స్మృతి ఇరానీ వర్సెస్ రాహుల్ గాంధీ: అమేఠీలో బీజేపీకి విజయం ఎలా దక్కింది

  • 28 మే 2019
అమేఠీ

దాదాపు ఒకటిన్నర కిలోమీటరు పొడవున్న ఒక వంతెన అమేఠీలో చాలా మార్పులు తీసుకొచ్చింది.

గోమతీ నది ఒక ఒడ్డున పిపలీ జమాల్‌పూర్ ఉంది. ఈ గ్రామంలో థౌరీ చౌరస్తా నుంచి నదివైపు వెళ్లే ఇరుకైన దారిలో ఉంది. సైకిల్ మిస్త్రీ బలికరణ్ ఇక్కడే ఉంటారు.

"నది నీళ్లు ఇళ్లలోకి వచ్చేసేవి. మేమంతా గ్రామంలో ఎన్నికలను బహిష్కరించాలనే నిర్ణయానికి కూడా వచ్చాం. అప్పుడే స్మృతి ఇరానీ వచ్చారు. మీరు ఎన్నికలను బహిష్కరించద్దని, నేను ఓడినా, గెలిచినా కచ్చితంగా వంతెన కట్టిస్తానని హామీ ఇచ్చారు" అని తన ఇంటి ముందు కూర్చున్న బలికరణ్ చెప్పారు.

అది 2014లో జరిగింది. కానీ 2019 లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు పిపలీ జమాల్‌పూర్, చుట్టుపక్కల 28 గ్రామాలన్నీ స్మృతి ఇరానీకే ఓట్లు వేశాయి.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై 55 వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచిన స్మృతి ఇరానీకి సంబంధించి ఇలాంటి చాలా విషయాలు చాలా మంది చెప్పుకుంటున్నారు. స్థానికులు ఆమెను దీదీ (అక్క) అని కూడా పిలుచుకుంటున్నారు.

Image copyright EPA

దీదీ సాధ్యం చేశారు

భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో "దీదీ ఉంటే ఏదైనా సాధ్యమే" అనే నినాదం అక్కడక్కడా అతికించి ఉంది.

పార్టీ జిల్లా కార్యాలయంలో వార్ రూం, సీసీటీవీలు, నాలుగైదు కంప్యూటర్లు ఉన్న ఒక చిన్న గది కూడా ఉంది. అక్కడ కంప్యూటర్ ఇంజనీర్ వివేక్ మహేశ్వరి టీమ్ కూర్చుంటుంది.

"మా మాటను అందరికీ వినిపించడమే మా పని. జిల్లాలో ప్రతి బ్లాక్‌లో మా టీమ్ ఉంది. సందేశాలను వాట్సాప్‌లో ఫార్వార్డ్ చేస్తాం. అమేఠీ ట్విటర్‌లో కూడా చాలా చురుకుగా ఉంది. మనం ఏదైనా చేస్తుంటే ఫేస్‌బుక్ ద్వారా దాన్ని లైవ్ చేయొచ్చు, గ్రామంలోని వారికి ఫేస్‌బుక్ బాగా తెలిసుంటుంది" అని అక్కడే పనిచేసే వివేక్ చెప్పాడు.

పీపలీ వంతెనతోపాటు ఇంకా చాలా అంశాలపై ప్రచారం చేశారు. ఇక్కడ నుంచి పోటీ చేసిన కాన్షీరాం, శరద్ యాదవ్, రాజ్‌మోహన్ గాంధీ నుంచి కుమార్ విశ్వాస్ వరకూ అందరూ ఒకసారి ఓటు అడిగిన తర్వాత మళ్లీ ముఖం చూపించేవారు కాదని, స్మృతి ఇరానీ మాత్రం అక్కడికి మళ్లీ మళ్లీ వచ్చేవారని చెప్పారు.

స్థానికుల ఫిర్యాదులు

అమేఠీ ప్రజలు ఎక్కువగా అక్కడి నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన రాహుల్ గాంధీపై ఫిర్యాదులు చేస్తున్నారు.

సయ్యద్ మొయిన్ షా అనే స్థానికుడు "ఆయన వచ్చేవారు, రెండు మూడు రోజులు ప్రచారం చేసి, జగదీష్‌పూర్‌లో తన గెస్ట్ హౌస్‌ చేరేవారు. తర్వాత వెళ్లిపోయేవారు. ఆ మూడు నాలుగు చోట్ల మేం ఆయనతో మాట్లాడలేకపోయేవాళ్లం. మా సమస్యలు ఎలా చెప్పుకోవాలి" అన్నారు.

రాహుల్ మాత్రం తను గాంధీ కుటుంబం ప్రతినిధిని అని చెప్పుకునేవారు. కానీ స్థానికులు మాత్రం ఆయన్ను కలవడం అంత సులభం కాదని ఫిర్యాదు చేసేవారు.

మొయిన్ షా అమేఠీ రాజవంశం పాత మహల్ దగ్గర ఉండే రాంనగర్‌లో ఉండేవారు.. అది ఇప్పుడు మూతపడి ఉంది.

గాందీ కుటుంబం అమేఠీ

సంజయ్ గాంధీకి అమేఠీ నుంచి పోటీ చేయాలని అమేఠీ రాజు రణంజయ్ సింగే సలహా ఇచ్చారని చెబుతారు. అయితే అత్యవసరస్థితి తర్వాత ఇందిర వ్యతిరేక పవనాలు వీయడంతో 1977 ఎన్నికల్లో సంజయ్ గాంధీ ఓడిపోయారు. కానీ అప్పుడు ఆయనకు లక్ష ఓట్లకు పైనే వచ్చాయి.

రాంనగర్‌ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ముసాఫిర్‌ఖానాకు వెళ్లే దారిలో రామవృక్ష షాపు ఉంటుంది.

"స్మృతి ఇరానీ అన్ని గ్రామాలూ తిరిగి, ప్రచారం చేసేవారు. ఓట్లు అడిగేవారు. జనం కూడా ఆమెను చూడాలని తపించిపోయేవారు. కానీ రాహుల్ కూడా వచ్చేవారు, రోడ్డు మీద నుంచి అట్నుంచి అటే వెళ్లిపోయేవారు" అని ఆయన చెప్పారు.

కాంగ్రెస్ కార్యకర్త శీత్లా ప్రసాద్ యాదవ్ కూడా రామవృక్ష షాపు దగ్గరే ఉంటారు. ఆయన కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే ఓటు వేశారు. కానీ తన నాయకుల గురించి చాలా బాధపడుతున్నారు. "అసలు కార్యకర్తలు అనేవారే కనిపించకుండాపోయారు" అన్నారు.

కాంగ్రెస్ నేత యోగేంద్ర మిశ్రా మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపారేశారు.

"రాహుల్ గాంధీ తరచూ అమేఠీ వచ్చేవారు. ప్రజలను కలవడానికి ప్రత్యేకంగా సమయం కేటాయించేవారు. ఎవరైనా ఏదైనా పని గురించి అడిగితే దానిని పుస్తకంలో నోట్ చేసుకునేవారు" అని చెప్పారు.

రాహుల్ గురించి వ్యాఖ్యలు

నియోజకవర్గం అభివృద్ధిపై రాహుల్ గాంధీని కొందరు విమర్శిస్తున్నారు.

పదేళ్లు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, రాహుల్ గాంధీ అమేఠీకి ఏం చేయలేదని స్థానికులు చెబుతున్నారు. "ఆయన చెబుతున్న బీహెచ్ఈఎల్, హెచ్ఏఎల్, ఏసీసీ, సంజయ్ గాంధీ ఆస్పత్రి... అన్నీ రాజీవ్ గాంధీ హయాంలో నిర్మించినవి" అన్నారు.

అది వినగానే ఇంకొకరు కోపంగా "ఆ..ఆ.. స్మృతి గారు ఇక్కడ చాలా పనులు చేశారు. ఆమె ఇక్కడ్నుంచి ట్రిపుల్ ఐటీ లాక్కెళ్లిపోయారు. అట్టల పరిశ్రమ ఉండేది. దాన్ని కూడా ఆమె వేరే ఎక్కడికో పంపించేశారు" అన్నారు.

బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే అమేఠీని టార్గెట్ చేశారని, ఎన్నికల్లో బాగా డబ్బులు ఖర్చు పెట్టారని యోగేంద్ర మిశ్రా చెప్పారు.

బీజేపీ ప్రతినిధి నరేంద్ర సింగ్ చౌహాన్ మాత్రం అది అబద్ధం అంటారు. "ఇది మోదీ మ్యాజిక్. స్మృతి ఇరానీ కష్టానికి ఫలితం" అంటారు.

Image copyright Getty Images

కాంగ్రెస్ ఓవర్ కాన్ఫిడెన్స్

డాక్టర్ అంగద్ సింగ్ స్థానిక కాలేజీలో లెక్చరర్. "కాంగ్రెస్ అవసరమైన దానికన్నా ఎక్కువ ఆత్మవిశ్వాసం చూపించింది, ఫలితంగానే ఓటమి పాలైంది" అని ఆయన అన్నారు.

"కేరళలోని వయనాడ్‌ నుంచి పోటీ చేయడం ద్వారా స్థానికులకు రాహుల్ గాంధీ ఒక పెద్ద నెగటివ్ మేసేజ్ ఇచ్చారు. దాంతో ఆయనకు మాపై నమ్మకం లేకుండా పోయిందని అమేఠీ ప్రజలు భావించారు" అని అంగద్ సింగ్ చెప్పారు.

అమేఠీలో 2014 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన రాహుల్ గాంధీ, ఓడిన స్మృతి ఇరానీల ఓట్లలో తేడా తగ్గిపోయి లక్ష దగ్గరికి చేరుకుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ, ఎస్పీ ఖాతాలో ఐదేసి స్థానాలు వెళ్లాయి.

జాతీయవాదం, శక్తిమంతుడైన నేతగా మోదీ మాయ అమేఠీ ప్రజలపై ప్రభావం చూపించింది.

ఇక ఈసారి ఇక్కడ నుంచి పోటీ చేసిన మిగతా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులందరికీ కలిపి 60 వేల ఓట్లు రావడం వల్ల కూడా రాహుల్‌ విజయవకాశాలపై దెబ్బ పడింది.

అమేఠీలో రాహుల్ గాంధీ 55 వేల 120 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు