సినిమా రివ్యూ: సీతను విలన్ దగ్గరకు పంపే రఘురాముడి కథ

  • 26 మే 2019
సీత సినిమా రివ్యూ Image copyright KAJALAGGARWAL/FACEBOOK

'నేను కమర్షియల్ సినిమాలను తీయలేను' అని సందర్భం వచ్చిన ప్రతిసారీ చెప్పుకొనే దర్శకుడు తేజ.. 'నేనే రాజు-నేనే మంత్రి' తరువాత తీసిన మరో కమర్షియల్ చిత్రం సీత.

సినిమా కథంతా సీత టైటిల్ రోల్ పోషించిన కాజల్ అగర్వాల్ చుట్టూ అల్లుకుని ఉంటుంది.

సాధారణంగా తేజ సినిమాల్లో హీరోయిన్లు అనగానే వాడివాడి చూపులు, వేడివేడి నిట్టూర్పులు, ఊడ్పులు, గాడ్పులు, వెక్కివెక్కి ఏడ్పులతో కూడిన సర్కస్ ఫీట్లతో పాటు, తగని పౌరుషాలు, అంతలోనే నీరసాలు, రక్తంలో తడిసి ముద్దవ్వడాలు కనిపిస్తాయి. అయితే ఇలాంటి రొటీన్ ఫార్ములాను ఈ సినిమాలో కాస్త బ్రేక్ చేసినట్లనిపిస్తుంది.

Image copyright KAJALAGGARWAL/FACEBOOK

ఇది హీరోయిజమా, మంచితనమా?

తల్లిదండ్రులను కోల్పోయిన మేనల్లుడు రఘురామ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్)ని తన ఇంటికి తీసుకొస్తాడు ఆనంద మోహన్ (భాగ్యరాజ్). తన ఉనికినే ఇష్టపడని ఆనంద మోహన్ భార్య పెట్టే బాధలను తట్టుకోలేని రఘురామ్.. నరాలకు సంబంధించిన జబ్బు బారిన పడతాడు. డాక్టర్ సలహా మేరకు భూటాన్ తీసుకెళ్లి అక్కడొక బౌద్ధ ఆశ్రమంలో చేరుస్తాడు మోహన్. అక్కడే పెరిగి పెద్దవుతాడు. బయటి సమాజంలోని అవినీతి, అక్రమాలు, కుట్రలు, కుతంత్రాలు తెలియకుండా పెరుగుతాడు.

మాట ఇచ్చింది కాబట్టి విలన్‌తో సహజీవనం చేయాల్సిందే అనడం, అది కూడా తాను ఎంతో ప్రేమించిన అమ్మాయిని విలన్ దగ్గరకి పంపించాలనుకోవడం... ఇది ఏ రకమైన హీరోయిజమో, అది ఏ మంచితనానికి సూచికో మనకైతే అర్థంకాదు.

ఆనంద మోహన్ కూతురు సీతామహాలక్ష్మి (కాజల్ అగర్వాల్) చిన్నతనంలోనే తల్లి చనిపోయినా.. తల్లి తనలో నాటి వెళ్ళిన స్వార్థం, డబ్బు వ్యామోహం, లౌక్యాలను పెంచి పోషించుకుంటూ ఎదుగుతుంది. రఘురామ్‌ని పెళ్ళిచేసుకోవాలన్న తండ్రి ప్రపోజల్ ఆమెకు నచ్చదు. తాను నెల రోజుల్లో వందకోట్లు సంపాదిస్తే రఘురామ్‌ని పెళ్ళాడనవసరం లేదంటూ ఓ డీల్ కుదుర్చుకుంటుంది. నెలరోజుల్లో ఇంతడబ్బు సంపాదిస్తే లేదా ఖర్చుపెడితే ఫలానాది దక్కుతుంది అనే కాన్సెప్ట్ కొత్తదేమీ కాదు. సన్నివేశం మాత్రమే కొత్తది.

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఒక స్లమ్ ఏరియాను పదికోట్లకు కొని, అక్కడ 30 ఏళ్ళుగా జీవిస్తున్న జనాలను తరిమేసి, వందకోట్లు సంపాదించాలని భావించి... అందుకు బసవరాజు(సోనూ సూద్) అనే లోకల్ ఎంఎల్ఏ సాయం ఆశిస్తుంది. అయితే తనాశించిన సహాయం చేయాలంటే నెలరోజులు తనతో సహజీవనం చేయాలని షరతు పెడతాడు బసవరాజు. ఆ షరతుకు ఒప్పుకుంటూ ఒప్పంద పత్రంపై సంతకం చేసిన సీత తన పనైపోగానే బసవరాజుకు ఇచ్చిన మాట తప్పుతుంది. దాంతో పగ పెంచుకున్న బసవరాజు సీతను అడుగడుగునా ఇబ్బందులకు గురిచేస్తుంటాడు.

అలాంటి పరిస్థితుల్లో సీత ఇబ్బందుల్లో నుంచి బయటపడడానికి ఏం చేసింది? బసవరాజు ఎత్తుగడలను ఎలా తిప్పికొట్టింది అనేదే సీత సినిమా సారాంశం.

Image copyright KAJALAGGARWAL/FACEBOOK

కాజల్ నటనలో వేరియేషన్స్

ఆధునిక యుగపు టక్కుటమారా విద్యలన్నీ తెలిసిన ఒక ఆడపిల్ల తనచుట్టూ ఉన్న పరిస్థితులను ఎలా ఎదుర్కొంది అనేది దర్శక హృదయం అనుకోవచ్చేమో అనుకునేంతలో సెకండ్ హాఫ్‌లో దర్శకుడు మరో గెంతు గెంతి ఇంతకీ ఏం చెప్పాలనుకున్నారీయన అని తల పట్టుకునేలా చేస్తారు.

కాజల్ అగర్వాల్ సీత క్యారెక్టర్‌కి తన శక్తికి మించి న్యాయం చేసిందని చెప్పాలి. ఒకటి రెండు సందర్భాల్లో ఓవరాక్షన్ చేసినట్లుగా అనిపించినా ఓవరాల్‌గా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. 'నా పేరు సీత నేను గీసిందే గీత' అనే మ్యానరిజంతో, మోడ్రన్ లుక్‌లో యువతలో క్రేజ్ కొట్టేసింది. మనుషుల కన్నా మనీయే ముఖ్యమనుకునే సీత ఆలోచన ధోరణితో ఫస్టాఫ్ అంతా నెగిటివ్ రోల్ ప్లే చేసింది. సెకండాఫ్‌లో మరో కొసకు వెళ్లి ముత్యాలముగ్గు హీరోయిన్‌గా అంటే భర్త కాళ్ళు మొక్కి ఆశీర్వాదాలు తీసుకుని, భర్త వెళ్ళమంటే, ఇష్టం లేకపోయినా రావణుడి లాంటి బసవరాజు వెంట వెళ్ళిపోయే సోకాల్డ్ సీతగా మారిపోతుంది.

Image copyright KAJALAGGARWAL/FACEBOOK

కమల్ హాసన్ తరహాలో కష్టపడిన బెల్లంకొండ

పేదవారి ఇళ్ళను కూల్చేసి వారు పెట్టే శాపనార్థాలను కూడా ఆశీర్వాదాలుగా భావిస్తూ పెదాలపై నవ్వు కూడా చెరగనివ్వకుండా ఉంటుంది. వారు చేసేది తప్పని తెలిసినా డబ్బుంది కనుక చుట్టూ ఉన్నవారంతా ఎలాగోలా భరిస్తూ ప్రేమిస్తున్నట్టు నటిస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి డెబిట్ కార్డు నిల్ అయ్యిందా లోపల దాచేసినవన్నీ నిద్రలేస్తాయి.

ఆ డబ్బు యావే... ఇష్టంలేని మగాడితో నెలరోజులు సహజీవనం చేస్తానని ఒప్పుకునేలా చేస్తుంది. అమాయకుడైన రఘురామ్‌ని పెళ్ళి చేసుకుంటానని నమ్మించి, ఆస్తులన్నింటినీ తన పేరిట బదలాయించుకుని మోసం చేయడానికి ప్రయత్నిస్తుంది.

పురాణసీత రాముడి మాట కోసం అగ్నిలో దూకితే, ఈ సీత ఆస్తి దక్కగానే తన రఘురాముడిని నడిరోడ్డు మీదకు నెట్టేయడానికి పూనుకుంటుంది.

ఆ తరువాత అనేక పల్టీలు కొట్టి రఘురామ్ కోసం బసవరాజుతో పడకపంచుకునేందుకు సిద్ధపడే సీతగా రకరకాల వేరియేషన్స్ చూపిస్తుంది.

స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్ తరహా పాత్రను పోషించిన బెల్లంకొండ శ్రీనివాస్ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో కాస్త కష్టపడ్డాడనే చెప్పొచ్చు.

అమాయకుడిగా కనిపిస్తూనే తెలివిగా మాట్లాడడం కొత్తగా అనిపిస్తుంది. డబ్బు యావ మనుషులను మమతలను మింగేస్తున్న వర్తమాన సమాజంలో అలాంటి మనిషి అవసరం అని పెట్టిన పాత్ర లాగా అనిపిస్తుంది. కాకపోతే తనంటే సీతకు ఇష్టంలేదని తెలిసినా, ఆమెనే ప్రేమిస్తూ ఆమెకోసం చచ్చిపోవడానికి కూడా వెనకాడకపోవడం మాత్రం మూసధోరణిలో ఉంటుంది.

Image copyright FACEBOOK

హాస్యం, సంగీతం, సంభాషణలు

అనూప్ రూబెన్స్ సంగీతంలో కొత్తదనం లేకపోయినా నేపథ్య సంగీతం అలరిస్తుంది. లక్ష్మి భూపాల మాటలు బాగున్నాయి.

సోనూసూద్ తనదైన శైలిలో నటించి సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచాడని చెప్పవచ్చు. హీరో కంటే విలన్ బలవంతుడిగా కనిపించే తేజ మార్క్ విలన్. అయితే సోనూసూద్ తనికెళ్ళ భరణి మధ్య జరిగే సంభాషణలు 'రాజా ది గ్రేట్' సినిమాలో విలన్‌కి తనికెళ్ళ భరణికి మధ్య జరిగే సంభాషణలను గుర్తుకు తెస్తాయి.

తీన్మార్ బిత్తిరిసత్తి హాస్యం పర్లేదనిపిస్తుంది. కాజల్ సెక్రటరీగా నటించిన అభినవ్ గౌతమ్, పోలీస్ ఆఫీసర్ అభిమన్యు సింగ్, మన్నారా చోప్రాల నటన కథకు బలాన్ని చేకూర్చాయి. జబర్దస్త్ మహేష్ రంగస్థలం మోడ్ నుంచి ఇంకా బయటపడలేదనిపించింది.

ఎలాంటి పరిస్థతులలోనైనా అప్పుడు సహజీవనానికి ఒప్పుకున్నావు కనుక ఇప్పుడు ఇష్టం లేకపోయినా బసవరాజుతో వెళ్ళమని రఘురామ్ ఆదేశించడం, అతని ఆదేశానుసారం సీత బసవరాజుతో వెళ్ళడానికి నిర్ణయించుకోవడం సీత వ్యక్తిత్వాన్నే ప్రశ్నార్థకం చేస్తాయి.

Image copyright FACEBOOK

మొత్తంగా...

ఈ సమాజంలో ఒప్పందాలన్నీ నిజానికి ఒప్పైపోవు. కాగితాలమీద రాసుకున్నంత మాత్రానో ఒత్తిడిలో మాట తీసుకున్నంత మాత్రానో దుర్మార్గాలన్నీ సరైనవి అయిపోవు. మాట పేరుతో లొంగిపోయే బదులు ఒకవైపు లౌక్యాన్ని, మరో వైపు డబ్బుతో ఏదైనా కొనొచ్చనే మదాన్ని రెంటినీ కాస్త లోతుగా చర్చించి ఉంటే... ఆధిపత్య వ్యవస్థ వ్యక్తుల జీవితాల్లో లేపే కల్లోలాన్ని మరికాస్త మానవీయంగా చూపించి ఉంటే బాగుండేది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు