‘మంగళగిరి నుంచి వద్దన్నారు.. కానీ మళ్లీ అక్కడి నుంచే పోటీ’ - ప్రెస్ రివ్యూ

  • 28 మే 2019

తాను మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేస్తానని లోకేశ్ స్పష్టం చేసినట్లు ఈనాడు కథనం పేర్కొంది. అందులో..

మంగళగిరి నుంచి పోటీ చేయడంలో ఎలాంటి సందేహం లేదని లోకేశ్ అన్నారు. మంగళగిరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ సహాయం కావాలన్నా తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు.

ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, ఓటమికి తాను కుంగిపోవడంలేదని తెలిపారు. ''నేను మంగళగిరి నియోజకవర్గాన్ని ఎన్నుకోవడం తప్పని పోటీ చేస్తున్నప్పుడే అందరూ అన్నారు. ఓడిపోయాక కూడా అదే అంటున్నారు. నా వరకు నేను మంగళగిరి నుంచి పోటీ చేయడం నా అదృష్టంగా భావించాను. మంగళగిరి నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చింది. నియోజకవర్గ అభివృద్ధికి అనేక ప్రణాళికలు సిద్ధం చేశాను. ఓడిపోయినా వాటి అమలుకు శాయశక్తులా కృషి చేస్తాను'' అని వివరించారు.

వందలాదిగా తరలి వచ్చిన మహిళలు మీ వెంటే మేము ఉంటామంటూ నినాదాలు చేశారు. లోకేశ్‌తో ఫొటోలు దిగిన కార్యకర్తలు, అభిమానులు భావోద్వేగానికి గురవగా.. ఆయన వారిని సముదాయించారని ఈనాడు కథనం తెలిపింది.

‘మీరు దిద్దిన తిలకం తడి ఇంకా ఆరలేదు!

మంగళగిరి ప్రజలకు లోకేశ్.. సోమవారం లేఖ రాశారు. ఆ లేఖలో...

'‘మీ ప్రేమ, ఆప్యాయతలు నాకు ధైర్యం ఇచ్చాయి.. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. ఫలితం ఏదైనా మీతోనే నా ప్రయాణం. నేను గెలవాలని కోరుతూ అక్కాచెల్లెళ్లు దిద్దిన తిలకం తడి ఇంకా ఆరలేదు.. ప్రేమగా నన్ను హత్తుకున్న అన్నలు, బాబాయిలు, తాతల ఆత్మీయ స్పర్శ ఇంకా హృదయానికి చల్లగా తాకుతూనే ఉంది. మండే ఎండల్లో నా కోసం ప్రచారం చేసిన కార్యకర్తల సహకారం మరువలేను. అన్నిటికీ మించి నేను మంగళగిరిలో చేసిన అభివృద్ధిని మీకు వివరించా. జరగాల్సిన అభివృద్ధిని గుర్తించా. మీ బాధలు విన్నా, సమస్యలు తెలుసుకున్నా, నాకు అండగా నిలిచిన ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, నియోజకవర్గ అభివృద్ధికి మీతో కలిసి పోరాటం చేస్తాను' అని పేర్కొన్నారంటూ ఈనాడు కథనం తెలిపింది.

Image copyright YSR CONGRESS

జగన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరం

ముఖ్యమంత్రిగా ఈ నెల 30న జరగనున్న వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు ఊపందుకున్నాయంటూ సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

వచ్చే గురువారం మధ్యాహ్నం 12.23గంటలకు జరిగే ఈ కార్యక్రమం కోసం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. భారీ వాటర్‌ ప్రూఫ్‌ టెంట్లు ఏర్పాటుచేస్తున్నారు.

గ్యాలరీలు, బారికేడింగ్‌ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. స్టేడియంతోపాటు నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేస్తున్నారు. స్టేడియంకు వచ్చే రహదారులకు మరమ్మతులు వేగంగా జరుగుతున్నాయి.

సిటీ కేబుల్‌తోపాటు అన్ని లోకల్‌ చానల్స్, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రసారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. స్టేడియంలో ఏఏ, ఏ1, ఏ2.. ఇలా వివిధ కేటగిరీల కింద మొత్తం 18రకాల గ్యాలరీలు, మీడియాకు ప్రత్యేకంగా ఒకటి ఏర్పాటుచేస్తున్నారు.

ఒక్కో గ్యాలరీకి ఇద్దరు అధికారులను నియమించారు. గవర్నర్, జ్యుడీషియరీ, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి కుటుంబ సభ్యులకు వేర్వేరుగా గ్యాలరీలు ఏర్పాటుచేస్తున్నారు. వీరందరికీ కలిపి సాధారణ పరిపాలనా విభాగం నుంచి 11,500ల పాస్‌లు జారీచేయనున్నారు.

స్టేడియంలో మిగిలిన గ్యాలరీల్లోకి సామాన్య ప్రజలను వేరే గేట్‌ ద్వారా అనుమతిస్తారు. ఈ 11,500 పాస్‌లు పోను, సుమారు 15వేల నుంచి 20వేల మంది సామాన్య ప్రజలను సాధారణ గ్యాలరీలలోకి అనుమతిస్తారు.

హైదరాబాద్, చెన్నై, విశాఖ మార్గాల్లో వచ్చే వాహనాలకు.. ఎక్కడికక్కడ శివారు ప్రాంతాల్లోనే ప్రత్యేక పార్కింగ్‌ ప్రదేశాలు ఏర్పాటుచేస్తున్నారు.

సీఎం కుటుంబ సభ్యులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మాజీ సీఎంలు, అపాట్, ఆర్టీఐ కమిషనర్ల వాహనాలకు మాత్రమే ఇందిరాగాంధీ మైదానంలో పార్కింగ్‌ ఉంటుందని సాక్షి కథనం పేర్కొంది.

Image copyright Twitter/Kavitha Kalvakuntla

'పదవి లేకున్నా.. ప్రజలతోనే ఉంటా'

పదవి ఉన్నా, లేకపోయినా ప్రజలతోనే ఉంటానని నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారంటూ నమస్తే తెలంగాణ పత్రిక తెలిపింది. ఆ కథనంలో..

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన టీఆర్‌ఎస్ కార్యకర్త కిశోర్ కుటుంబసభ్యులను కవిత పరామర్శించారు.

తన ఓటమిని తట్టుకోలేక మనస్తాపంతో అన్న, పానీయాలు, నిద్రాహారాలు మానేసిన కిశోర్.. గత శుక్రవారం గుండెపోటుతో మరణించడంతో కవిత భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీటి పర్యంతమయ్యారు.

పార్టీ కార్యకర్తలు, తన అభిమానులు ధైర్యం కోల్పోవద్దని, తనది నిజామాబాద్ అని, ఈ జిల్లాను వదిలిపోనని స్పష్టంచేశారు. పదవుల్లో ఉన్నా లేకపోయినా ప్రజాసేవకే తన జీవితం అంకితమని పేర్కొన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందేమోనన్న ఆశతోనే ప్రజలు ఆ పార్టీ వైపు మొగ్గుచూపినట్లు కనిపిస్తున్నదన్నారు. నిజామాబాద్ ప్రజల ప్రత్యేక ఆకాంక్షలను కొత్తగా ఎన్నికైన ఎంపీ, వారి పార్టీ నెరవేరుస్తుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.

ఓటమిలోనూ హుందాగా ఉండటం తెలంగాణ ఉద్యమం నేర్పిందని కవిత అన్నారంటూ నమస్తే తెలంగాణ కథనం తెలిపింది.

స్టీఫెన్ రవీంద్ర Image copyright facebook/Stephen Raveendra

ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా తెలంగాణ కేడర్‌కు చెందిన స్టీఫెన్ రవీంద్ర నియామకం ఖరారైందని ఆంధ్రజ్యోతి పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

ఇక ఆ దిశగా ఉత్తర్వులు వెలువడటమే తరువాయి. ఈ ఆదేశాలు కూడా రాకముందే స్టీఫెన్‌ రవీంద్ర రంగంలోకి దిగారు. విజయవాడలోని ఇంటెలిజెన్స్‌ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి సిబ్బంది ఆయనతో పరిచయం చేసుకున్నారు.

30న జరగాల్సిన వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై స్టీఫెన్‌ రవీంద్ర సమీక్షించారు. నిఘా చీఫ్‌గా రవీంద్ర పేరు వెలువడటం నుంచి జగన్‌తో భేటీ అయ్యి, కార్యాలయ ప్రవేశం చేసేదాకా ఈ పరిణామాలన్నీ సోమవారం చకచకా జరిగాయి.

స్టీఫెన్.. వైఎస్ రాజశేఖర రెడ్డి చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేశారు. అప్పటి నుంచి వైఎస్‌ కుటుంబంతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో సేవలందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన జగన్‌కు తెలిపారు.

రెండు రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మర్యాద పూర్వకంగా భేటీ అయిన జగన్‌, ఈ విషయాన్ని ప్రస్తావించి, స్టీఫెన్‌ రవీంద్రను డిప్యుటేషన్‌పై ఏపీకి పంపాల్సిందిగా కోరారు.

స్టీఫెన్ మార్క్!

స్టీఫెన్‌ రవీంద్ర 1999 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. ఉమ్మడి రాష్ట్రంలో రాయలసీమలో పనిచేసిన కాలంలో ఫ్యాక్షనిజంపై ఉక్కుపాదం మోపారు. వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో పనిచేసిన సమయంలో మావోయిస్టు కదలికల్ని సమర్థమంతంగా అడ్డుకున్నారు.

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పశ్చిమ మండలం డీసీపీగా పనిచేసిన సమయంలో, డ్రగ్స్‌ మాఫియాపై కఠినంగా వ్యవహరించారు. ఎన్నికలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐటీ గ్రిడ్‌ కేసు దర్యాప్తునకు ఏర్పాటు చేసిన సిట్‌‌కు ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర చీఫ్‌గా వ్యవహరించారని, ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు