హిప్పీ సినిమా రివ్యూ: శృతి మించిన రొమాన్స్‌‌తో కార్తికేయ ఖాతాలో మరో విజయం చేరుతుందా?

  • 8 జూన్ 2019
హిప్పీ సినిమా రివ్యూ Image copyright facebook/vcreationsofficial

ఆర్‌ఎక్స్ 100 సినిమాతో కార్తికేయ హీరోగా తనను తాను నిరూపించుకున్నాడు. ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో సత్తా చూపుతున్న యంగ్, డైనమిక్, ట్రెండీ హీరోల్లో ఒకడిగా నిలిచాడు.

దర్శకుడు టి.ఎన్.కృష్ణ దాదాపు 12 ఏళ్ల క్రితం సూర్య నటించిన 'సిల్లును ఒరు కాదల్' అనే తమిళ సినిమా (తెలుగులో 'నువ్వు నేను ప్రేమ')తో ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.

వీరిద్దరి కలయికలో, ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మాణంలో హిప్పీ తెరకెక్కింది.

ట్రైలర్‌లో దిగంగనా సూర్యవంశీ, జజ్బాసింగ్ గ్లామరస్ లుక్‌తో యువతను ఆకట్టుకున్నారు.

'హిప్పీ' అనే క్రేజీ టైటిల్, 'మోర్ క్యాజువల్' అనే క్యాప్షన్‌తో రూపొందిన ఈ చిత్రంపై మామూలుగానే కాస్త అంచనాలున్నాయి.

మరి, ఈ చిత్రం వాటిని అందుకుందా?

కార్తికేయ ఖాతాలో మరో విజయం చేరిందా?

ఆ విషయాలు తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే...

Image copyright twitter/theVcreations

ఇద్దరమ్మాయిలతో..

మైలురాయి మీద కూర్చున్న మన హీరో హిప్పీ అలియాస్ దేవదాస్‌ను.. కౌగిలించుకుని, లిప్ లాక్ చేస్తూ ఉంటుంది స్నేహ (జబ్బాసింగ్).

అదే సమయంలో ఆమె మెడ వంపులో నుంచి ఎదురుగా నడిచి వస్తున్న మరో అమ్మాయి ఆముక్తమాల్యద (దిగంగనా సూర్యవంశీ)ను చూసి ప్రేమలో పడతాడు హిప్పీ.

ఇక, ఆ పడడం నుంచి లేవడానికి అతడు చేసే ప్రయత్నమే హిప్పీ సినిమా కథ.

ప్లే బాయ్ నుంచి లవర్ బాయ్‌గా మారడానికి హిప్పీ ఎన్ని కష్టాలు పడ్డాడు?

'నాకు పెళ్లి కుదిరింది ఎక్కడికైనా లేపుకుపో' అని నమ్మి తన వెంట వచ్చిన స్నేహను ఏం చేశాడు?

ప్రేమ ప్రేమ అంటూ వెంటపడి మరీ ఒప్పించిన ఆముక్తమాల్యదను ఎందుకు వదిలించుకోవాలనుకున్నాడు?

కంపెనీలో అతడి బాస్ అరవింద్ (జేడి చక్రవర్తి) లవ్ గురూగా ఏం చేశాడు?

ఈ ప్రశ్నల చుట్టే కథంతా తిరుగుతుంది.

ఇప్పటికే లివ్ ఇన్ రిలేషన్ షిప్, ఓపెన్ మ్యారేజ్ లాంటి అంశాలను స్పృశిస్తూ తెలుగు ప్రేక్షకులకు ముందు సినిమాలు వచ్చాయి.

ఆ తరహా కథతోనే తెరకెక్కిన హిప్పీ జనాలను ఎంతవరకు అలరించింది?

Image copyright twitter/theVcreations

తగ్గినట్లు అనిపించింది

ఆర్‌ఎక్స్ 100‌తో వచ్చిన ‘లవ్ ఫెయిల్యూర్ బాయ్ ఇమేజ్‌’ని పోగోట్టుకోవాలని కార్తికేయ గట్టిగానే ప్రయత్నించాడు.

ప్లే బాయ్ తరహా పాత్రను ఎంచుకుని, అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ హెయిర్ స్టైల్, సిక్స్ ప్యాక్ బాడీ, శరీరంపై ట్రెండీ టాటూ, కేర్‌లెస్ నేచర్‌తో బాగానే కనిపించాడు.

అయితే వచ్చిన చిక్కల్లా, అతని నటనతోనే.

ప్లే బాయ్ పాత్రలో ఫర్వాలేదనిపించాడు. కానీ, లవర్ బాయ్‌గా క్లాసీ లుక్కులో అతడు పలికించే అర్థం కాని హావభావాలు ప్రేక్షకులను ఆకట్టుకోవు.

ముఖ్యంగా, ఆర్‌ఎక్స్ 100 లాంటి విజయం తర్వాత వచ్చిన సినిమా కావడంతో, సగటు ప్రేక్షకుడికి ఇందులో కార్తికేయ పర్ఫార్మెన్స్ తగ్గినట్లుగా అనిపిస్తుంది.

Image copyright twitter/theVcreations

బోల్డ్ కథలో బోలెడు లొసుగులు

'నువ్వు నేను ప్రేమ'ను ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించాడు డైరెక్టర్ కృష్ణ.

అయితే హిప్పీ కథపై మాత్రం అతడి బిగి సడలిందా అన్న అనుమానం రాకమానదు.

డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పించి, శృతి మించిన లిప్ లాక్స్, రొమాన్స్‌తో ప్రేక్షకులను ఒప్పించాలనుకోవడం ఎథిక్స్‌కు దూరంగా ఉంది.

బీటెక్ చేసి, ఖాళీగా ఉన్న టైంలో ప్రేమిస్తున్నానంటే ఒప్పుకున్నానంటూ సాగే డైలాగులతో డైరెక్టర్ యువతకు ఏం చెప్పదలుకున్నాడో అర్థం కాదు.

ప్రేమ, విడిపోవడం, మళ్ళీ కలిసిపోవడం.. ఈ లైన్‌తో లోగడ బోలెడు కథలు వచ్చాయి.

వాటిలో ప్రేమ పేరుతో ఎంత కంగాళీ కంగాళీ చేసినా, ఏదో ఒక స్ట్రాంగ్ లాజిక్ ఉండేలా చూసుకున్నారు.

హిప్పీలో అలాంటి లాజిక్ ఏదీ కనపడకపోగా.. అమ్మాయిలను మార్చడం, వదిలించుకోవడాలను హీరోయిజంగా చూపించారు.

స్త్రీ, పురుష పాత్రలతో సంబంధం లేకుండా అందరితోనూ బూతులు మాట్లాడించి డైరెక్టర్ బోల్డంత సమానత్వం చూపించాడు.

అయితే, హీరో వదిలించుకోవాలనుకుంటున్నాడని గ్రహించి కూడా, హీరోయిన్ లివ్ ఇన్ రిలేషన్ పేరుతో ఇంకా కలిసి ఉంటానంటూ అతడి ఇంట్లో తిష్టవేయడం అమ్మాయిల వ్యక్తిత్వాన్ని కించపరచడమేనన్న ఆలోచన డైరెక్టర్‌కు లేకపోవడం దురదృష్టకరం.

విలువలు, నైతిక విలువల సంగతి పక్కన పెడితే యువతను టార్గెట్ చేసుకుని అల్లుకున్న కథ బాగానే ఉంది.

కథనం మాత్రం నేలవిడిచి సాము చేస్తున్నట్లుగా.. ఒక దగ్గర ఉరిమి,ఇంకెక్కడో మెరిసి,మరో చోట కురుస్తున్న భావన కలిగిస్తుంది.

Image copyright facebook/vcreationsofficial

తారలు తలుక్కుమన్నారు

తెలుగులో మొదటి సినిమా అయినప్పటికీ దిగంగనా సూర్యవంశీ గ్లామర్ పరంగా,నటన పరంగా బెటర్ హోప్స్ కలిగించింది. ఎమోషనల్ సీన్స్‌లో,కైమాక్స్‌లో చాలా ఈజ్ తో నటించింది.

అందలా ఆరబోతలో ఇద్దరు హీరోయిన్లూ పోటీ పడినట్లుగా అనిపించింది.

సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జేడి చక్రవర్తి గురించి. లవ్ గురూ తరహా పాత్రలో తెలంగాణ పాత బస్తీ యాసతో చెప్పే డైలాగులు బాగున్నాయి.

అయితే తెలంగాణ యాస అంటే కేవలం బూతులు, డబుల్ మీనింగ్ మాటలు అనుకునే సిక్ మైండ్ సెట్ ఈ సినిమా మాటల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

బ్రహ్మజీ, వెన్నెల కిశోర్‌ల కామెడీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్.

Image copyright twitter/theVcreations

పాటలు ఆకట్టుకున్నాయి

నివాస్ కే ప్రసన్న సంగీతం ఆకట్టుకుంటుంది.

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, 'ఎవతివే' అనే పాట, క్లైమాక్స్ గీతం ప్రేక్షకులు కనెక్టయ్యాలా ఉన్నాయి.

అనంత శ్రీరామ్ సాహిత్యం ఆశించిన స్థాయిలోనే ఉంది.

నిర్మాణ విలువలు కథకు అనుగుణంగా రిచ్‌గా, క్లాసీగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు