జగన్ ప్రమాణం ఎల్లుండి, అసలింతకీ ప్రమాణ స్వీకారం ఎలా జరుగుతుంది

  • 28 మే 2019
వైఎస్ జగన్మోహన్ రెడ్డి Image copyright Getty Images

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో అసలు ప్రమాణ స్వీకార విధానం ఎలా ఉంటుంది, గత అనుభవాలేమిటి, కాలక్రమేణా ఈ ప్రమాణ స్వీకారం ప్రక్రియ ఎలా మారుతూ వచ్చింది అనేది చర్చించుకోవడం అవసరం.

Image copyright Getty Images

ప్రమాణ స్వీకార ప్రక్రియకు ముందు...

ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక, రాష్ట్రపతి పరిధిలో పనిచేసే కేంద్ర ఎలక్షన్ కమిషన్ శాసన సభకు ఎన్నికయిన విజేతల వివరాలు గవర్నర్‌కు పంపుతుంది. గెలిచిన పార్టీ తమ నాయకుణ్ని ఎన్నుకుంటుంది. ఆ తర్వాత నూతన ప్రభుత్వ ఏర్పాటుకు, మెజారిటీ స్థానాలు గెలిచిన లెజిస్లేచర్ పార్టీ నాయకుడి అభీష్టం మేరకు, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి అవసరమైన ఏర్పాట్లు చేయమని రాష్ట్ర గవర్నర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలిస్తారు. దాన్ని సాధారణ పరిపాలన శాఖ (జనరల్ ఎడ్మినిస్ట్రేషన్) పొలిటికల్ కార్యదర్శి మిగతా అన్ని శాఖల సమన్వయంతో అమలు చేస్తారు.

రాష్ట్ర విభజన అనంతరం ఏపీ తొలి ప్రభుత్వ ప్రమాణ స్వీకారం జూన్ 8, 2014న గుంటూరు నాగార్జున యునివర్సిటీ ఎదురుగా వున్న బైబిల్ గ్రౌండ్‌లో జరిగింది. ఇందుకు సంబంధించిన పనులన్నీ ప్రభుత్వ కార్యదర్శులు, శాఖాధికారులు అప్పట్లో హైదరాబాద్ నుంచి వచ్చి విజయవాడ, గుంటూరు నగరాల్లో బసచేసి పర్యవేక్షించవలసి వచ్చింది. స్థానికంగా కృష్ణా, గుంటూరు జిల్లా పరిపాలనా యంత్రాంగం తరపున కలెక్టర్లు ఈ పనులు పూర్తిచేశారు.

Image copyright Getty Images

అట్టహాసంగా ఏర్పాట్లు - అధికారుల ఇబ్బందులు

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వల్ల రాష్ట్ర విభజన తర్వాత, దేశంలో 29వ రాష్ట్రంగా వారు తమ ప్రాంతానికి ఒక ప్రాదేశిక ప్రతిపత్తిని భారత ప్రభుత్వం నుంచి రాష్ట్ర పునర్విభజన చట్టం ద్వారా 2014 జూన్ 2న సాధించుకున్నారు. వారికి అది ఒక విజయోత్సవం కనుక, దాన్ని వారు ఒక పండుగగా నిర్వహించుకున్నారు. అయితే ఏపీలో ముహూర్తాలు చూసుకుని జూన్ 8 సాయంత్రం 6-7 గంటల మధ్య ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ స్వీకారం చేయాలనుకున్నారు. అది కూడా లక్షలాది మంది పార్టీ కార్యకర్తలను తరలించి, వారి మధ్య అట్టహాసంగా దాన్ని జరపాలనుకున్నారు. ఇటువంటి సందర్భాలకు వేదిక ఏదైనా ఒక స్టేడియం అయినప్పుడు, దాని సామర్ధ్యాన్ని బట్టి ప్రేక్షకులు ఉంటారు.

కానీ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి 4-5 లక్షల మంది జనం వస్తారు, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలి అని పార్టీ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి సమాచారం అందింది. దాంతో అందుకు తగిన అలంకరణతో వేదిక, రాజ్‌భవన్ సిబ్బంది పర్యవేక్షణలో ఏర్పాట్లు, ప్రోటోకాల్ మేరకు ప్రభుత్వ అతిథులకు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు, రవాణా, సీటింగ్ ఏర్పాట్లు, రాత్రి బస, భోజన ఏర్పాట్లు, రాకపోకలు, భద్రత, మైదానం అంతా బారికేడింగ్, కుర్చీలు, పార్కింగ్ ఏర్పాట్లు, మైక్, లైటింగ్, ఎల్ఈడీ స్క్రీన్ల ఏర్పాట్లు, మీడియా ఎన్‌క్లోజర్, ఇంటర్‌నెట్, మండువేసవి కావడంతో మంచినీళ్ళ ఏర్పాటు, సభ ముగిశాక బాణాసంచా కాల్చడం... ఇటువంటివి ఇంకా ఎన్నో అప్పట్లో ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి వచ్చింది.

సభా వేదిక కోల్‌కతా-చెన్నైజాతీయ రహదారి పక్కన ఉండడంతో కృష్ణా జిల్లాలో హనుమాన్ జంక్షన్ వద్ద, గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట వద్ద నుంచి హైవేపై ట్రాఫిక్ మళ్ళించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక చంద్రబాబుతో ఎన్డీయే నేతలు

ప్రభుత్వ, పార్టీ అతిథులు

అప్పట్లో కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో టీడీపీ భాగస్వామి కావడంతో, చంద్రబాబు నాయుడు ఆహ్వానంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మినహా మిగతా కేంద్ర మంత్రి మండలిలో ఒకరిద్దరు మినహా అందరూ ప్రభుత్వ అతిథులుగా వచ్చారు. ఇక ప్రభుత్వంలో లేని అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి వంటి సీనియర్లు వారికి అదనం. వీరు కాకుండా దిల్లీ నుంచి నేషనల్ మీడియాను కూడా ప్రభుత్వం పిలిపించింది. వీరంతా రెండు ప్రత్యేక విమానాల్లో గన్నవరం వచ్చి, అక్కడి నుంచి ఏసీ బస్సుల్లో వేదిక వద్దకు వచ్చి వెళ్లారు.

ఈ ఒక్క పని సజావుగా పూర్తి చేయడానికే అధికారులు అష్టకష్టాలు పడ్డారు. వేదిక వద్ద ఉక్కపోతకు ప్రత్యేక ఎన్‌క్లోజర్లలో కూర్చున్న అతిథులు ఏసీలు ఉన్నప్పటికీ దుంపలు ఉడికినట్టు ఉడికిపోయారు. మీడియా ఎన్‌క్లోజర్లో ముందుగా నిల్వ ఉంచిన నీళ్ళ బాటిళ్లు సభ మధ్యలోనే అయిపోతే, వేదిక పక్కన ఉన్న నీళ్ళ బాటిళ్లను వారికి చేర్చడం సాధ్యం కాలేదు.

ఒక దశలో 'క్రౌడ్ మేనేజ్‌మెంట్' సాధ్యంకాక పోలీస్ అధికారులు నిస్సహాయులయ్యారు. ఎలాగోలా సభ ముగిశాక, పోలీస్ పైలెట్ ఉన్న ప్రోటోకాల్ వాహనాలు మాత్రం అక్కణ్ణించి బయట పడగలిగితే, మిగిలినవి 15 కి.మీ. దూరంలో ఉన్న విజయవాడ, గుంటూరు చేరడానికి అర్ధరాత్రి దాటింది! ఇక ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారి సంగతి చెప్పనక్కరలేదు.

వేదిక నిర్మాణ పనులు మే నెల మూడో వారంలో 42- 44 డిగ్రీల ఎండల్లో మొదలైనప్పుడు స్థానికులు ముందుకు రాకపొతే, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు తమిళనాడు, ఒడిశా నుంచి లేబర్‌ను తీసుకురావాల్సి వచ్చింది. ఆ మైదానంలో తీవ్రమైన ఎండలో వాళ్ళు ఐరన్ పైప్స్ కోసి వెల్డింగ్ చేస్తూ వేదిక నిర్మించారు. ఆ వేడిలో పనిచేయడానికి పనివాళ్ళు దొరక్క ప్రతిదానికీ ప్రభుత్వం అదనంగా చెల్లించాల్సి వచ్చింది. సభ ముగిశాక, పులిహోర పొట్లాలు, నీళ్ళ బాటిళ్లు చెత్త శుభ్రం చేయడానికి వారాలు పట్టింది. ఇక దారి పొడవునా పడేసిన వాటి సంగతి అంతే! రాకపోకల్లో రోడ్డు ప్రమాదాలు వీటికి అదనం.

ఇంత అట్టహాసంగా అంగరంగ వైభవంగా ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ స్వీకారోత్సవం చేసి, ఏడాది తిరిగి వచ్చాక జూన్ 2న నవ నిర్మాణ దీక్ష అని మొదలు పెట్టి, ప్రభుత్వ అధికారిక వేదిక మీద నుంచి - "కుట్రతో రాష్ట్రాన్ని విభజించి..." అంటూ మొదలయ్యే వాక్యంతో ఐదేళ్ళు రాష్ట్ర ప్రజలతో ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ చేయించారు. ఇక ఇప్పటికీ ఏపీ రాష్ట్ర అవతరణ దినం ఎప్పుడు అనేది స్పష్టత లేని పరిస్థితి.

Image copyright Getty Images

ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మే 30న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అందుకోసం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదిక అవుతోంది.

పదేళ్ళు హైదరాబాద్‌లో ఉండాల్సిన రాజధానిని, అకస్మాత్తుగా విజయవాడ తరలించిన చంద్రబాబు నాయుడు, గడచిన ఐదేళ్ళలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఇక్కడ ఒక కన్వెన్షన్ హాలు కూడా నిర్మించలేకపోయారు. ముందుగా కొన్నాళ్ళు ప్రైవేట్ హోటళ్ళలో నడిపించి, ఆ తర్వాత తన అధికారిక నివాసం వద్ద ప్రభుత్వ నిధులతోనే 'ప్రజా వేదిక' పేరుతో అన్ని వసతులతో ఒక భారీ సమావేశ మందిరం ఏర్పాటు చేశారు. దానిలో ఇన్నాళ్ళుగా కలెక్టర్ల సమావేశాలు, తెలుగుదేశం పార్టీ మీటింగులు... రెండూ జరిగేవి.

అది ప్రభుత్వానికి పార్టీకి మధ్య విభజన రేఖ చెరిగిపోయిన కాలం కనుక, దాన్ని నిరోధించ గలిగిన యంత్రాంగం అప్పట్లో లేకపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో, దాన్ని ఇప్పుడు ప్రభుత్వ వేదికగా గుర్తించడం కష్టం. పైగా మే 27న సోమవారం కూడా నారా లోకేష్ 'ప్రజావేదిక'లో పార్టీ మీటింగ్ పెట్టినట్టు మంగళవారం వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో రెండవ 'టర్మ్'లో అయినా అవసరమైన శాశ్వత భవనాలు కొన్ని అయినా సిద్దమైతే, ఇటువంటి 'ప్రోటోకాల్' సందర్భాలకు అనువుగా ఉంటుంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం

ప్రమాణ స్వీకారం ఎలా జరగాలి?

నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారం అనేది పూర్తిగా 'బుక్' ప్రకారం నిర్వహించాల్సిన ప్రోటోకాల్ అంశం. అది సాధారణంగా ప్రొటోకాల్ ప్రకారం జరిగిపోవాల్సిన అధికారిక ప్రక్రియ. గవర్నర్ సమక్షంలో సింపుల్‌గా జరిగిపోయే ప్రక్రియ. ఎన్టీఆర్ తర్వాతే అది రాజ్ భవన్ నుంచి లాల్ బహుదూర్ స్టేడియంలోకి వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ ఆనవాయితీని కొనసాగించారు. ఇప్పుడు అది పూర్తిగా ఎన్నికైన ప్రభుత్వ ఇష్టంగా మారింది.

అయితే, రోహిణి కార్తె ఎండలు, నిర్వహణలో సాధ్యాసాధ్యాలు, వీలైనంతలో జనజీవనానికి ఇబ్బందులు లేకుండా చూడడం అవసరం. అయినా ప్రతిదానిలో కాలానుగుణంగా మార్పులు సహజం, కానీ ఒక 'ప్రోటోకాల్' సంప్రదాయానికి ఇవ్వవలసిన గౌరవప్రపత్తులు ఎన్నికైన పార్టీలు ఇచ్చినప్పుడే, అధికార యంత్రాంగం వాటి స్థాయిని కాపాడగలుగుతాయి. అందువల్ల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఆపడమే కాకుండా, కాలక్రమంలో పౌరసమాజ ప్రమాణాలు కొనసాగుతాయి.

ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రమాణ స్వీకారం తర్వాత తన కార్యాలయం నుంచి కూడా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి, తమ ప్రభుత్వ ప్రాధాన్యాలను తెలియచేస్తూ, పైసా ఖర్చు లేకుండా రేడియో, దూరదర్శన్ వంటి అధికారిక మీడియా ద్వారా ప్రసంగించవచ్చు. ఇప్పుడున్న వెబ్ క్యాస్టింగ్ టెక్నాలజీతో దాన్ని ప్రజలు తాము ఉన్న చోటు నుంచి ఎక్కడికీ వెళ్ళకుండానే, తమ స్మార్ట్ ఫోన్లలో చూడవచ్చు.

మనం మాట్లాడే దానిలో విషయం ఉన్నప్పుడు, అది ఎంత చిన్న సందేశం అయినా విలువైనదే అవుతుంది. సహజంగా మితభాషి అయినప్పటికీ, ఇప్పటికే దిల్లీ పత్రికా సమావేశంలో జగన్ మరింత క్లుప్తంగా మాట్లాడవలసింది అనే సూచనలు మొదలయ్యాయి. మన పక్కనున్న ఒడిశాకు ఐదోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన నవీన్ పట్నాయక్ సుదీర్ఘ ప్రసంగం అంటే, అది - పదినిముషాలు అట!

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు