మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ప్రభుత్వం ఉంటుందా.. కూలిపోతుందా

  • 30 మే 2019
కమల్ నాథ్ Image copyright Getty Images

మధ్యప్రదేశ్‌ ప్రజల మనసుల్లో ఇప్పుడు కమల్‌నాథ్ ప్రభుత్వం ఉంటుందా, పడిపోతుందా అనే ప్రశ్న తొలిచేస్తోంది.

మధ్యప్రదేశ్‌లో 15 ఏళ్లపాటు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత పాలనకు దూరమైంది.

కానీ కాంగ్రెస్‌కు కూడా స్పష్టమైన మెజారిటీ రాలేదు. మొత్తం 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 114, బీజేపీకి 109 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

సమాజ్‌వాదీ పార్టీ ఒకరు, బీఎస్పీ ఇద్దరు, నలుగురు ఇండిపెండెంట్ల సాయంతో కాంగ్రెస్ 121 సభ్యుల మధ్దతు పొందింది.

ఆ తర్వాత కమల్‌నాథ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ పరిస్థితి బలహీనంగా ఉంది.

రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఛింద్వాడా స్థానం ఒక్కటే గెలుచుకుంది.

కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై కన్ను

రాష్ట్రంలో కాంగ్రెస్ దిగ్గజ నేతలైన జ్యోతిరాధిత్య సింధియా జునాలో, దిగ్విజయ్ సింగ్ భోపాల్‌లో, అజయ్ సింగ్ సీధీలో, అరుణ్ యాదవ్ ఖాండ్వాలో ఓడిపోయారు.

రాష్ట్రంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కమల్‌నాథ్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.

జ్యోతిరాదిత్య సింధియా వైపున ఉన్న కాంగ్రెస్ నేతలు కమల్‌నాథ్ అధ్యక్ష పదవిని వీడాలని, పార్టీ పగ్గాలు సింధియాకు అప్పగించాలని కోరుతున్నారు.

Image copyright FACEBOOK/THEKAMALNATH

కానీ కమల్‌నాథ్ మాత్రం తను ఆ పదవిని వీడాల్సి వస్తే, అది తన సన్నిహితులకు గానీ, నమ్మకస్తులకు గానీ లభించాలని భావిస్తున్నారు.

దీంతో ఆరు నెలల ముందు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీ పరిస్థితి ఇప్పుడు ఇలా మారిపోయిందేంటా అని రాష్ట్ర ప్రజలు నమ్మలేకపోతున్నారు.

అటు కమల్‌నాథ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఇండిపెండెంట్లు, మిగతా పార్టీ సభ్యులు కూడా మంత్రి పదవులు కావాలంటూ ఆయనపై ఒత్తిడి పెంచడం మొదలుపెట్టారు.

Image copyright Pti

వేడెక్కిన రాష్ట్ర రాజకీయం

బీజేపీ నేతల వరుస ప్రకటనలు కూడా రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వరసగా ఆ పార్టీపై విమర్శలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ "బీజేపీ తారుమారు రాజకీయాలు చేయదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తన కర్మల ఫలితంగానే కుప్పకూలుతుందని" అన్నారు.

దీంతో మధ్యప్రదేశ్ రాజకీయాలను నిశితంగా గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు కమల్‌నాథ్ ప్రభుత్వం గురించి రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

గిరిజా శంకర్ మాట్లాడుతూ "ప్రభుత్వం ఉంటుందా, కూలుతుందా చెప్పడం కష్టం. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఒక విధంగా అనిశ్చితి నెలకొంది" అన్నారు.

"ఈ ఎన్నికల్లో కమల్‌నాథ్‌కు ఒక ప్రయోజనం లభించింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌లో ఉన్న దిగ్విజయ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, అజయ్ సింగ్, అరుణ్ యాదవ్ లాంటి ప్రెజర్ గ్రూప్ లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయింది. ఇప్పుడు ఆయనపై అంతర్గత ఒత్తిడి లేదు. కానీ ఎమ్మెల్యేల నుంచి మంత్రి పదవుల కోసం ఆయనపై వేరే ఒత్తిడి ఉంది" అన్నారు.

కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం

అయితే కమల్‌నాథ్‌కు పార్టీలోనుంచే ఎక్కువ కష్టాలు ఎదురవుతాయని చెబుతున్నారు.

ఎన్నికల ఫలితాలకు ముందు ముఖ్యమంత్రి కమల్‌నాథ్ "10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయాలని చూస్తోందని, వారికి మంత్రి పదవులు ఎరవేస్తోందని" ఆరోపించారు. అయినా ఆయనకు తన ఎమ్మెల్యేలపై పూర్తి నమ్మకం ఉంది.

లోక్‌సభ ఫలితాలు వెల్లడైన తర్వాత జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో ఆయన తన ప్రభుత్వం మైనారిటీలో పడిందని, అస్థిరంగా ఉందని చెబుతున్నారని ఆరోపించారు.

సోషల్ మీడియాలో జరిగే అవాస్తవ ప్రచారాలతో జాగ్రత్తగా ఉండాలని. మిగతావారిని కూడా అప్రమత్తం చేయాలని ఆయన తన ఎమ్మెల్యేలకు సూచించారు.

ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం

ఈ సమావేశానికి హాజరైన ఎస్పీ, బీఎస్పీ ఎమ్మెల్యేలు అవసరమైతే తాము విశ్వాస పరీక్షకు కూడా సిద్ధంగా ఉన్నామని కమల్‌నాథ్‌కు భరోసా ఇచ్చారు.

కానీ, రాష్ట్రంలో మాత్రం అనిశ్చితి వాతావరణం నెలకొంది. కమల్‌నాథ్ సొంత పార్టీ నేతల ఒత్తిడిలో ఉన్నట్టు చెబుతున్నారు.

రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనే ఆయన ప్రయత్నాలు ఎంతోకాలం సాగవని వరుస ప్రకటనలు చేస్తున్నారు.

ర్నాటక రాజకీయాలతో పోలిక

మధ్యప్రదేశ్ రాజకీయ పరిణామాలను కర్నాటకతో కూడా పోల్చి చూస్తున్నారు.

కానీ రషీద్ కిద్వాయ్ "కర్నాటకలో పరిస్థితి వేరే. అక్కడ ఓటర్లు స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. రెండు, మూడు స్థానాల్లో ఉన్న పార్టీలు కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి" అన్నారు.

"రాజకీయాల్లో ఒక మాండేట్ థియరీ ఉంటుంది. ఒక ప్రభుత్వానికి అంత మెజారిటీ లభించిలేదంటే, ఆ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని భావించాలి" అన్నారు.

"దిగ్విజయ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా ఓడిపోవడంతో నాకు పార్టీ లోపలి నుంచి ఆయనకు ఏదైనా ప్రమాదం ఉందని అనిపించడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్‌ తమ ప్రభుత్వంలోనే తామే చిచ్చు పెట్టాలని అనుకోదు. ప్రమాదం ఉంది అంటే అది కేంద్ర ప్రభుత్వం నుంచే" అని కిద్వాయ్ అన్నారు.

Image copyright Hindustan Times

శివరాజ్ సింగ్ చౌహాన్ పాత్ర

ఇటు రాష్ట్రంలో శివరాజ్ సింగ్ చౌహాన్ పాత్రను కేంద్ర నాయకత్వం ఎలా చూస్తోంది అనేది కూడా కీలకంగా మారింది.

బీజేపీలో ఒక వర్గం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకోవడం లేదు.

ఇది కమల్‌నాథ్‌కు లాభించే అంశమే. అటు రాష్ట్ర ప్రతిపక్ష నేత గోపాల్ భార్గవ్ కూడా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని స్పీకర్ ఆనందీ బేన్ పటేల్‌కు లేఖ రాశారు.

మీడియాతో మాట్లాడుతూ విశ్వాస పరీక్షకు డిమాండ్ చేసిన గోపాల్ భార్గవ్, తన లేఖలో ఎక్కడా ఆ విషయం ప్రస్తావించలేదు. కొన్ని అత్యవసర అంశాలపై చర్చించడానికి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని మాత్రమే కోరారు.

రాష్ట్ర బీజేపీ అగ్ర నేతలు ఈ విషయంలో రకరకాలుగా ప్రకటనలు చేస్తున్నప్పటికీ, వారిలో ఎవరూ అవతలి పార్టీ ఎమ్మెల్యేలను అప్రోచ్ అయినట్లు తెలీడం లేదు.

పార్టీలో చీలికలు వస్తాయా

బీజేపీ నిజానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చీలికలు చూడాలనుకుంటోంది. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా ద్వారా ప్రభుత్వాన్ని కూల్చడం సాధ్య కాదు.

బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించగలదు. కానీ, రాజీనామాల తర్వాత ఆ ఎమ్మెల్యేలు బీజేపీ తరఫున గెలవగలరా, లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది.

కమల్‌నాథ్ నుంచి రాహుల్ గాంధీ ఏవైతే ఆశించారో అది నెరవేరలేదని దినేశ్ గుప్తా చెబుతున్నారు.

"ఇది కమల్‌నాథ్‌కు క్లిష్ట సమయం. ఒత్తిడి పెంచుతున్న బీజేపీ ఆయనకు రోజుకో కొత్త సమస్య తెచ్చిపెడుతోంది. కమల్ నాథ్ ప్రభుత్వానికి పార్టీ లోపలి నుంచి, బీజేపీ నుంచి రెండు వైపులా ప్రమాదం ఉంది" అని సీనియర్ జర్నలిస్ట్ రుషి పాండే అన్నారు.

ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ చెప్పడాన్ని బట్టి సొంత పార్టీ నుంచి కూడా ఆయనకు ప్రమాదం ఉన్నట్టు భావించవచ్చు.

"ప్రస్తుతం పార్టీ మనోబలం తగ్గింది. పార్టీ అగ్రనేతలందరూ ఓడిపోయారు. ఒకే లైన్లో నిలబడ్డట్టు కనిపిస్తున్నారు" అని రుషి అన్నారు.

అయినా బీజేపీకి ప్రభుత్వం కూల్చడం అంత సులభం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ దగ్గర 121 మంది సభ్యులున్నారు. అటు బీజేపీ కూడా 109 నుంచి 116 వరకూ రావచ్చు.

ఇవన్నీ చూస్తుంటే బీజేపీ ఇప్పటికిప్పుడు ఏదైనా చేయాలని తొందరపడుతున్నట్టు అనిపించడం లేదు. అయినా, అది కొంతకాలమే అలా వేచిచూస్తుందని అందరూ భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)