కందుకూరి వీరేశలింగం: చదువుకునే రోజుల్లోనే 2 శతకాలు.. సమాజం వెలివేసినా 40 వితంతు వివాహాలు

  • 27 మే 2019
వితంతు వివాహం

ఇటీవల జీవితచరిత్రల చుట్టూ పెద్ద స్థాయిలో చర్చ సాగుతోంది. తెలుగు భాషలో ప్రచురితమైన తొలి స్వీయ చరిత్ర మాత్రం కందుకూరి వీరేశలింగం రాసినదే. అంతేకాదు మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి వీరేశలింగం. మొట్టమొదటి సహవిద్యా పాఠశాలను ప్రారంభించినది కూడా ఆయనే. తెలుగులో తొలి నవల ఆయన రాసిందే. తెలుగులో తొలి ప్రహసనం కూడా కందుకూరి రాసిందే.

తెలుగు నేల మీద సంఘ సంస్కర్తల జాబితాలో కందుకూరి వీరేశలింగానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 1848 ఏప్రిల్ 16న రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి తీరంలో జన్మించిన వీరేశలింగం అనతికాలంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించారు.

ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పిల్లలకు పాఠాలతో పాటు, సంఘ సంస్కరణ భావాలను బోధించేందుకు ఆయన ప్రయత్నించినట్టు చెబుతారు.

సమాజంలోని దురాచారాలకు వ్యతిరేకంగా తన భావాలను వ్యాప్తి చేయడానికి ఆయన 1874 అక్టోబరులో 'వివేక వర్ధని' అనే పత్రికను ప్రారంభించారు.

"సంఘంలోని అవకతవకలను ఎత్తి చూపడం, దురాచారాల నిర్మూలన, ప్రభుత్వ వ్యవస్థలో ప్రబలంగా ఉన్న అవినీతిని ఎత్తిచూపి, అవినీతిపరులను సంఘం ముందు పెట్టడం వివేకవర్ధని లక్ష్యాలు" అని మొదటి సంచికలోనే తెలియజేశారు. ఆ పత్రిక కోసం పరిశోధనాత్మక కథనాలు చేసిన తీరు నేటి సమాజానికి కూడా ఆశ్చర్యం కలిగించే స్థాయిలో ఉండేదని చరిత్ర పరిశీలకుల అభిప్రాయం.

సాహితీ వ్యాసంగంలోనూ కృషి చేసిన కందుకూరి బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు. వీరేశలింగం స్త్రీవిద్య కోసం ఉద్యమించి, ప్రచారం చెయ్యడమే కాక, బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించారు. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారని చరిత్ర చెబుతోంది.

ఆ కాలంలో అంటరాని కులాలుగా భావించిన వారి పిల్లలను కూడా చేర్చుకుని మిగతా పిల్లలతో కలిపి కూర్చోబెట్టేవారు. అప్పట్లో అది ఒక సాహసమే. ఉచితంగా చదువు చెప్పడంతో బాటు, పుస్తకాలు, పలకా బలపాలు అందిస్తూ వారిని చదువుల్లో ప్రోత్సహించేవారు. 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా ఐదేళ్లు పనిచేశారాయన.

అన్నింటికీ మించి మహిళోద్దరణకు కందుకూరి విశేషంగా ప్రాధాన్యమిచ్చారు. బాల్య వివాహాలు ఎక్కువగా జరిగిన నాటి కాలంలో వితంతువుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఆయన సతీమణి కందుకూరి రాజ్యలక్ష్మి అందించిన తోడ్పాటుతో వారి ఉద్ధరణపై శ్రద్ధ పెట్టారు. వితంతు పునర్వివాహాలు జరిపించారు.

సంఘ సంస్కరణల విషయంలో ప్రచారంతో సరిపెట్టకుండా కార్యాచరణ చేపట్టడం కందుకూరి ప్రత్యేకత. రాజమహేంద్రవరంలోని తన స్వగృహంలోనే తొలి వితంతు వివాహానికి సిద్ధమయ్యారు.

అయితే ఆనాడు అనేక అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అతి రహస్యంగా ఈ వివాహం జరిపినట్టు రాజమహేంద్రవరానికి చెందిన తెలుగు అధ్యాపకుడు పీవీబీడీఆర్ సంజీవరావు బీబీసీకి తెలిపారు.

"సమాజ హితం కోసం కందుకూరి సేవలను వందేళ్ల తర్వాత కూడా గుర్తుంచుకోవడం ఆయన ఘనతకు నిదర్శనం. నేటి ఆధునిక భావజాలం ఆనాడు ఆయనలో కనిపిస్తుంది. 1881 డిసెంబర్ 11న తొలి వితంతు వివాహం జరిపించారు. స్త్రీ బయటకు వెళ్లి చదువుకునే అవకాశం కూడా లేని రోజులవి. ఆ పరిస్థితుల్లోనే ధవళేశ్వరంలో ఆయన బాలికా పాఠశాల ప్రారంభించారు. కానీ ఆ పాఠశాలకు వెళుతున్న వారిని వేశ్యలుగా హేళన చేసిన రోజులవి.

సంఘ సంస్కరణా ధృక్పథంతో ఆనాడు వితంతు వివాహాలు చేయించడం సామాన్య విషయం కాదు. చాలామంది విద్యార్థులు వీరేశలింగానికి అండగా నిలవడంతోనే గోగులపాటి శ్రీరాములు అనే వ్యక్తితో గౌరమ్మ అనే యువతికి పునర్వివాహం చేయగలిగారు. రాత్రి పూట చీకటిలో వారిద్దరినీ తరలించడం, ఎవరి కంట కనబడకుండా జాగ్రత్తగా పెళ్లి మండపానికి తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది" అంటూ సంజీవరావు పేర్కొన్నారు.

కందుకూరి వీరేశలింగం ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజం స్థాపించాడు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగంతోనే మొదలయింది. సమాజ సేవ కోసమంటూ 1905 హితకారిణి సమాజం అనే సంస్థను స్థాపించి, తన యావదాస్తిని దానికి ఇచ్చేశారు. బెంగళూరు సహా వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆస్తులన్నీ ఆ సంస్థకు అప్పగించేశారు.

రచనా వ్యాసంగంలో కూడా కందుకూరి కీర్తి గడించారు. మొత్తం 130కి పైగా గ్రంథాలు రాశారు. తెలుగులో ఇంత పెద్ద సంఖ్యలో గ్రంథ రచనలు చేసినవారు మరొకరు లేరంటే ఆశ్చర్యమే. ఇక ఆయన రచనల్లో రాజశేఖర చరిత్ర అనే నవల, సత్యరాజా పూర్వ దేశయాత్రలు వంటివి ప్రముఖమైనవి. అనేక ఆంగ్ల, సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. బడి పిల్లల కోసం వాచకాలు రాశారు. స్వీయ చరిత్రతో పాటు ఆంధ్ర కవుల చరిత్రనూ ఆయన ప్రచురించారు.

కందుకూరి పలు నాటకాలు రచించారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లో కందుకూరి జయంతిని ఏపీ ప్రభుత్వం నాటకరంగ దినోత్సవంగా పాటిస్తోంది. అయితే కందుకూరి తీరు పట్ల ఆ రోజుల్లో పలు విమర్శలుండేవి. ఆయన ధోరణిని నిరసిస్తూ కందుకూరికి సమకాలికుడు కొక్కొండ వెంకటరత్నం పోటీగా పత్రికలు ప్రచురించడమే కాకుండా పలు కార్యక్రమాలు కూడా చేపట్టారు.

కందుకూరి వివేకవర్ధనికి పోటీగా కొక్కొండ హాస్య వర్ధని అనే పత్రికను తీసుకొచ్చారు. హాస్య వర్థని పత్రికకు పోటీగా కందుకూరి హాస్య సంజీవిని అంటూ మరో హాస్య పత్రికను ముందుకు తీసుకొచ్చారు.

తెలుగులో మొట్టమొదటి ప్రహసనాన్ని కందుకూరి ఈ పత్రికలోనే ప్రచురించారు. ఎన్నో ప్రహసనాలు, వ్యంగ్య రూపకాలు ఈ పత్రికలో ముద్రించేవారు. కందుకూరి మీద అనేక విమర్శలు చేసిన వారిలో నాళం కృష్ణారావు, దిగవల్లి వెంకట శివరావు వంటి వారు ఉన్నారు.

చిత్రం శీర్షిక కందుకూరి వీరేశలింగం నివసించిన ఇల్లు

"హేతువాద ధృక్పథంతో బాల్యవివాహాలు, కుల వివక్ష వంటి అనేక అంశాలపై వీరేశలింగం పనిచేశారు. వితంతు వివాహాలు జరుపుతున్న సమయంలో అనేక ఆటంకాలు ఎదుర్కొన్నారు. అవమానాలకు కూడా గురయ్యారు.

కందుకూరితో పాటు తొలి వితంతు వివాహానికి వెళ్ళిన అందరినీ ఆనాటి సమాజంలో వెలివేసినా ఆయన వెనకడుగు వేయలేదు. ఎంత ప్రతిఘటన ఎదురైనా పట్టుబట్టి సుమారు 40 వితంతు వివాహాలు జరిపించారు. వంటవాళ్లు, నీరు తెచ్చేవారు ఆయన ఇంటికి రావడానికి నిరాకరించినప్పటికీ తను అనుకున్నది సాధించడానికి కందుకూరి కంకణం కట్టుకుని సాగారు" అని చరిత్ర పరిశోధకులు వైఎస్ నరసింహరావు తెలిపారు.

సంఘసేవలో వీరేశలింగం ఎంత కృషి చేశారో, సాహిత్యంలోనూ సమాంతర కృషి చేశారు.

"చదువుకునే రోజుల్లోనే రెండు శతకాలు రాసిన ఘనుడు కందుకూరి. వివేకవర్ధనిలో సులభశైలిలో రచనలు చేశారు. వ్యావహారిక భాషలో రచనలు చేసిన ప్రథమ రచయితలలో ఆయన ఒకరు. తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాషల్లో అద్వితీయ ప్రతిభ కందుకూరి సొంతం" అంటూ వైఎస్ఎన్ బీబీసీకి వివరించారు.

కందుకూరి వీరేశలింగం స్థాపించిన హితకారిణీ సమాజం ప్రస్తుతం దేవాదాయ శాఖ పరిధిలో ఉంది. ఈ సంస్థ మొత్తం 8 విద్యాసంస్థలు నడుపుతోంది. వీటిలో 4వేల మంది విద్యార్థులున్నారు.

తొలి వితంతు వివాహం జరిపించిన కందుకూరి సొంతింటితో పాటు కందుకూరి రాజేశ్వరి, వీరేశలింగం దంపతుల సమాధులు కూడా ఇప్పుడు సందర్శనీయ స్థలాల జాబితాలో ఉంది.

కందుకూరి గురించి సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో ఆరుద్ర.. "అదేం చిత్రమో గాని తాము శారీరకంగా దుర్బలులైనా జాతిని బలిష్ఠం చేసి దేశాభివృద్ధిని, భాషాభివృద్ధిని సాధించిన మనోబల భీములలో పంతులుగారు ప్రథములు. రెండోవారు గురజాడవారు. అటువంటి ఉజ్వల చారిత్రకుని ఏ బిరుదుతో వర్ణించినా అది అసమగ్రమే. అయినా నవ్యాంధ్ర నిర్మాతలనే నిర్మించినవారిగా నేను పంతులుగారిని భావిస్తున్నాను. అభినవాంధ్రకు ఆయన ఆద్య బ్రహ్మ" అంటూ వ్యాఖ్యానించారు.

చిలకమర్తి లక్ష్మీనరసింహం కూడా కందుకూరి గురించి వ్యాఖ్యానిస్తూ...

"తన దేహము తన గేహము

తన కాలము తన ధనంబు తన విద్య జగ

జ్జనులకే వినియోగించిన

ఘనుడీ వీరేశలింగకవి జనులార!" అంటూ పేర్కొన్నారు.

రాజమహేంద్రవరం చరిత్రలోనే కాకుండా తెలుగునాట సాంఘిక సంస్కరణోద్యమాలు, సాంస్కృతిక అంశాలలో కందుకూరికి ప్రత్యేక స్థానం ఉంటుంది. 1919 మే 27న ఆయన మరణించారు.

(ఈరోజు కందుకూరి వీరేశలింగం శతవర్థంతి.)

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం