ప్రెస్‌రివ్యూ: ఏపీలో కొత్తగా ఎన్ని జిల్లాలు ఏర్పాటు చేయనున్నారు

  • 30 మే 2019
Image copyright ugc

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారని ఈనాడు ఒక కథనంలో పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం 51 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. 25 డివిజన్ల పరంగా ఎటువంటి సమస్యలు లేవు. మిగిలిన 26 డివిజన్‌ కేంద్రాల్లో మార్పులు చేయాల్సి ఉంది.

కొత్త జిల్లాల ఏర్పాటు పరిశీలనలో భాగంగా జిల్లాల నుంచి రెవెన్యూ శాఖ వివరాలు కోరుతోంది. ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తామని వైసీసీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ కసరత్తు చేస్తోంది.

ముఖ్యంగా జిల్లా, రెవెన్యూ మండలాల వారీగా ఉన్న జనాభా, ఇతర సమాచారాన్ని వెంటనే పంపాలని కలెక్టర్లను కోరుతున్నామని బుధవారం రెవెన్యూ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

రాష్ట్రంలో మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. దీనికి అనుగుణంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే పక్షంలో ప్రస్తుతం ఉన్న జిల్లాల స్వరూపాన్ని మార్చాల్సి ఉంటుంది.

దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల్లో ఐదింటికి, కొత్తగా ఏర్పాటు చేయాల్సిన 12 జిల్లాల్లో మరో అయిదింటికి ఎటువంటి ఆటంకాలు లేవు. మిగిలిన వాటి విషయంలో కొన్ని సమస్యలను గుర్తించారు.

గుర్తించిన సమస్యల్లో కొన్ని ఇలా...

* బాపట్ల లోక్‌సభ నియోజకవర్గంలో సంతనూతలపాడు ఉంది. సంతనూతలపాడు మండలానికి చెందిన పేర్నమిట్ట ఒంగోలు నగరంలో అంతర్భాగంగా ఉంది. జిల్లా కేంద్రంగా బాపట్లను గుర్తిస్తే ఒంగోలు నగర పరిధిలో ఉన్న సంతనూతలపాడు మండల వాసులు అక్కడి వరకు వెళ్లాల్సి ఉంటుంది.

* గుంటూరు జిల్లా నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేస్తే పల్నాడు ప్రాంతానికి అనువుగా ఉంటుంది. పెదకూరపాడు శాసనసభ నియోజకవర్గ పరిధిలోని అమరావతి మండలవాసులకు దూరం అవుతుంది.

* కర్నూలు జిల్లా పాణ్యం శాసనసభ నియోజకవర్గంలోని కొన్ని పంచాయతీలు కర్నూలు నగర పరిధిలో ఉన్నాయి. నంద్యాల పార్లమెంటు పరిధిలో పాణ్యం ఉంది. ఇలా...దూరాభారాలను పరిశీలించాలి.

* అనంతపురం రూరల్‌ మండలం రాప్తాడు నియోజకవర్గ పరిధిలో ఉంది. హిందూపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో రాప్తాడు ఉంది. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా గుర్తిస్తే అనంతపురం గ్రామీణ మండల వాసులు అంత దూరం వెళ్లాల్సి ఉంటుంది.

* గిరిజనులు అత్యధికంగా ఉన్న అరకును జిల్లాగా గుర్తించడంలో పలు అంశాలను పరిశీలనకు వస్తున్నాయి. ఈ నియోజకవర్గం వివిధ జిల్లాల పరిధిలోకి వస్తోంది. దీన్ని ఒక జిల్లాగా గుర్తిస్తే పరిపాలనాపరంగా సమస్యలు వస్తాయి. దీని వల్ల అరకును 2 జిల్లాలుగా చేయాల్సి ఉంటుంది.

... ఇలా వివిధ కోణాల నుంచి రెవెన్యూ శాఖ వివరాలను జిల్లా అధికారుల నుంచి కోరుతూ లోక్‌సభ నియోజకవర్గాలను జిల్లాలుగా గుర్తించడంలో ఉన్న సమస్యలు...తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు జరుగుతోంది.

సీఎం స్థాయిలో సమీక్షా సమావేశం జరిగితే కొత్త జిల్లాల ఏర్పాటు పరిస్థితిని వివరించేందుకు రెవెన్యూ శాఖ సమాయత్తం అవుతోందని ఈనాడు తెలిపింది.

Image copyright YSJagan

నవరత్నాలతోనే తొలి అడుగు

ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి సర్వాంగ సుందరంగా సన్నాహాలు పూర్తయ్యాయి. ప్రమాణ స్వీకారం అనంతరం చేసే ప్రసంగంలో జగన్‌ కొత్తగా ఇచ్చే వరాలజల్లు ఏమైనా ఉంటుందేమోనని ఆశగా రాష్ట్రం ఎదురు చూస్తోందని ఆంధ్రజ్యోతి తెలిపింది.

2004లో ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖర రెడ్డి హైదరాబాద్‌ లాల్‌ బహుదూర్‌ స్టేడియంలో వ్యవసాయానికి ఏడు గంటల ఉచిత విద్యుత్తు పథకంపై తొలి సంతకం చేశారు. ఇదే తరహాలో గురువారం జరిగే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం సందర్భంగా జగన్‌ కూడా రాష్ట్ర ప్రజలకు కొత్త వరాన్ని ప్రకటిస్తారేమోనన్న ఆసక్తి నెలకొంది.

అయితే, ముఖ్యమంత్రిగా తాను చేసే తొలి ఉపన్యాసంలో ఎన్నికల హామీ అయిన నవరత్నాలుకే జగన్‌ అత్యధిక ప్రాధాన్యం ఇస్తారని పార్టీ ముఖ్య నేతలు స్పష్టం చేస్తున్నారు. జగన్‌ మొదటి సంతకం పెట్టే ఫైలంటూ ఏదీ ఉండదని, నవరత్నాలు అమలుపై ఆయన అక్కడ విస్పష్టమైన ప్రకటన చేస్తారని వెల్లడిస్తున్నారు.

నవరత్నాలులో ఒకటయిన పింఛన్ల కుఆయన తన ప్రసంగంలో అధిక ప్రాధాన్యత ఇస్తారని చెబుతున్నారు. అధికారంలోకి వస్తే సామాజిక పింఛన్ల మొత్తాన్ని పెంచుతానని జగన్‌ తన పాదయాత్ర, ఎన్నికల సభల్లో హామీ ఇచ్చారు. ఈ మేరకు పింఛన్ల పెంపుదలపై ఆయన ప్రకటన చేస్తారని వారు వివరిస్తున్నారు. అదేవిధంగా, డ్వాక్రా మహిళల రుణమాఫీపైనా తన అభిప్రాయాన్ని వెల్లడించే వీలుందని అంటున్నారు.

వైఎస్‌ జగన్‌ తన పాదయాత్రలో భాగంగా ప్రజలనుంచి వచ్చిన అభ్యర్థనలు, స్పందనలను క్రోడీకరించి నవరత్నాలను ప్రకటించిన విషయం తెలిసిందే. తొమ్మిది పథకాల సమాహారంగా ఇవి రూపొందాయి. వాటిని ఏ పథకానికి ఆ పథకాన్ని విడివిడిగా అమలు చేస్తే దానికి ప్రాధాన్యత ఉండదని జగన్‌ భావిస్తున్నారు.

ఈ తొమ్మిది రకాల వాగ్దానాల అమలుకు ఒక ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేసి, దానికి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని ప్రత్యేకంగా పర్యవేక్షణ అధికారిగా నియమించనున్నారని తెలిసింది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పేద, బడుగు వర్గాల సంక్షేమం కోసం 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని ప్రకటించారు. దీని అమలు కోసం జాతీయ స్థాయిలోనూ, రాష్ట్రస్థాయిలోనూ ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

ప్రశాంత్ కిషొర్ Image copyright ysrcp/fb

వైసీపీ విజయంలో 'ఐ-ప్యాక్‌' కీలక పాత్ర

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం వెనుక ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ(ఐ-ప్యాక్‌) కీలక పాత్ర పోషించిందని సాక్షి తెలిపింది.

సంస్థాగతంగా పార్టీ బలోపేతం కావడం, ప్రచారం, పోల్‌ మేనేజ్‌మెంట్‌లో ఐ-ప్యాక్‌ సంస్థ పక్కా వ్యూహాలతో దిశానిర్దేశం చేసింది. 2014 ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల వ్యూహకర్తగా విజయవంతమై ప్రశాంత్‌ కిశోర్‌ యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించారు.

2014లో తృటిలో అధికారానికి దూరమైన వైసీపీ 2019 ఎన్నికల కోసం నాలుగేళ్ల క్రితమే సమాయత్తమైంది. వైఎస్‌ జగన్‌ తమ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిశోర్‌ను నియమించారు. దాంతో ప్రశాంత్‌ కిశోర్‌ తొలిసారి దక్షిణ భారతదేశంలో ఎన్నికల వ్యూహకర్తగా రంగంలోకి దిగారు.

2017 మే నుంచి ఐ-ప్యాక్‌ సంస్థ వైఎస్సార్‌సీపీతో కలిసి పనిచేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రణాళికాబద్ధంగా వ్యూహాలను అమలు చేస్తూ పార్టీకి దిక్సూచిగా నిలిచింది.

వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా నియమితులు కాగానే ప్రశాంత్‌ కిశోర్‌ తన ఐ-ప్యాక్‌ బృందంతో కార్యాచరణ చేపట్టారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పటికీ ఎన్నికలకు 709 రోజులే ఉన్నాయి. అందుకు అనుగుణంగా 200 మంది సభ్యులను వివిధ బృందాలుగా ఏర్పాటు చేసి, పలు బాధ్యతలు అప్పగించారు.

క్షేత్రస్థాయి విభాగాలు, మీడియా వింగ్, డిజిటల్‌ మీడియా అండ్‌ రిసెర్చ్‌ కమ్యూనికేషన్‌ వింగ్‌... ఇలా పలు విభాగాలు ఏర్పాటయ్యాయి. ఐ-ప్యాక్‌ సంస్థ అధినేత ప్రశాంత్‌ కిశోర్‌ మొత్తం వ్యవహారాలను పర్యవేక్షిస్తూ రిషిరాజ్‌ సింగ్, శంతన్‌సింగ్, ఈషాలకు కీలక బాధ్యతలు అప్పగించారు.

ఆ ముగ్గురు వైసీపీకి చెందిన వివిధ విభాగాలను పర్యవేక్షిస్తూ, ఎన్నికల వ్యూహాలను అమలు చేశారని సాక్షి తెలిపింది.

Image copyright Getty Images

తెలంగాణలో రికార్డు స్థాయి ఎండలు.. ప్రపంచంలో మూడో స్థానం

తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు మండుతున్నాయి. అదీ మామూలు రికార్డు కాదు.. ప్రపంచస్థాయి రికార్డుల్లో! దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతంలో జగిత్యాల అగ్రభాగాన నిలిచింది అని నమస్తే తెలంగాణ పేర్కొంది.

బుధవారం ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నమోదైన పగటి ఉష్ణోగ్రతలను గమనిస్తే.. తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికాలోని కేప్ సెయింట్ ఫ్రాన్సిస్ ప్రాంతం 56.8 డిగ్రీలతో అగ్రభాగాన ఉండగా, కువైట్‌లోని మిత్రిబా 48డిగ్రీలతో రెండోస్థానం లో నిలిచింది.

రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనా గ్రామం 47.5 డిగ్రీల ఉష్ణోగ్రతతో దేశంలో టాప్‌లో, ప్రపంచంలో మూడోస్థానంలో నిలిచింది.

ఇరాక్‌లోని బస్తాహుస్సేన్ 47.2 డిగ్రీలతో నాలుగు, 46.6 డిగ్రీలతో ఇండియాలోని చురుప్రాంతం ఎనిమిది, 46.3 డిగ్రీ లతో ఆదిలాబాద్ పదవ స్థానాల్లో నిలిచాయి.

రాష్ట్రంలో రెండ్రోజులుగా ఇరవైకి పైగా ప్రాంతా ల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు దాటి ఏసీ గదుల్లోనూ చెమటలు పట్టిస్తున్నాయి. ఉత్తర వాయవ్య దిశలోని రాజస్థాన్, విదర్భ ప్రాంతాల నుంచి వేడిగాలులు వీస్తున్నాయి.

ఉత్తర తెలంగాణలోని చాలాచోట్ల కొన్నిరోజులుగా 44 నుంచి 47డిగ్రీల మేరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో కొన్నిచోట్ల పగటి ఉష్ణోగ్రత 47 డిగ్రీలు దాటడంతో జనం విలవిలలాడుతున్నారు.

రాష్ట్రంలో అల్ట్రావయొలెట్ కిరణాలు తీక్షణంగా ఉన్నాయని వరల్డ్ మెట్రాలాజికల్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తున్నది. అల్ట్రావయొలెట్ (యువీ) ఇండెక్స్ సాధారణంగా 3-5 మధ్య ఉండాలి. కానీ, కొన్నిరోజులుగా తెలంగాణలో యూవీ ఇండెక్స్ 11గా నమోదవుతున్నది.

అల్ట్రావయొలెట్ కిరణాలు 3 నుంచి 5 డిగ్రీల మధ్య ఉంటే సాధారణంగా, 6 నుంచి 7 దాటితే ప్రమాదకరంగా భావిస్తారు. అదే 8-10 మధ్య ఉంటే అతి ప్రమాదకరంగా, 11 డిగ్రీలను దాటితే అత్యంత ప్రమాదకరంగా భావిస్తారు. కానీ, ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు అల్ట్రావయొలెట్ కిరణాల ఇండెక్స్ 11 డిగ్రీలకు చేరుతున్నట్టు అధికారులు తెలిపారు. అనూహ్యమైన వాతావరణ మార్పుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ప్రజలకు అవసరమైన హెచ్చరికలు చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అధికారయంత్రాంగాన్ని అప్రమత్తం చేశారని నమస్తే తెలంగాణ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)