జగన్ సీఎంగా ప్రమాణం చేసిన తొలిరోజే బదిలీలు, ఏపీ డీజీపీగా గౌతమ్‌ సవాంగ్‌‌ - ప్రెస్ రివ్యూ

  • 31 మే 2019
డీజీపీ గౌతం సవాంగ్ Image copyright YSR Congress Party - YSRCP/facebook

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే జగన్ కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు.

ఆంధ్రప్రదేశ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్ (డీజీపీ)గా పూర్తి అదనపు బాధ్యతలను సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి గౌతమ్‌ సవాంగ్‌కు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సాక్షి ఒక కథనం ప్రచురించింది.

ఆయన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా కూడా కొనసాగుతారు. నలుగురు ఐపీఎస్‌ల బదిలీలకు సంబంధించి రెండు జీవోలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి విడుదల చేసింది.

ఇప్పటిదాకా డీజీపీగా పనిచేసిన ఆర్పీ ఠాకూర్‌ను ప్రింటింగ్, స్టేషనరీ అండ్‌ స్టోర్స్, పర్ఛేజ్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న కుమార్‌ విశ్వజిత్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఏడీజీగా బదిలీ చేశారు.

ఏసీబీ డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును వేరొక పోస్టులో నియమించే వరకు పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌కు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Image copyright IWMP.TELANGANA.GOV.IN

తెలంగాణలో పదకొండు పార్టీలకు విప్ అవకాశం

జిల్లా పరిషత్ చైర్మన్లు, వైస్‌చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో ఆప్షన్ సభ్యుల ఎన్నికపై రాష్ట్ర ఎన్నికల సంఘం మరిన్ని మార్గదర్శకాలను జారీచేసిందని నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.

రాష్ట్రంలో పదకొండు పార్టీలకు విప్ జారీచేసేందుకు అవకాశం కల్పించింది. ఆ పార్టీల వివరాలను వెల్లడిస్తూ గురువారం రాత్రి ఎస్‌ఈసీ ఆదేశాలు జారీచేసిందని పత్రిక తెలిపింది.

జెడ్పీ చైర్మన్లు, వైస్‌చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో ఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఎన్నికైన ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యులు మాత్రమే ఓటేయాలని స్పష్టంచేసింది.

పార్టీ గుర్తుపై పోటీచేసి గెలుపొందిన సభ్యులకు ఆయాపార్టీలు విప్ జారీచేసే అవకాశాన్ని కల్పించింది.

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌తోపాటు బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, ఎంఐఎం, టీడీపీ, వైసీపీ, ఆల్‌ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, జనతాదళ్, రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీలు విప్ జారీచేయవచ్చునని ఈసీ పేర్కొన్నట్టు కథనంలో తెలిపారు.

సదరు పార్టీల తరపున విప్ జారీచేసే వ్యక్తికి సంబంధించి గుర్తింపుకార్డుతోపాటు ఆధారిత లేఖ, రాష్ట్ర అధ్యక్షుడి నియామకం పత్రాన్ని ప్రత్యేక సమావేశం రోజున రిటర్నింగ్ అధికారులకు అందించాలని సూచించింది.

ఉదయం 11 గంటల వరకు విప్‌జారీ అర్హత పత్రాలు అందించి, ఆ తర్వాత పార్టీ సభ్యులకు విప్ జారీ చేయాలని పేర్కొంది. విప్‌ను ఉల్లంఘిస్తే సదరు సభ్యుడికి నోటీసు జారీచేసి, 7 రోజుల్లో సమాధానం ఇవ్వకుంటే వారిపై సస్పెన్షన్ వేటువేసే అధికారం ఉంటుంది.

ఎంపీపీ, జెడ్పీచైర్మన్, కో ఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఎన్నికైన ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యులే ఓటేయాలని స్పష్టం చేసిన ఎస్‌ఈసీ.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓటువేసే అధికారం లేదని తేల్చినట్టు నమస్తే తెలంగాణ తెలిపింది.

ప్రత్యక్షంగా ఎన్నికైన పరిషత్ ప్రాదేశిక సభ్యులను గుర్తించేందుకు వీలుగా ప్రత్యేకసీట్లను కేటాయించాలని అధికారులకు సూచించింది.

సమావేశాల మందిరాల్లో ఓటింగ్ ప్రక్రియను ప్రభావితం చేసేవిధంగా ఎలాంటి ప్రచారానికీ అనుమతి లేదని పేర్కొంది.

Image copyright Reuters

ఏపీలో భూపంపిణీపై సర్కారు దృష్టి, రెవెన్యూ శాఖ కసరత్తు

అధికారంలోకి వస్తే పేదలకు సాగుభూమి పంపిణీ చేస్తామన్న హామీని అమలు చేసేందుకు వైసీపీ సర్కారు సన్నాహాలు ప్రారంభించిందని ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.

ఇందుకోసం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సాగుకు యోగ్యమైన ప్రభుత్వ భూముల వివరాలను శుక్రవారం నాటికి అందించాలని ఆదేశాలు వెళ్లాయి. ఈ ఫైల్‌ శనివారం సీఎం జగన్‌కు చేరే అవకాశం ఉంది.

దీంతో రెవెన్యూ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. భూముల వివరాలను సేకరించి వెంటనే నివేదించాలని భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ)ను రెవెన్యూశాఖ ఆదేశించింది.

జిల్లాల వారీగా ప్రభుత్వ భూముల వివరాలు అందించాలంటూ కలెక్టర్లను రెవెన్యూ శాఖ కోరింది. ఆరు జిల్లాల్లో కలిపి 12,500 ఎకరాల సాగు భూములు ఉన్నట్లు కలెక్టర్లు నివేదించారు. ఏడు జిల్లాల్లో సెంటు భూమి కూడా అందుబాటులో లేదని వెల్లడించినట్లు ఆంధ్రజ్యోతి చెప్పింది.

శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనే సాగు భూములు అందుబాటులో ఉండగా, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో భూముల లభ్యత లేదని అధికారులు నివేదించినట్లు తెలిసిందని కథనం పేర్కొంది.

ఏడు జిల్లాల్లో సెంటు భూమి కూడా అందుబాటులో లేదన్న నివేదికలపై అసంతృప్తితో ఉన్న అధికారులు మరోసారి నిశిత పరిశీలన చేయాలని ఆదేశించారు.

గతంలో ప్రభుత్వం నుంచి వివిధ అవసరాల పేరిట తీసుకున్న భూములను పడావుపెట్టిన (నిరుపయోగంగా ఉన్న భూములు) కేసులపై దృష్టిపెట్టాలని, నిబంధనలను ఉల్లంఘించిన వ్యవహారంపై పరిశీలన చేయాలని ఆదేశించారని ఆంధ్రజ్యోతి చెప్పింది.

Image copyright Getty Images

పెట్టుబడి నిర్ణయాల్లో మహిళలు ఇప్పటికీ దూరమే

పురుషులతో పోలిస్తే మహిళలు స్వతంత్రంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకబడి ఉన్నారని ఓ నివేదిక వెల్లడించినట్టు ఈనాడు ఒక కథనం ప్రచురించింది.

వాస్తవానికి పరిశ్రమలో మహిళా ఉద్యోగులే అధిక సంఖ్యలో ఉన్నా కేవలం 33 శాతం మందే సొంతంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు 'డీఎస్‌పీ డబ్ల్యూఇన్వెస్టార్‌ పల్స్‌ 2019' సర్వేలో తేలినట్టు ఇందులో తెలిపారు.

రీసెర్చ్‌ ఏజెన్సీ నీల్సన్‌తో కలిపి ఈ సంస్థ సర్వే నిర్వహించింది. పురుషుల విషయానికొస్తే 64 శాతం మంది సొంతంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు నివేదిక తేల్చింది.

'పెట్టుబడుల పరిశ్రమలో సంఖ్యాపరంగా మహిళలే అధికంగా ఉన్నారు. ఎంతో అనుభవం ఉన్న వృత్తి నిపుణులు, ఫండ్‌ మేనేజర్లుగా వారే కొనసాగుతున్నారు. అయినప్పటికీ రిటైల్‌ మదుపర్లుగా మహిళలను పెట్టుబడుల పరిశ్రమ పట్టించుకోవడం లేదు' అని డీఎస్‌పీ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ అధ్యక్షుడు కల్పేన్‌ పరేఖ్‌ వెల్లడించినట్టు కథనం పేర్కొంది.

సొంతంగా పెట్టుబడుల నిర్ణయాలు తీసుకుంటున్నవారిలో చాలా మంది తొలినాళ్లలో వారి భర్తలు లేదా తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ముందడుగు వేసినట్లు ఈ సర్వేలో తెలుస్తోందని కథనం చెప్పింది.

మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా ఇద్దరి లక్ష్యాలు ఒకటే విధంగా ఉన్నాయి. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, కలల గృహం, రుణ రహిత, మంచి జీవన ప్రమాణాలతో కూడిన జీవితం అనుభవించాలని వారు కోరుకుంటున్నట్టు ఈనాడు తెలిపింది.

ఇల్లు/కారు కొనుగోలు చేసే సమయంలో పురుషులు చాలా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారని, మహిళలపై ఆధిపత్యం చూపిస్తున్నారని ఈ సర్వేలో తేలింది. ఆభరణాలు, గృహావసరాలకు సంబంధించిన రోజువారీ, మన్నికైన వస్తువుల కొనుగోలు విషయంలో మాత్రం మహిళలదే పైచేయిగా ఉంది.

డబ్బుల విషయంలో మహిళలు, పురుషులు ఎలా ఆలోచిస్తున్నారు? పెట్టుబడి నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారు? వారి ఆర్థిక లక్ష్యాలను అర్థం చేసుకునేందుకు వీలుగా 8 నగరాల్లోని సుమారు 4,013 మంది మహిళలు/పురుషులను (1853 మంది పురుషులు+2160 మంది మహిళలు) సర్వే చేసిన 'డీఎస్‌పీ డబ్ల్యూఇన్వెస్టార్‌ పల్స్‌ 2019' నివేదిక వెల్లడించిందని ఈనాడు చెప్పింది. ఈ సర్వేలో 25-60 ఏళ్ల మధ్య వయసున్న వారు పాల్గొన్నట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)