‘ఎక్కడ ఉగ్రదాడి జరిగినా హైదరాబాద్‌లో మూలాలు‘: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి - ప్రెస్‌రివ్యూ

  • 1 జూన్ 2019
Image copyright kishanreddy/fb

దేశ, విదేశాల్లో జరిగే ఉగ్రవాద దాడుల మూలాలు హైదరాబాద్‌లో తేలుతున్నట్లు వార్తలు వస్తుండటం, ఉగ్ర దాడుల కుట్రలు, ప్లానింగ్‌ హైదరాబాద్‌ కేంద్రంగా జరుగుతుండటం అత్యంత ఆందోళనకరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి పేర్కొన్నట్లు సాక్షి వెల్లడించింది.

హైదరాబాద్‌లో తలదాచుకుంటున్న అక్రమ చొరబాటుదారులను వెనక్కి పంపాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర సహాయ మంత్రిగా గురువారం రాత్రి ప్రమాణ స్వీకారం చేసిన కిషన్‌రెడ్డికి ప్రధాని మోదీ కీలకమైన కేంద్ర హోంశాఖ (సహాయ) కేటాయించారు. ఈ నేపథ్యంలో సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు, అక్రమ చొరబాట్లు, కేంద్ర రాష్ట్ర సంబంధాలపై మాట్లాడారు.

‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దేశమంతటా సమగ్రత, సమైక్యత, భద్రతకు ప్రాధాన్యం ఇస్తాం. ప్రపంచంలో ఎవరు ఏ దేశానికి వెళ్లినా అక్కడ రికార్డు ఉంటుంది. ఎవరైనా అమెరికా వెళ్తే.. అమెరికన్లు ఎవరు? నాన్‌ అమెరికన్లు ఎవరు? అనే రికార్డు ఉంటుంది. ఇంగ్లండ్‌ వెళ్లినా.. ఇంగ్లండ్‌ వాళ్లెవరు? నాన్‌ ఇంగ్లండ్‌ వారెవరు అనే రికార్డు ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తూ మన దేశంలో ఎవరు భారతీయులు, ఎవరు కాదు అనే రికార్డు ఏదీ మనకు లేదు. అందుకే ఈరోజు బీజేపీ ప్రభుత్వం నేషనల్‌ రిజిస్టర్‌ ఫర్‌ సిటిజన్స్‌ (ఎన్‌ఆర్సీ) రికార్డు తయారు చేయాలనుకుంటోంది. భారతీయులు ఎవరు, కాని వారెవరో రికార్డుల్లో పొందుపరచాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీన్ని మతపరంగానో, ఓట్లపరంగానో చూడరాదు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు ఒక మంచి విషయానికి మద్దతు ఇవ్వాలి’’ అని పేర్కొన్నారు.

దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినా లేక పొరుగు దేశాల్లో జరిగినా కూడా దానికి ప్లానింగ్, కుట్ర హైదరాబాద్‌లో జరుగుతోందని అన్నారు.

‘‘దేశ, విదేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొని హైదరాబాద్‌కు వచ్చి సేఫ్‌ జోన్‌గా భావించి స్లీపర్‌ సెల్స్‌లా ఉంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రతిసారీ జాతీయ స్థాయిలో ఉన్న పోలీసు అధికారులు రావడం, హైదరాబాద్‌లో అనుమానితులను అరెస్టులు చేయడం చూస్తున్నాం. మరోవైపు ఐసిస్‌ కార్యకలాపాలు పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలు చూస్తున్నాం. ఇవన్నీ చాలా ఆందోళన కలిగించేవి. మయన్మార్‌ నుంచి వేలాది మంది చొరబాటుదారులు (రోహింజ్యాలు) హైదరాబాద్‌ వచ్చి నివసిస్తున్నారు. వారికి కొన్ని సంస్థలు, పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి’’ అని పేర్కొన్నట్లు సాక్షి వెల్లడించింది.

Image copyright Tdp/fb

ఎన్నికల్లో గెలుపోటములు సహజం

'ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియలో గెలుపోటములు సహజం. ప్రజల పక్షాన ఉందాం. బాధ్యతాయుతంగా పనిచేద్దాం' అని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

శుక్రవారం టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు బక్కని నర్సింలు, సాయిబాబా, బండ్రు శోభారాణి తదితరులు, టీడీపీ ఆంధ్ర నాయకులు జేసీ దివాకర్‌ రెడ్డి, కంభంపాటి రామ్మోహన్‌రావు తదితరులు చంద్రబాబును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

'లోక్‌సభ ఎన్నికల్లో మనం పోటీ చేయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. ప్రజల మైండ్‌సెట్‌ కూడా మారింది. మాకు కూడా కొంత సమయం కేటాయించాలి' అని రమణతో సహా పలువురు నాయకులు చంద్రబాబును కోరారు.

తాను వచ్చేవారం మరోసారి వస్తానని, అప్పుడు సమావేశమవుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. సంస్థాగత లోపాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని, వాటిని సరిదిద్దుకోవాలని ఆయన సూచించారు. కాగా, ఉదయం గచ్చిబౌలిలోని ఒక ఆస్పత్రిలో చంద్రబాబు సాధారణ వైద్య పరీక్షలు చేయించుకున్నారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

పోలవరం కాఫర్ డ్యాం పనులు పాక్షికంగా నిలిపివేత

పోలవరం ప్రాజెక్టులో కాఫర్‌ డ్యాం నిర్మాణ పనులు రీచ్‌ 1, రీచ్‌ 3లలో నిలిపివేయాలని, గోదావరి మధ్యలో.. రీచ్‌ 2లో ఇప్పటికే 32 నుంచి 35 మీటర్ల ఎత్తుకు నిర్మించిన చోట రక్షణాత్మక స్థాయికి తీసుకువెళ్లాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో నిర్ణయించారని ఈనాడు వెల్లడించింది.

వరద సమయంలో రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో కేంద్ర జలసంఘంతో చర్చించి మెథడాలజీ సిద్ధం చేసుకుని.. ఆ మేరకు చర్యలు చేపట్టాలని ప్రాజెక్టు అథారిటీ సీఈవో ఆర్‌ కే జైన్‌ ఆదేశించారు.

'స్పిల్‌ వే నిర్మాణం, రీచ్‌ 2లో కాఫర్‌ డ్యాం నిర్మాణం తదితరాల వల్ల వరద సమయంలో స్పిల్‌ వే వెనుక ప్రాంతంలో నీటి నిల్వ స్థాయులు పెరుగుతాయి. కొన్ని రోజుల పాటు అక్కడ వరద నిల్వ ఉంటుంది. దీనివల్ల ఉభయగోదావరి జిల్లాల్లో దాదాపు 57 ఆవాసాలకు ముంపు ఉండే అవకాశం ఉంది. ఈ లోపు ఎంతమందికి పునరావాసం కల్పించగలరో తేల్చి వారిని తరలించడం, మిగిలిన ఆవాసాలకు సంబంధించి తగిన పునరావాసం కల్పించడం వంటి పనులు చేపట్టాలి' అని అథారిటీ సూచించింది.

విజయవాడలో శుక్రవారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి జైన్‌, చీఫ్‌ ఇంజినీరు ప్రధాన్‌.. జలవనరులశాఖ అధికారులు, పునరావాస కార్యక్రమాలు చేపట్టే అధికారులతో సమావేశమయ్యారు.

పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో తదితరులు రెండు రోజుల పాటు పోలవరం ముంపు గ్రామాల్లో పర్యటించారు. పునరావాసం కోసం భవనాలు, ఇతర కాలనీల నిర్మాణం ఎలా సాగుతోందో పరిశీలించారు. జూన్‌ నెలాఖరులోపు ఎన్ని నిర్మాణాలు పూర్తిచేసి ఎంతమందిని తరలించగలరు.. తదితర అంశాలపై నిర్ణయాలు వెల్లడించారని ఈనాడు తెలిపింది.

నవీన్ రావు Image copyright kcr/fb

ఎమ్మెల్సీగా నవీన్ ఏకగ్రీవం

తెలంగాణలోని ఎమ్మెల్యే కోటా శాసనమండలి సభ్యుడుగా టీఆర్‌ఎస్ అభ్యర్థి కుర్మయ్యగారి నవీన్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని నమస్తే తెలంగాణ పేర్కొంది.

నామినేషన్ల పరిశీలన అనంతరం ఒకే ఒక్క నామినేషన్ మిగలడంతో నవీన్ ఎన్నిక లాంఛనమైంది. ఈ మేరకు ఎన్నికల రిట్నరింగ్ అధికారి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు శుక్రవారం నవీన్‌కుమార్‌కు ధ్రువపత్రం అందజేశారు.

అనంతరం నవీన్‌కుమార్ సహా మంత్రులు, టీఆర్‌ఎస్ నాయకులు గన్‌పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు గత అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎమ్మెల్యేగా ఎన్నికకావడంతో ఆ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే.

ఆ స్థానంలో తనకు అవకాశం కల్పించిన కేసీఆర్‌, కేటీఆర్‌లకు నవీన్‌కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తానని నవీన్ తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ముందుంటానని చెప్పారని నమస్తే తెలంగాణ ప్రచురించింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)