చంద్రబాబు: ఎన్టీఆర్ కూడా అపజయాలు ఎదుర్కొన్నారు - ప్రెస్‌రివ్యూ

  • 29 మే 2019
చంద్రబాబు Image copyright fb/TDP.Official

'మూడున్నర దశాబ్దాలుగా నేను మీకు అండగా ఉంటున్నా.. ఇకపైనా ఉంటా.. ఎవరూ అధైర్యపడొద్దు' అని టీడీపీ కార్యకర్తలకు, నేతలకు ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారని ఆంధ్రజ్యోతి రాసింది.

ఇబ్బందులనేవి జీవితంలో వస్తుంటాయని, వాటిని ధైర్యంగా అధిగమిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుందని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తితో ముందుకెళ్లి ప్రజల అభిమానం, సహకారం చూరగొందామని పిలుపిచ్చారు.

నందమూరి తారకరామారావు 96వ జయంతి కార్యక్రమాన్ని గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత ఏర్పాటు చేసిన తొలి కార్యక్రమం కావడంతో నేతలు, కార్యకర్తలు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. వారికి సీనియర్‌ నేతలు ధైర్యం చెప్పారు. చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి వచ్చారు.

'ఎన్టీఆర్‌ యుగపురుషుడు. తెలుగుజాతి ఉన్నంత వరకు చిరకాలం ఆయన ప్రజల గుండెల్లో ఉండిపోతారు. ఆయన్ను చూసి కష్టాలు మరిచిపోయి ముందుకుపోవడానికి సిద్ధమవుదాం. ఆయన ఒక వ్యక్తి కాదు శక్తి.. వ్యవస్థ. కృష్ణా జిల్లా నిమ్మకూరులోని ఒక సాధారణ కుటుంబంలో పుట్టి గుంటూరులోనే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఒక్క రోజే పని చేసి ఆ తర్వాత తన జీవితాన్ని నటనకి అంకితం చేశారు. 290 సినిమాల్లో నటించి సమాజంలో మార్పు కోసం రాజకీయ తెరంగేట్రం చేశారు. అలాంటి మహానుభావుడికి కూడా అపజయాలు ఎదురయ్యాయి. అయినా నిబ్బరం కోల్పోలేదు. ఆయన సీఎం కాగానే అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్లు అని నిర్వచనం చెప్పి ఆచరణలో పెట్టి చూపించారు. పక్కా ఇళ్లు, రూ.2కే కిలో బియ్యం, రూ.50కే కరెంటు, పటేల్‌ పట్వారీ వ్యవస్థ రద్దు వంటి విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని (కార్యకర్తలను) చూస్తున్నాను. త్యాగాలు చేశారు.. కష్టపడ్డారు.. అయినాసరే పార్టీ జెండాను మోస్తూనే వచ్చారు. అభివృద్ధి, సంక్షేమంతో మనం ముందుకుపోయాం. రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేశాం. అయినా ఎన్నికల్లో ఫలితం మరోలా వచ్చింది. చాలామంది బాధపడుతున్నారు. కనీసం భోజనం కూడా చేయకుండా దిగులు పడుతున్నారు. ఎవరూ అధైర్యపడొద్దు. కుటుంబాన్ని పట్టించుకోకుండా ఏ విధంగా అయితే రాష్ట్రం కోసమే పని చేశానో అలానే ఉంటా. కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి కొంత సమయమిచ్చి చూద్దాం. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిద్దాం.. మనకు 40 శాతం మంది ప్రజలు ఓట్లు వేశారు. వారికి అండగా ఉంటూ సేవలందించాల్సిన బాధ్యత ఉంది. లోపాలు సరిదిద్దుకొని ప్రజాసేవతో మళ్లీ టీడీపీకి పూర్వవైభవం తీసుకొద్దాం' అని చంద్రబాబు పిలుపిచ్చారు.

Image copyright fb/KTRTRS

కారుకు ఎదురుదెబ్బ కాదు.. స్పీడ్‌ బ్రేకర్ మత్రమే

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు టీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ కాదని, వాటిని తాత్కాలిక స్పీడ్‌బ్రేకర్‌గా భావిస్తున్నామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారక రామారావు అన్నారని సాక్షి కథనం పేర్కొంది.

లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 40 శాతం ఓట్లు, మెజారిటీ సీట్లు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. దేశవ్యాప్తంగా మోదీ మళ్లీ ప్రధాని కావాలనే భావన ఏర్పడిందని, బీజేపీకి కార్యకర్తలు లేనిచోట్ల కూడా ఆ పార్టీకి భారీగా ఓట్లు పడ్డాయన్నారు.

లోక్‌సభ ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని, గెలుపోటములకు ఒక్కోచోట ఒక్కో కారణం కనిపిస్తోందన్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 4.5 లక్షల ఓట్లు తగ్గాయని తెలిపారు.

"నిజామాబాద్‌లో కవిత ఓడిపోయారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని దేవేగౌడ ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. గతంలో ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ పరాజయం పాలయ్యారు. రెండోసారి సీఎం అయిన కేసీఆర్‌ సైతం మొదటి ఎన్నికల్లో ఓడిపోయారు. టీఆర్‌ఎస్‌ డక్కామొక్కీలు తిన్న పార్టీ. ఎన్నో క్లిష్ట పరిస్థితులను అధిగమించింది. కొందరు ముఖ్యనేతలు ఓడిపోయినంత మాత్రాన కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందనేది నిజం కాదు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అధైర్యపడొద్దు. లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక సరిగా లేదనే వ్యాఖ్యలు సరికాదు. ఉద్యమంలో క్రీయాశీలకంగా పనిచేసిన వినోద్‌ కుమార్, బూర నర్సయ్యగౌడ్, కవిత ఓడిపోయారు. కొత్తగా పోటీ చేసిన వారు, పార్టీ మారిన వారు గెలిచారు. ఈ ఎన్నికల్లో గెలుపోటములకు రకరకాల కారణాలు ఉన్నాయి. ఒక్క కారణం అని చెప్పడానికి లేదు" అని కేటీఆర్ అన్నారు.

Image copyright iStock

జూన్‌ నుంచే కొత్త పింఛన్

తెలంగాణలో వృద్ధులకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు జూన్ నుంచే కొత్త ఆసరా పింఛన్లను ప్రభుత్వం అందించనుందంటూ ఈనాడు ఒక కథనం ప్రచురించింది.

రాష్ట్రంలోని 39 లక్షల మందికి నెలవారీ పింఛను ఇక రూ.2,016 మేర అందుతుంది. దివ్యాంగులకైతే రూ.3,016 లభిస్తుంది.

దీనికి సంబంధించి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంగళవారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

వృద్ధాప్య పింఛను అందుకొనేందుకు ప్రస్తుత వయోపరిమితి 65 ఏళ్లు కాగా.. 57 ఏళ్లకు కుదించనున్నట్లు ఎన్నికల సమయంలో చేసిన ప్రకటనకు అనుగుణంగా బడ్జెట్‌లో నిధులను చూపించినప్పటికీ.. ఉత్తర్వులు మాత్రం జారీ కాలేదు.

పింఛను రెట్టింపు కావటం మినహా మిగతా నిబంధనలన్నీ ఇంతకు ముందు మాదిరిగానే అమలవుతాయని తాజా ఉత్తర్వులు పేర్కొన్నాయి.

ప్రస్తుత లబ్ధిదారులకే రెట్టింపు పింఛన్లను ఇవ్వాలంటే బడ్జెట్‌పై ఏడాదికి రూ.4,950 కోట్ల మేర భారం పడుతూ.. మొత్తం రూ.9,900 కోట్లను ఖర్చు చేయాల్సి ఉంటుంది. వయోపరిమితిని 57 ఏళ్లకు కుదిస్తే మరో 7 లక్షల మంది ఆసరా జాబితాలోకి వస్తారనే అంచనాతో ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులను కేటాయించింది. దీంతో ఆసరాకు ఓటన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో పొందుపర్చిన మొత్తం రూ.12,067 కోట్లకు చేరింది. నిధులను చూపించినందున వృద్ధుల వయపరిమితిని 57 ఏళ్లకు తగ్గిస్తూ ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది.

Image copyright fb/DrKAPaulOfficial

కేఏ పాల్‌పై చీటింగ్ కేసు

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై, ఆయన అనుచరులపై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైందని నమస్తే తెలంగాణ పత్రిక రాసింది.

సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం అశోక్‌నగర్‌కు చెందిన కాట్రగడ్డ సత్యవతి (54) అమెరికా విజిటింగ్ విసా కోసం గతనెల 22న అమీర్‌పేట్ లాల్‌బంగ్లాలోని కేఏ పాల్ నివాసానికి వెళ్లి కలిశారు.

ఇందుకు రూ.15 లక్షలు ఖర్చవుతుందని, ముందస్తుగా రూ.2 లక్షలు చెల్లించాలని ఆయన సూచించారు. ఈ నెల 8న పాల్ కార్యాలయానికి వెళ్లిన సత్యవతి రూ.2 లక్షల చెక్‌ను పాల్ అనుచరురాలు జ్యోతి పేరిట అందజేయగా ఆమె డ్రా చేసుకుంది.

ఈ నెల 23న పాల్ ఫోన్‌చేసి అదనంగా రూ.15 లక్షలు ఇవ్వాలని, అప్పుడే వీసాకు సంబంధించిన పేపర్లు ఇస్తానని చెప్పారు.

అనంతరం ఆమె పాల్, జ్యోతి ఫోన్‌నంబర్లకు కాల్ చేయగా ఎలాంటి సమాధానం లేదు. సత్యవతి మంగళవారం పంజాగుట్ట ఠాణాలో ఫిర్యాదుచేయగా వారిపై కేసు నమోదైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)