తెలంగాణలో ‘నమో’ సునామీ: టీఆర్ఎస్‌ గుర్తించాల్సిన పాఠాలు లోక్‌సభ ఫలితాలు - అభిప్రాయం

  • 26 మే 2019
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం 2018 డిసెంబర్ 26వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన కేసీఆర్ Image copyright facebook/TelanganaCMO
చిత్రం శీర్షిక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం 2018 డిసెంబర్ 26వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన కేసీఆర్

తెలంగాణ శాసనసభ ఎన్నికలను లోక్‌సభ ఎన్నికల నుంచి వేరుచేసి ముందే జరిపించడం అనే వ్యూహం టీఆర్ఎస్‌కు అనేక ప్రయోజనాలను తెచ్చిపెట్టిందని ఫలితాలు రుజువు చేస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్ర సమితి 2014లో ఒంటరిగా ఎంతో సాహసోపేతమైన పోరాటం చేసింది, అధికారాన్ని చేజిక్కించుకుంది. అప్పటికి తెలుగుదేశం, బీజేపీ కూడా గణనీయమైన స్థానాలతో ప్రతిపక్షంలో నిలబడ్డాయి. అయినా 2014 నాటి మోదీ ప్రభంజనాన్ని తెలంగాణ ఓటరు నిలువరించడం ఆనాటి ఒక చరిత్ర.

మళ్లీ గెలవాలనే తపనతో టీఆర్ఎస్‌ ఎన్నో కార్యక్రమాలు చేసింది. ఇంకా ఎక్కువ ఆధిక్యంతో గెలిచింది. అయితే ఇప్పుడు 2019లో అంతగా కనిపించకపోయినా మోదీ సునామీ విస్తరించడం చూస్తూనే ఉన్నాం.

ఆంధ్ర ప్రదేశ్‌లో తెలుగుదేశం మద్దతుతో 2014లో బీజేపీ 3 లోక్‌సభ, కొన్ని శాసనసభ స్థానాలను గెలుచుకుంది. 2019లో బీజేపీకి ఆంధ్ర ప్రదేశ్‌లో విజయాలు శూన్యం. పరాజయాలు పరిపూర్ణం. జాతీయ స్థాయిలో సునామీ సృష్టించినా ఇక్కడ నోటా కన్నా, కాంగ్రెస్ కన్నా తక్కువ ఓట్లు సాధించింది.

నోటాకు 1.28 శాతం మంది నొక్కితే, కాంగ్రెస్ చేతి మీద 1.17 శాతం, బీజేపీ గుర్తు కమలం మీద 0.84 శాతం ఓటర్లు మాత్రమే నొక్కడం ఒక వైవిధ్యం.

Image copyright kavitha/twitter

టీఆర్ఎస్‌ గుర్తించాల్సిన పాఠాలు ఈ ఫలితాలు

2018 డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో 117 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 103 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. ఒక్క స్థానాన్ని మాత్రం గెలిచింది. తెలుగుదేశంతో కలిసి పోటీచేసిన కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలకు పరిమితమైంది. తెలుగుదేశం నామరూపాలు లేకుండా పోయింది. చివరకు 2019లో ఒక్క స్థానానికి కూడా పోటీచేయలేని అంతిమ దశతో తెలుగుదేశం కథ ముగిసిపోయింది.

వైసీపీ కూడా 2019 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన కార్యక్షేత్రం ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే అని ఎంచుకున్నారు. తెలంగాణను వదిలేయాలని నిర్ణయించుకున్నారు.

ఆరు నెలల్లో వచ్చిన కీలకమైన తేడా ఏమంటే తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ తెలంగాణలో కనుమరుగైపోవడం. ఆ రెండు పార్టీలు వదిలేసిన శూన్యాన్ని ఎవరెవరు పంచుకున్నారు? పోటీలో మిగిలిన పార్టీలు టీఆర్ఎస్‌, కాంగ్రెస్, బీజేపీ పంచుకున్నాయని అనుకుంటే టీఆర్ఎస్‌ ఓట్లు తగ్గడం, మిగిలిన పార్టీల ఓట్లు పెరగడంలో గమనించవలసిందేమిటి? అధికార పార్టీ పట్ల వ్యతిరేకత.

2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం లేకుండా కాంగ్రెస్ ఒంటరిగా పోటీచేసింది. ఇదే పని 2018లో చేసి ఉంటే ఇంకా ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచి ఉండేది. ఆంధ్ర ప్రదేశ్‌లో తెలుగుదేశంతో రహస్యంగా సహకరించింది. తన నాయకులను టీడీపీ టికెట్‌పై పోటీ చేయించింది. అక్కడా మట్టి కరిచింది.

తెలంగాణలో మూడు లోక్‌సభ స్థానాల్లో గెలిచింది. ‘నమో’ సునామీ సాయంతో బరిలోకి దిగిన బీజేపీ నాలుగు స్థానాలు గెలిచి టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ ఇంకా సజీవంగానే ఉందని, బీజేపీ రాబోయే రోజుల్లో నిలబడి సవాల్ అవుతుందని టీఆర్ఎస్‌ గుర్తించాల్సిన పాఠాలు ఈ ఫలితాలు.

Image copyright Bandi sanjay/fb

కుందేలు కుదేలు

ముందుగానే ఎన్నికలు జరిపించి, తన సర్వశక్తులన్నీ ఒడ్డి 88 స్థానాల్లో గెలిచి అధికారంలో కొనసాగుతున్న టీఆర్ఎస్‌ గెలిచినవి ఎట్లాగూ తమవే కనుక ఓడిన నియోజకవర్గాలను కైవసం చేసుకోవాలని ఎక్కువగా ప్రయత్నించారు.

టీఆర్ఎస్‌ లెక్క ప్రకారం హైదరాబాద్ తప్ప మిగిలిన అన్ని (16) లోక్‌సభ స్థానాలనూ వారే గెలిచి తీరాలి. ఎందుకంటే అక్కడి అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్ఎస్‌కే ఎక్కువ ఓట్లు ఉన్నాయి.

కానీ, టీఆర్ఎస్‌ 9 స్థానాలే గెలుచుకుంది. ఏడింటిని అనూహ్యంగా కోల్పోయింది. అవి తమ చేతుల్లో ఉన్నాయనుకున్నారు కానీ చేజారిపోయాయి.

తాబేలు-కుందేలు కథ నుంచి రాజకీయ నాయకులు పాఠాలు నేర్చుకోవాలి. గెలిచిన వారు కాస్త కునుకు తీస్తే ఓడిపోవచ్చు. ఓడినవాడు రెప్పవాలకుండా ప్రతిక్షణం వాడుకుంటూ రొప్పుతూ వగరుస్తూ పరిగెత్తి గెలవవచ్చు.

తెలంగాణలో నిజామాబాద్, కరీంనగర్ స్థానాలను ఎలాగైనా గెలుస్తాం అనే విశ్వాసం అన్ని సందర్భాల్లో ఉపయోగపడదు. శాసనసభ ఎన్నికల్లో కోల్పోయిన స్థానాల్లో పార్టీ వ్యూహాలను పటిష్టం చేసుకుని ఇప్పుడు విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో వచ్చిన ఓట్లను లెక్కించుకుని గెలుస్తామనుకున్న స్థానాల్లో కొన్నింటిని కోల్పోయారు. ఏడు పోటీల్లో కుందేలు కుదేలైంది, తాబేలు గీత దాటింది.

శాసనసభలో ఒకరికి, లోక్‌సభలో మరొకరికి ఓటు వేయడం తెలంగాణ ఓటరు విజ్ఞతకు నిదర్శనం. అట్లా అని సరిపెట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే సమీకరణాలు మారాయి. కుటుంబ, కుల, మత రాజకీయాల లెక్కలు అదనంగా వచ్చాయి.

చివరి నిమిషంలో టీఆర్ఎస్ నాయకుడు జితేందర్ రెడ్డిని వదులుకోవడంతో ఆ పార్టీ రెడ్డి సామాజిక వర్గాన్ని వదులుకోదలచుకున్నదనే సందేశాన్ని పంపింది. 2018లో ఓడిపోయిన ప్రాంతాల మీద దృష్టి కేంద్రీకరించిన టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, తమవనుకున్న నియోజకవర్గాల్లో కొత్త సమీకరణాలను గమనించలేకపోయింది.

Image copyright kcr/fb

ఆరు నెలల్లో మారిన సమీకరణాలు

సికింద్రాబాద్ నియోజకవర్గం బీజేపీదే. అక్కడ తలసాని శ్రీనివాస యాదవ్ కుమారుడికి టీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం, పార్టీని నమ్ముకున్న వారికి, తెలంగాణ కోసం పోరాడిన వారికి కోపం తెప్పించింది. ఫలితం -శాసనసభకు గెలవలేకపోయిన కిషన్ రెడ్డి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

ఆర్నెల్లలో వచ్చిన మార్పులు గమనిస్తే అందుకు కారణాలు తరువాత వెతుక్కోవచ్చు. టీఆర్ఎస్ ఓట్ల శాతం డిసెంబర్‌లో 46.18 శాతం నుంచి ఏప్రిల్ కల్లా 5.57 శాతం తగ్గి 41.3 శాతానికి పడిపోయింది. ఆ దెబ్బ ఏడు స్థానాల్లో తగిలింది.

బీజేపీ ఓట్లు 12.57 శాతం పెరిగి 19.5 శాతానికి చేరుకున్నాయి. అందుకే నాలుగు స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఒక్క శాతమే పెరిగాయి. బీజేపీ కన్నా ఎక్కువ శాతం ఓట్లు కాంగ్రెస్ (29.5 శాతం) సాధించింది. కానీ, మూడు సీట్లతో ఆగిపోయింది.

తెలంగాణలో 30 శాతం మంది ఓటర్లు కాంగ్రెస్‌ను, 20 శాతం మంది ఓటర్లు మాత్రమే బీజేపీని కోరుకున్నారని దాని అర్థం. ఓట్లేసిన వారిలో సగం మంది తమతో లేరని, తమకు 41.3 శాతం మంది మాత్రమే ఓట్లు వేశారని టీఆర్ఎస్ అర్థం చేసుకోవలసి ఉంటుంది.

రెడ్లతో పాటు ఇంకా ఏయే వర్గాలు తమకు దూరమయ్యాయో టీఆర్ఎస్ తెలుసుకుంటే నిలబడుతుంది. ఈ ఫలితాలు తెరాసకు హెచ్చరిక. అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఆశాకిరణాలు.

శాసనసభ బరిలో గెలవలేకపోయినా రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి లోక్‌సభకు ఎన్నికకావడం, చేవెళ్లలో విశ్వేశ్వరరెడ్డి తృటిలో గెలుపుకు దూరంకావడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్‌సభకు కూడా ఎన్నిక కావడం కాంగ్రెస్ పునరుజ్జీవానికి సంకేతాలు.

ఆరెస్సెస్ శాఖలు విస్తరిస్తూ బీజేపీ శాఖోపశాఖలుగా పెరుగుతోంది. దేశభక్తికి, ఇతర మతాల వ్యాప్తిపట్ల వ్యతిరేకతను, హిందుత్వను ఎన్నికల్లో బాహాటంగా వాడుకుంటోంది. ముస్లింలు, క్రైస్తవుల ఓట్ల కోసం ఇతర పార్టీల వలే వెంపర్లాడడం లేదు. పాకిస్తాన్ వ్యతిరేకతను వినియోగిస్తోంది.

మొదటిసారి కేంద్రంలో పూర్తి స్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత 2014 నుంచి విదేశీ విధానాన్ని, రక్షణ విధానాన్ని కూడా తన ఘనతని చెప్పుకుంటూ బీజేపీ పకడ్బందీగా ముందడుగు వేస్తోంది.

రాబోయే రోజుల్లో అయోధ్యలో రామ మందిరానికి పునాదులు పడతాయి. అప్పుడిక హిందుత్వ విస్తరణను అడ్డుకోవడం మరింత కష్టతరం అవుతుంది. కనుక రాష్ట్ర స్థాయిలో పరిపాలనను పటిష్టం చేసుకుని జనానికి దగ్గర కావడం, పార్టీని వటవృక్షంగా బూత్ స్థాయిలో విస్తరించని పక్షంలో బీజేపీని ఎదుర్కొనడం సాధ్యం కాదని దేశవ్యాప్తంగా కాంగ్రెస్, తెలంగాణ పరిధిలో టీఆర్ఎస్ గుర్తించాలి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం