ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం.. మోదీ, రాహుల్ గాంధీ శుభాకాంక్షలు

వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మైదానం ఇందుకు వేదికైంది.

గవర్నర్ నరసింహన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అని పలికే సమయంలో జగన్ క్షణంపాటు ఆగి సభవైపు చూసి చిరునవ్వు నవ్వారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, డీఎంకే అధినేత స్టాలిన్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తిలకించేందుకు పార్టీ కార్యకర్తలు, నేతలు వివిధ జిల్లాల నుంచి విజయవాడకు తరలివచ్చారు.

ముహుర్తాన్ని అనుసరించి 12.23 గంటలకు జగన్‌తో గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు.

ప్రమాణ స్వీకారం అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్ జగన్‌ను హత్తుకొని శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత సర్వమత ప్రార్థనలు జరిపారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్మోహన్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు వేర్వేరుగా శుభాకాంక్షలు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి జగన్‌కు పూర్తి సహకారం అందిస్తానని మోదీ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు కలసి పనిచేద్దామని మోదీ పేర్కొన్నారు.

ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్, కొత్త మంత్రులు, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

ఫొటో క్యాప్షన్,

కేసీఆర్, స్టాలిన్

ఖడ్గ చాలనం కాదు.. కరచాలనం కావాలి: కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజల పక్షాన ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి జగన్‌ను శుభాకాంక్షలు అందిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ‘‘తెలుగు చరిత్రల్లో ఇదో ముఖ్యమైన ఘట్టం. తెలుగు ప్రజలు అనురాగంతో పరస్పర సహకారంతో ముందుకు సాగడానికి ఈ ఘట్టం బీజం వేస్తుందని భావిస్తున్నా. జగన్ వయసు చిన్నది, బాధ్యత పెద్దది’’ అని అన్నారు.

ఈ సమయంలో రెండు రాష్ట్రాల మధ్య ఖడ్గ చాలనం కాదు.. కరచాలనం కావాలని సూచించారు.

‘‘ఆత్మీయతతో రెండు రాష్ట్రాలు సహకారించుకోవాలి. గోదావరి జలలాలను ఏపీ సంపూర్ణంగా వినయోగించుకోవాలి. జగన్ తన తండ్రిపేరు నిలబెట్టేలా పరిపాలన చేయాలి’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.

అంతకు ముందు అందరికీ నమస్కారం అంటూ తెలుగులో మాట్లాడిన డీఎంకే అధినేత స్టాలన్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

వైఎస్సార్ పెన్షన్ల ‌పై తొలి సంతకం

నవరత్నాలు హామీలో భాగంగా పెన్షన్లను మూడు వేలకు పెంచుతూ సీఎంగా జగన్ తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 3,648కి.మీ పాదయాత్ర చేసి రాష్ట్రమంతా పర్యటించానని, తన పాదయాత్రలో పేదలు పడిన కష్టాలను చూశానని చెప్పారు.

‘‘ఆ కష్టాల చూసే ఒక ముఖ్యమంత్రిగా ఈ వేదికపై మీ అందరికీ నేను ఉన్నానని మాటిస్తున్నా. అందరి ఆశలు, ఆకాంక్షలు పరిగణనలోకి తీసుకుంటూ, రెండు పేజీలతో మేనిఫెస్టో తీసుకొచ్చాం. అందులో ఉన్న ప్రతి అంశాన్ని సీఎంగా నెరవేర్చుతానని మాట ఇస్తున్నా. నవరత్నాలు హామీలో భాగంగా పెన్షన్లను మూడు వేలకు పెంచుతున్న ఫైల్ ‌మీద తొలి సంతకం పెట్టబోతున్నాను.’’ అని తెలిపారు.

మొదటిగా రూ.2,250లతో పెంచిన పెన్షన్‌ను ప్రారంభించి, వచ్చే ఏడాది రూ.2,500, ఆ తర్వాత రూ.2,750, ఆ తర్వాతి ఏడాది రూ.3000లకు పెంచుతామని తెలిపారు.

ప్రభుత్వ పథకాలను నేరుగా ఇంటింటికి అందించేందుకు కొత్తగా ప్రతీ గ్రామంలో 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను నియమిస్తామని ప్రకటించారు. ప్రతీ వాలంటీర్‌కు రూ. 5వేలు వేతనంగా ఇస్తామని చెప్పారు. ఆగస్టు 15 వరకు ఈ వ్యవస్థను అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు ఎవరికీ అందకపోయినా నేరుగా సీఎం కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పేలా కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. లంచాలు లేని పారదర్శక పాలనను తీసుకొస్తామని చెప్పారు.

‘‘ప్రాజెక్టులల్లో అక్రమాలను గుర్తించి రివర్స్ టెండరింగ్ చేస్తాం. ఇకపై ప్రతీ కాంట్రాక్టు టెండర్‌కు వెళ్లడానికి ముందే జ్యూడీషిల్ కమిటీ ముందుకు పంపుతాం. ఏపీలోని కొన్ని మీడియా సంస్థలకు చంద్రబాబు మాత్రమే సీఎంగా కనిపిస్తారు. ఎల్లో మీడియా ప్రభుత్వంపై తప్పుడు కథనాలు రాస్తే పరువు నష్టం దావా వేస్తాం’’ అని తెలిపారు.

శుభాకాంక్షలు తెలిపిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న జగన్‌కు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు.

‘‘ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మీకు అభినందనలు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పేదల సంక్షేమమే లక్ష్యంగా కృషి చేయాలని కోరుతున్నాను. అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సహకారాన్ని అందజేస్తాము. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అని చంద్రబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)