ఎన్‌జీకే: ముఖ్యమంత్రయిన యువకుడి కథ - సినిమా రివ్యూ

  • 2 జూన్ 2019
ఎన్‌.జి.కె. Image copyright Selva raghavan/fb

తమిళ నటుడు సూర్య, దర్శకుడు సెల్వ రాఘవన్ కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ఎన్‌జీకే.

7/జీ బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, యుగానికొక్కడు లాంటి హిట్ సినిమాలు తీసిన సెల్వ రాఘవన్, తన విలక్షణ నటనతో టాలీవుడ్‌లోనూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పరుచుకున్న సూర్య, భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సాయిపల్లవి, గ్లామర్‌ గర్ల్ రకుల్ ప్రీత్ సింగ్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా అనగానే ప్రేక్షకుల్లో సహజంగానే అంచనాలు పెరిగిపోతాయి. మరి, ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకు అందుకుంది?

అసలు కథేంటీ?

రెండు తరాల క్రితం ఉన్న సామాజిక, రాజకీయ పరిస్థితులు ప్రస్తుత రాజకీయాలలో లేవు. యువతలో రాజకీయ సృహ బాగా పెరిగింది. ఆలోచనా పరిధులు విస్తరించాయి. కుటుంబాలు రూపాంతరం చెందాయి. ఈ మారుతున్న సామాజిక నేపథ్యంలో రాజకీయాల్లో ఏదో చేద్దామనే తపనతో అందులో అడుగుపెట్టే యువకుడి కథే ఎన్‌జీకే అలియాస్ నంద గోపాల కృష్ణ.

ఎన్విరాన్‌మెంట్ సైన్స్‌లో ఎంటెక్ చేసిన నంద గోపాలకృష్ణ (సూర్య) ఊళ్లో ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనుకుంటాడు. స్వతహాగా సోషల్ యాక్టివిస్ట్ అయిన ఎన్‌జీకేకు స్థానిక యువత మద్దతు ఉంటుంది. కానీ, వడ్డీ వ్యాపారులకు, దళారులకు ఆ విషయం నచ్చక బెదిరింపులకు పాల్పడతారు. ఆ సమస్య నుంచి గట్టెక్కడానికి స్థానిక ఎమ్మెల్యే సాయం కోరతాడు.

ఆ తరవాత ఎమ్మెల్యే ఏం చేస్తాడు? ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనుకున్న ఎన్‌జీకే రాజకీయాల వైపు ఎందుకు వెళ్తాడు? సాధారణ కార్యకర్త నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగే క్రమంలో వనిత(రకుల్ ప్రీత్ సింగ్) ఏ విధంగా సహకరించింది? అనుమానపు భార్య పాత్రలో గీతాకూమారి (సాయిపల్లవి) కథకు ఎంత వరకు అదనపు ప్రయోజనంగా నిలిచింది అన్నదే ఎన్‌జీకే సినిమా సారాంశం.

Image copyright Selva raghavan/fb

సహజత్వం కోల్పోయిన సూర్య

నంద గోపాలకృష్ణ పాత్రలో సూర్య తనను తాను బాగానే ఎలివేట్ చేసుకున్నాడు. అయితే పొలిటికల్ డ్రామాలో ఏ మాత్రం ఇమడలేకపోయాడు. ఫ్యామిలీ డ్రామా కూడా ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ భారీగానే ఉన్నా దర్శకుడు ఉపయోగించుకున్నట్లుగా అనిపించదు. స్లో నెరేషన్, ఏ మాత్రం పట్టులేని స్క్రీన్ ప్లేతో సూర్య నటన ఆకట్టుకోలేకపోయింది.

Image copyright Selva raghavan/fb

మిస్సైన 'రౌడీ బేబీ' పెర్ఫార్మెన్స్

రాజకీయ వ్యూహకర్త పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ గ్లామరస్‌గా, ట్రెండీగా కనిపించింది. సాయిపల్లవి తన పాత్రకు న్యాయం చేయలేదనే చెప్పాలి. అసలేమాత్రం స్కోప్ లేని పాత్రను సినిమాలో ఎందుకు పెట్టారో దర్శకుడికే తెలియాలి.

సాయిపల్లవి డ్యాన్స్, పెర్ఫార్మెన్స్ కోసం ఆశించి వచ్చిన ప్రేక్షకుడికి నిరాశే మిగిలింది. అసలు ఆమె లేకుండా రకుల్ ఒక్కదానితో సినిమా తీసినా సరిపోయేదనిపిస్తుంది.

సాంకేతిక విభాగం అంతంతమాత్రం

యువన్ శంకర్ రాజా సంగీతం ఆశించిన స్థాయిలో లేకున్నా సెకండాఫ్‌లో రకుల్, సూర్య జోడీగా వచ్చిన సిద్ శ్రీరాం పాట బాగుంది. స్క్రీన్ ప్లేలో లోపాలు కొట్టొచ్చినట్లు కనపడతాయి. సంఘటనలు ఒకదానితో ఒకటి కనెక్ట్ కాకుండా అస్తవ్యస్థంగా ఉండి ప్రేక్షకుడ్ని అయోమయానికి గురిచేస్తాయి. రాజకీయ వాతావరణం సృష్టించడంలోనూ దర్శకుడి ప్రతిభ కనపడదు.

Image copyright Selva raghavan/fb

ఆకట్టుకోలేకపోయిన పొలిటికల్ డ్రామా

చదువుకున్న వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఏదైనా సాధించగలడని చూపిస్తూనే.. రాజకీయాలలో ఎదగాలంటే అవమానాలు, ఎదురు దెబ్బలు తప్పవని ఎన్‌జీకే సినిమా ద్వారా దర్శకుడు చెప్పాలనుకున్నాడేమోనని అనిపిస్తుంది. అందుకు సూర్య లాంటి విషయమున్న హీరోను ఎంచుకున్నాడు.

అయితే దర్శకుడు తాను చెప్పదల్చుకున్న విషయం మీద కానీ ఎలా చెప్పాలనే దాని మీద కానీ స్పష్టతతో ఉన్నట్లు కనిపించదు. సినిమాల్లో రాజకీయాలను డీల్ చేసే చాలామంది పాపులర్ దర్శకుల్లాగే పైపై అవగాహనతో హడావుడి చేసినట్టు అనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)