తెలంగాణకు ఐదేళ్లు: వల్లభాయ్ పటేల్ నుంచి కేసీఆర్ వరకు

 • 2 జూన్ 2019
హైదరాబాద్ విలీనం Image copyright etelangana.org

నేటితో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదేళ్లు పూర్తవుతోంది. 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం 2014లో తెలంగాణ ప్రజల ఆంకాంక్ష నెరవేరింది.

ఆంధ్రతో హైదరాబాద్ ప్రాంతం విలీనం అయినప్పటి నుంచి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వరకు జరిగిన సుదీర్ఘ పోరాటాల్లో కొన్ని ముఖ్య ఘట్టాలను ఒకసారి గుర్తు చేసుకుందాం.

1948: నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రం (ప్రస్తుత తెలంగాణ) పోలీస్ చర్య‌తో భారత్‌లో విలీనం అయింది. అప్పటి నుంచి 8 ఏళ్ల పాటు హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ Image copyright telugu akademi books

1956: ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను కలిపి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇరు ప్రాంతాల నేతలతో చర్చలు జరిపింది. పెద్దమనుషుల ఒప్పందం (జెంటిల్ మెన్ అగ్రిమెంట్)తో హైదరాబాద్ రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక రక్షణలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది.

1969 తెలంగాణ ఉద్యమం Image copyright etelangana.org

1969: పెద్ద మనుషుల ఒప్పందంలోని రక్షణలు అమలు కావడం లేదని భావించిన తెలంగాణ ప్రజలు తొలిసారిగా ఉద్యమించారు. పోలీసుల కాల్పుల్లో 300 మంది చనిపోయారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి పార్టీని స్థాపించారు.

ఇందిరా గాంధీ, మర్రి చెన్నారెడ్డి Image copyright dr.marrichennareddy/facebook

1973: ఇరు ప్రాంతాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు నాటి ప్రధాన మంత్రి ఇంధిరా గాంధీ ఆరు సూత్రాల పథకాన్ని (సిక్స్ పాయింట్ ఫార్ములా) ప్రతిపాదించారు.

 1. రాష్ట్రంలోని వెనుకబడ్డ ప్రాంతాల సత్వర అభివృద్ధితో పాటు రాష్ట్ర రాజధానిని నిర్ణీత పద్ధతిలో అభివృద్ధిపర్చడానికి నిధుల కేటాయింపు.
 2. విద్యా సంస్థల్లో స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యతనిచ్చే విషయంలో రాష్ట్రానికంతటికీ ఒకే విధానాన్ని వర్తింపజేయాలి. రాజధాని నగరంలో ఉన్నత విద్యావసతులు పెంచేందుకు ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు.
 3. నిర్ణీత స్థాయి వరకు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో స్థానికులకే ప్రాధాన్యం. ప్రమోషన్ల విషయంలో నిర్ణీత స్థాయి వరకు ఈ నిబంధన పాటించాలి.
 4. ఉద్యోగ నియామకాలు, సీనియారిటీ, ప్రమోషన్ వంటి విషయాల్లో ఉత్పన్నమయ్యే ఫిర్యాదులను పరిశీలించేందుకు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చే నిర్ణయాలను ప్రభుత్వం పాటించాలి.
 5. పైన వివరించిన సూత్రాలను పాటించడంలో ఎదురయ్యే న్యాయపరమైన చిక్కులను అనిశ్చిత పరిస్థితులను నివారించేందుకు రాజ్యాంగాన్ని సవరించాలి.
 6. పైన సూచించిన మార్గాన్ని అవలంబిస్తే ముల్కీ నిబంధనలు, తెలంగాణ ప్రాంతీయ కమిటీ కొనసాగింపు అనవసరమవుతాయి.

ఈ ఆరుసూత్రాల పథకాన్ని ఆంధ్రా, తెలంగాణ నేతలు అంగీకరించారు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమాలు తాత్కాలికంగా ఆగిపోయాయి.

కేసీఆర్ Image copyright kcr fans/facebook

2001: తెలుగు దేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆ పార్టీ శాసన సభ్యుడు కె.చంద్రశేఖర్ రావు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ తదితర మేధావులు కేసీఆర్‌కు మద్దతుగా నిలిచారు.

కేసీఆర్ Image copyright kcr fans/facebook

2009: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఆయన దీక్షకు తెలంగాణ వాదులు, విద్యార్థులు, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. తెలంగాణలో ఉద్యమం ఊపందుకుంది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి శ్రీకాంత చారి ఆత్మహత్య చేసుకున్నారు. కేసీఆర్ దీక్షతో తెలంగాణలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని డిసెంబర్ 9న కేంద్రం ప్రకటించింది.

జస్టిస్ శ్రీకృష్ణ Image copyright Bellur n.srikrishna/facebook

2010: తెలంగాణ ఏర్పాటుపై ఆంధ్ర ప్రాంతం నుంచి వ్యతిరేకత రావడంతో తెలంగాణ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రెండు ప్రాంతాలను సందర్శించి తన నివేదికలో ఆరు రకాల ప్రతిపాదనలు చేసింది. అవేమిటంటే...

 1. యథాతథ స్థితి కొనసాగింపు: రాష్ట్రాన్ని విభజించకుండా ఉమ్మడిగానే ఉంచాలి. దీనికి చిట్టచివరి ప్రాధాన్యం మాత్రమే ఇస్తున్నామని కమిటీ తెలిపింది.
 2. సీమాంధ్ర, తెలంగాణలుగా విభజించి, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం
 3. రాష్ట్రాన్ని రాయల తెలంగాణ, కోస్తాంధ్రలుగా విభజించడం
 4. సీమాంధ్ర, తెలంగాణలుగా విభజన-హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం
 5. సీమాంధ్ర, తెలంగాణగా విభజన
 6. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం-తెలంగాణకు ప్రాంతీయ మండలి ఏర్పాటు
మిలియన్ మార్చ్ Image copyright etelangana.org

2011, 2012 : శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇరుప్రాంతాలను సంతృప్తి పరచలేకపోయింది. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఏర్పడింది. వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు కలసి మిలియన్ మార్చ్, సాగర హారం, చలో అసెంబ్లీ, సకల జనుల సమ్మె తదితర రూపాల్లో నిరసనలు తెలుపుతూ ఉద్యమాలు చేశాయి.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ Image copyright www.inc.in

2013: హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. సీడబ్ల్యూసీ నిర్ణయానికనుగుణంగా తెలంగాణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

తెలంగాణ Image copyright i and pr telangana

2014: అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ జరిగింది. బిల్లును వ్యతిరేకిస్తూ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. కానీ, వివిధ పార్టీల మద్దతుతో రాజ్యసభ, లోక్‌సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. జూన్ 2న ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

కశ్మీర్ నుంచి లద్దాఖ్ ప్రజలు ఎందుకు విడిపోవాలనుకున్నారు? - లేహ్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్

కశ్మీర్: భారత్-పాక్ సరిహద్దు వెంబడి శత్రువుల తుపాకీ నీడలో దశాబ్దాలుగా పహారా

ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ల వివాదం... ఆ కెమేరాల వాడకంలోని నిబంధనలేంటి?

కేరళ వరదలు: 'మా వాళ్ళు ఏడుగురు చనిపోయారు.. నేను ఎక్కడికి పోవాలి...'

నడి సంద్రంలో తిండీ నీరూ లేక 14 మంది చనిపోయారు... ఒకే ఒక్కడు బతికాడు

అనంతపురం వైరల్ వీడియో: గ్రామ పెద్ద బాలికను కొట్టిన ఘటనలో ఏం జరిగింది

"డబ్బులిచ్చి ఉద్యోగులతో అబద్ధాలు చెప్పిస్తున్నారు" - అమెజాన్‌పై ట్విటర్‌లో విమర్శలు

శాండ్‌విచ్ ఆలస్యంగా తీసుకొచ్చాడని హత్య చేసేశాడు