ఆంధ్రప్రదేశ్‌లో ఓటుకు రూ. 2,000.. దేశంలో ఒక్కో లోక్‌సభ స్థానంలో రూ. 100 కోట్ల వ్యయం - సీఎంఎస్ అంచనా

  • 4 జూన్ 2019
ఎన్నికల వ్యయం Image copyright Getty Images

ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం అత్యంత భారీగా డబ్బు వెచ్చించారని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) విశ్లేషణ నివేదిక పేర్కొంది.

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు ఏకంగా రూ. 60,000 కోట్లు ఖర్చయిందని ఆ నివేదిక అంచనా వేసింది. ఇది 2014 లోక్‌సభ ఎన్నికల అంచనా వ్యయం రూ. 30,000 కోట్ల కన్నా రెట్టింపు అని చెప్పింది.

మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో ఒక్కో స్థానానికి సగటున దాదాపు రూ. 100 కోట్లు చొప్పున ఖర్చు పెట్టారని విశ్లేషించింది. మొత్తం మీద ఒక్కో ఓటుకు సగటున రూ. 700 చొప్పున వ్యయం చేసినట్లు అంచనా వేసింది.

ఎన్నికల వ్యయంపై అంచనా నివేదికను సీఎంఎస్ సోమవారం దిల్లీలో విడుదల చేసింది. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎస్.వై.ఖురేషి దీనికి ముందుమాట రాశారు.

Image copyright ECI

ఏపీలో నాలుగు జిల్లాల్లో సగం మంది ఓటర్లకు డబ్బు పంపిణీ

‘‘ఈ ఏడాది ఎన్నికల ఆరంభంలో భారత ఎన్నికల కమిషన్ దినపత్రికల్లో వరుస అడ్వర్టైజ్‌మెంట్లు జారీ చేసింది. 'నా ఓటు అమ్మకానికి లేదు' అని చైతన్యం పరచడం ఆ ప్రకటనల లక్ష్యం. అలా ఓటును అమ్మటం ప్రజాస్వామ్యాన్ని వంచించటమేనని, అది జైలుశిక్ష విధించగల నేరమని పేర్కొంది. కానీ.. ఆ ప్రకటనను ఆచరణలో చూపించటానికి సరైన చర్యలు చేపట్టలేదు’’ అని సీఎంఎస్ పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌లో అయితే.. లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల కోసం కూడా ఓటర్లకు నేరుగా డబ్బులు పంపిణీ చేశారని తమ అధ్యయనంలో వెల్లడైనట్లు సీఎంఎస్ వివరించింది.

ముఖ్యంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు - నాలుగు జిల్లాల్లో సగటున సగం మంది పైగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారని చెప్పింది. ఈ జిల్లాల్లో ఓటుకు రూ. 1,000 నుంచి రూ. 2,000 వరకూ చెల్లించినట్లు తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో నగదు పంపిణీ అంచనాలు...
జిల్లా అసెంబ్లీ స్థానాలు నగదు అందుకున్న క్రియాశీల ఓటర్ల శాతం ఒక్కో ఓటుకు పంచిన మొత్తం (రూ.)
శ్రీకాకుళం 10 60 500 - 1,000
విజయనగరం 9 40 500 - 1,500
విశాఖపట్నం 15 40 1,000 - 1,500
పశ్చిమ గోదావరి 19 45 1,000 - 2,000
తూర్పు గోదావరి 15 60 1,500 - 2,000
కృష్ణా 16 60 1,500 - 3,500
గుంటూరు 17 60 2,000 - 4,000
ప్రకాశం 12 65 1,000 - 4,000
నెల్లూరు 10 45 1,500 - 3,000
చిత్తూరు 14 50 1,000 - 2,000
కర్నూలు 14 50 1,000 - 3,000
అనంతపురం 14 50 1,000 - 1,500
కడప 10 60 1,500 - 3,000

2019 ఎన్నికల వ్యయం మీద సీఎంఎస్ నివేదికలోని ముఖ్యాంశాలివీ...

ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో దాదాపు సగం (75 - 80) స్థానాల్లో నేరుగా గానీ, మధ్యవర్తుల ద్వారా గానీ డబ్బులు పంపిణీ చేశారు. ఆయా స్థానాల్లో దాదాపు లక్ష మంది ఓటర్లు ఉన్నారు.

ఈ ఓటర్లలో సుమారు 20,000 నుంచి 25,000 మంది ఓటర్లకు కనీసం రెండు పార్టీలు, అభ్యర్థుల నుంచి (టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్) డబ్బులు అందాయి. కొన్ని నియోజకవర్గాల్లో ముగ్గురు అభ్యర్థులు డబ్బులు పంపిణీ చేశారు.

ఓటర్లకు ఎంత డబ్బులు ఇస్తున్నారు, వివిధ పార్టీలు ఎంత మంది ఓటర్లకు డబ్బులు పంచుతున్నాయనే అంశాల గురించి కొందరు రాజకీయ నాయకులు బహిరంగంగానే మాట్లాడారు, టీవీ చానళ్లు వార్తలు ప్రసారం చేశాయి.

రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన వారం రోజుల తర్వాత ఒక ఎంపీ ఏపీ రాజధానిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలవటానికి ఒక్కో అభ్యర్థి రూ. 50 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్పారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో రూ. 10,000 కోట్లు ఖర్చు పెట్టినట్లు చెప్పారు. (2019 ఏప్రిల్ 21వ తేదీ నాటి ద హిందూ, ద హిందుస్తాన్ టైమ్స్ దినపత్రికలను సీఎంఎస్ ఉటంకించింది.)

ఎన్నికల వ్యయంలో ఎవరి వాటా ఎంత?
అభ్యర్థులు 40 శాతం 24,000 కోట్లు
రాజకీయ పార్టీ 35 శాతం 20,000 కోట్లు
ఈసీఐ-ప్రభుత్వం 15 శాతం 10,000 కోట్లు
మీడియా, స్పాన్సర్లు 5 శాతం 3,000 కోట్లు
ఇతరులు, పరిశ్రమ 5 శాతం 3,000 కోట్లు
మొత్తం 100 శాతం 60,000 కోట్లు

ఒక్కో ఓటుకు రూ. 2,000 చొప్పున ఇచ్చినట్లు కూడా సదరు ఎంపీ చెప్పుకొచ్చారు. ఈసీ అధికారుల తనిఖీలను తప్పించుకుంటూ పెద్ద మొత్తంలో నగదును రాత్రికి రాత్రి తరలించటానికి బ్యాంకులకు చెందిన క్యాష్ క్యారీయింగ్ వాన్లను ఉపయోగించుకున్నట్లు కూడా చెప్తున్నారు.

ఒకవేళ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను వేర్వేరుగా కొంత కాలం విరామంతో నిర్వహించినట్లయితే.. ఎన్నికల వ్యయం మరో పావు వంతుకు పైగా పెరిగేది. అంటే ఎన్నికలు వేర్వేరుగా జరిగి ఉంటే మొత్తం రూ. 14,000 కోట్లు ఖర్చయి ఉండేది.

కొందరు అభ్యర్థులు పార్టీ నామినేషన్ పొందటం కోసం పార్టీకి చెల్లించిన డబ్బులను ఈ ఖర్చులో లెక్కించలేదు.

రాష్ట్రంలో ఎన్నికల సమయంలో మొత్తంగా రూ. 120 కోట్ల నగదును, రూ. 12 కోట్ల విలువైన మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

2019 ఎన్నికల వ్యయం - ఒక విశ్లేషణ
నేరుగా ఓటరుకు 20-25 శాతం 12,000 - 15,000 కోట్లు
ప్రచారం 30-35 శాతం 20,000 - 25,000 కోట్లు
సదుపాయాలు 8-10 శాతం 5,000 - 6,000 కోట్లు
ఈసీఐ 15-20 శాతం 10,000 - 12,000 కోట్లు
ఇతరత్రా 5-10 శాతం 3,000 - 6,000 కోట్లు
మొత్తం 100 శాతం 55,000 - 60,000 కోట్లు

రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో ఓటుకు సగటున రూ. 2,000 అంతకన్నా ఎక్కువ మొత్తం చెల్లించారు.

నిజానికి ఓట్ల కోసం ఎంత డబ్బులు మోహరించాలన్నది నిర్ణయించింది సరఫరా - డిమాండ్ నమూనానే కానీ.. ఓటరు డిమాండ్ కాదు.

ఓట్ల కోసం ఎంత పంపిణీ చేయాలన్నది.. అభ్యర్థుల మధ్య పోటీ మీద ఆధారపడి నిర్ణయమైంది. ఇలా పంపిణీ చేసిన డబ్బులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, నియోజకవర్గాల్లోనే కాదు.. ఒకే నియోజకవర్గంలోనూ ఏకరీతిగా లేవు.

ఏ సామాజిక వర్గం వారున్నారు, ఎన్ని ఓట్లు ఉన్నాయి, పోలింగ్ ఎప్పుడు జరుగుతుంది అనే అంశాల ఆధారంగా ఈ మొత్తం మారింది.

ఉదాహరణకు గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక చోట ఒక ఓటరుకు రూ. 2,000 చెల్లిస్తే.. మరొక చోట మరొక ఓటరుకు రూ. 7,000 చెల్లించారు. వేరే పార్టీ సిటింగ్ అభ్యర్థి ఓటుకు రూ. 1,000 నుంచి రూ. 5,000 మధ్య చెల్లించారు. ఈ ఎన్నికల్లో ఓట్ల రేటును పెంచటానికి దోహదపడిన కొత్త పోకడ.. 'పోటీ అనివార్యత'.

1998 నుంచి 2019 వరకూ ఎన్నికల వ్యయాల అంచనాలు ఇవీ...
సంవత్సరం మొత్తం వ్యయం (రూ. కోట్లలో) ఈసీఐ వ్యయం శాతం కాంగ్రెస్+ వ్యయం శాతం బీజేపీ+ వ్యయం శాతం
1998 9,000 13 30 20
1999 10,000 10 31 - 40 25
2004 14,000 10 35 - 45 30
2009 20,000 12 40 - 45 35 - 40
2014 30,000 12 30 - 32 40 - 45
2019* 55,000 15 15 - 20 45 - 55

సీఎంఎస్ ఇంకా ఏం చెప్పిందంటే...

2019లో ఓటర్ల సంఖ్య 90.2 కోట్లకు పెరిగింది. పోలింగ్ బూత్‌ల సంఖ్య 10 లక్షలు దాటింది. కానీ మొత్తంగా పోలింగ్ శాతం అతి స్వల్పంగానే పెరిగింది. ఎస్సీ, ఎస్టీ సీట్ల సంఖ్య పెరగలేదు. మహిళా అభ్యర్థులు పోటీ చేసిన సీట్ల సంఖ్యలో పెద్దగా మార్పు లేదు. అయితే.. పశ్చిమబెంగాల్, ఒడిశాలలో అధికార పార్టీలు తమ పార్టీ అభ్యర్థుల్లో సుమారు 15 శాతం మహిళా ప్రాతినిధ్యం ఉండేలా చర్యలు తీసుకున్నాయి.

ఎన్నికల ప్రక్రియ 75 రోజులకు పైగా విస్తరించింది. పోలింగ్ ఏడు దశల్లో జరిగింది. నిజానికి అధికారిక నోటిఫికేషన్ విడుదలకు కొన్ని వారాల ముందే ఎన్నికల ప్రచారం తీవ్ర రూపం దాల్చింది.

ఒక్కో సీటుకు పోటీచేసిన అభ్యర్థుల సగటు సంఖ్య సుమారు 15గా ఉంది. వారిలో ఎక్కువ మంది డమ్మీ అభ్యర్థులు లేదంటే నిరసనగా పోటీ చేసిన వారే. 2019 ఎన్నికల్లో కూడా కోటీశ్వరులైన అభ్యర్థులు, నేర చరిత్ర ఉన్న అభ్యర్థులు ప్రధానంగా కొనసాగారు.

అభ్యర్థులు, నాయకులు, పార్టీలు, చివరికి న్యూస్ మీడియా సైతం.. ఎన్నికల సంఘం నిర్దేశించిన ఎన్నికల నియమావళిని ఇంతగా ఉల్లంఘించిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవు. వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలన్నంతగా ఈ ఎన్నికల్లో తలపడ్డారు.

ప్రచారం సందర్భంగా ప్రచారకర్తలు, మీడియా కూడా ఓటర్లను ప్రలోభపెట్టటానికి డబ్బులు ఖర్చు పెడుతుండటాన్ని ఉటంకించాయి. డబ్బు, బంగారం, వెండి, మద్యం వంటివి రవాణా జరుగుతుండగా అధికారులు స్వాధీనం చేసుకున్న ఉదంతాలను న్యూస్ చానళ్లు పదేపదే చూపించాయి.

ఇలా స్వాధీనం చేసుకున్న నగదు తదితరాల విలువ 2014 ఎన్నికల్లో స్వాధీనం చేసుకున్నవాటికి రెట్టింపు కన్నా ఎక్కువగా ఉంది.

Image copyright HINDUSTAN TIMES

మధ్యవర్తులు, నాయకులకు తాయిలాలు

ఇంతకుముందు సీఎంఎస్ క్షేత్రస్థాయి అధ్యయనాలతో పోలిస్తే.. ఎక్కువ మంది ఓటర్లు తమకు ఓట్ల కోసం డబ్బులు ముట్టాయని చెప్పారు.

ఈసారి ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో 15 శాతం నుంచి 40 శాతం మంది ఓటర్లకు ఓట్ల కోసం నగదు పంపిణీ చేశారు.

100 - 120 లోక్‌సభ నియోజవర్గాల్లో 'మధ్యవర్తులు, నాయకుల'ను తమవైపు తిప్పుకోవటానికి ప్రలోభాలు, ప్రోత్సాహకాలు అందించటం గణనీయంగా జరిగాయి.

ఓటర్లలో 10 నుంచి 12 శాతం మంది తమకు 'నేరుగా' నగదు అందిందని అంగీకరించారు. తమ చుట్టూ ఉన్న వారికి కూడా ఓటుకు నోటు ముట్టిందని మూడింట రెండు వంతుల మంది చెప్పారు.

Image copyright TDP

మొట్టమొదటిసారి.. నేరుగా నగదు బదిలీ...

ఈ ఎన్నికలతో మొట్టమొదటిసారిగా.. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టటానికి వివిధ పథకాల పేరుతో డబ్బులు 'బ్యాంకు ఖాతాలకు బదిలీ' చేయటం కొత్త మార్గంగా ముందుకొచ్చింది.

పలు పథకాలకు ఎన్నికల ప్రక్రియకు ముందు రూపకల్పన చేయగా.. అంతకన్నా ముందే ప్రకటించిన కొన్ని పథకాల ప్రయోజనాలు కూడా సరిగ్గా ఎన్నికల సమయంలో ప్రజలకు - ముఖ్యంగా మహిళా స్వయం సహాయక బృందాలు, రైతులు, వృద్ధులు వంటి కీలక వర్గాల వారికి అందేలా చేశారు.

సర్వే చేసిన ఓటర్లలో నాలుగో వంతు మంది.. ఎన్నికల నెలలో తమ వర్గం వారిలో ఎవరో ఒకరికి నగదు బదిలీ జరిగిందని లేదా జరిగినట్లు సమాచారం వచ్చిందని బదులిచ్చారు. దాదాపు ఆరో వంతు మంది తమ బ్యాంకు ఖాతాకు నేరుగా నగదు జమ అయిందని చెప్పారు. అయితే.. తమ బ్యాంకు ఖాతాలోకి ఎవరు, ఏ పథకం కింద డబ్బులు జమ చేశారన్నది తెలియదన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం తీసుకున్న రెండు నిర్ణయాలు ఈ తరహావే. జాతీయ స్థాయిలో కూడా అధికార పార్టీ రైతులకు నగదు బదిలీ చేయాలన్న నిర్ణయం కూడా ఈ కోవలోకే వస్తుంది.

ఎన్నికల సమయంలో నగదు బదిలీ అయిన పథకాల్లో డ్వాక్రా, రైతుబంధు, వ్యవసాయం, వరద సాయం, సమాజ్ కల్యాణ్ విభాగం వంటి పేర్లు ఓటర్లు ఉటంకించారు.

ఉదాహరణకు.. తెలుగుదేశం పార్టీ రూ. 10,000 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ నుంచి రూ. 1,000 కోట్లు అందాయని, బీజేపీ నుంచి రూ. 500 కోట్లు ముట్టాయని ఆరోపణలు చేశారు.


విశ్లేషణ మెథడాలజీ...

2019 ఎన్నికల వ్యయం అంచనాకు అనుసరించిన పద్ధతిలో వివిధ స్థాయుల్లో గత, ప్రస్తుత పోకడలను విశ్లేషించామని.. ఇందులో ఆరు కీలక అంశాలను స్వీకరించామని సీఎంఎస్ నివేదిక చెప్పింది.

  1. పార్టీలు, అభ్యర్థుల ప్రచార కార్యకలాపాలు
  2. ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో ఓటర్ల పరిశీలన
  3. స్వతంత్ర పరిశీలకులు, పార్టీ క్రియాశీల కార్యకర్తలతో నాణ్యమైన చర్చ
  4. అభ్యర్థులు, నియోజకవర్గాల ప్రొఫైల్ విశ్లేషణ, నియోజకవర్గ అభివృద్ధి ప్రొఫైల్ విశ్లేషణ
  5. పోటీ, ప్రచారం, వ్యయానికి సంబంధించిన కార్యకలాపాలపై మీడియా కథనాలు
  6. ప్రజా సమూహాల్లో కులం సహా వివిధ విభజనలకు సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారం, గత సీఎంఎస్ పోల్ అధ్యయనాలు

‘‘ఎన్నికల సంఘం ‘వ్యయ పరిశీలకుల’ సంఖ్యను ఈసారి పెంచింది. పైగా వారిలో చాలా మంది ఆదాయ పన్ను శాఖ, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అధికారులే ఉన్నారు. కానీ ఓట్లకు నోట్లు పంపిణీ విషయంలో తేడా ఏమీ లేదు’’ అని సీఎంఎస్ వ్యాఖ్యానించింది.

ఈసీ అధికారాలపై స్పష్టత లేకపోవటం ఒక ప్రధాన లోపమని అభిప్రాయపడింది. ఎన్నికల ప్రచార వ్యయం, ఎన్నికల నిధుల సమీకరణపై జాతీయ స్థాయి చర్చ జరిపి పార్లమెంటులో చర్చించాల్సిన సమయం ఆసన్నమైందని సూచించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు