మామిడిపండు కోశాడని దళితుడి హ‌త్య.. అస‌లేం జ‌రిగింది

  • 1 జూన్ 2019
బక్కి శ్రీను భార్యాపిల్లలు

మామిడిపండు కోసం మ‌నిషి ప్రాణం తీసిన ఘ‌ట‌న విస్మ‌య‌క‌రంగా మారింది. తినడానికి కోసిన మామిడికాయ చివ‌ర‌కు ప్రాణం మీద‌కు తెచ్చింది. తోటలో మామిడిపండు కోసినందుకు ఓ ద‌ళిత యువ‌కుడి ప్రాణం తీసిన ఉదంతం క‌ల‌క‌లం రేపింది.

ఆంధ్ర‌ ప్ర‌దేశ్‌లోని తూర్పు గోదావ‌రి జిల్లా రంగంపేట మండలం సింగంప‌ల్లిలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. మామిడి పండు కోసినందుకే మనిషిని చంపేస్తారా అని, ద‌ళితుల ప్రాణాల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌నీ ప‌లు సంఘాలు ప్రశ్నిస్తుండగా, బాధ్యులపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్రభుత్వం చెబుతోంది.

స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం... పెద‌పూడి మండ‌లం జి.మామిడాడ‌కు చెందిన బ‌క్కి శ్రీను వయసు 32 సంవ‌త్స‌రాలు. ఆయన ఎస్సీ యువ‌కుడు. శ్రీను త‌న స్వ‌గ్రామంలో వ్య‌వ‌సాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు.

శ్రీనుకు ప‌క్ష‌వాతంతో బాధ‌ప‌డుతున్న తండ్రి, భార్య కుమారితోపాటుగా ఆరేళ్లు, ఐదేళ్ల వ‌య‌సున్న ఇద్ద‌రు కొడుకుల‌ున్నారు. వేస‌వి సెల‌వులు కావ‌డంతో అత్త‌గారిల్లు వ‌డ్ల‌మూరులో పిల్ల‌ల‌ను దింప‌డానికి వెళ్లిన శ్రీను తిరిగి వ‌స్తూ కొందరు వ్యక్తుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు.

మార్గ మధ్యలో తోటలోని మామిడిపళ్లను తీసుకున్నాడని, శ్రీనుపై దాడి చేసి, ఆ తర్వాత గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉరి వేశారని పోలీసులు చెబుతున్నారు.

చిత్ర‌హింస‌లు పెట్టారు

సింగ‌ంప‌ల్లి, రంగాపురం మ‌ధ్య‌లో చాలా మామిడితోట‌లున్నాయి. బంగిన‌ప‌ల్లి, ర‌సాలు వంటి ర‌కాల మామిడిపళ్లను అక్కడ పండిస్తున్నారు. అయితే ఇటీవ‌ల మైనింగ్‌లో భాగంగా గ్రావెల్ తవ్వ‌కాలు జ‌ర‌ప‌డంతో ప‌లు తోట‌లు తీసేయాల్సి వ‌చ్చింది.

మిగిలిన కొద్దిపాటి మామిడి తోట‌ల‌కు డిమాండ్ ఏర్ప‌డింది. అందులో భాగంగా సింగంప‌ల్లి గ్రామానికే చెందిన సుబ్బారావు అనే రైతు ద‌గ్గ‌ర క‌డియాల రామ‌కృష్ణ‌, క‌డియాల నాగేశ్వ‌ర‌రావు అనే తండ్రీ కొడుకులు మామిడి తోటను కౌలుకు తీసుకున్నారు.

వ‌డ్ల‌మూరులోని అత్తారింటిలో పిల్ల‌ల‌ను దింపి వస్తున్న శ్రీను రోడ్డుని ఆనుకుని ఉన్న ఆ తోట‌లో మామిడిప‌ళ్లు చూశారు. తోట‌లో ఎవ‌రూ క‌నిపించ‌క‌పోవ‌డంతో నేరుగా వెళ్లి కింద‌ప‌డ్డ మామిడిప‌ళ్ల‌తో పాటు కొన్ని మామిడికాయ‌లు కూడా కోసేందుకు ప్ర‌య‌త్నించారని, పేరు చెప్పడానికి ఇష్టపడని రంగాపురం గ్రామవాసి ఒకరు బీబీసీకి వివరించారు.

మరికొందరు గ్రామస్థులు చెబుతున్న వివరాల ప్రకారం...

‘‘స‌రిగ్గా అదే స‌మ‌యానికి కౌలు రైతు క‌డియాల నాగేశ్వ‌ర‌రావు దీనిని గ‌మ‌నించి అక్క‌డికి రావ‌డంతో వాగ్వాదం జ‌రిగింది. నాగేశ్వ‌ర రావు త‌న‌కి తోడుగా గ్రామంలో ఉన్న తండ్రి రామ‌కృష్ణ‌, మ‌రికొంద‌రు స్నేహితుల‌ను కూడా ఫోన్ చేసి రప్పించారు. ఈలోగా శ్రీనుని ప‌ట్టుకున్న సంగ‌తి త‌మ బంధువుల‌కు చెప్పేందుకు కుమారి వెళ్లారు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేది విచార‌ణ‌లో తేలాల్సి ఉంది.’’

‘చంపి, సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడ‌దీశారు!’

మామిడితోట‌లో కాయ‌లు కోస్తుండ‌గా ప‌ట్టుబ‌డిన శ్రీనుని తీవ్రంగా గాయ‌ప‌రిచిన‌ట్లు త‌మ విచార‌ణ‌లో తేలింద‌ని పెద్దాపురం డీఎస్పీ ఎం.రామారావు బీబీసీకి తెలిపారు.

''అనుమ‌తి లేకుండా మామిడికాయ‌లు కోశారనే కోపంతో క‌డియాల నాగేశ్వ‌ర రావు స‌హా ఇత‌రులంతా క‌లిసి శ్రీనును గాయ‌ప‌రిచారు. ఆ త‌ర్వాత పంచాయతీ ఆఫీసు సెక్ర‌ట‌రీని తాళాలు అడిగితే, గుమ‌స్తా.. వారికి తాళాలు ఇవ్వడంతో శ్రీనును అక్క‌డికి తీసుకొచ్చి సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడ‌దీసి ఉరి వేసిన‌ట్లు మా విచార‌ణ‌లో తేలింది'' అని రామారావు అన్నారు.

పంచాయతీ కార్య‌ద‌ర్శి, వీఆర్వో, గుమ‌స్తా, వీఆర్ఏ‌ల మీద కూడా కేసు న‌మోదు చేశారు.

క్రైమ్ నెంబ‌ర్ 96- 2019 కింద కేసు న‌మోదైంది. 10 మంది నిందితుల‌పై సీఆర్పీసీ 342, 302 స‌హా ప‌లు సెక్ష‌న్ల‌తో పాటుగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చ‌ట్టం కింద కేసులు న‌మోద‌య్యాయ‌ని డీఎస్పీ రామారావు వివ‌రించారు.

ఈ ప్రాంతంలో, ఇలాంటి పంచాయితీలు చేయడం, శిక్షలు వేయడం తరచూ జరుగుతుంటుందని కొందరు గ్రామస్థులు బీబీసీతో అన్నారు.

మాకుటుంబానికి దారేది?

భ‌ర్త రెక్క‌ల క‌ష్టంపై ఆధార‌ప‌డి జీవ‌నం సాగిస్తున్న తమకు ఇప్పుడు ఏ జీవనాధారం లేదని శ్రీను భార్య కుమారి వాపోయారు. గొల్ల‌ల‌మామిడాడ‌లో త‌న ఇంటివ‌ద్ద ఉన్న కుమారిని బీబీసీ ప‌ల‌క‌రించింది.

''పిల్ల‌ల‌ను దింప‌డానికి వెళ్లిన నా భ‌ర్త తిరిగి వ‌చ్చేస్తాన‌ని ఫోన్ చేశాడు. వ‌స్తాడు క‌దా.. అని ఎదురుచూస్తున్న నాకు బుధ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల స‌మ‌యంలో ఫోన్ వ‌చ్చింది. మా ఆయ‌న పంచాయతీ ఆఫీసులో ఉన్నాడని చెప్పారు. సింగంప‌ల్లి వెళ్లి చూసేస‌రికి చ‌నిపోయి ఉన్నాడు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశాం. ఇప్పుడు నా కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కావ‌డం లేదు. ఇద్ద‌రు చిన్న‌పిల్ల‌లు, ప‌క్ష‌వాతంతో బాధ‌ప‌డుతున్న మామ‌ని ఎలా చూసుకోవాలన్నదే నా ఆందోళ‌న‌. నా భ‌ర్త‌ను చంపిన వారిని క‌ఠినంగా శిక్షించాలి. అలాంటి వాళ్ల‌ను వ‌ద‌ల‌కూడ‌దు'' అంటూ ఆమె వాపోయారు.

మామిడిపండు కోసినందుకే చంపేస్తారా?

ఆంధ్ర‌ ప్ర‌దేశ్‌లో కూడా ద‌ళితుల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని మాజీ ఎంపీ హ‌ర్ష‌కుమార్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఆయ‌న బీబీసీతో మాట్లాడుతూ..

''బ‌క్కి శ్రీను విష‌యం తెలిసిన వెంట‌నే సింగంప‌ల్లి వెళ్లాను. పంచాయతీ ఆఫీసులో ప్రాణం తీయ‌డం దుర్మార్గ‌మైన చ‌ర్య‌. పోలీసులు, అధికారుల తీరు మారాలి. ఇంత దారుణంగా చిత్ర‌హింస‌లు పెట్టి చంపిన త‌ర్వాత క‌నీసం క‌లెక్ట‌ర్, ఎస్పీ కూడా గ్రామానికి రాలేదు. అత్యంత క‌ర్క‌శంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు పోస్ట్‌మార్ట‌మ్ ప్ర‌కారం అర్థమవుతోంది. త‌క్ష‌ణం జ‌గ‌న్ ప్ర‌భుత్వం స్పందించాలి. బాధిత కుటుంబాన్ని ఆదుకుని, నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించ‌డ‌మే కాకుండా, ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చూడాలి'' అని ఆయన డిమాండ్ చేశారు.

పలు ఎస్సీ సంఘాల నేతలు, వామ‌ప‌క్ష పార్టీల కార్య‌క‌ర్త‌లు కూడా బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. మామిడిపండు కోసినందుకే మనిషిని చంపేస్తారా అని వారు ప్రశ్నించారు. గురువారం కాకినాడ జీజీహెచ్‌లో శ్రీను మృత‌దేహానికి పోస్ట్‌మార్ట‌మ్ నిర్వ‌హించిన అనంత‌రం అంతిమ‌యాత్ర నిర్వహించారు. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేస్తూ బాధితుల‌కు న్యాయం జ‌ర‌గ‌క‌పోతే ఆందోళ‌న చేప‌డ‌తామ‌ని హెచ్చ‌రించారు.

మ‌రోవైపు పోలీసులు ద‌ర్యాప్తు చేసి 10 మంది నిందితుల‌ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ముద్దాయిలు క‌డియాల నాగేశ్వ‌ర రావు, రామ‌కృష్ణతోపాటుగా సింగంప‌ల్లి పంచాయతీ గుమస్తా కొమ్మ‌న త్రినాథ్, పంచాయతీ కార్య‌ద‌ర్శి పాలేటి నూక‌రాజు, అదే గ్రామానికి చెందిన ప‌చ్చిపాల వీర‌బాబు, మూడే రాంబాబు, షేక్ అబ్బులు, వీఆర్ఓ షాలేమ్ ,వీఆర్ఏ సుద‌ర్శ‌న్ రావు, పేరూరి జ‌నార్ధన్ రావు ఉన్నారు. వారిని శుక్ర‌వారం పెద్దాపురం కోర్టులో హాజ‌రుప‌రచారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం