లోక్‌సభ ఎన్నికలు 2019: ముస్లింలు ఈసారి బీజేపీకి ఓటేశారా

  • 2 జూన్ 2019
ముస్లిం యువతి, ముస్లిం మహిళలు Image copyright Getty Images

తాజా ఎన్నికల్లో బీజేపీ గెలిచినట్లుగా.. ఒక పార్టీ భారీ మెజార్టీ సాధించినప్పుడు, ఆ పార్టీకి అంతా అనుకూలంగా ఉందని, ఓడిన పార్టీకి ఏదీ కలిసిరాలేదని చాలామంది భావిస్తారు. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీల కూటమిని ఎదుర్కొని బీజేపీ మెజార్టీ సీట్లు సాధించడం ఆ వాదనకు మరింత బలం చేకూరింది.

ఉత్తరప్రదేశ్‌లో 2014 ఎన్నికల్లో బీజేపీ ఓట్ షేర్ 40 శాతం, 2019లో అది 49 శాతానికి పెరిగింది. ఈ ఎన్నికల్లో ముస్లింలలో చాలామంది ఓట్లు బీజేపీకే పడ్డాయని, ఆ పార్టీ భారీ విజయం సాధించడానికి అది కూడా ఒక కారణమని కొందరు బలంగా వాదిస్తున్నారు.

ముస్లింలలో పురుషులు బీజేపీకి ఓటు వేయకపోయినా, మహిళలు మాత్రం ఉత్తరప్రదేశ్ సహా చాలా రాష్ట్రాల్లో ఆ పార్టీకే ఓటు వేసి ఉంటారని చాలామంది అభిప్రాయం. అందుకు ప్రధాన కారణం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లు అని చెబుతారు. ఆ బిల్లును పార్లమెంటులో పాస్ చేయడం పట్ల ముస్లిం మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారని అంటారు.

ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ ఓట్ల శాతం ఎక్కువగా ఉండటం ఈ వాదనకు మరింత బలాన్నిస్తోంది.

ముస్లింల ఓట్లు 10 శాతానికి లోపు ఉన్న లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీకి పోలైన ఓట్లు 34.9 శాతం కాగా... ముస్లింల ఓట్లు 10 నుంచి 20 శాతం ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ ఓటు షేర్ 39.2 శాతంగా ఉంది.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... ముస్లింల ఓట్లు 20 నుంచి 40 శాతం ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ ఓటు షేర్ అదే స్థాయిలో 43.8 శాతానికి పెరిగింది.

Image copyright AFP
కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేసిన ముస్లింల శాతంలో మార్పు
ముస్లిం జనాభా కాంగ్రెస్ ఓటు షేర్ 2014తో పోల్చితే బీజేపీ ఓటు షేర్ 2014తో పోల్చితే
10 శాతం లోపు 22.1% -0.4% 34.9% +5.0%
10- 19.9 శాతం 16.5% -0.5% 39.2% +5.3%
20- 40 శాతం 16.2% +1.6% 43.8% +8.1%
ఆధారం: CSDS Data Unit

పైన పేర్కొన్న లెక్కలు చూస్తుంటే ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ముస్లింలు బీజేపీ వైపు మొగ్గు చూపడం వల్లే ఆ పార్టీ ఓటు షేర్ పెరిందని చాలామంది ఒక అంచనాకు వచ్చేస్తారు.

అయితే, ట్రిపుల్ తలాక్ బిల్లు కారణంగా బీజేపీ పట్ల ముస్లిం మహిళలు సానుకూలంగా ఉండటం నిజమే కావొచ్చు, కానీ... బీజేపీకి గత ఎన్నికలతో పోల్చితే ఈసారి ముస్లింల ఓట్ షేర్ పెద్దగా పెరిగినట్లు కనిపించడంలేదని సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్‌డీఎస్) నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వే చెబుతోంది.

1996 నుంచి (2009 మినహా) 2014 వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 7 నుంచి 8 శాతం మంది ముస్లింలు ఓటు వేశారని పోస్ట్‌ పోల్ సర్వే అంచనాలు చెబుతున్నాయి. 2009లో 4 శాతం ముస్లింలు మాత్రమే ఆ పార్టీకి ఓటు వేశారు.

Image copyright Getty Images

సీఎస్‌డీఎస్ సర్వే ప్రకారం, దేశవ్యాప్తంగా చూస్తే 2014 ఎన్నికల్లో బీజేపీతో పోల్చితే కాంగ్రెస్‌కు ముస్లింల మద్దతు అధికంగా ఉంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వారి మద్దతు తగ్గింది, బీజేపీకి అలాగే ఉంది. దేశవ్యాప్తంగా బీజేపీకి 8 శాతం, కాంగ్రెస్‌కు 33 శాతం మంది ముస్లింలు ఓటు వేశారని అంచనా. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల వైపే ముస్లింలు మొగ్గు చూపారు.

2004 నుంచి 2019 వరకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పొందిన ముస్లిం ఓట్ల శాతం
పార్టీ 2004 2009 2014 2019
కాంగ్రెస్ 36% 38% 38% 33%
బీజేపీ 7% 4% 8% 8%

ముస్లిం మహిళల్లో ఎక్కువ మంది బీజేపీకి ఓటు వేశారని చెప్పడం వాస్తవం కాదేమో అనిపిస్తోంది. ఎందుకంటే, సీఎస్‌డీఎస్ పోస్ట్ పోల్ సర్వే డేటా ప్రకారం, తాజా ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసిన ముస్లిం పురుషులు, మహిళల సంఖ్యలో పెద్దగా వ్యత్యాసం లేదు.

గ్రామాలు, చిన్న పట్టణాలు, నగరాల వారీగా మాత్రమే ముస్లింల ఓటింగ్ సరళిలో కొద్దిగా మార్పు కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాలు మినహా చాలావరకు పట్టణ ప్రాంతాల్లో ముస్లింలు ఎక్కువగా కాంగ్రెస్‌, బీజేపీలకు ఓటు వేశారు, ప్రాంతీయ పార్టీల వైపు పెద్దగా ఆసక్తి చూపలేదు.

అయితే, దేశవ్యాప్తంగా బీజేపీ వైపు ముస్లింలు మొగ్గు చూపినట్లు కనిపించకున్నా, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం అక్కడి రాజకీయాల్లో భాగంగా కొంత మార్పు కనిపించింది. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో తప్పించి... బీజేపీ, కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోరు నడిచిన రాష్ట్రాల్లో ఎక్కువ మంది ముస్లింలు బీజేపీకి మద్దతుగా నిలిచారు.

Image copyright Getty Images

రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో 15 నుంచి 20 శాతం మంది ముస్లింలు బీజేపీకి ఓటు వేశారు. అయితే, ఇది కొత్తేమీ కాదు. గతంలోనూ ద్విముఖ పోటీ ఉన్న రాష్ట్రాల్లో బీజేపీకి ముస్లింల మద్దతు ఎక్కువగానే ఉండేది, ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట తక్కువగా పడేది.

ముస్లింలలో ఎవరు ఏ పార్టీకి ఓటు వేశారు?
కాంగ్రెస్ కాంగ్రెస్ మిత్రపక్షాలు బీజేపీ బీజేపీ మిత్రపక్షాలు
పురుషులు 32 12 8 1
మహిళలు 33 13 8 1
గ్రామీణ ప్రాంతాలు 30 15 7 1
పట్టణ ప్రాంతాలు 40 7 12 1
యువత (25 ఏళ్ల లోపు) 32 11 7 1
పెద్దలు (56 ఏళ్లకు పైబడినవారు) 33 14 11 1
పేదలు 30 10 8 1
మధ్య తరగతి ప్రజలు 31 17 10 1
ఎగువ తరగతి ప్రజలు 32 10 8 1
ఆధారం: CSDS Data Unit (అన్ని అంకెలూ శాతాల్లో)
రాష్ట్రాల వారీగా ముస్లింలు ఏ పార్టీకి ఎంత శాతం మంది ఓటు వేశారు?
రాష్ట్రం రాష్ట్రంలో ముస్లింల జనాభా శాతం కాంగ్రెస్ కాంగ్రెస్ మిత్రపక్షాలు బీజేపీ బీజేపీ మిత్రపక్షాలు ఇతర పార్టీలకు గమనిక
ఆంధ్రప్రదేశ్ 9 3 .. 0 .. 97 టీడీపీ- 40, వైసీపీ- 47
తెలంగాణ 13 42 .. 2 .. 56 (టీఆర్‌ఎస్- 43, ఇతర పార్టీలకు 13)
గుజరాత్ 9 70 .. 25 .. 5
మధ్యప్రదేశ్ 6 67 .. 33 .. 0
రాజస్థాన్ 8 78 .. 19 .. 3
కర్ణాటక 12 73 .. 18 .. 9 (కాంగ్రెస్+ జేడీఎస్)
ఒడిశా 2 22 .. 14 .. 64
అస్సాం 31 70 .. 7 .. 23 (AIUDF)
బిహార్ 17 33 44 4 2 17
మహారాష్ట్ర 11 56 30 9 4 1
తమిళనాడు 6 25 47 1 12 15
పంజాబ్ 2 60 .. 0 0 40 (ఆమ్ ఆద్మీ పార్టీ)
పశ్చిమ బంగా 25 12 .. 4 .. 84 టీఎంసీ- 70, వామపక్షాలు- 10, ఇతరులు- 4
ఉత్తరప్రదేశ్ 19 15 .. 8 .. 77 (ఎస్పీ, బీఎస్పీ కూటమికి- 74, ఇతరులకు- 3)
ఝార్ఖండ్ 14 36 42 11 .. 11
కేరళ 25 65 .. 2 .. 32 (యూడీఎఫ్-65, ఎల్‌డీఎఫ్- 28, ఇతరులకు-4)
ఆధారం: CSDS Data Unit (అన్ని అంకెలూ శాతాల్లో)

*ప్రొఫెసర్ సంజయ్ కుమార్ ప్రస్తుతం సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్‌డీఎస్)కు డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ కథనంలో వ్యక్తపరిచిన అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం