జగన్‌తో కేసీఆర్: ‘ఏపీ ప్రత్యేకహోదాకు పూర్తి మద్దతు’ - ప్రెస్ రివ్యూ

  • 26 మే 2019
Image copyright facebook/YSR Congress Party

ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో పూర్తి మద్దతు ఉంటుందని కేసీఆర్ జగన్‌తో అన్నారంటూ ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో...

ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడమే తమ విధానమన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో కూడా అలాగే ఉంటుందన్నారు. ఏపీతో సత్సంబంధాలు నెలకొల్పుతామని చెప్పారు.

జగన్‌ శనివారం సాయంత్రం సతీసమేతంగా ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిశారు. ఇద్దరు నాయకుల మధ్య కొద్దిసేపు చర్చలు జరిగాయి.

రాయలసీమ సస్యశ్యామలం

గోదావరి, కృష్ణా నదీ జలాలను సమర్థంగా వినియోగించుకుంటే రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయని కేసీఆర్ అన్నారు. రాయలసీమ సస్యశ్యామలం కావాలన్నారు.

విభజన సమస్యలను సత్వరమే పరిష్కరించుకుందామని, త్వరలోనే రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులతో సహా సమావేశమై అన్ని అంశాలపై చర్చించుకోవాలని ఇద్దరు నాయకులు నిర్ణయించారు.

''పక్కనున్న రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని మేం మొదటి నుంచి భావిస్తున్నాం. నేను స్వయంగా మహారాష్ట్రకు వెళ్లి అక్కడి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిశాను. దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్‌-మహారాష్ట్ర మధ్య ఉన్న జల వివాదాల కారణంగా ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోవడంపై నేనే చొరవ తీసుకుని మాట్లాడాను. సహకరించడానికి మహారాష్ట్ర ముందుకొచ్చింది. ఫలితంగా కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులు నిర్మించుకోగలుగుతున్నాం. గోదావరి నది నుంచి ఏటా 3,500 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. తెలంగాణ గరిష్ఠంగా 700-800 టీఎంసీలు మాత్రమే వాడుకోగలదు. మిగతా నీరంతా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వాడుకునే వీలుంది. ప్రకాశం బ్యారేజి ద్వారా సోమశిల వరకు గ్రావిటీతో గోదావరి నీటిని పంపించవచ్చు. దీంతో యావత్‌ రాయలసీమను సస్యశ్యామలం చేయవచ్చు. కేవలం రెండు లిఫ్టులతో గోదావరి నీళ్లను రాయలసీమకు పంపించవచ్చు'' అని కేసీఆర్‌ తెలిపారంటూ ఈనాడు దినపత్రిక తెలిపింది.

Image copyright facebook/Indian National Congress

'కాంగ్రెస్ చీఫ్‌గా ఉండలేను'

లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ, రాహుల్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు సీడబ్ల్యూసీ సమావేశంలో ప్రకటించారంటూ సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో...

రాహుల్ నిర్ణయాన్ని సమావేశం ముక్తకంఠంతో తిరస్కరించింది. అయితే, రాహుల్‌ తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే సూచనలు కనిపించడం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి.

ఈ నేపథ్యంలో గాంధీ కుటుంబం నుంచి కాకుండా వేరొకరికి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. ఇందుకు సరైన నేతల్లో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఒకరని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో యూపీఏ చైర్‌‌పర్సన్‌ సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్, పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ, ఇతర నేతలు పాల్గొన్నారు.

'పార్టీ చీఫ్‌గా ప్రియాంక వద్దు'

ఈ సమావేశంలో ప్రసంగించిన రాహుల్‌..

'ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన పోరాటం కొనసాగుతుంది. క్రమశిక్షణ గల కాంగ్రెస్‌ పార్టీ సైనికుడిగా నా పోరాటాన్ని కొనసాగిస్తా. కానీ, పార్టీ అధ్యక్షుడిగా నేను కొనసాగాలనుకోవడం లేదు' అని పేర్కొన్నారు. తన స్థానంలో మరొకరిని ఎన్నుకోవాలని కోరారు.

ప్రియాంకకు ఆ బాధ్యతలు అప్పగించాలని కొందరు ప్రతిపాదించగా 'నా సోదరిని ఈ విషయంలోకి లాగకండి' అంటూ రాహుల్‌ వ్యతిరేకించారు. కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌గా గాంధీ కుటుంబానికి చెందినవారే ఉండాల్సిన అవసరం లేదని రాహుల్‌ వ్యాఖ్యానించారంటూ సాక్షి కథనం పేర్కొంది.

చిత్రం శీర్షిక రాములమ్మ

ఆరోగ్యానికీ ఆధార్

భూములు, బ్యాంకు ఖాతాలు, రేషన్‌కార్డులు, పాన్‌కార్డులు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తదితర వాటికి ఆధార్‌ నంబర్‌ అనుసంధానం చేసిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పడు వైద్యసేవలకూ తప్పనిసరి చేసిందంటూ నవతెలంగాణ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

ఇప్పటి వరకు సర్కారు ఆస్పత్రికి వెళ్తే ఓపీ చీటీపై పేరు, వయస్సు వంటి వివరాలు మాత్రమే రాసేవారు. కానీ కొన్నాళ్లుగా అన్ని వివరాలు సేకరిస్తున్నారు. రోగి ఆధార్‌ నంబర్‌ నుంచి పూర్తిపేరు, ఊరు, వీధి, ఎత్తు, బరువు, వంశపారంపర్య జబ్బులు, షుగర్‌, బీపీ ఇతర వ్యాధి లక్షణాలను నమోదు చేస్తున్నారు.

అలాగే, రోగి ఏ జబ్బుతో బాధపడుతున్నాడు.. ఆ జబ్బుకు వాడుతున్న మందులేంటి.. ఎలాంటి చికిత్స లభించింది? మళ్లీ ఎప్పుడు ఆస్పత్రికి రావాలి.. వంటి వివరాలను అప్‌లోడ్‌ చేస్తున్నారు.

అలా ఒక వ్యక్తికి సంబంధించిన అనారోగ్య కారణాలు ఒక్కసారి నమోదు చేస్తే మళ్లీ అతను ఏ సర్కారు ఆస్పత్రిలో చేరినా అక్కడి వైద్యులకు వివరాలన్నీ తెలిసిపోతాయి. అలాగే, ప్రాంతాల వారీగా ప్రజలు ఏ తరహా జబ్బులకు గురవుతున్నారో తెలుసుకునే వీలుంటుందని ప్రభుత్వం భావిస్తున్నది.

ఆధార్‌ నంబరును ఆన్‌లైన్‌లో నమోదు చేయడం ద్వారా సేవలపై రోగులను నేరుగా సంప్రదించే అవకాశం ఉంటుంది. దీంతో సేవలు మరింత మెరుగుపడి ప్రజలకు మేలు జరుగుతుందనేది ప్రభుత్వ ఉద్దేశం.

గర్భిణీలకు ఆధార్‌ నమోదుతో ఈ-బర్త్‌ సర్టిఫికెట్లు నేరుగా ఆస్పత్రి నుంచే ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ-ఔషధాలను సైతం సులభంగా ఇవ్వవచ్చు. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య వారికి ఇచ్చే మందులు, ఎంత మంది ప్రసవం పొందుతున్నారనే వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నిక్షిప్తం అవుతున్నాయి.

రోగుల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆన్‌లైన్‌లో 'ఈ-హాస్పిటల్‌' విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఎలాంటి ప్రచారం లేకుండా ఆధార్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తుండటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

ఆరోగ్యం బాగాలేక వైద్యం కోసం పెద్దాస్పత్రికి వెళితే ఆధార్‌ నంబరు అడుగుతుండడంతో గ్రామీణ నిర్లక్షరాస్యులకు ఇబ్బందిగా మారిందంటూ నవతెలంగాణ కథనం పేర్కొంది.

భారత జట్టు ఎవరు Image copyright Getty Images

వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్‌లో ఓడిన భారత్

వరల్డ్‌‌కప్‌కు ముందు భారత్ జట్టుకు కనువిప్పు లాంటి పరాజయం ఎదురైందంటూ నమస్తే తెలంగాణ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

న్యూజీల్యాండ్‌తో శనివారం జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ సమిష్టిగా విఫలమవడంతో భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన కివీస్ పేసర్లు బౌల్ట్ (4/33), నీషమ్ (3/26) ధాటికి 39.2 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది.

రవీంద్ర జడేజా (54; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. లక్ష్య ఛేదనలో రాస్ టేలర్, కెప్టెన్ విలియమ్సన్ హాఫ్‌సెంచరీలతో చెలరేగడంతో న్యూజీల్యాండ్ 37.1 ఓవర్లలో 4 వికెట్లకు 180 పరుగులు చేసి గెలిచింది. మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా 12 పరుగుల తేడాతో గెలిచింది.

స్వింగ్‌కు అనుకూలించే పరిస్థితుల్లో కివీస్ బౌలర్లు చెలరేగడంతో భారత్ బ్యాటింగ్ లైనప్ సైకిల్ స్టాండ్‌ను తలపించింది. రెండో ఓవర్‌లో రోహిత్ (2) నిష్క్రమించడంతో ప్రారంభమైన వికెట్ల పతనం ఇక ఏ దశలోనూ ఆగలేదు. ధవన్ (2), రాహుల్ (6) ఇలావచ్చి అలా వెళ్లగా.. కొహ్లీ (18), పాండ్యా (30), ధోనీ (17) మంచి ఆరంభాలను వినియోగించుకోలేకపోయారు.

దీంతో టీమ్‌ఇండియా 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కుల్దీప్ (19) అండతో జడేజా చెలరేగాడు. గాయాల నుంచి కోలుకుంటున్న శంకర్, జాదవ్ ఈ మ్యాచ్‌లో ఆడకపోగా.. మిగిలిన 13 మందిలో 8 మంది అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ బరిలో దిగినా.. ఒక్కరంటే ఒక్కరు కూడా క్రీజులో నిలదొక్కుకునేందుకు యత్నించలేదని స్తే తెలంగాణ పత్రిక పేర్కొంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)