వైఎస్ జగన్ ఇంటర్వ్యూ: ‘నాకు ఈరోజు డబ్బు మీద ఆశ లేదు. నాకు ఉన్నది ఒకే ఒక ఆశ, అదేంటంటే..’

  • 28 మే 2019
వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 151 స్థానాలు గెల్చుకుని, ఈనెల 30వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీబీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ మీ కోసం..

బీజేపీకి 250 సీట్లు వస్తే బావుండేదన్నారు ఎందుకు?

ఒకవేళ బీజేపీకి 250 సీట్లే వచ్చుంటే, ఈపాటికి ప్రత్యేక హోదా ఫైల్ పైన సంతకం అయపోయిండేది. ఎందుకంటే వారికి ప్రభుత్వం ఏర్పాటు కోసం మన అవసరం పడేది. అటువంటి పరిస్థితి రావాలి అని దేవుణ్ణి నిజంగా చాలా ప్రార్థించాను. కానీ, దేవుడు ఆంధ్రప్రదేశ్‌లో మనల్ని (వైసీపీని) ఆశీర్వదించినట్లుగానే అక్కడ (కేంద్రంలో) వారిని (బీజేపీని) ఆశీర్వదించాడు. అయినప్పటికీ మేం ఇప్పటికీ దాని కోసం డిమాండ్ చేస్తాం. పార్లమెంటు సాక్షిగా ఏపీకి ఇచ్చిన వాగ్ధానం అది. ప్రత్యేక హోదా ఇస్తాం, నెరవేరుస్తాం అని హామీ ఇచ్చి రాష్ట్రాన్ని విభజించారు. కాబట్టి ఈ డిమాండ్‌ను మేం కొనసాగిస్తాం. అడుగుతూనే ఉంటాం. ఇది నిరంతర ప్రక్రియ. ఒక్కసారి అడగటం మానేశామంటే అసలు ఇక ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం తెరమరుగైపోతుంది. వాళ్లు కూడా ఇక ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన పనిలేదు అనుకుంటారు. అందరూ కూడా మర్చిపోయే పరిస్థితి వస్తుంది. ఇది ఎవ్వరూ మర్చిపోలేని అంశం. ఎవ్వరూ మర్చిపోకుండా ఉండనివ్వాల్సిన అంశం. కాబట్టి ఎప్పుడు ప్రధానమంత్రిని నేను కలిసినా.. అది నెలకోసారి కావొచ్చు, రెండు నెలలకు ఒకసారి కావొచ్చు.. రాష్ట్ర సమస్యలపై ప్రధానమంత్రిని అభ్యర్థించినప్పుడల్లా.. మొట్టమొదటి స్థానంలో ప్రత్యేక హోదా ఉంటుంది. ఈరోజు కాకపోయినా ఎప్పుడైనా వస్తుంది. దాని కోసం అడుగుతుంటే.. గట్టిగా, చిత్తశుద్ధితో అడుగుతుంటే ఎప్పుడో ఒకసారి దేవుడు ఇస్తాడు.

మీరు మోదీతో జరిగిన సమావేశం ఎలా అనిపించింది. రాష్ట్రానికి సహాయం చేకూరేలా అనిపిస్తోందా లేదా?

దాదాపు గంటకు పైగా మాట్లాడారు. చాలా సానుకూలంగా స్పందించారు. రాష్ట్రానికి మంచి చేస్తానని.. చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి (రెండోసారి) కాకముందే మనకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం, గంటకు పైగా చర్చించడం, అన్ని విషయాలనూ సుదీర్ఘంగా తెలుసుకోవడం.. ప్రత్యేక హోదాపైన అరగంటకు పైగా.. దాని ఆవశ్యకత గురించి, అవసరం గురించి చాలా వివరంగా చెప్పాం. చాలా నవ్వుతూ, చాలా సానుకూలంగా స్పందించారు. చూద్దాం.. ఇది ఎలా వెళుతుందో.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో బీబీసీ ప్రత్యేక ఇంటర్వ్యూ

బీజేపీకి 250 సీట్లు వస్తే ఈపాటికి ప్రత్యేక హోదా వచ్చేది అన్నారు. కానీ, ఈ పరిస్థితి ఇప్పుడు లేదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే మీ ప్రణాళిక ఏంటి? ఎంత వరకు ఎదురుచూసేందుకు సిద్ధంగా ఉన్నారు?

గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనున్నాను. దేశ ప్రధానమంత్రిగా ఆయన (మోదీ) ఉన్నారు. 67 ఏళ్ల పరిపాలన తర్వాత రాష్ట్రం విడిపోయే నాటికి మన రాష్ట్రానికి వచ్చిన అప్పులు రూ.97 వేల కోట్లు. ఈ ఐదేళ్లలో ఆ అప్పులు 2.58 లక్షల కోట్ల రూపాయలకు ఎగబాకాయి. ఈ అప్పులపై ఉత్తి వడ్డీలే సంవత్సరానికి 20 వేల కోట్ల రూపాయలు. వడ్డీ, అసలు చెల్లించాలంటే.. ప్రతి ఏటా రూ.40 వేల కోట్లు కావాలి. ఈ పరిస్థితుల్లో కేంద్రం నుంచి అన్ని విధాలుగా రాష్ట్రం సహాయ సహకారాలు తీసుకోవాల్సి ఉంది. రాష్ట్రం సమర్థవంతంగా నడవాలన్నా, మన ఆర్థిక వనరులు మనకు రావాలన్నా, మనం ప్రజలకు ఇంకా మంచి చేయగలిగే పరిస్థితి రావాలన్నా కచ్చితంగా కేంద్రం అవసరం మనకు చాలా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కచ్చితంగా ఈ ప్రత్యేక హోదా అన్న అంశం.. దురదృష్టవశాత్తూ వాళ్లకు మన అవసరం లేదిప్పుడు. ప్రభుత్వ ఏర్పాటుకు మన అవసరం పడినట్లైతే కథ వేరుగా ఉండేది. 340-350 స్థానాలు వారికి వచ్చినప్పుడు.. మీరు మద్దతు ఇచ్చినా, ఇవ్వకున్నా వారికేమీ తేడా పడదు. లోక్‌సభలో మెజార్టీకి 273 స్థానాలు కావాలి. అలాంటిది వారికి 348 స్థానాలు ఉన్నాయి. నిజంగా మనం ఒక స్థాయి దాటి ఏం చేసినా కూడా దానివల్ల సాధించేదేమీ ఉండదు. కాబట్టి నిరంతరాయంగా ఒత్తిడి తీసుకురావాలి. వాళ్లు మర్చిపోకుండా నిరంతరం గుర్తు చేస్తుండాలి. వాళ్లతో పని చేయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్ని రకాలుగా చేసుకుంటూ పోవాల్సి ఉంది.

కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకూ అడుగుతూనే ఉంటాము. ఇది మర్చిపోవాల్సిన అంశం కాదు. అది తెచ్చుకునేంత వరకూ అడుగుతూనే ఉంటాము.

మీరు ప్రచారంలో ప్రత్యేక హోదానే ముఖ్యాంశంగా పెట్టుకున్నారు. పోరాడదాం. సాధించుకుందాం అన్నారు. ఇప్పుడు ఆగుదాం అంటున్నారు.

ఇప్పుడు ఏం చేద్దామమ్మా? పోనీ నువ్వు చెప్పమ్మా ఏం చేస్తే బాగుంటుందో నువ్వే సలహా ఇవ్వమ్మా? నేను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా. ఏం చేయమంటావో నువ్వే చెప్పు.

అది ముఖ్యమంత్రిగా మీరు తీసుకోవాల్సిన నిర్ణయం కదా?

దానికి మరే పరిష్కారమూ లేదమ్మా. నువ్వు నాకు ఏదైనా చెబితే చేసేందుకు సిద్ధంగా ఉన్నాను నేను. ప్రత్యేక హోదాను చంద్రబాబు నాయుడు పూర్తిగా మభ్యపెట్టి, పక్కనపెట్టిన సమయంలో కూడా నేను మర్చిపోలేదు దానిని. ప్రత్యేక హోదా అనే అంశం ఆంధ్ర రాష్ట్రంలో బతికి ఉంది అంటే దానికి కారణం జగన్. ప్రత్యేక హోదాను మర్చిపోనివ్వకుండా జగన్ పోరాడాడు కాబట్టే అది బతికి ఉంది. ఇవ్వాల్టికీ అంతే నిబద్ధతతో ప్రత్యేక హోదా అంశంపై ఒత్తిడితీసుకువచ్చే ప్రతి పరిస్థితి చేస్తూనే ఉంటాం. కానీ, వాస్తవం ఏంటి? 273 స్థానాలకు గాను 348 స్థానాలు వారికి ఉన్నాయి. ఇంక నువ్వు ఏం చేస్తే వాళ్లు ఏం పట్టించుకుంటారు? ఇదే రియాలిటీ. కానీ, అదే సమయంలో ప్రత్యేక హోదా అన్నది ఎవ్వరూ మర్చిపోకూడదు, ఎవ్వరూ కూడా అది మన హక్కు అన్నది గుర్తుంచుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రతి సందర్భంలోనూ అది గుర్తు చేస్తూనే ఉంటాం. ప్రధానమంత్రికి రాసే ప్రతి లేఖలోనూ ఒక పేరాగ్రాఫ్ ప్రత్యేక హోదా అనేది ఉండాల్సిందే. కచ్చితంగా గుర్తు చేస్తుంటాం. దిల్లీ వెళ్లినప్పుడు, జాతీయ మీడియాతో మాట్లాడేప్పుడు నేను చెప్పే అంశం ప్రత్యేక హోదా. మరొక్కసారి ప్రధానికి ప్రత్యేక హోదా గుర్తు చేశామని చెబుతాను. ఆ రకంగా ఒత్తిడి తీసుకురావాల్సిందే తప్ప.. చేయగలిగిందంతా చేస్తూ పోవాల్సిందే తప్ప మనం చేయగలిగింది ఏముంది?

మీరు ఇందాక అన్నట్లు రాష్ట్రం చెల్లించాల్సిన వడ్డీ భారమే ఏటా రూ.20 వేల కోట్లు. మీరు హామీ ఇచ్చిన నవరత్నాల అమలుకు రూ.56 వేల కోట్లు అవసరం అవుతాయని ఒక అంచనా. ఈ నవరత్నాల హామీలను ఎలా అమలు చేస్తారు? మీ ప్రణాళిక ఏంటి?

దాని గురించి మీరు ఏమాత్రం బాధపడొద్దు. మేనిఫెస్టో, నవరత్నాలు అనేవి నాకు బైబిల్‌, ఖురాన్, భగవద్గీతతో సమానం. ఈరోజు ప్రజలు విశ్వసనీయత అనే పదానికి ఓటేశారు. ఆ విశ్వసనీయత ఎప్పుడూ ప్రశ్నార్థకం కాకుండా నేను కచ్చితంగా కాపాడుకుంటాను. దేవుడిమీద నాకు నమ్మకం ఉంది. కచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కచ్చితంగా మంచి జరుగుతుంది. కచ్చితంగా మేం అమలు చేస్తాం. ఎప్పుడెప్పుడు దేన్ని ఎలా అమలు చేస్తామనేది రాబోయే రోజుల్లో మేం వివరిస్తాం. ప్రతి హామీ అమలుకు తేదీలను ప్రకటిస్తాం. గ్రామ వాలంటీర్ల పథకం తీసుకొస్తాం. గ్రామ సెక్రటేరియెట్ అనే విధానం తీసుకొస్తున్నాం. వీటి ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ.. ఎవ్వరూ మిగలకుండా సంతృప్త స్థాయిలో ప్రతి ఒక్కరికీ మేలు చేసే కార్యక్రమం చేపడతాం. నవరత్నాలకు (అమలుకు) నాదీ పూచీ. మీకు హామీ ఇస్తున్నా.

అవినీతి రహిత పాలన అందిస్తామని భరోసా ఇచ్చారు. కానీ మీపై సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది. మీ ప్రత్యర్థులు కూడా దీన్ని వాళ్ల ప్రచారాస్త్రంగా వాడుకున్నారు. ఈ వైరుధ్యంపై ఏమంటారు?

నా మీద అవినీతి ఆరోపణలు అని ఏదైతే చెబుతున్నారో.. నేను సూటిగా, స్పష్టంగా ఒక ప్రశ్న అడుగుతున్నా.. నా మీద ఉన్న కేసులు ఎప్పుడు పెట్టారు? ఎవరు పెట్టారు?

ఆంధ్రరాష్ట్ర ప్రజలకు అన్ని విషయాలూ తెలుసు. వారికి నేనెవరో తెలుసు. నా బ్యాగ్రౌండ్ తెలుసు. మా నాన్న బతికి ఉన్నంతకాలం నాపై ఏ కేసులూ లేవన్న సంగతి వారికి తెలుసు. జగన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం జగన్‌పై ఎలాంటి కేసులూ లేవన్న సంగతీ తెలుసు. జగన్ మీద ఎప్పుడు కేసులు వచ్చాయంటే.. జగన్ తండ్రి చనిపోయిన తర్వాత, జగన్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టిన తర్వాత.. అప్పుడు జగన్‌ను రాజకీయంగా అణగదొక్కాలనే ఉద్దేశ్యంతో కేసులు పెట్టారన్న సంగతి అందరికీ తెలుసు. జగన్‌పై కేసులు పెట్టింది ఎవరు? ఈ కేసులో పిటిషనర్లు ఎవరు? చంద్రబాబు నాయుడు గారి పార్టీ.. తెలుగుదేశం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. వాళ్లవాళ్ల అధిష్టానాలు కేసులు వేయమంటే వీళ్లు పిటిషనర్లుగా కేసులు వేశారు. ఇవన్నీ ఆంధ్రరాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు.

రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ అనే వ్యక్తి ఒక మంత్రికి ఫోన్ చేయలేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్‌కి ఫోన్ చేయలేదు. సెక్రటేరియేట్‌లో ఎప్పుడూ అడుగు కూడా పెట్టలేదు. అసలు జగన్ అనే వ్యక్తి హైదరాబాద్‌లోనే లేడు. బెంగళూరులో తన పిల్లలతో పాటు ఉండేవాడు. ఇవన్నీ ప్రజలకు తెలుసు. అందుకే అక్షరాలా 50 శాతం ఓట్లు వేశారు. ఇంత ఓటింగ్ శాతం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ నమోదు కాలేదు. ఇప్పుడు టీడీపీ, వైసీపీల మధ్య ఓట్ల తేడా దాదాపు 11 శాతం. ఇంత గొప్ప ఓటు శాతంతో.. ఈ కక్షపూరిత రాజకీయాలు చాలించండి.. జగన్‌కు మేం తోడుగా ఉన్నాం అని చెప్పి నా తరపున వాళ్లు తీర్పు ఇచ్చారు. దీనికి దేవుడికీ, ప్రజలకు నేను రుణపడి ఉన్నా.

ఇక రెండో విషయానికి వద్దాం. అవినీతిలేని పరిపాలన మీరు ఎలా ఇవ్వగలుగుతారు? అని మీరు అడిగారు. సంకల్పం ఉంటే.. మార్గం ఉంటుంది. మనసులో చిత్తశుద్ధి ఉండాలి. చెయ్యాలన్న తపన, తాపత్రయం ఉండాలి. అప్పుడు అది జరుగుతుంది. నాకు ఈరోజు డబ్బు మీద ఆశ లేదు. నాకు ఉన్నది ఒకే ఒక ఆశ.. నేను చనిపోయిన తర్వాత బతకాలి. ప్రతి ఇంట్లో నాన్న ఫొటోతో పాటు నా ఫొటో ఉండాలి. అదే నా కల. దాని కోసమే నేను రాజకీయాల్లో ఉన్నా. కాబట్టి, నేను ఈ వ్యవస్థను కచ్చితంగా ప్రక్షాళన చేస్తా. ఎలా చేస్తానో కూడా చెబుతా. ఈ రోజు మీరే చూడండి.. ఈ రాష్ట్రంలో ఏ పని అయినా తీసుకోండి.. విపరీతమైన అవినీతి. మేమేం చేస్తామంటే.. ఎక్కడెక్కడ అయితే అవినీతి జరిగిందో ఆ పనిని బయటకు తీస్తాం. ఆ పనిని రద్దు చేస్తాం. రివర్స్ టెండరింగ్ ప్రక్రియతో మరలా ఆ పనికి టెండర్లు పిలుస్తాం. ఏమీ మార్చం. ఇంతకు ముందు పని ఎలా ఉందో అలాగే ఉంటుంది. కానీ, ఒక్కటే మారుస్తాం. ఇంతకు ముందు వీళ్లు అవినీతి ఎలా చేసేవారు? ప్రీక్వాలిఫికేషన్ క్రైటీరియాలో టైలర్ మేడ్ పాలసీలు పెట్టి, వాళ్లకు కావల్సిన వాళ్లకు, నచ్చిన వాళ్లకు మాత్రమే టెండర్లు వచ్చేలా ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసి, టెండర్లు పిలిచేవారు. దానివల్ల కరెక్టుగా వాళ్లకు కావాల్సిన వాళ్లకే, వాళ్ల కోటరీలో ఉన్న సభ్యులకే అధిక రేట్లకు టెండర్లను విపరీతంగా కట్టబెట్టిన పరిస్థితి. రెండోది, రింగ్ ఏర్పాటు చేసి, రెండోవాళ్లతో కూడా ముందుగానే మాట్లాడుకుని, ఎవ్వరికీ చెప్పకుండా చేసేవాళ్లు. వీటితో ప్రతిచోటా విపరీతమైన కరెప్షన్ కనిపిస్తోంది.

మేం ఆ పనులు తీస్తాం. ఆ ప్రీ క్వాలిఫికేషన్ క్రైటీరియాను పెంచుతాం. అంటే.. ఇంకా ఎక్కువ మంది భాగస్వాములయ్యే అవకాశం కల్పిస్తాం. ఇదే పనిని రివర్స్ టెండరింగ్ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పనికి టెండర్ ఇచ్చిన రేటు ఇది. దీనికంటే ఎంత తక్కువ రేటు కోట్ చేస్తే అప్పుడే పని ఇస్తాం అని చెబుతాం. ఒక 20 శాతం మిగిలింది అనుకోండి.. అలా తక్కువకు కోట్ చేసే పరిస్థితులు వస్తాయి. ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ 20 శాతం మిగిలింది. చంద్రబాబు హయాంలో ఇదే పనికి రాష్ట్ర ఖజానాకు 20 శాతం దెబ్బ తగిలేది’ అని చూపిస్తాం. ప్రతి పనిలోనూ ఏ మేరకు అవినీతి జరిగింది, ప్రభుత్వానికి ఆదాయం ఎంత వచ్చింది అని చూపిస్తాం.

దీనికి ఏమైనా గడువులు నిర్దేశించుకున్నారా? ఏ ప్రాజెక్టు ముందు చెయ్యాలి అని?

ఎక్కడెక్కడ అవినీతి జరిగిందన్న వివరాలను మేం ముందు బయటకు తీయాలి. తీశాక, ఒక పద్ధతి ప్రకారం మేం చూపిస్తాం. నేను కూడా కళ్లు మూసుకుని, చూసీ చూడనట్లు ఉంటే.. చంద్రబాబు నాయుడుకు డబ్బు ఇచ్చిన వాళ్లే నాకూ డబ్బు ఇస్తారు. అదే డబ్బు. కానీ, నేను ఆ డబ్బు తీసుకోదల్చుకోలేదు. కారణం, నేను ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలనుకుంటున్నాను. ఇదొక్కటే కాదు. విద్యుత్ రేట్ల విషయంలో కూడా.. పునరుత్పాదక విద్యుత్ విషయంలో పోటీతత్వంతో అంతర్జాతీయ టెండర్లు పిల్చినప్పుడు.. భారతదేశంలో రేట్లు చూస్తే.. సోలార్ 2.60 రూపాయలకు, పవన విద్యుత్ 3 రూపాయల లోపు లభిస్తున్నాయి. కానీ, మన రాష్ట్రంలో రేటెంతో తెలుసా? 4.84 రూపాయలు. అదే పీక్ అవర్స్ (డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు) 6 రూపాయలు. అంటే కుంభకోణం ఏంటి? నీకు రూపాయి, నాకు రూపాయి. ఇదీ స్కామ్. ఈ పరిస్థితులు పూర్తిగా మార్చేస్తాం. పూర్తిగా రేట్లు తగ్గిస్తాం. ప్రతి అంశంలోనూ అవినీతి అనేది ఎక్కడా కనపడకుండా.. పైస్థాయి నుంచి కింది స్థాయి దాకా వ్యవస్థను పూర్తిగా శుభ్రం చేసేస్తాం. ఇదొక్కటే కాదు. రాబోయే రోజుల్లో మేం ఏదైనా పనులు, కొత్తగా టెండర్లు పిలిచే కార్యక్రమాలు చేస్తే దాంట్లో కూడా అవినీతికి అవకాశం లేకుండా, కనీసం వేలెత్తి చూపే అవకాశం కూడా ఇవ్వకుండా జ్యుడీషియల్ కమిషన్ అడుగుతాం.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను (హైకోర్టు) ప్రధాన న్యాయమూర్తి అపాయింట్‌మెంట్ తీసుకుని, ఒక సిట్టింగ్ జడ్జిని ఇవ్వమని కోరతాను. ఆయన్ను జ్యుడీషియల్ కమిషన్‌కు హెడ్‌ను చేస్తాం. ప్రభుత్వంలో అధిక మొత్తంలో డబ్బుతో ముడిపడిన ఏ పనిని అయినా సరే.. నేరుగా జ్యుడీషియల్ కమిషన్‌కే పంపిస్తాం.. టెండర్లు పిలవకముందే. మీరు ఏమేం సలహాలు ఇస్తారో ఇవ్వండి, మీరు ఏమేం మార్పులు చేస్తారో చేయండి.. మీరు ఏం మార్పులు చేయాలన్నా నేను పూర్తి పారదర్శకంగా చేస్తాం. ఆ తర్వాతే టెండర్లు పిలుస్తాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం