మోదీ చెప్పిన కెమిస్ట్రీ మేధావులకు ఎందుకు అర్థం కాలేదు - అభిప్రాయం

  • 29 మే 2019
మోదీ Image copyright Getty Images

లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ సాధించిన ఘన విజయం రాజకీయ పండితులు, పాత్రికేయులు, మేధావులమని చెప్పుకొనే చాలా మందిని కంగు తినిపించింది.

ఫలితాలు వెలువడకముందు ఇలాంటి భారీ విజయాన్ని ఎవరూ ఊహించలేదు.

రాజకీయం ఊహించని ఫలితాలు అందించే ఆట. మోదీ, అమిత్ షా ద్వయం దాన్ని చేసి చూపించింది.

లిబరల్స్, తటస్థులు, వామపక్షాలు, సెక్యులర్ వర్గానికి చెందిన పాత్రికేయులు ఈ విజయాన్ని అంచనా వేయడంలో విఫలమయ్యారు. అయితే, ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు.

2004లో 'ఇండియా షైనింగ్' నినాదంతో ఎన్డీయే ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లినప్పుడూ ఊహించని ఫలితాలే వచ్చాయి. ఇలాంటి ఉదాహరణలు ఇంకా ఉన్నాయి.

Image copyright Getty Images

అంచనాలు వేయడంలో లిబరల్ రాజకీయ విశ్లేషకులు ఎందుకు విఫలమయ్యారో ప్రధాని మోదీ ఇటీవల వివరించారు.

''ఎన్నికలంటే గణిత సమీకరణాలని అనుకుంటారు. 2014 లోక్‌సభ ఎన్నికలు, ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, ఇటీవల ఎన్నికలు మాత్రం ఇందుకు భిన్నంగా జరిగాయి. గణితానికి మించి ఏదో కెమిస్ట్రీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంగీకరించకతప్పని పరిస్థితి ఏర్పడింది. సమాజ శక్తి, సంకల్ప శక్తి కెమిస్ట్రీ గణితాన్ని కూడా పక్కకుతోస్తుంటుంది'' అని మోదీ అన్నారు.

''మూడేసి ఎన్నికలు జరిగాక కూడా రాజకీయ పండితులకు విషయం అర్థం కావడం లేదంటే.. వారి ఆలోచనలు ఇంకా 20వ శతాబ్దంలో ఉన్నాయని అనుకోవాలి. ఇప్పడు వాటితో ఏ ప్రయోజనమూ లేదు. వారి బయోడేటా 50 పేజీలు ఉంటుంది. కానీ, క్షేత్ర స్థాయి పరిస్థితులపై వారి కన్నా ఓ పేదవాడికి మెరుగైన అవగాహన ఉంటుంది'' అని మోదీ వ్యాఖ్యానించారు.

యుద్ధంలో గెలిచినవాళ్లే చరిత్రను రాస్తారన్న సామెతకు రుజువులా మోదీ ఇప్పుడు మాట్లాడుతున్నారు.

తన వాదనను బలపరుచుకునేందుకు ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను ఆయన ఉదాహరణగా చూపుతున్నారు కానీ, దిల్లీ, బిహార్‌ల్లో ఎదురైన ఓటములను ప్రస్తావించడం లేదు.

Image copyright Getty Images

గత ఎన్నికల గణాంకాలు, కొత్తగా ఏర్పడిన మహాకూటమి, రైతుల సమస్యలు వంటి కీలక అంశాల ప్రభావంపైనే విశ్లేషకులు లెక్కలు వేశారు. బీజేపీని సమర్థించే పాత్రికేయులు, రాజకీయ పండితులు కూడా ఎన్డీయేకు సీట్లు తగ్గుతాయని అన్నారే తప్ప, పెరుగుతాయని చెప్పలేదు. కానీ, ఈ లెక్కలన్నీ తప్పాయి.

కెమిస్ట్రీ విషయానికి వస్తే, దాన్ని లాజికల్‌గా అంచనా వేయడం కష్టం. దేశభక్తి భావన, 'ఇంట్లోకి చొచ్చుకువెళ్లి దాడి చేస్తాం'' అనే వ్యాఖ్యల ప్రభావం ఎలా ఉంటుందన్నది విశ్లేషకులు ఎలా లెక్కగట్టగలరు?

ఎన్నికలను భావోద్వేగ అంశాలే గెలిపిస్తాయని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి పుల్వామా, బాలాకోట్ ఘటనల కన్నా ముందే వ్యాఖ్యానించారు.

మోదీ, అమిత్ షా ప్రసంగాల్లో అభివృద్ధి గురించిన అంశాలు అడుగునే ఉండేవి.

ఉజ్వల పథకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జనధన్ పథకం, కిసాన్ సమ్మాన్ నిధి.. మాట్లాడేందుకు ఇలాంటివి చాలా ఉన్నా, వారి ప్రసంగాలన్నీ పాకిస్తాన్, ముస్లింలు, దేశ భద్రత, దేశ ప్రతిష్ఠ, భారత మాత, కాంగ్రెస్ వారసత్వ రాజకీయాల వల్ల జరుగుతున్న నష్టం చుట్టే తిరిగాయి.

Image copyright EPA

జనాల భావోద్వేగాలను అర్థం చేసుకుని, రాజకీయంగా వాటి నుంచి లబ్ధి పొందడంలో మోదీ విజయవంతమయ్యారు.

ఫ్యాక్ట్ చెక్‌లో (విషయం వాస్తవమా, కాదా అన్నది తేల్చడంలో) పాత్రికేయులు శిక్షణ పొందుతారే తప్ప, భావోద్వేగ మీటర్‌ను లెక్కగట్టడంలో కాదు.

దేశంలో ఉద్యోగాలు లేవని బహిరంగంగా చెబుతూనే, మరోపక్క మోదీకే ఓటు వేస్తామని జనం అంటున్నారు. సమస్యల్లో ఉన్న రైతులు, నోట్ల రద్దు వల్ల ఇబ్బందులు పడ్డ సామాన్యలదీ ఇదే మాట.

ఇవన్నీ పాత్రికేయులు విన్నారు. అయితే, బీజేపీకి 300 పైచిలుకు సీట్లు వస్తాయనేది దీని అర్థమని వారు గుర్తించలేకపోయారు.

'మోదీ భక్తులు' అందరూ ముందు నుంచి బీజేపీని అనుసరిస్తున్న ఓటర్లని చాలా మంది పాత్రికేయులు భావించారు. వారిలో చాలా మంది కొత్తగా ఓటు హక్కు వచ్చినవారన్న విషయాన్ని లిబరల్ మీడియా గుర్తించలేదు. ప్రభుత్వ వ్యతిరేకత, మహాకూటమి, దళితులు, బలహీనవర్గాలు, ముస్లింలు.. ఈ సమీకరణాన్ని చూసి మోదీ విజయంపై సందేహాలు వ్యక్తం చేశారు. బీజేపీ ఉత్తర్‌ప్రదేశ్‌లో సీట్లు కోల్పోతుందని, పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో నెగ్గుకురాలేదని అంచనాలు వేశారు.

Image copyright Getty Images

ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, హరియాణా, ఝార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లోనూ బీజేపీకి సీట్లు తగ్గుతాయని భావించారు. వీటిలో కొన్ని రాష్ట్రాల్లో అంతకు కొంతకాలం ముందే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది.

కానీ, ఇలా ఓడిపోయిన రాష్ట్రాల్లో క్రితం సారి లోక్‌సభ ఎన్నికల్లో కన్నా ఈ పర్యాయం బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచింది.

ప్రభుత్వ పథకాల అమలు తీరును విశ్లేషించడంలో పాత్రికేయులు నిమగ్నమయ్యారు. గ్యాస్ కనెక్షన్ పొందిన పేదలు మరో సిలిండర్ కొనుక్కొనే స్థితిలో లేరని, మరుగుదొడ్లు నిర్మించుకున్నవారికి నీటి సరఫరా లేదని, జనధన్ ఖాతాల్లో డబ్బులు లేవని.. ఇలా చాలా విషయాలు చెప్పారు.

ఇవన్నీ లాజికల్ విషయాలు, వాస్తవాలు.

వాడినా, వాడకున్నా గుడిసెలో ఎర్ర సిలిండర్ కనబడితే పేదలకు మోదీ గుర్తుకువస్తారు. ఈ విషయాన్ని రాజకీయ పండితులు విస్మరించారు.

లబ్ధి పొందని ప్రజలు కూడా మోదీ ప్రభుత్వం మళ్లీ వస్తే తమకు ఏదో చేస్తుందన్న నమ్మకంతో ఓటేశారు. ఇలాంటి ఆశలను లెక్కగట్టే విధానమేదీ పాత్రికేయుల దగ్గర లేదు.

సర్కారు పట్ల, ఎంపీల పట్ల కోపం ఉన్నా, మోదీని కీర్తిస్తూ జనాలు చేసిన నినాదాల వెనుకన్న మర్మాన్ని రాజకీయ పండితులు పట్టుకులేకపోయారు.

Image copyright TWITTER/ JP NADDA

ఎన్నికల్లో పడిన శ్రమ విషయంలో బీజేపీకి, విపక్షాలకు అస్సలు పోలికే లేదు. రకరకాల ఇంటర్వ్యూలు, నమో టీవీ ఛానెల్, ప్రచారం ముగిసిన తర్వాత గుహలో ధ్యానం.. ఇలా ఎప్పుడూ టీవీల్లోనూ, సోషల్ మీడియాలోనూ మోదీ కనిపిస్తూనే ఉన్నారు. అయితే, జనాలు బాగా అవగాహన కలిగినవారని, కేవలం టీవీలు చూసి ఓట్లేయరని విశ్లేషకులు అంటూ వచ్చారు.

సీబీఐ, సుప్రీం కోర్టు, ఎన్నికల కమిషన్ వంటి సంస్థల్లో వివాదాలు, రఫేల్ ఒప్పందంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విశ్లేషణలు చేస్తూ వచ్చిన పాత్రికేయులు.. మోదీకి నష్టం తప్పదని ఊహించారు.

అయితే, ప్రతిసారీ ఈ భావోద్వేగాల కెమిస్ట్రీనే విజయాన్ని నిర్దేశిస్తుందని చెప్పలేం. కాకపోతే దాని ప్రభావాన్ని అంచనా వేసేందుకు మాత్రం ఈ లాజికల్ 'కళ్లద్దాలు' పనికిరావు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం