కిషన్ రెడ్డి: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రస్థానం ఇదీ

  • 31 మే 2019
కిషన్ రెడ్డి Image copyright Rajyasabha TV

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్యాబినెట్‌లో సహాయ మంత్రిగా గంగాపురం కిషన్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కిషన్ రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

శుక్రవారం శాఖల కేటాయింపులో ఆయనకు హోంశాఖ సహాయమంత్రిగా పదవి లభించింది.

కాగా, తాను కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు కిషన్ రెడ్డి గురువారం సాయంత్రమే ట్వీట్ చేశారు.

''ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులతో ఈరోజు రాత్రి 7 గంటలకు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను'' అని బీజేపీ నాయకుడు, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందిన కిషన్ రెడ్డి ప్రకటించారు.

కిషన్ రెడ్డికి పలువురు బీజేపీ నేతలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు శుభాకాంక్షలు చెబుతున్నారు. మోదీ ప్రభుత్వంలో లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దక్షిణాది రాష్ట్రాలు, దేశాభివృద్ధిలో పాత్రధారులు కావాలని బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి ఆకాంక్షించారు.

కిషన్ రెడ్డి ప్రస్థానం

  • జనతా పార్టీలో యువ విభాగం నాయకుడిగా 1977లో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు గంగాపురం కిషన్ రెడ్డి
  • 1980లో భారతీయ జనతా పార్టీ ప్రారంభం నుంచి పూర్తిస్థాయి నాయకుడిగా చేరారు
  • అదే ఏడాది రంగారెడ్డి జిల్లా యువమోర్చా కన్వీనర్ అయ్యారు. తదనంతర కాలంలో యువమోర్చా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు
  • 1986 నుంచి 1990 వరకు యువమోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.
  • 2002 నుంచి 2014 వరకు యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు
  • 2004లో మొదటిసారి అంబర్ పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009, 2014ల్లో కూడా అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తిరిగి గెలుపొందారు. అసెంబ్లీలో పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు.
  • 2010 నుంచి 2014 వరకు రెండుసార్లు ఆంధ్రప్రదేశ్బీజేపీ అధ్యక్షుడిగా, 2014 నుంచి 2016 వరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు.
  • ఈ ఏడాది లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)