లోక్‌సభ ఎన్నికల ఫలితాలు: పాతికేళ్లకే ఎంపీగా గెలిచిన చంద్రాణి ముర్ము

  • 29 మే 2019
చంద్రాణి ముర్ము Image copyright Facebook/Amarendra Dhal
చిత్రం శీర్షిక చంద్రాణి ముర్ము

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడైన రోజు వరకూ ఒడిశాకు చెందిన చంద్రాణి ముర్ముది సాధారణ జీవితం.

ఇంజినీరింగ్ పూర్తి చేసి, సర్కారు ఉద్యోగం కోసం సన్నద్ధమవుతున్నారు ఆమె. ఇందుకోసం పరీక్షలు కూడా రాశారు.

కానీ, ఈలోపే ఎన్నికల ఫలితాలు వచ్చి, ఆమె జీవితాన్ని పెద్ద మలుపు తిప్పాయి.

అత్యంత పిన్నవయసులో ఎంపీగా ఎన్నికైన వ్యక్తిగా చంద్రాణి రికార్డు సాధించారు. ప్రస్తుతం ఆమె వయసు 25 ఏళ్ల 11 నెలలు.

కేంఝర్ లోక్‌సభ సీటు నుంచి బిజూ జనతాదళ్ (బీజేడీ) తరఫున పోటీ చేసి ఆమె విజయాన్ని అందుకున్నారు.

అయితే, రాజకీయాల్లోకి వస్తానని ముందెప్పుడూ తాను అనుకోలేదని చంద్రాణి చెబుతున్నారు.

ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకునేందుకు చాలా మందిలాగే తాను కష్టపడుతూ ఉన్నానని, ఎన్నికలకు కొన్ని రోజుల ముందే ఎంపీగా పోటీచేసే అవకాశం అనుకోకుండా తనకు వచ్చిందని ఆమె అన్నారు.

Image copyright FACEBOOK/KEONJHAR BJD

''చదువుకుంటున్న సమయంలో రాజకీయాల్లోకి వస్తానన్న ఆలోచనే నా మనసులో లేదు. అదృష్టమో, ఇంకొకటో తెలియదు కానీ, ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నా'' అని చంద్రాణి అన్నారు.

''కేంఝర్ సీటును బీజేడీ మహిళలకు కేటాయించింది. పోటీ చేసే విషయంపై నేరుగా నన్ను అడగలేదు. మా మామయ్య ద్వారా సంప్రదించారు. చదువుకున్న అభ్యర్థి కోసం వారు వెతుకుతున్నారు. నేను తగిన అభ్యర్థినని అనిపించి, నాకు అవకాశం ఇచ్చారు'' అని ఆమె వివరించారు.

చంద్రాణి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేశారు. ఆమెది ఉమ్మడి కుటుంబం. తల్లిదండ్రులతోపాటు ఆమెకు ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉన్నారు.

తన విజయం ఘనతంతా బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్‌దేనని చంద్రాణి అంటున్నారు.

''యువ ఎంపీగా రికార్డు సాధించడం పట్ల చాలా ఆనందంగా ఉంది. నా జీవితంలోనే గర్వించదగ్గ క్షణాలివి. కానీ ఈ క్రెడిట్ అంతా నాకు అవకాశం ఇచ్చిన నవీన్ పట్నాయక్‌కే దక్కుతుంది'' అని చెప్పారు.

Image copyright FACEBOOK/KEONJHAR BJD

ఓ రకంగా చంద్రాణికి రాజకీయాల్లో అవకాశం వారసత్వంగా వచ్చింది. ఆమె తండ్రి తరఫున కుటుంబంలో వారెవరూ రాజకీయాల్లో లేరు. అయితే, తల్లి కుటుంబం వైపు నుంచి ఆమె తాతయ్య హరిహర్ సోరెన్ గతంలో ఎంపీగా పనిచేశారు.

తమ తాతయ్యే తనకు ఆదర్శమని చంద్రాణి అంటున్నారు.

''తాతయ్య కారణంగా కుటుంబంలో రాజకీయ వాతావరణం ముందు నుంచీ ఉంది. ఆయన తర్వాత క్రియాశీల రాజకీయాల్లో మా కుటుంబంలో ఎవరూ లేరు. అయితే, ఆసక్తి మాత్రం ఉంది. ఇప్పుడు హరిహర్ సోరెన్ మనవరాలు వచ్చిందంటూ ఆయన పేరు మరోసారి అందరూ స్మరించుకుంటున్నారు'' అని ఆమె చెప్పారు.

కేంఝర్‌లో గిరిజన జనాభా చాలా ఎక్కువ. ఇక్కడి ప్రజల అభివృద్ధి కోసం చాలా పథకాలు అమలవుతున్నాయని, విద్యకు మాత్రం వారు ఇంకా దూరంగా ఉన్నారని చంద్రాణి అన్నారు.

''అందరికీ విద్య అందించేందుకు కృషి చేస్తా. అభివృద్ధి జరగాలంటే ఆ ప్రాంతంలోని ప్రజలు చైతన్యవంతులు కావడం అవసరం'' అని ఆమె వ్యాఖ్యానించారు.

Image copyright BBC/SUBRAT KUMAR PATI

పోలింగ్‌కు కొన్ని రోజుల ముందు చంద్రాణికి సంబంధించినదిగా చెబుతూ ఓ అసభ్య వీడియో సోషల్ మీడియాలో ప్రచారమైంది.

తనను అపవాదు పాలుచేసేందుకే ప్రయత్నంలో భాగంగానే ఈ పని చేశారని, చివరికి నిజమే గెలిచిందని చంద్రాణి చెప్పారు.

తనకు వచ్చినట్లే రాజకీయాల్లో మరింత మందికి అవకాశాలు రావాలని కోరుకుంటున్నానని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు