డాక్టర్ పాయల్ తాడావీ: కులం పేరుతో వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న డాక్టర్

  • 27 మే 2019
పాయల్ తాడ్వీ Image copyright Facebook/Payal Tadvi

ఉత్తర మహారాష్ట్ర జలగావ్‌కు చెందిన పాయల్ తాడావీ ఎప్పుడూ డాక్టర్ కావాలని కలలు కనేవారు.

తన చదువు పూర్తి చేశాక గిరిజనులకు సేవ చేయాలనుకుని భావించారు. ఆమె టోపీవాలా మెడికల్ కాలేజీలో గైనకాలజీ(స్త్రీరోగ సంబంధ వైద్యం) చదివేవారు.

కానీ పాయల్ మే 22న ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కలలన్నీ ఛిద్రమయ్యాయి. సీనియర్ల వేధింపులు భరించలేకే పాయల్ ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబం ఆరోపిస్తోంది.

ఐపీసీ సెక్షన్ 306/34 ప్రకారం ముగ్గురు మహిళా డాక్టర్లపై అగ్రీపాడా స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో ఐటీ చట్టంలోని కొన్ని సెక్షన్లను కూడా కలిపారు.

ఏసీపీ దీపక్ కుదాల్ బీబీసీతో మాట్లాడుతూ.. "కేసు దర్యాప్తు చేస్తున్నామని" చెప్పారు.

ఆత్మహత్యకు కారణం

డాక్టర్ పాయల్ పశ్చిమ మహారాష్ట్రలోని మీరాజ్-సాంగ్లీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. గత ఏడాది ఆమె పీజీ చేసేందుకు టోపీవాలా మెడికల్ కాలేజ్( బీవైఎల్ నాయర్ ఆస్పత్రి సంబంధిత)లో చేరారు. ఆమె వెనుకబడిన వర్గాలకు చెందినవారు. రిజర్వేషన్ కోటాలో ఆమెకు ఇక్కడ అడ్మిషన్ లభించింది.

అదే మెడికల్ కాలేజీలో ఉన్న ముగ్గురు సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ఆమెను కులం పేరుతో దూషించేవారని, కులం ఆధారంగా ఆమెను వేధించారని ఆరోపిస్తున్నారు. ఈ వేధింపులతో విసిగిపోయిన పాయల్ ఆత్మహత్యకు పాల్పడిందని చెబుతున్నారు.

పాయల్ వాళ్లమ్మ ఆబేదా తాడవీ బీవైఎల్ నాయర్ ఆస్పత్రి డీన్‌కు దీనిపై లిఖిత ఫిర్యాదు చేశారు. అందులో.. తను ఏ ఆస్పత్రిలో క్యాన్సర్‌కు చికిత్స తీసుకుందో, అదే ఆస్పత్రిలో పాయల్‌పై వేధింపులు జరిగాయని, వాటిని తను స్వయంగా చూశానని ఆరోపించారు.

ఆ ఫిర్యాదులో ఆమె "నేను అప్పుడు కూడా కేసు పెట్టడానికి వెళ్తున్నా. కానీ పాయల్ నన్ను ఆపేసింది. దాంతో ఆమెను మరింత వేధించారు. నా కూతురు చెప్పడం వల్లే నన్ను నేను ఆపుకున్నాను" అని తెలిపారు.

సీనియర్ మహిళా డాక్టర్ రోగుల ముందు కూడా పాయల్‌ను ఎగతాళి చేసేవారని, దాంతో పాయల్ చాలా మానసిక ఒత్తిడికి గురైందని ఆబేదా చెప్పారు. ఆమె మానసిక ఆరోగ్యం గురించి తనకు ఆందోళనగా ఉండేదని తెలిపారు. పాయల్ తన డిపార్ట్‌మెంట్ మార్చాలని కూడా అప్లికేషన్ పెట్టిందన్నారు.

చివరికి మే 22న పాయల్ ఆత్మహత్య చేసుకుంది.

మహారాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్(ఎంఎఆర్డీ) ఆమెను వేధించినట్లు చెబుతున్న ముగ్గురు మహిళా డాక్టర్లను సస్పెండ్ చేసింది. ఆమె కుటుంబం మాత్రం యూనిట్ హెడ్‌ను కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తోంది.

పాయల్‌తోపాటు పనిచేస్తున్న మిగతా డాక్టర్లు దీనిపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులుగా చెబుతున్న డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Image copyright Central MARD

కౌన్సెలింగ్ అవసరం

ఈ ఘటనతో మెడికల్ రంగానికి సంబంధించిన చాలా మంది షాక్‌ అయ్యారు. పాయల్ మృతితో వివక్ష, మానసిక ఒత్తిడి అంశం మరోసారి వెలుగులోకి వచ్చిందన్నారు.

జేజే ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ అంబేడ్కర్ మెడికోస్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ రేవంత్ కానిందే మాట్లాడుతూ.. "పీజీ చేస్తున్న ఒక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిందంటే, ఆమె ఎంత మానసిక ఒత్తిడికి గురయ్యిందో మనం అర్థం చేసుకోవచ్చని" అన్నారు.

"యూనివర్సిటీ, కాలేజీలు సమాన అవకాశాల సెల్ ఏర్పాటు చేయాలని యూజీసీ మార్గనిర్దేశాలు జారీచేసింది. కానీ మహారాష్ట్రలోని ఏ కాలేజీలూ అలా చేయడం లేదు. విద్యార్థులు తమ ఇళ్లు వదిలి చదువుకోడానికి వస్తారు. వారికి కౌన్సెలింగ్ అవసరం ఉంటుంది. ఇలాంటి కేసులు త్వరగా విచారించేందుకు, కాలేజీ యంత్రాంగం ఎస్సీ-ఎస్టీ అధికారిని నియమించాలి".

"జనరల్, వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఒకరినొకరు అర్థం చేసుకునేలా వారికి షేరింగ్ కౌన్సెలింగ్ సెషన్ ఉండాలి" అన్నారు.

కాలేజ్ డీన్ డాక్టర్ రమేష్ భర్మాల్ స్పందన తెలుసుకోవాలని బీబీసీ ప్రయత్నించింది. కానీ ఆయన వైపు నుంచి ఎలాంటి సమాధానం లభించలేదు.

మహారాష్ట్ర యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం యాంటీ రాగింగ్ టీమ్.. ఘటన జరిగిన తర్వాత రోజు నుంచే దర్యాప్తు చేపట్టింది.

ఈ టీమ్ దాదాపు 25 మంది వాంగ్మూలం సేకరించింది. మంగళవారం ఉదయం లోపు పాయల్ ఆత్మహత్యపై ఒక నివేదిక సమర్పించనుంది.

పాయల్‌ను వేధించినట్లు చెబుతున్న ముగ్గురు మహిళా డాక్టర్లు కూడా యాంటీ రాగింగ్ కమిటీ ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు.

పాయల్ పనిచేస్తున్న యూనిట్ హెడ్ మీద కూడా దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ఆస్పత్రి తమ పరిధిలో ఉండడంతో గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కూడా దీనిపై విచారణ ప్రారంభించింది.

వార్డెన్, ఎంఏఆర్డీ, డీన్ ఆఫీసులో ఉన్నవారు ఆస్పత్రిలో అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు తమకు తెలీదని చెబుతున్నారు. అలాంటివి జరక్కుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పాయల్‌కు ఏవైనా సమస్యలుంటే తమకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఆమె భర్త సల్మాన్‌కు కూడా చెప్పామని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. కానీ పాయల్‌ చదువుకు ఇబ్బంది అవుతుందని ఆయన తమ దగ్గరకు వచ్చేవాడు కాదని, అప్పుడే తాము వీటిపై మాట్లాడి ఉంటే ఇంత జరిగేది కాదన్నారు.

‘‘మాతో కలిసి పనిచేస్తున్న ఒక తెలివైన విద్యార్థిని మేం కోల్పోయాం. పాయల్ మృతికి షాక్ అయ్యాం’’ అని ఆ ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)