గోవా: ఏడాదిలో 11 నెలలు నీటిలో మునిగిపోయి.. ఒక్క నెల మాత్రమే బయటకు వచ్చే గ్రామం కుర్ది

  • 11 జూన్ 2019
మునిగిపోయిన గ్రామం Image copyright GURUCHARAN KURDIKAR

గోవా రాష్ట్రంలో ఒక గ్రామం ఉంది. అది ఏడాదిలో 11 నెలలూ నీటిలో మునిగిపోయి ఉంటుంది. ఒక్క నెల మాత్రమే బయటకు వస్తుంది. పొరుగు ఊళ్ళకు వెళ్లి స్థిరపడ్డ ఈ గ్రామస్థులంతా ఆ నెలలో వచ్చి తమ పాత ఇళ్ల వద్ద వేడుకలు చేసుకుంటారు.

ఈ గ్రామం పేరు కుర్ది. పశ్చిమ కనుమల్లోని కొండల మధ్యలో సలౌలిం నది పరివాహక ప్రాంతంలో ఈ ఊరుంది. గోవాలోని ప్రధాన నదుల్లో సలౌలిం నది ఒకటి.

1986లో ఈ నదిపై ఆనకట్టను నిర్మించడంతో ఆ జలాశయంలో ఈ గ్రామం మునిగిపోయింది. వందల ఎకరాల సారవంతమైన భూములు, తోటలు కనుమరుగయ్యాయి.

అయితే, వేసవిలో జలాశయంలో నీటి మట్టం భారీగా తగ్గిపోతుంది. దాంతో, ఏటా మే నెలలో ఊరు శిథిలాలు నీటి నుంచి బయటకొస్తాయి.

పగుళ్లు పట్టిన నేల, చెట్ల కొయ్యలు, మట్టి గోడల శిథిలాలు, ఆలయం, మసీదు, చర్చి అవశేషాలు కనిపిస్తాయి.

Image copyright SUPRIYA VOHRA

1961లో పోర్చుగీసు వారి నుంచి గోవాకు విముక్తి లభించిన తర్వాత ఆ రాష్ట్రంలో నిర్మించిన తొలి భారీ సాగునీటి ప్రాజెక్టు ఇది. ప్రస్తుతం దక్షిణ గోవా ప్రాంతంలో తాగునీటికి, సాగునీటికి, పరిశ్రమల అవసరాలకు ఈ జలాశయమే ఆధారం.

పోర్చుగీసు పాలన ముగింపు పలికిన తర్వాత రెండు మూడు దశాబ్దాల కాలంలో గోవా రూపురేఖలు వేగంగా మారిపోయాయి. దక్షిణ గోవా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు సలౌలిం నదిపై ఆనకట్ట నిర్మించాలని గోవా తొలి ముఖ్యమంత్రి డయానంద్ బందోడ్కర్ నిర్ణయించారు. ముంపు గ్రామాల ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి భూసేకరణకు అడ్డంకులు లేకుండా వారిని ఒప్పించారు.

Image copyright GURUCHARAN KURDIKAR

"ఆనకట్ట నిర్మాణం కోసం ఈ గ్రామస్థులు చేసే త్యాగం వల్ల వందల గ్రామాలకు తాగు నీరు, లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ముఖ్యమంత్రి మాకు చెప్పారు. దాంతో మా ఊరును ఖాళీ చేసేందుకు మేము అంగీకరించాం" అని ఈ గ్రామానికి చెందిన 75 ఏళ్ల గజనన్ కుర్దికర్ గుర్తు చేసుకున్నారు.

మొత్తం 600 కుటుంబాలు సమీప గ్రామాలకు వెళ్లిపోయాయి. సారవంతమైన వ్యవసాయ భూములను, తోటలను కోల్పోయారు. ప్రభుత్వం పునరావాస ప్యాకేజీ కింద వారికి ఆర్థిక సాయంతో పాటు, మరోచోట సాగు భూములు ఇచ్చింది.

Image copyright SUPRIYA VOHRA

ఈ జలాశయంలో నీటిమట్టం వేసవి కాలంలో భారీగా తగ్గిపోతోంది. దాంతో, ఏటా మే నెలలో కుర్ది గ్రామం ఆనవాళ్లు బయటకు కనిపిస్తాయి. అప్పుడు నిర్వాసితులు తమ పాత ఇళ్ల శిథిలాలలను చూసేందుకు ఇక్కడికి వస్తారు.

గుడిలో హిందువులు, చర్చిలో క్రైస్తవులు వేడుకలు చేసుకుంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు