ఆంధ్రా సరిహద్దులో అరుదైన ఆదివాసీ తెగ.. మహిళలదే అధికారం.. పెళ్లికి ముందు సెక్స్‌కు పట్టింపుల్లేవు

  • 11 జూన్ 2019
రీనో, బోండా

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో నివసించే రీనో ఆదివాసీ తెగకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వారి ఆచారాలు, అలవాట్లు, నమ్మకాలు చాలా విభిన్నం.

ప్రధాన స్రవంతిలోని ప్రజలు రీనోలను 'బోండాలు’ అని పిలుస్తుంటారు. సాధారణ వ్యవహారంలో 'బోండా' అంటే 'బండోడు' అనే అర్థం ఉంది.

ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లాలో రీనోలు ఎక్కువగా ఉంటారు. వీరు మాట్లాడే భాష బోండీ.

మల్కన్ గిరిలోని ఒనకడిల్లీలో ప్రతి గురువారం జరిగే సంతకు వచ్చి తమ దగ్గరున్న కొండ చీపుర్లను, ఇతర వస్తువులను అమ్ముకొని, కావాల్సిన వస్తువులను కొనుక్కుంటారు. వీరి వేషధారణ, ఆచార వ్యవహారాల గురించి తెలుసుకొనేందుకు పర్యాటకులు ఒనకడిల్లీ సంతకు వస్తుంటారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: రీనో ఆదివాసీ తెగలో మహిళలదే అధికారం

రీనోల జీవన విధానం గురించి తెలుసుకోవడానికి వీరు నివసించే కతం గూడ గ్రామాన్ని, ఒనకడిల్లీ సంతను బీబీసీ బృందం సందర్శించింది.

ఈ తెగ జనాభా సుమారు 10 వేలు. ప్రపంచంలోనే అరుదైన ఆదివాసీ తెగల్లో ఇది ఒకటని ఆంత్రోపాలజిస్టులు చెబుతున్నారు.

రీనో ప్రజలు ఫొటోలు దిగడానికి ఇష్టపడరు. ఫొటో రూపంలో తమ ఆత్మ నుంచి కొంత భాగం వెళ్లిపోతుందని వీరి విశ్వాసం. అందుకే తమతో ఫొటో దిగాలని పర్యాటకులు కోరితే వీరు డబ్బులు అడుగుతారు. ఈ డబ్బుతో సంతలో జీలుగకల్లు కొనుక్కొని తాగి విశ్రాంతి తీసుకుంటారు. ఇలా చేస్తే తాము కోల్పోయిన శక్తి తిరిగి వస్తుందని వీరి భావన.

భిన్నమైన వేషధారణ

రీనో మహిళలైనా, పురుషులైనా ఆయుధాలు ధరిస్తారు.

యుక్త వయసు రాగానే మహిళలు గుండు చేయించుకుంటారు. గుండు కనిపించకుండా పూసలదండలను ఆభరణాలుగా అలంకరించుకుంటారు.

ఒళ్లంతా పూసలదండలు ధరించి కేవలం నడుం వద్ద 'రింగ్ డా' అనే పట్టీ ధరిస్తారు. మెడ చుట్టూ అల్యూమినియం, వెండితో చేసిన రింగులను పెట్టుకుంటారు. చేతుల నిండా లోహపు గాజులను వేసుకుంటారు.

వనవాస సమయంలో సీత రీనో ప్రజలు నివాసమున్న ప్రాంతంలో నగ్నంగా ఒక సరస్సులో స్నానం చేశారని, అప్పుడు రీనో మహిళలు ఆమెను చూసి నవ్వారని, ఆమె ఆగ్రహంతో ఆ మహిళలు వస్త్రాలు ధరించకుండా ఉండేలా శాపం పెట్టారని స్థానికులు నమ్ముతుంటారు.

ఆ మహిళలు సీతను ప్రాధేయపడగా, ఆమె తన చీరలోంచి చిన్న వస్త్రం చించి ఆ మహిళలకు ఇచ్చారని వారు అంటారు. అప్పట్నుంచి రీనో తెగ మహిళలు అందరూ గుండు చేయించుకోవడంతోపాటు పూసలతో శరీరాన్ని కప్పుకొంటున్నారని వివరిస్తుంటారు.

ఈ విషయం గురించి రీనో తెగకు చెందిన సిసా అనే మహిళ మాట్లాడుతూ.. "చిన్నప్పటి నుంచి మా ఆచారం ఇదే. జుట్టు కత్తిరించుకుంటాం. పూసలు వేసుకుంటాం. మా తల్లిదండ్రులు ఇలానే ఉన్నారు, మేమూ ఇలానే ఉంటున్నాం" అని చెప్పారు.

సాధారణంగా గిరిజనులు నీరు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో జీవిస్తుంటారు. కానీ, రీనోలు కొండ ప్రాంతంలోని శిఖరాగ్ర భాగంలో ఉంటారు. కింద నుంచే నీటిని తీసుకెళ్తారు.

గ్రామం చుట్టూ రాళ్లు, కర్రలతో రక్షణ వలయం నిర్మించుకుంటారు. అక్కడ పహారా కాస్తారు. కొత్త వ్యక్తులను గ్రామంలోకి రానివ్వరు. కొత్త వ్యక్తులు 'దుష్ట శక్తుల'ను వెంట తీసుకొస్తారని వీరి నమ్మకం.

పోడు వ్యవసాయం వీరి ప్రధాన వృత్తి.

మహిళలే కుటుంబ పెద్దలు

గ్రామ పెద్ద, పూజారి, వైద్యులు పురుషులే అయినా కుటుంబపెద్ద మాత్రం మహిళే. కుటుంబ బాధ్యతంతా మహిళే చూసుకుంటారు.

రీనో యువతులు తమ కంటే చిన్నవాడైన యువకుడిని పెళ్లి చేసుకుంటారు.

సొంబారి జిగిడి అనే మహిళ బీబీసీతో మాట్లాడుతూ.. "మేం మా కంటే చిన్నవాళ్లను పెళ్లి చేసుకుంటాం. ఎందుకంటే వయసు తక్కువున్న భర్తయితే వృద్ధాప్యంలో మమ్మల్ని చూసుకుంటాడని నమ్మకం" అని తెలిపారు.

యువతులు తమ కన్నా 7 నుంచి 9 ఏళ్ల తక్కువ వయసున్న యువకులను పెళ్లాడతారు.

పెళ్లికి ముందు సెక్స్ గురించి పట్టింపులు లేవు

సాధారణంగా రీనో తెగలో అబ్బాయిలు, అమ్మాయిలు కుటుంబాలతో కాకుండా విడివిడిగా డార్మెటరీ లాంటి నివాసాల్లో గుంపుగా ఉంటారు.

అబ్బాయిలు ఈ డార్మెటరీల వద్ద వాయిద్య పరికరాలు వాయిస్తూ అమ్మాయిల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తుంటారు.

మొదట అబ్బాయే అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అమ్మాయికి కూడా ఇష్టమైతే మాంసం వండి అబ్బాయికి పంపుతుంది.

అబ్బాయి తరఫు వారు అమ్మాయి కుటుంబానికి కన్యాశుల్కం ఇచ్చే ఆనవాయితీ ఈ తెగలో ఉంది.

నచ్చిన వ్యక్తితో అమ్మాయి ఇష్టపూర్వకంగా జీవిస్తారు.

పెళ్లికి ముందు సెక్స్ గురించి పెద్దగా పట్టింపులు ఉండవు.

సొంత గ్రామస్థులను మాత్రం వివాహం చేసుకోరు.

జీవిత భాగస్వామి చనిపోతే, ఇష్టాన్ని బట్టి మరో పెళ్లి చేసుకుంటారు.

‘హత్య పెద్ద తప్పు కాదు’

రీనోల వ్యవహార శైలి, ఆచార వ్యవహారాల గురించి ఆంధ్రా యూనివర్శిటీ ఆంత్రోపాలజీ విభాగం పలు పరిశోధనలు చెసింది.

ఈ పరిశోధనలకు ప్రొఫెసర్ పీడీ సత్యపాల్ నేతృత్వం వహించారు.

రీనో సమాజంలో స్త్రీ, పురుషులు ఇద్దరూ కష్టపడ్డా, కుటుంబ బాధ్యతంతా మహిళే చూసుకుంటారని ఆయన తెలిపారు.

"గ్రామంలో ఉన్న చిన్నారుల ఆలనాపాలనను వృద్ధులు చూసుకుంటారు. ఈ తెగను చూసి ఇతరులు భయపడతారు. రీనో స్త్రీ, పురుషులు నిత్యం ఆయుధాలు పట్టుకొని సంచరిస్తుంటారు. జీలుగకల్లు, ఇప్పసారా లాంటివి తీసుకుంటారు. క్షణికావేశంలో హత్యలు చేస్తారు. హత్య వీరికి పెద్ద తప్పు కాదు. అలాగని, వారు హత్యలు చేస్తారని కాదు. వ్యక్తిని చంపడాన్ని తాము అతడికి మేలు చేసినట్లని భావిస్తారు. చనిపోయిన వ్యక్తిని అదే గ్రామంలో తర్వాత పుట్టబోయే వ్యక్తిగా భావిస్తారు" అని సత్యపాల్ వివరించారు.

వలస బాట

పోడు వ్యవసాయం ఆశాజనకంగా లేకపోవడంతో రీనోలు గ్రామాలను వదిలి ఉపాధి కోసం పట్టణాలకు వసల వెళ్తున్నారు.

రీనోల కోసం ఒడిశా ప్రభుత్వం బోండా డెవలప్‌మెంట్ ఏజెన్సీ ఏర్పాటు చేసింది.

ఇప్పుడిప్పుడే ఈ తెగలో మార్పులు వస్తున్నాయి. వ్యక్తిగత ఆస్తులను కూడబెట్టుకుంటున్నారు.

వారి వస్త్రధారణ కూడా మారుతోంది. సంతలకు వచ్చినప్పుడు మహిళలు నైటీలు ధరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)