సొంత ఊళ్లకు వెళ్లాలంటే భయపడుతున్నారు

  • 6 జూన్ 2019
మరాఠ్వాడాలో కరవు Image copyright Getty Images

మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతం ప్రతి వేసవిలోనూ తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. ఈ ఏడాది కూడా రుతుపవనాలు బలహీనంగా ఉండొచ్చన్న అంచనాల మధ్య ఇక్కడి చాలా గ్రామాలు ఇప్పటికే కరవుతో విలవిలలాడుతున్నాయి.

అలాగే, పశ్చిమ మహారాష్ట్రలో నీటి వసతి మెరుగ్గా ఉండే ప్రాంతాల్లో చెరకు తోటల్లో పని చేసేందుకు మరాఠ్వాడా నుంచి చాలా మంది కూలీలు ప్రతి ఏటా వలస వెళ్తుంటారు. సాధారణంగా వీరు పనులు పూర్తి కాగానే ఏప్రిల్‌లో తమ తమ గ్రామాలకు తిరిగి వెళ్తుంటారు. కానీ ఈసారి మాత్రం తమ స్వస్థలాల్లో నెలకొన్న నీటి కొరతకు భయపడి ఇక్కడి చెరకు తోటల్లోనే ఉండిపోతున్నారు.

బీబీసీ ప్రతినిధి రాహుల్ రణ్‌సుభే అందిస్తున్న వీడియో కథనం...

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: మహారాష్ట్ర కరవు కష్టాలు

''1972 నాటి కరవు చాలా తీవ్రమైంది. మేం దాన్ని ఎదుర్కొన్నాం. ఇప్పడూ మేం కరవులోనే కొట్టుమిట్టాడుతున్నాం. ఈసారి పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది'' అని భివారాబాయి గంగే అనే మహిళ అన్నారు.

బారామతిలోని చెక్కెర కర్మాగారాల పని సీజన్‌ ముగిసింది. అయితే చెరకు కోత పనుల కోసం ఇక్కడికి వచ్చిన కూలీలు మాత్రం ఇంకా వెనక్కి వెళ్లలేదు. మరాఠ్వాడాలో నెలకొన్న తీవ్రమైన కరవు కారణంగా వీరు తమ స్వస్థలాలకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు.

''70 ఏళ్లుగా మేం ఇక్కడికి వస్తున్నాం. మాది బీడ్ జిల్లా ఆష్టీ తాలూకాలోని గాంగేవాడి గ్రామం. మా పిల్లలను కలవడానికి నేనిక్కడికి వచ్చాను. గతంలో నేను కూడా చెరకు కోత పనులకు వచ్చేదాన్ని. అదే పని ఇప్పుడు నా పిల్లలు చేస్తున్నారు. ఏం చెయ్యాలి? మేం పేదవాళ్లం. మాకున్న భూమి చాలా తక్కువ. నీటి సదుపాయం లేదు. ఈసారి మేం ఘోరమైన కరవును చవి చూస్తున్నాం'' అని వలస వచ్చిన తన పిల్లలను చూడటానికి బారామతి వచ్చిన భివారాబాయి గంగే అన్నారు.

చిత్రం శీర్షిక ‘గత 70 ఏళ్లుగా మేం ఇక్కడికి వస్తున్నాం. గతంలో నేను కూడా చెరకు కోత పనులకు వచ్చేదాన్ని. అదే పని ఇప్పుడు నా పిల్లలు చేస్తున్నారు’

చెరకు తోటల్లో అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు కోత పనులు జరుగుతుంటాయి. ఈ సీజన్‌లో సోమేశ్వర్ చెక్కర ఫ్యాక్టరీలో పని చేసేందుకు చాలామంది కూలీలు ఇక్కడికి వస్తుంటారు. అలా వచ్చిన వారిలో దత్తు పైసల్ కూడా ఒకరు.

''వెనక్కి వెళ్తే తీవ్రమైన నీటి కొరత కాబట్టి మేం ఇక్కడే ఉండిపోవాల్సి వస్తోంది. వర్షాలు పడితే మేం మా స్వస్థలానికి వెళ్లిపోయేవాళ్లం. ఇప్పడు అక్కడ ఎంత కరవు నెలకొని ఉందటే.. అసలు చెట్లపై ఆకులనేవే లేవు. వారానికి ఒక్కసారి వాటర్ ట్యాంకులొస్తాయి. ఆ నీరు మాకు వారం రోజులకు ఏ మాత్రం సరిపోదు. ఇక్కడున్న కాలువలో కొద్దిగా నీళ్లు పారుతున్నాయి. దాంతో మేం ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాం'' అని దత్తు చెప్పారు.

చిత్రం శీర్షిక వలస కూలీలు పనులు పూర్తయ్యాక కూడా కరవుకు భయపడి, తమ స్వగ్రామాలకు వెళ్లడం లేదు

మరాఠ్వాడా నుంచి పశ్చిమ మహారాష్ట్రకు పెద్ద సంఖ్యలో కూలీలు వలస వస్తుంటారు. వీరిలో బీడ్ జిల్లానుంచి వచ్చే వారి సంఖ్యే ఎక్కువ.

''1972 అంటే అప్పటికి మా పిల్లలు చాలా చిన్నవాళ్లు. మేం అప్పుడు ఎన్నో బాధలు పడ్డాం. మట్టిలో పని చేస్తూ ప్రభుత్వం వాళ్లు అందించిన ఆహారంతో ప్రాణాలు నిలుపుకున్నాం. అవి భయంకరమైన రోజులు. ఈ ఏడాది మేం జొన్న పంట వేశాం. కానీ అది ఎండిపోయింది. అటు పంట చేతికి రాక, ఇటు నీళ్లు లేక.. ఎలా బతకాలో దిక్కుతోచడం లేదు'' అని భివారాబాయి గంగే ఆందోళన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు