200 ఏళ్ల నాటి నృత్యం: ‘విదేశాల్లో ఆదరిస్తున్నారు.. మన దేశంలో పట్టించుకోవట్లేదు’

  • 28 మే 2019
కామాక్షి

పోయి కాల్ కుతిరై (గోఢ నాచ్) అనేది తమిళనాడులోని పురాతన జానపద నృత్యరూపకాల్లో ఒకటి. తంజావూరుకు చెందిన 67 ఏళ్ల కామాక్షి ఇప్పటికీ ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. భర్త కలైమామణి నాడి రావు(75)తో కలిసి ఈ జానపద నృత్యరూపకం అంతరించిపోకుండా కాపాడుతున్నారు.

బీబీసీ ప్రతినిధులు ఆ దంపతులను కలవడానికి తంజావూరు వెళ్లగా, వారు అక్కడ తమ నృత్యాన్ని ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సొంతగా మేకప్ వేసుకుంటూ గుర్రాన్ని అలంకరిస్తున్నారు.

‘‘ఎప్పుడూ నాకు నేను మేకప్ వేసుకుంటా’’ అని రోజ్ పౌడర్ ముఖానికి అద్దుకుంటూ చెప్పారు కామాక్షి. అదే సమయంలో గుర్రాన్ని కూడా రంగు రంగుల జాకెట్లు వేసి అలంకరిస్తున్నారు.

నాడి రావు పూర్వీకులది వాస్తవానికి మహారాష్ట్ర. ఎన్నో తరాలుగా వారి కుటుంబం తమిళనాడులో ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తోంది. పూర్వకాలంలో తంజావూరు సరభోజ రాజులు తమ నృత్యాన్ని ఆదరించేవారని వారు చెప్పారు.

పురాతన సంప్రదాయ జానపద కళల్లో గోఢ నాచ్ అత్యంత ముఖ్యమైనదని నాడి రావు చెప్పారు. కాలుకు ఒక కట్టెను కట్టుకొని బొమ్మ గుర్రం బరువును మోస్తూ నృత్యం చేస్తామని అన్నారు.

200 ఏళ్ల నాటి కళారూపం

‘‘ఈ గోఢనాచ్ 200 ఏళ్ల కిందట కళారూపం. మహారాష్ట్ర నుంచి ఈ కళ వచ్చింది. మా పూర్వీకులు అక్కడి నుంచి తమిళనాడుకు దీన్ని తీసుకొచ్చారు. మా తాత,ముత్తాతలు తమిళనాడులో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. అప్పట్లో గ్రామంలోని జాతరలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు, అన్ని శుభకార్యాల్లోనూ ఈ నృత్యాన్ని ప్రదర్శించేవారు. నేటి యువతరం ఈ కళారూపాన్ని చూసార్తో లేదో అని అనుమానంగా ఉంది’’ అని నాడి రావు పేర్కొన్నారు.

‘‘ఆ రోజుల్లో మాకు మంచి పేరు ప్రతిష్టలు ఉండేవి. ఇప్పుడు అవన్నీ పోయాయి. 40 ఏళ్ల నుంచి నేను నృత్యం చేస్తున్నా. కనీసం ప్రదర్శన చేయడానికి కూడా సరైన అవకాశాలు రావడం లేదు’’ అని కామాక్షి తెలిపారు.

కామాక్షి పెళ్లైన తర్వాత మామ నుంచి ఈ నృత్యం నేర్చుకున్నారు.

‘‘గతంలో నేను కగరం, కురితి నృత్యరూపాలను ప్రదర్శించేదాన్ని. ఇప్పుడు ఈ నృత్యం చేస్తున్నా. అప్పట్లో ఎక్కడ పెళ్లి జరిగినా మమ్మల్ని పిలిచేవారు. అక్కడ ఈ నృత్యాన్ని ప్రదర్శించేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు’’ అని ఆమె పేర్కొన్నారు.

‘‘ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ కాలం నుంచి నేను నృత్యం చేస్తున్నా. నాలాంటి ముసలిది నృత్యం చేస్తే ఎవరు చూస్తారు. ఎవరూ మమ్మల్ని ప్రదర్శనకు కూడా పిలవడం లేదు. యువతుల నృత్యాన్నే నేటితరం ఇష్టపడుతోంది. కానీ, వారు నాలాగా నృత్యం చేయగలరా? అంతకుమించి ఇప్పుడు అందరూ సినిమా పిచ్చిలో పడ్డారు. మా ప్రదర్శనను చూడటానికి ఎవరూ రావడం లేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నృత్యరూపకం కనుమరుగు కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్య తీసుకోవాలని, తమకు సరైన అవకాశాలు ఇవ్వాలని ఈ దంపతులు కోరుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే ఈ నృత్యం అంతరించిపోతుందని చెబుతున్నారు.

చిత్రం శీర్షిక కామాక్షి, నాది రావు దంపతులు

రాజులు, రాణులను చూశారా?

‘‘మీరు రాజులు, రాణులను చూశారా... లేదు కదా. మేం ఇప్పుడు ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తే రాజులు, రాణులు ఎలా ఉండేవారో ప్రజలకు తెలుస్తుంది. మా నుంచి వారు రాజులను చూసే అవకాశం కలుగుతుంది.’’ అని నాది రావు తెలిపారు.

‘‘కొంతమంది ప్రజలు మా దగ్గరకు వచ్చి అభినందిస్తారు. మమ్మల్ని ఇష్టపడుతారు. దాని వల్ల ఈ నృత్యం అభివృద్ధి జరగదు కదా... కనీసం మాకు చాలినంత డబ్బు కూడా దీని వల్ల రావడం లేదు’’ అని ఆ దంపతులు పేర్కొన్నారు.

ముందుతరాలకు తీసుకెళ్లాలి

నాదిరావు, కామాక్షిల కుమారుడు శివాజీరావు కూడా ఇదే వృత్తిలో ఉన్నారు. ఈ సంప్రదాయ కళారూపాన్ని ముందుతరాలకు తీసుకెళ్లాలని ఆయన అన్నారు.

‘‘యూనివర్సిటీలలో దీన్ని ఒక పాఠ్యాంశంగా చేర్చాలి. అవార్డు పొందిన కళాకారులతో ఈ నృత్యాన్ని వారికి నేర్పించాలి’’ అని చెప్పారు.

‘‘మేం ఎప్పుడైనా విదేశాల్లో ఈ కళారూపాన్ని ప్రదర్శిస్తే అక్కడి ప్రేక్షకులు మా మీద ఎంతో గౌరవం, ప్రేమ చూపేవారు. భారతీయులుగా మాకు గర్వంగా ఉండేది. కానీ, అదే కళారూపాన్ని మన గ్రామాల్లో వేస్తే ఎందుకు ఇంకా ఈ నృత్యం చేస్తున్నాం అని అనిపించేది’’ అని శివాజీ రావు తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)