తెలంగాణ: ఇంటర్ ఆత్మహత్యలు.. బోర్డు రద్దే పరిష్కారమా?

  • 8 జూన్ 2019
విద్యార్థులు Image copyright Getty Images

జీవితం అటో ఇటో తేలిపోయే టైమంటూ టీచర్ల హెచ్చరికలు.. రెండేళ్లు కష్టపడితే చాలు లైఫ్ సెటిల్ అన్న శ్రేయోభిలాషుల జాగ్రత్తలు.. నీ మీదే ఆశలు పెట్టుకున్నామంటూ చూసే తల్లితండ్రుల చూపులూ.. మొదటిసారి కాలేజీకి వెళ్తున్నామన్న ఆనందం కొంచెం.. ఎలా ఉంటుందో అన్న ఆందోళన కొంచెం.. వీటన్నింటి మధ్యా స్కూలు వదలి కాలేజీలోకి అడుగుపెడుతున్నారు టీనేజీ పిల్లలు.. ఇంటర్ అంటే జీవితం అనేట్టుగా ఉంటుంది వారి చుట్టూ ఉన్న వాతావరణం.

మరి నిజంగా ఇంటర్‌కు అంత ప్రాధాన్యత ఉండాల్సిందేనా? అసలు ఇప్పుడు మనం చదువుతోన్న ఇంటర్ వ్యవస్థతో మనకు లాభమేనా? అంతా సవ్యంగా ఉంటే ఆత్మహత్యలెందుకుంటాయి? పోనీ ర్యాంకులు కొత్తా అంటే ఐఐటీలూ, వాటిలో సీట్లూ కొత్తగా పుట్టుకురాలేదు.. 50 ఏళ్ల నుంచీ ఉన్నవే కదా... మరెక్కడుంది సమస్య? ప్రస్తుత ఇంటర్ విద్యా విధానం ఎలా ఉంది? ఎలా ఉండాలి?

మన ఇంటర్ వ్యవస్థ గురించి చర్చ వచ్చిన ప్రతీసారీ కేవలం ఇంటర్ మాత్రమే కాకుండా, మొత్తం విద్యా విధానం, వ్యవస్థే మారాలని వాదిస్తుంటారు విజ్ఞలు. వారి వాదనలో అర్థం ఉంది. ఆ అవసరమూ ఉంది. తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో ఇంటర్ విద్య ప్రక్షాళనపై చర్చ మొదలైంది.

Image copyright Telangana Intermediate board

ఇంటర్ ఎలా పుట్టింది?

రకరకాల రూపాల్లో ఉన్న మాధ్యమిక విద్యను (సెకండరీ, హైయర్ సెకండరీ) కొఠారీ కమిషన్ నివేదికతో 10+2+3 అంటే పదేళ్లు స్కూలు, మూడేళ్ల యూనివర్సిటీ డిగ్రీ, వాటికి మధ్యలో రెండేళ్ల ఇంటర్ కోర్సుగా మార్చారు. ఇది రాకముందు ఇంటర్ చదువును పీయూసీ (ప్రీ యూనివర్సిటీ కోర్సు) అనేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1968లో ఇంటర్ బోర్డు స్థాపించారు. అప్పట్నుంచి ఆ బోర్డే ఇంటర్ వ్యవహారాలు చూసుకుంటోంది. పదో తరగతి వరకూ అన్ని సబ్జెక్టులూ చదివిన వారు ఇంటర్‌లో మాత్రం లెక్కలు, సైన్సు, సోషల్, కామర్స్, వృత్తి విద్య.. ఎలా ఏదో ఒకటి తమ అభిరుచి, సామర్థ్యం ఆధారంగా కోర్సులు ఎంపిక చేసుకుని చేరతారు.

ప్రభుత్వ, ప్రభుత్వ మద్దతుతో నడిచే ఎయిడెడ్ కాలేజీలు, సొసైటీలు, అతి తక్కువ ప్రైవేటు కళాశాలలు ఇంటర్ విద్యలో ఉన్నంతకాలం ఈ చదువుపై ఎప్పుడూ ఇంత చర్చ జరగలేదు. పైగా ఎవరికీ తగ్గ గ్రూపు వారు తీసుకుని కష్టపడి చదివి ఇప్పట్లానే ఐఐటీల్లో ర్యాంకులు, మెడికల్ కాలేజీలో సీట్లూ సంపాదించారు. ఇప్పుడు 40-45 ఏళ్లు పైబడ్డ ఇంజినీర్లు, డాక్టర్లు - వీరిద్దరే కాదు, సమాజంలో ఉన్నతులుగా చెప్పుకున్న, లక్షలు సంపాదిస్తోన్న అందరూ అలా వచ్చినవారే.

Image copyright Getty Images

కార్పొరేట్ ప్రభావం

గత రెండు దశాబ్దాలుగా కార్పొరేట్ సంస్థలు ఇంటర్ విద్యలో దిగినప్పటి నుంచీ పరిస్థితి మారిపోయింది. ఇంటర్ చదువులో పోటీ ఎవరూ ఊహించనంతగా పెరిగింది. ఎంత పోటీ అంటే, పిల్లలకు ఊపిరిసలపనంత పోటీ వచ్చేసింది. పిల్లల ఊపిరి తీసేంత పోటీ వచ్చేసింది. అందుకే ఇప్పుడు ఇంటర్ విద్యపై చర్చ మొదలైంది. ప్రస్తుత ఇంటర్ విద్య పరిస్థితి తెలుసుకోవాలంటే మొదట గుర్తించాల్సింది ఇంటర్ బోర్డు కల్పించిన గ్రూపు అవకాశాలు కాలేజీలు ఇవ్వకపోవడం.

ఎంపీసీ, బైసీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీ ఇవి ఎక్కువ మంది చదవే గ్రూపులు. ఇవి కాకుండా వృత్తి విద్య (ఒకేషనల్: ల్యాబ్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్ మొదలైనవి) కొందరు చదువుతారు. ఆయా స్థానిక పరిస్థితులను, కాలేజీలో ఉన్న డిపార్టుమెంట్లను బట్టి జాగ్రఫీ, స్టాటస్టిక్స్ వంటి అరుదైన సబ్జెక్టులతో కూడా కాంబినేషన్లు ఉంటాయి. తెలుగు, హిందీ, ఉర్దూతో పాటూ ఒడియా, తమిళం, ఫ్రెంచ్, సంస్కృతం రెండో భాషగా చదివే వెసులుబాటు కూడా ఉంది.

ఒకప్పుడు ఇంటర్ కాలేజీ దగ్గర అందుబాటులో ఉన్న గ్రూపుల వివరాలు, వాటిలో ఉన్న సీట్లు, ఆ గ్రూపులో సీటు కోసం రావల్సిన కనీస మార్కులు లేదా కటాఫ్ మార్కులు బోర్డుపై పెట్టేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కార్పొరేట్ కాలేజీల్లో ఎంసీసీ, బైపీసీ తప్ప మరో గ్రూపు ఉండే ప్రశ్నే లేదు.

ఓ మాదిరి కాలేజీల్లో అయితే సీఈసీ, ఎంఈసీ గ్రూపులుంటాయి. ఇక హెచ్‌ఈసీ లాంటి సోషల్ సబ్జెక్టులకు సంబంధించిన గ్రూపు ప్రభుత్వ కాలేజీలు, ఒకట్రెండు ప్రైవేటు కాలేజీల్లో తప్ప ఇంకెక్కడా దొరకడం లేదు. ఇక రెండో భాషగా కూడా ఎక్కువ మంది సంస్కృతాన్నే చదువుతారు. ఎందుకంటే సంస్కృతం సబ్జెక్టులో అడ్డగోలుగా మార్కులు వేస్తారు కాబట్టి. విద్యార్థికి ఏం నచ్చుతుంది, ఏం నచ్చదు, లెక్కలు చేయగలడా, బయాలజీ చదవగలడా వంటి ప్రశ్నలకు అవకాశం లేదు. ఇక తెలుగులో పేరు తప్పుల్లేకుండా రాయలేని వారిని కూడా సంస్కృతం ఆప్షనల్ గా తీయిస్తున్నారు అది వేరే కథ.

గ్రూపుల ఎంపిక నుంచి క్షీణించడం మొదలైన ప్రస్తుత ఇంటర్ విద్య కథ, క్రమంగా కార్పొరేట్లకు నచ్చినట్టుగా సాగింది. ఇంజినీరింగ్ లేదా మెడిసిన్ చదివితేనే పిల్లలకు భవిష్యత్తు అని తల్లితండ్రులే భావించేలా బ్రెయిన్ వాష్ చేయడంలో సఫలం అయి, ఆ మేరకు మార్కెటింగ్ నైపుణ్యం ఉపయోగించి పిల్లలను చేర్చుకోవడం, చేర్చుకున్నవారిని ఆయా పోటీ పరీక్షల్లో ర్యాంకులు వచ్చేలా చేయడం మళ్లీ వాళ్ళ ఫొటోలు చూపించి కొత్త పిల్లలను ఆకర్షించడం ఇదే జరుగుతోంది.

కార్పొరేట్ సంస్థల బ్రెయిన్ వాష్ ఏ రేంజ్ లో జరిగిందంటే ఆలోచనాపరులైన తల్లితండ్రులు కూడా, ఇంజినీరింగ్ - మెడిసిన్ కాకుండా మరేదైనా చదువుతాను అన్న తమ పిల్లల కోరికలను ఒప్పుకోలేనంతగా. సమాజంలో మేధోవర్గంగా, చదువరులుగా పేరొందిన తల్లితండ్రులు కూడా ఎందుకైనా మంచిది, ఇంటర్ వరకూ సైన్స్ లేదా మ్యాథ్స్ మాత్రమే చదువు, కావాలంటే డిగ్రీలో మారుదువు, ఏదైనా తేడా వస్తే ఎలాగోలా ఉద్యోగం సంపాదించడానికి ఉపయోగపడుతుంది అని తమ పిల్లల గురించి బెంగపెట్టేసుకుంటున్నారు.

Image copyright Getty Images

సమస్య ఏమిటీ?

ఇక్కడ పిల్లలకు ర్యాంకులు రావడంలో ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ అధ్యయనం ద్వారా రావల్సిన ర్యాంకులు, బట్టీ ద్వారా రావడం, ర్యాంకులు రప్పించడం కోసం ఇంటర్ కాలేజీలు చేస్తోన్న అరాచకాలు ఇక్కడ సమస్య.

''అసలు అవి ఇంటర్ కాలేజీలు కాదు, కాన్సన్ ట్రేషన్ క్యాంపులు'' అంటూ వ్యాఖ్యానించారు ప్రొఫెసర్ నీరదా రెడ్డి. 2001 లో విద్యార్థి ఆత్మహత్యలపై అప్పటి ప్రభుత్వం నీరదా రెడ్డి కమిటీని నియమించింది. ఇంటర్ విద్యను కార్పొరేట్ రంగం ఎలా శాసిస్తుందో తెలుసుకోవాలంటే ప్రొఫెసర్ నీరదా రెడ్డి నివేదిక చదవాల్సిందే. రోజుకు 16 గంటలు పాఠాలు చెప్తున్నారనీ, మార్కుల ప్రకటన రోజు ఆత్మహత్యలు మామూలు అయిపోయాయనీ, హాస్టళ్లు సరిగా లేవనీ, ఒత్తిడిలో ఉన్న వారికి కౌన్సిలింగు ఇచ్చే వ్యవస్థ లేదనీ ఇలా ఎన్నో లోపాలు ఎత్తి చూపారావిడ. హాస్టళ్లలో సిలెండర్ల పక్కనే పిల్లలు పడుకుంటున్నారు. ఆటలు, వినోదం అసలు లేవు. అసలు సైన్స్ ల్యాబ్ అనే ప్రశ్నే లేదు. మార్కులు తగ్గితే తక్కువ సెక్షన్లకు మార్చే పనిష్మెంట్ విధానం పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. కానీ ఆ కమిటీ నివేదిక వచ్చిన 18 ఏళ్ల తరువాత కూడా పరిస్థితి ఏమీ మారలేదు.

Image copyright Getty Images

పిండేస్తున్నారు!

ఇంటర్ విద్యార్థుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే, కార్పొరేట్ కాలేజీల్లో ఆత్మహత్యలు సర్వ సాధారణ విషయంగా మారిపోయాయి. ఒకప్పుడు విద్యార్థి ఆత్మహత్య అంటే కాలేజీలు అట్టుడికిపోయే రోజుల నుంచి ప్రతీ ఏటా కార్పొరేట్ కాలేజీల్లో ఆత్మహత్యలు మామూలే అని ప్రతీ ఒక్కరూ అనుకునే స్థాయికి వచ్చేశాయి.

ఆదివారం సెలవు లేకపోవడం, రోజూ తెల్లవారుఝాము నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ చదివించడం, ఆటలు అనే ప్రశ్నే లేకపోవడం, అంతర్గతంగా జరిపే పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే అవమానించడం, కావాలని తక్కువ తెలివైన వారి సెక్షన్లు అంటూ విడదీసి వాటిల్లోకి మార్చడం, ఒకవైపు చదువు అర్థంకాక బాధపడుతోన్న విద్యార్థులపై మధ్య తరగతి తల్లితండ్రుల ఒత్తిడి.. ఇవన్నీ కలిసి 16-17 ఏళ్ల పిల్లలను పిండేస్తున్నాయి. ఫలితం ఉరితాళ్ల రూపంలో వస్తోంది.

ఇంటర్ కాలేజీల్లో విద్యార్థుల ఫ్రస్టేషన్ గురించి ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. బాగా కోపం వచ్చిన టీనేజీ పిల్లల్లో వస్తువులను విసిరికొట్టే లక్షణం ఉంటుంది. కానీ హాస్టల్లో ఉండే విద్యార్థులంతా ఒకేసారి అలా ప్రవర్తిస్తే? నిజం.. ఎన్నో కార్పొరేట్ కాలేజీల హాస్టళ్లల్లో విద్యార్థులు తమను బయటకు వదలాలంటూ ఏకమై ఫర్నీచర్ ధ్వసం చేయడం, లైట్లు పగలగొట్టడం వంటివి సామూహికంగా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సరదాగా ఉండాల్సిన పిల్లలు హాస్టళ్లను ధ్వంసం చేసే వైపు నడిపించేదేంటి?

ఇక ఇంటర్ పాసై ఇంజినీరింగ్ చేస్తోన్న వారు అక్కడ కూడా ఇదే బట్టీ విధానంతో దెబ్బతింటున్నారు. చివరకు పరిస్థితి అర్థమయి తమ మీద తామే జోకులు వేసుకుంటున్నారు. తెలుగునాట సోషల్ మీడియా కార్పొరేట్ కాలేజీల్లో చదివిన ఇంజినీరింగ్ విద్యార్థులు నడిపే పేజీలు చూస్తేనే ఆ విషయం అర్థం అవుతుంది. ఫ్రీ చైతన్య, పారాయణ అంటూ షార్ట్ ఫిలిం ఇండస్ట్రీ పరోక్షంగా రెండు ప్రముఖ విద్యా సంస్థలపై సెటైర్లు వేస్తూ వీడియోలు తీసి వదిలారు. ఇదంతా కామెడీ కాదు, తమ పరిధిలో తమకు అర్థమైన రీతిలో ఆ కాలేజీల్లో చదివి బతికి బట్టకట్టిన విద్యార్థులు వెళ్లగక్కుతున్న ఆక్రోశం. కానీ ఆ ఆవేదన తీర్చడానికి ప్రభుత్వం ఏం చేయాలన్నదే ఇప్పుడు ప్రశ్నగా మిగిలింది.

Image copyright FB

ఇంటర్ - భవిష్యత్తు?

ఈ వ్యవస్థను బాగు చేయడానికి ఇంటర్ బోర్డు రద్దు చేయడం ఒకటే మందు అంటారు ప్రొఫెసర్ కంచె ఐలయ్య. ఇంటర్ బదులు హైస్కూళ్లలోనే 11, 12 తరగతులు ప్రారంభించాలని, దాని వలన గ్రామీణ విద్యర్థులకు కూడా మరింత లాభం ఉంటుందనేది ఐలయ్య మాట. పదో తరగతి పబ్లిక్ పరీక్షల బదులు 12వ తరగతి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. "పెద్ద సంఖ్యలో కాలేజీలు, కోచింగ్ సెంటర్లను కార్పొరేట్ సంస్థలు ఏర్పాటు చేయడం, భారీ ప్రకటనలు, రెసిడెన్షియల్ విద్యలో అధ్యయనానికి బదులు వల్లెవేయడం, బట్టీ పట్టానికి ప్రాధాన్యత ఇవ్వడం, సృజనాత్మకత, వినోదాలు లేకుండా మానసికంగా దెబ్బతీస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలు నేరుగా ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే స్థాయికి వెళ్లి, విధానాలను తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆ బోర్డును రద్దు చేసి హైస్కూల్లో కలిపేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని" ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే విద్యా విధానం మారకుండా బోర్డు రద్దయితే ఉపయోగం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు రమేశ్ పట్నాయక్. ఆంధ్ర ప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ గా, ఆల్ ఇండియా ఫోరమ్ ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ సెక్రటేరియట్ మెంబర్ ఉన్న రమేశ్, ఇంటర్ విద్య బాగు చేసే దశను కూడా దాటిపోయిందంటున్నారు. ఇంటర్ విద్యలో ఈ సమస్యలకు కారణం విద్యా వ్యాపారమే అనేది ఆయన వాదన.

''ఇప్పుడు ఇంటర్ విద్యా విధానంలో లోపాలన్నిటికీ ఒకటే కారణం. విద్యను వ్యాపారం చేయడమే. బోర్డు రద్దు చేయడం వల్ల ఉపయోగం ఉండదు. రూపం మారుతుంది కానీ విషయం మారదు కదా. విద్యకు కొలమానమే ఉండకూడదు. అలాంటిది విద్యకు ర్యాంకుల కొలత పెట్టారు. పిల్లల్ని పోటీలో పెట్టారు. యాడ్స్ ద్వారా ఒత్తిడి పెంచుతున్నారు. విద్య మొత్తం ప్రభుత్వ బాధ్యత అయితేనే ఫలితం ఉంటుంది. అది తప్ప దీనికి వేరే పరిష్కారం లేదు. 30 ఏళ్ళ క్రితం వరకూ విద్య ప్రభుత్వ బాధ్యతే. అప్పుడు కూడా గొప్ప గొప్ప ఇంజినీర్లు, డాక్టర్లు వచ్చారుగా. కానీ ఇప్పుడు అలాంటి వారు రావడం లేదు. మామూలుగా ఏదైనా సమస్యకు తాత్కాలిక ఉపశమన చర్యలు, మధ్యే మార్గ పరిష్కారాలు ఉంటాయి. కానీ ఇప్పుడు అవేవీ లేవు. సంపూర్ణ ప్రక్షాళనే మార్గం. అసలు ఐఐటీలు మాత్రమే మంచి ఇంజినీరింగ్ కాలేజీలు ఎందుకయ్యాయి. నాణ్యతలేని కాలేజీలుంటే నాణ్యతలేని ఇంజినీర్లు వస్తారు. తక్కువ సామర్థ్యం ఉన్న ఇంజినీరు సమాజానికి ఎందుకు? కాబట్టి నాణ్యమైన వృత్తి విద్యా కాలేజీలు నిర్మించడం కూడా ప్రభుత్వ బాధ్యతే. ఒత్తిడి లేకుండా చదువుకున్న ప్రభుత్వ గురుకులాలు, నవోదయ విద్యార్థులు కూడా ఐఎఎస్ లు అవుతున్నారు కదా'' అంటూ తన వాదన వినిపించారు రమేశ్.

నిజానికి తెలంగాణ ప్రభుత్వం విద్యా విధానం గురించి ముందు నుంచీ చాలా విషయాలు చెబతూ వచ్చింది. కేజీ టూ పీజీ ఉచిత విద్య ప్రకటన ఉంది. మోడల్ స్కూళ్లు ప్రారంభం అయ్యాయి. సాంఘిక సంక్షేమ గురుకులాలకు విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చారు. పదో తరగతి వరకూ చదువు విషయంలో అంత ప్రాధాన్యత ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం, మాధ్యమిక, ఉన్నత విద్యా విధానంపై మాత్రం ఇప్పటి వరకూ అంత శ్రద్ధ పెట్టలేదనే చెప్పాలి. తాజా ఆత్మహత్యల వ్యవహారం తరువాత ఇంటర్ బోర్డు రద్దు అనే వార్తల లీక్ మినహా ఈ విషయంపై ఇంకా స్పష్టమైన పాలసీ లేదు.

అయితే ఇంటర్ విద్యతో పాటూ మొత్తం విద్యా విధానాన్నే సమూలంగా, సమగ్రంగా మార్చే ప్రయత్నాల్లో ఉన్నామనీ ఆలోపే ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమనీ అన్నారు తెలంగాణ విద్యా మంత్రి జగదీశ్ రెడ్డి.

తెలంగాణ ప్రభుత్వం చెబుతోన్న సమూల - సమగ్ర విద్యా విధానం మార్పు ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. తాజాగా కేంద్రం ప్రభుత్వం కూడా అసలు 10+2+3 బదులు మరో కొత్త విధానం తీసుకుచ్చే ప్రతిపాదనలను ప్రజల ముందు ఉంచింది.

కానీ ఇప్పుడు సమాజం ముందున్న ప్రశ్న ఇంటర్ బోర్డు ఉంటుందా లేదా అన్నది కాదు. ఇంటర్ విద్య, ఆ మాటకొస్తే, మొత్తం విద్యా విధానంలో ప్రభుత్వ పెత్తనం ఎంత ఉంటుంది? కార్పొరేట్ పెత్తనం ఎంత ఉంటుంది? విద్య అధ్యయనానికీ, జ్ఞానానికీ ప్రాధాన్యత ఇస్తుందా లేకపోతే బట్టీకీ, ర్యాంకులకీ ప్రాధ్యాన్యత ఇస్తుందా అన్నది తేలాలి.

ఎందుకంటే రమేశ్ చెప్పినట్టు, చదువును తెలుగో, ఇంగ్లీషో.. ఇలా ఏదో ఒక మీడియంలో చెప్పవచ్చు కానీ వ్యాపారం అనే మీడియంలో చెప్పలేం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)