మోదీ ప్రమాణ స్వీకారానికి స్టాలిన్‌ను ఎందుకు ఆహ్వానించలేదు?

  • 30 మే 2019
ఎంకే స్టాలిన్ Image copyright facebook/MKStalin

లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయంతో నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని పదవి అధిష్టించబోతున్నారు. గురువారం సాయంత్రం ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

తమిళనాడు నుంచి నటులు రజినీ కాంత్, మక్కల్ నీతి మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్‌కు మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానం అందింది.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో కమల్ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. నాథురాం గాడ్సే దేశంలో మొదటి ఉగ్రవాది అని కమల్ చేసిన వ్యాఖ్యలు బీజేపీని ఆగ్రహానికి గురిచేశాయి.

అయినప్పటికీ బీజేపీ అధిష్ఠానం కమల్‌ను మోదీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించింది. కానీ, లోక్‌సభ ఎన్నికల్లో మూడో అతిపెద్ద పార్టీగా అవతరించిన డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్‌ను ఆహ్వానించలేదు.

జాతీయస్థాయిలో బీజేపీ పూర్తిస్థాయిలో ఆధిక్యాన్ని ప్రదర్శించినప్పటికీ తమిళనాట డీఎంకే అభ్యర్థుల చేతిలో బీజేపీ, దాని మిత్రపక్షాలు దారుణ ఓటమి చవి చూశాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పుదుచ్చెరి ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామి

తమిళనాడు నుంచి రజినీ, కమల్‌లను ఆహ్వానించిన బీజేపీ... రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన డీఎంకేను ఆహ్వానించకపోవడం అమితాశ్చర్యానికి గురిచేసింది.

ప్రధానమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎవరిని ఆహ్వానించాలనేదానిపై ప్రొటోకాల్ ఏమైనా ఉంటుందా అని పుదుచ్చెరి ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి కార్యాలయ శాఖ మాజీ

మంత్రి వి.నారాయణ స్వామిని అడగగా, ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ''ఎవరిని ఆహ్వానించాలనేదానిపై ప్రధానమంత్రిగా ఎన్నికైన వారికే హక్కు ఉంటుంది'' అని వివరించారు.

''గతంలో ప్రధానప్రతిపక్షం మాత్రమే కాకుండా లోక్‌సభలో ఎక్కువ స్థానాలు సాధించిన పార్టీలను కూడా ప్రధానమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించేవారు. స్టాలిన్‌ను కూడా పిలవాల్సి ఉండేది'' అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక డీఎంకే పార్లమెంటరీ పార్టీ విప్ ఎ. రాజా

దీనిపై మాజీ మంత్రి, డీఎంకే పార్లమెంటరీ పార్టీ విప్ ఎ. రాజా మాట్లాడుతూ, ''మమ్మల్ని ఆహ్వానించడం లేదా ఆహ్వానించకపోవడం అనేది వారి ఇష్టం. ఈ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి ప్రొటోకాల్ ఉండదని అనుకుంటున్నా'' అని తెలిపారు.

''స్టాలిన్ ముఖ్యమంత్రి కాదు, డీఎంకే పార్లమెంటరీ పార్టీ నేత కూడా కాదు. కానీ, కమల్, రజనీలను పిలిచినప్పుడు స్టాలిన్‌ను ఎందుకు పిలవలేదు? పార్లమెంట్‌లో మూడో అతిపెద్ద పార్టీకి అధినేత ఆయన. రాజకీయ మర్యాద కోసమైన ఆయనను పిలవాల్సింది'' అని సీనియర్ జర్నలిస్టు ఆర్.ఇలంగోవన్ అన్నారు.

పేరు చెప్పడానికి ఇష్టపడని బీజేపీలోని కీలక సభ్యుడు ఒకరు దీనిపై మాట్లాడుతూ, ''మమతా బెనర్జీతో సహా దేశంలోని అందరు ముఖ్యమంత్రులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. రాష్ట్రపతి భవన్ తన పరిధిలో నిర్వహించే అన్ని కార్యక్రమాలకు పద్మఅవార్డు గ్రహీతలను ఆహ్వానిస్తుంది. రజనీ, కమల్‌లు పద్మ అవార్డు గ్రహీతలు కాబట్టి వారిని ఆహ్వానించి ఉండొచ్చు'' అని అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు