అసోం ఎన్ఆర్సీ వివాదం: కార్గిల్ యుద్ధంలో పోరాడిన మాజీ సైనికుడిపై 'విదేశీయుడు' అనే ముద్ర

  • 31 మే 2019
సైనికుడిపై విదేశీ ముద్ర

భారత సైన్యంలో 30 ఏళ్లు సేవలు అందించిన రిటైర్డ్ సుబేదార్ మొహమ్మద్ సనాఉల్లాను విదేశీ పౌరుడని ప్రకటించిన అసోంలోని ఒక విదేశీ ట్రైబ్యునల్ (ఎఫ్‌టీ), అతడిని డిటెన్షన్ కేంద్రానికి పంపించింది.

ఈ ఘటనతో సనాఉల్లా కుటుంబం తీవ్ర ఆందోళనలో పడింది. ఈ కేసును గువాహటి హైకోర్ట్ ముందుకు తీసుకొచ్చేందుకు ఆ కుటుంబం సిద్ధమవుతోంది.

2017లో ఇండియన్ ఆర్మీ, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ వింగ్‌లో సుబేదార్‌గా పనిచేసి రిటైరైన మొహమ్మద్ సనాఉల్లా పేరును అసోంలో అప్‌డేట్ అవుతున్న జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్‌సీ)లో చేర్చలేదు. 52 ఏళ్ల సనాఉల్లాను మే 23న కామరూప్ (రూరల్)లో ఉన్న విదేశీ ట్రైబ్యునల్ అంటే ఎఫ్‌టీ కోర్ట్ 'నంబర్ 2 విదేశీయుడు'గా ప్రకటించింది.

గువాహటి హైకోర్టులో ఈ కేసును వాదించడానికి సిద్ధమవుతున్న వకీల్ అమన్ వాదూద్ బీబీసీతో మాట్లాడుతూ "2008-09లో సనాఉల్లా పౌరసత్వం గురించి ఒక దర్యాప్తు జరిగింది. ఆప్పుడు ఆయన మణిపూర్‌లో పనిచేసేవారు. దర్యాప్తు సమయంలో సనాఉల్లా వేలిముద్రలు కూడా తీసుకున్నారు. ఆయన్ను అక్రమంగా వలసవచ్చిన కార్మికుడుగా చెప్పారు" అని అన్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఅసోం ఎన్ఆర్‌సీ జాబితా: త్రిశంకు స్వర్గంలో ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వలసదారులు

విదేశీయుడి ముద్ర

ఆ తర్వాత ఎన్ఆర్సీలో ఆయన పేరు రాలేదు. విదేశీ ట్రైబ్యునల్‌లో తనపై ఒక కేసు నమోదైనట్లు సనాఉల్లాకు తెలిసింది. ఆ తర్వాత ట్రైబ్యునల్‌లో ఎన్నో విచారణలు జరిగాయి. ఆయన తన నాగరికతకు సంబంధించిన ఎన్నో పత్రాలను సమర్పించారు. కానీ ట్రైబ్యునల్ వాటిని అంగీకరించడానికి తిరస్కరించింది. మే 23న ఎఫ్‌టీ ఆయన్ని విదేశీయుడిగా ప్రకటించింది.

ట్రైబ్యునల్‌లో వాంగ్మూలం ఇచ్చిన సనాఉల్లా తను భారత సైన్యంలో ఉంటూ జమ్ము-కశ్మీర్, ఈశాన్యంలోని తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో సేవలు అందించానని చెప్పారు. ఆయన ప్రస్తుతం అసోం పోలీస్ బోర్డర్ శాఖలో ఒక సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో అక్రమ వలసదారుల వివరాలు తెలుసుకునే పనిలో ఉన్న అదే బోర్డర్ పోలీసులు గత మంగళవారం సనాఉల్లాను అరెస్టు చేశారు.

నిర్బంధ కేంద్రంలో బందీ

సనాఉల్లాను అదుపులోకి తీసుకున్నట్లు కామరూప్ జిల్లా ఏఎస్పీ సంజీవ్ సైకియా ధ్రువీకరించారు. "ఎఫ్‌టీ ఆయన్ను విదేశీయుడని చెప్పింది. పోలీసులు చట్టప్రకారం దర్యాప్తు చేస్తున్నారు. సనాఉల్లాను ప్రస్తుతం గ్వాల్పాడాలోని ఒక డిటెన్షన్ సెంటర్లో ఉంచాం" అన్నారు.

"30 ఏళ్ల నుంచి సైన్యంలో పనిచేస్తున్న ఒక వ్యక్తిపై, కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్‌ ఆర్మీతో పోరాడిన వ్యక్తిపై విదేశీ పౌరుడుగా ఎలా ముద్ర వేస్తారు? 2015లో జమ్ము-కశ్మీర్‌లో తీవ్రవాదులతో పోరాడిన సనాఉల్లా కాలికి బుల్లెట్ కూడా తగిలింది. మా అన్నను విదేశీయుడుగా ప్రకటించి డిటెన్షన్ సెంటర్లో బంధిస్తారని మేం ఎప్పుడూ అనుకోలేదు" అని సనాఉల్లా సోదరుడు మొహమ్మద్ ఫైజుల్ హక్ బీబీసీతో అన్నారు.

సనాఉల్లా దగ్గర భారత పౌరసత్వానికి సంబంధించిన అన్ని పత్రాలూ ఉన్నాయని, కానీ ఆయన ముస్లిం కావడం వల్లే ప్రభుత్వం అలా చేసిందని ఆయనన్నారు.

సైన్యంలో పనిచేసిన సనాఉల్లా

ఆయన కుటుంబం దగ్గర పౌరసత్వానికి సంబంధించిన చాలా పత్రాలు ఉన్నాయని ఎఫ్‌టీ కోర్టులో సనాఉల్లా కేసు చూస్తున్న వకీల్ సాహిదుల్ ఇస్లాం చెప్పారు. "1966, 1970, 1977 ఓటర్ల జాబితాలో సనాఉల్లా కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయి. దానితోపాటు అతడి మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్, భూముల పత్రాలు కూడా ఉన్నాయి" అన్నారు.

నిజానికి గత ఏడాది ఎఫ్‌టీ సనాఉల్లాకు నోటీసులు పంపించింది. ఆయన మొదటిసారి 2018 సెప్టెంబర్ 25న ట్రైబ్యునల్ ఎదుట హాజరయ్యారు. ట్రైబ్యునల్ నోటీసులు అందిన తర్వాత గత ఏడాది బీబీసీతో మాట్లాడిన సనాఉల్లా... "సైన్యంలో చేరేటప్పుడు చాలా లోతుగా దర్యాప్తు చేస్తారు. కానీ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత పౌరసత్వం గురించి ఇలాంటి సందేహాలు ఎందుకు వచ్చాయి? సైన్యంలో చేరేటప్పుడు పౌరసత్వం సర్టిఫికెట్ లేదా ఇతర పత్రాలు అడుగుతారు. సైన్యం దానిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపి వాటిని రీవెరిఫికేషన్ చేయిస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి ప్రశ్నే రాకూడదు" అన్నారు.

బెంగాలీ మాట్లాడే ముస్లింలు, హిందువులే బాధితులు

సనాఉల్లా మాత్రమే కాదు. అసోంలో ఇలా చాలా మంది సైనికులు, మాజీ సైనికుల కేసులు వెలుగులోకి వచ్చాయి. వారందరూ తమ భారత పౌరసత్వం నిరూపించుకోవాలని చెబుతున్నారు.

అసోంలో విదేశీ పౌరుల కేసుల విచారణల కోసం ఇప్పుడు వంద ట్రైబ్యునల్స్ నడుస్తున్నాయి. ఈ వ్యవస్థ ప్రకారం విదేశీ చట్టం 1946 కింద ఏ వ్యక్తిపై ఈ కేసుందో, వారు ఈ చట్టం పరిధిలో విదేశీయులా కాదా అనేది ఎఫ్‌టీలో నియమితులైన సభ్యులు చూస్తారు. అయితే ఈ ఎఫ్‌టీ పనితీరుపై కూడా ప్రశ్నలు వస్తున్నాయి.

అక్రమ వలసదారులను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన విదేశీ ట్రైబ్యునల్ ఆదేశాలతో సుమారు 900 మందిపై విదేశీ ముద్ర వేశారు. తర్వాత అదుపులోకి తీసుకున్నారు. వీరిలో దాదాపు అందరూ బెంగాలీ భాష మాట్లాడే ముస్లింలు లేదా హిందువులు. అయితే గువాహటి హైకోర్టు జోక్యంతో చాలా మందికి ఉపశమనం కూడా లభించింది.

Image copyright Getty Images

సుప్రీంకోర్టు ఆదేశాలు

పదవీ విరమణ చేసిన సైనికులను డిటెన్షన్ కేంద్రానికి పంపించిన ఘటనలు చాలా నిరుత్సాహం కలిగించినట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ఎన్ఆర్సీ సమన్వయకర్త ప్రతీక్ హజేలాతో ఈ కేసును పూర్తిగా విచారణ చేయాలని, ప్రక్రియలు పాటించాలని ఆదేశించింది.

ఎన్ఆర్సీ ఎవరైనా ఒక వ్యక్తిని రిజిస్టర్ చేయాలని భావిస్తే, ఆ వ్యక్తి వాదనలను కూడా పూర్తిగా వినాలని కోర్టు చెప్పింది. ఈ ప్రక్రియను జులై 31 లోపు పూర్తి చేయాలని సూచించింది.

భారత చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ అనిరుద్ధ్ బోస్ అధ్యక్షతన ఏర్పడిన ధర్మాసనం జ్యుడీషియల్ అనుభవం ఉన్న ఐఏఎస్ అధికారి ఈ ట్రైబ్యునల్‌కు చీఫ్‌ కావచ్చని చెప్పింది.

ఎన్ఆర్సీ ప్రక్రియ పూర్తి చేయడానికి జులై 31 చివరి తేదీ. అప్పటికల్లా అది పూర్తి కావాలన్న కోర్టు, గడువు ఇక పొడిగించలేమని చెప్పింది. కానీ అంతమాత్రాన ప్రజల వాదనలు పూర్తిగా వినకూడదని, వారికి అవకాశం ఇవ్వకూడదని అనుకోకూడదని చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం