‘సొంతవారే టీఆర్ఎస్‌ను ఓడించారు’ - ప్రెస్ రివ్యూ

  • 27 మే 2019
Image copyright KCR/FB

సొంతపార్టీవారే టీఆర్ఎస్‌ను ఓడించారంటూ నవ తెలంగాణ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

'ఎంపీ ఎన్నికల్లో 16 స్థానాలకుగాను కేవలం 9 స్థానాలే ఎందుకు గెలిచాం..? మిగతా వాటిలో ఎందుకు గెలవలేకపోయాం..? అనే వివరాలు రాబట్టండి. అన్నింటికంటే ముఖ్యంగా ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌లలో ఎందుకు ఓడామనే దానిపై 48 గంటల్లో నాకు రిపోర్టు సమర్పించాలి' అని కేసీఆర్ హుకుం జారీచేశారు.

అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆదివారం ఉదయానికే వేగులు రిపోర్టును సీఎంకు సమర్పించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్‌ నాయకులే ఈ ఓటములకు కారణమంటూ ఆ రిపోర్టులో వారు వివరించారు.

'పార్టీలో సీఎం, ఆయన కుటుంబ సభ్యుల పెత్తనమే ఎక్కువైంది. మనం కేవలం ఉత్సవ విగ్రహాల్లాగానే ఉండిపోవాల్సి వస్తున్నది. ఏ ఒక్క కార్యక్రమానికీ ఆహ్వానించటం లేదు. అసలు మనం ఎమ్మెల్యేలమో, కాదో అర్థం కావటం లేదు. ఈ పరిస్థితి మారాలి. అందువల్ల ఈ ఒక్కసారి మనం కొంచెం పక్కకు తప్పుకుని.. సహాయ నిరాకరణ చేద్దాం...' అని మెజారిటీ ఎమ్మెల్యేలు భావించినట్టుగా ఆ నివేదికలో పేర్కొన్నారు.

అందువల్లే ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ ఎంపీ సెగ్మెంట్ల పరిధిలో పార్టీకి తీరని నష్టం వాటిల్లిందంటూ నివేదికలో వివరించారు. ఆ ప్రకారంగా ఇప్పుడున్న క్యాబినెట్‌ నుంచి నలుగురిని తప్పించి, కొత్తగా ముగ్గురికి చోటు కల్పించాలనే నిర్ణయానికి సీఎం వచ్చారని తెలిసింది.

వీరి స్థానంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌, కడియం శ్రీహరిలకు చోటు కల్పించనున్నారు. వీరితోపాటు మహిళా సభ్యురాలికి కూడా మంత్రి పదవి దక్కే సూచనలు కన్పిస్తున్నాయంటూ నవతెలంగాణ పత్రిక పేర్కొంది.

Image copyright Inc

పార్టీ కంటే మీ పిల్లలే ముఖ్యమా?

పార్టీ చీఫ్‌ రాహుల్‌ గాంధీ కొందరు సీనియర్‌ నాయకుల్ని నేరుగా టార్గెట్‌ చేశారంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో,

స్వప్రయోజనాల కోసం పార్టీ ప్రయోజనాల్ని పణంగా పెట్టారని ఘాటుగా దుమ్మెత్తారు. మాజీ ఆర్థికమంత్రి పి చిదంబరం, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రులు అశోక్‌ గెహ్లాట్‌, కమల్‌నాథ్‌లే లక్ష్యంగా విమర్శల శరాలు గుప్పించారు.

కొడుకుల ఎదుగుదలే ముఖ్యమని భావించారని వారిని నిశితంగా విమర్శించారు. శనివారంనాడు జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో పార్టీ చీఫ్‌ రాహుల్‌గాంధీ, ఆయన చెల్లెలు ప్రియాంక గాంధీ చాలా నిష్కర్షగా మాట్లాడారు.

పార్టీ పరాజయాన్ని విశ్లేషించిన రాహుల్‌.. ఓటమికి తాను బాధ్యత తీసుకుంటున్నానని చెబుతూనే ఈ వైఫల్యంలో మీ భాగస్వామ్యమూ తక్కువేం కాదని కుండబద్దలు కొట్టారు. ఏ అంతర్గత సమావేశంలోనూ ఆయన ఇంత తీవ్రంగా మాట్లాడలేదని సమావేశంలో పాల్గొన్న ఓ నేత చెప్పారు.

''కొడుకు కార్తికి టికెట్‌ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని చిదంబరం బెదిరించారు... మరి ఇవ్వాలా? వద్దా? కొడుకు వైభవ్‌ను గెలిపించుకోవడం కోసం ప్రచారమంతటినీ పక్కన పడేసి ఏకంగా వారంరోజుల పాటు జోధ్‌ఫూర్‌లోనే మకాం పెట్టారు అశోక్‌ గెహ్లాట్‌! ఇలా కుమారుడి కోసం కాడి వదిలేయడం సబబేనా? చాలా మంది నాయకులు.. వారి పిల్లలు, బంధువులే ముఖ్యమనుకున్నారు. ఇలా అయితే ప్రజలకు ఏం చెబుతాం?'' అని రాహుల్‌ అధిక్షేపించినట్లు సమాచారం.

నాలుగ్గంటల పాటు జరిగిన సమావేశంలో ప్రియాంక చాలా మార్లు మధ్యలో కల్పించుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఓటమికి కారకులైనవారంతా ఈ సమావేశంలోనే ఉన్నారని ఆమె చాలా నిష్టూరంగా విమర్శించారని ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

Image copyright NurPhoto

‘నల్లధనికుల వివరాలు వెల్లడిస్తాం’

స్విస్‌ బ్యాంకు ఖాతాల్లో నల్లధనం దాచుకున్న వారికి స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం నుంచి నోటీసులు అందుతున్నాయంటూ సాక్షి దినపత్రిక ఓ కథానాన్ని ప్రచురించింది. అందులో..

తాజాగా 11 మంది భారతీయులకు స్విట్జర్లాండ్‌ ఫెడరల్‌ ట్యాక్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ తాఖీదులు జారీ చేసింది. వారి ఖాతాల వివరాలను భారత ప్రభుత్వానికి అందజేయనున్నామని, దీనిపై అభ్యంతరాలేమైనా ఉంటే వెంటనే స్పందించాలని సూచించింది.

అప్పీల్‌ చేసుకోవడానికి ఇదే ఆఖరు అవకాశమని స్పష్టం చేసింది. వీరిలో కృష్ణ భగవాన్‌ రామ్‌చంద్, కల్పేష్‌ హర్షద్‌ కినారివాలా మొదలైన వారి పేర్లు ఉన్నాయి. మిగతా వారి పేర్లను కేవలం పొడి అక్షరాలతో మాత్రమే స్విస్‌ ప్రభుత్వం తన గెజిట్‌ నోటిఫికేషన్‌లో ప్రస్తావించింది.

దశాబ్దాలుగా నల్ల కుబేరులకు స్విస్‌ బ్యాంకులు ఊతంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే, నల్లధనంపై పోరులో భాగంగా ప్రపంచ దేశాల నుంచి ఒత్తిళ్లు పెరిగిన నేపథ్యంలో స్విట్జర్లాండ్‌ ఈ చర్యలు చేపట్టింది.

మార్చి నుంచి స్విస్‌ బ్యాంకుల భారతీయ క్లయింట్స్‌కు 25 నోటీసులు దాకా జారీ అయినట్లు సమాచారం అని సాక్షి కథనం తెలిపింది.

అన్నవరం దేవస్థానం Image copyright Annavaram Devasthanam

అన్నవరంలో ఇకపై సంప్రదాయ వస్త్రధారణ

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో సంప్రదాయ వస్త్రధారణ నిబంధన అమల్లోకి రానుందంటూ ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

సత్యదేవుని ఆర్జిత సేవలు, నిత్యకల్యాణం, వ్రతాలు, దర్శనానికి సైతం సంప్రదాయ వస్త్రధారణతో భక్తులు రావాల్సి ఉంటుంది. జులై 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని ఆ దేవస్థానం ఈవో ఎం.వి.సురేష్‌బాబు తెలిపారు.

స్వామి దర్శనానికి భక్తులు కొందరు ఆధునిక వస్త్రధారణతో వచ్చే ధోరణికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

వ్రతాలు, ఇతర పూజల్లో పాల్గొనే సమయంలో, దర్శనానికి పురుషులు పంచె, కండువా లేదా కుర్తా, పైజమా, మహిళలు చీర, జాకెట్టు లేదా పంజాబీ డ్రెస్‌, చున్నీ, చిన్నపిల్లలైతే లంగా, జాకెట్టు, ఓణి వంటి దుస్తులను మాత్రమే ధరించి రావాల్సి ఉంటుందని వెల్లడించారు.

దేవస్థానంలో వసతిగదులకు డిమాండ్‌ ఎక్కువగా ఉండటం, దళారులను నివారించేందుకు గదుల కేటాయింపు విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

ఇకపై ఆధార్‌ కార్డుతో బయోమెట్రిక్‌ విధానం ద్వారా గదులను కేటాయిస్తామన్నారు. అప్పటికప్పుడు రిజర్వేషన్‌ గదులు పొందే భక్తులు కూడా ఇకపై సీఆర్వో కార్యాలయం (సెంట్రల్‌ రిజర్వేషన్‌ కార్యాలయం) వద్ద దరఖాస్తు నింపి దానికి ఆధార్‌ జత చేయాల్సి ఉంటుందన్నారని ఈనాడు దినపత్రిక తెలిపింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం