మోదీ అభివృద్ధి వాగ్ధానాల విలువ రూ.100 లక్షల కోట్లు.. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?

  • 27 మే 2019
నరేంద్ర మోదీ విజయం Image copyright Getty Images

తాజా ఎన్నికల్లో నరేంద్ర మోదీ అఖండ విజయం సాధించారు.

రెండోసారి అధికారంలోకి రావడం ద్వారా మోదీకి తన సంస్కరణలను పూర్తిస్థాయిలో అమలు చేసే అవకాశం లభిస్తుందన్న సానుకూల భావన ఉంది. అందుకు సంకేతంగానే బీజేపీ భారీ మెజార్టీ సాధించిందన్న వార్తను ఆహ్వానిస్తూ షేర్ మార్కెట్లు పరుగులు పెట్టాయి, రూపాయి మారకం విలువు పుంజుకుంది.

అయితే, ఈ గెలుపు సంబరాలు ఎలా ఉన్నా... మున్ముందు మోదీ ప్రభుత్వానికి అత్యంత కఠినమైన ఆర్థిక సవాళ్లు ఎదుయ్యే అవకాశం ఉంది.

మొదటి ఐదేళ్లలో ఏం చేశారు?

మోదీ తన తొలి అయిదేళ్ల పాలనా కాలంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలు మిశ్రమ ఫలితాలిచ్చాయి.

కొన్ని కఠినమైన సంస్కరణలు తీసుకొచ్చారు. బ్యాంకింగ్ రంగానికి గుదిబండగా మారుతున్న మొండి బకాయిల సమస్యను సంస్కరించేందుకు నూతన దివాలా చట్టాన్ని తీసుకురావడం అందుకు ఒక ఉదాహరణ.

ప్రపంచ బ్యాంకు ఇచ్చే సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ర్యాంకుల్లోనూ మోదీ ప్రభుత్వం పురోగతి సాధించింది. 2014లో మోదీ ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టినప్పుడు భారత ర్యాంకు 134 ఉండగా 2019లో 77వ స్థానానికి ఎగబాకింది.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలిచింది.

Image copyright Getty Images

అయితే, అవినీతిపై పోరాడేందుకు మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం మాత్రం గురితప్పింది. అత్యధికంగా చెలామణీలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను హఠాత్తుగా నిషేధించడంతో కొన్ని నెలలపాటు నగదు కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. అసంఘటిత రంగం తాత్కాలికంగా కుదేలైంది. అనేకమంది ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది.

వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమలు కూడా అంత సజావుగా సాగలేదు. దీర్ఘకాలంలో ఆర్థిక వృద్ధికి జీఎస్టీ దోహదపడే అవకాశం ఉంది. కానీ, తాత్కాలికంగా కొన్ని లక్షల చిన్న, మధ్య తరహా వ్యాపారులు దాని వల్ల ఇబ్బందులు పడ్డారు.

Image copyright Getty Images

రెండో పర్యాయంలో ఏం ఆశించొచ్చు?

ఈ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ సాధించిన మోదీకి రానున్న అయిదేళ్లలో కఠినమైన నిర్ణయాలు తీసుకునేందుకు మరింత స్వేచ్ఛ దొరుకుతుందని సూర్జిత్ భళ్ళా లాంటి ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

"ఎన్నికల్లో బీజేపీకి భారీ మెజార్టీ వచ్చింది. దాన్ని బట్టి చూస్తే నరేంద్ర మోదీ తన రెండో పర్యాయంలో మరిన్ని సాహసోపేతమైన సంస్కరణలు తీసుకొచ్చే అవకాశం ఉంది" అని సూర్జిత్ అన్నారు. గడచిన అయిదేళ్లు మోదీ హయాంలోనే ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడిగా సూర్జిత్ భళ్ళా పనిచేశారు.

అయితే, మోదీ సాధించిన మెజార్టీకి తగ్గట్టుగానే దేశంలో సమస్యలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.

2018 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 8.2 శాతంగా ఉన్న దేశ ఆర్థిక వృద్ధి రేటు, క్రమంగా తగ్గుతూ... సెప్టెంబర్‌ నాటికి 7.1 శాతం, డిసెంబర్‌‌తో ముగిసిన త్రైమాసికంలో 6.6 శాతానికి దిగజారింది. గడచిన ఆరు త్రైమాసికాల్లో ఇదే అత్యల్పం.

మరోవైపు, నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఓ) రహస్య నివేదిక ప్రకారం 2017-18 ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగిత రేటు 45 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. ఆ సర్వే ప్రకారం 2017-18 ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగిత శాతం 6.1%గా నమోదైంది. 1972- 73 తర్వాత తర్వాత ఇంత నిరుద్యోగిత నమోదవడం ఇదే తొలిసారి.

నిరుద్యోగ సమస్య తీరుస్తారా?

యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రైవేటు రంగంలో పెట్టుబడులను ప్రభుత్వం ప్రోత్సహించాలని నిపుణులు సూచిస్తున్నారు.

తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'భారత్‌లో తయారీ' కార్యక్రమం ఇప్పటి వరకు మిశ్రమ ఫలితాలు ఇచ్చింది.

ఉపాధి అవకాశాలు పెరగాలంటే అంతర్జాతీయ మార్కెట్లపై దృష్టిపెట్టడం చాలా కీలకమని ఆదిత్య బిర్లా గ్రూపు ప్రధాన ఆర్థిక సలహాదారుడు అజిత్ రనడే అంటున్నారు.

"ఎగుమతులకు, వస్తు ఉత్పత్తికి మధ్య సంబంధం ఉంటుంది. ఎగుమతులు పెరగనంత కాలం దేశంలో తయారీ రంగం విస్తరించే అవకాశం ఉండదు" అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎక్కువ మందికి ఉపాధి కల్పించే నిర్మాణ, పర్యాటకం, వస్త్ర, వ్యవసాయ ఉత్పత్తులు వంటి రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచిస్తున్నారు.

Image copyright Getty Images

ఆర్థిక వ్యవస్థ ఊతం లభిస్తుందా?

గత 15 ఏళ్లలో భారత్ సాధించిన ఆర్థిక వృద్ధిలో దేశీయ వినియోగానిదే సింహ భాగం. అయితే, గడచిన కొన్ని నెలల గణాంకాలను పరిశీలిస్తే దేశంలో వినియోగం నెమ్మదిస్తోంది.

కార్లు, ఎస్‌యూవీల అమ్మకాలు ఏడేళ్ల కనిష్ఠానికి పడిపోయాయి. ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా తగ్గిపోయాయి. బ్యాంకు రుణాలకు డిమాండ్ మందగించింది.

ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల తయారీ సంస్థ హిందుస్థాన్‌ యూనీలీవర్‌ మార్చితో ముగిసిన త్రైమాసికంలో 7 శాతం వృద్ధి రేటు మాత్రమే సాధించింది. గడిచిన 18 మాసాల్లో ఇదే అత్యల్పం.

తాము మరోసారి అధికారంలోకి వస్తే ఆదాయపన్ను పరిమితిని పెంచుతామని, తద్వారా మధ్య తరగతి ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొంది. కానీ, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి చూస్తుంటే ఇప్పటికిప్పుడు అది సాధ్యమయ్యేలా కనిపించడంలేదు. ప్రస్తుతం దేశం 3.4 శాతం లోటు బడ్జెట్‌లో ఉంది.

"ఆర్థిక లోటు పెరగడం అనేది స్లో పాయిజన్. మధ్య, దీర్ఘకాల వృద్ధిని అది వెనక్కి లాగుతుంది" అని రనడే అంటున్నారు.

Image copyright AFP

రైతులను గట్టెక్కిస్తారా?

వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభం గత అయిదేళ్ల మోదీ ప్రభుత్వానికి పెను సవాల్‌గా ఉండింది. మద్దతు ధరల కోసం రైతులు దేశవ్యాప్తంగా అనేక చోట్ల రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేశారు.

చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు నగదు బదిలీ పథకాన్ని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే, మార్కెట్‌‌లో రైతులు నిర్ణయించిన ధరలకే ఉత్పత్తులను అమ్ముకునే రోజులు రావాలని కేంద్ర ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు ఇలా పట్నాయక్ అంటున్నారు.

Image copyright Reuters

ప్రైవేటీకరణ

దేశ వృద్ధిని పరుగులు పెట్టించేందుకు రోడ్లు, రైల్వే లైన్లతో పాటు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ. 100 లక్షల కోట్లు వెచ్చిస్తామని మోదీ పార్టీ వాగ్ధానం చేసింది.

అంత డబ్బు ఖర్చుపెట్టాలంటే ప్రభుత్వం నిధుల సమీకరణ చేపట్టాల్సి ఉంటుంది. అందులో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.

గత అయిదేళ్లలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా అమ్మకాల ప్రక్రియ నెమ్మదిగా సాగింది. విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో వాటాను అమ్మేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ, పెట్టబడిదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది.

రెండో పర్యాయంలో మోదీ ప్రైవేటీకరణను వేగవంతం చేసే అవకాశం ఉందని, తద్వారా విదేశీ పెట్టబడులను కూడా పెద్దఎత్తున ఆకర్షించే అవకాశం ఉంటుందని సూర్జిత్ భళ్ళా అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం