క్రికెట్ ప్రపంచకప్ 2019: 89 పరుగులతో పాక్‌పై భారత్ విజయం, రోహిత్ శర్మ‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్

  • 17 జూన్ 2019
రోహిత్ Image copyright Getty Images

ప్రపంచ కప్‌లో భారత క్రికెట్ జట్టు సంప్రదాయాన్ని కొనసాగించింది. పాక్‌పై వరుసగా ఏడో సారి విజయం సాధించింది. మాంచెస్టర్‌ ఓల్డ్ ట్రాఫర్డ్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీసేన 89 పరుగులతో గెలుపొందింది.

మొదట టాస్ గెలిచిన పాకిస్తాన్.. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కోహ్లీ సేన నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (140), కేఎల్ రాహుల్ (57) రాణించారు. వీరిద్దరి భాగస్వామ్యంతో భారత్ 337 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్ ముందు ఉంచింది. పాక్ బౌలర్లలో మహ్మద్ అమిర్ మూడు వికెట్లు తీశాడు.

Image copyright Getty Images

కుల్దీప్ మ్యాజిక్

ఇమామ్‌ ఉల్‌ హఖ్‌, ఫకర్‌ జమాన్‌ పాక్ ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ప్రారంభించారు. ఇమామ్ ఉల్ హఖ్(7)ను శంకర్ తన తొలి బంతికే ఔట్ చేయడంతో పాక్ వికెట్ల పతనం మొదలైంది. పాక్ జట్టులో ఫకర్ జమాన్ (62) ఒక్కడే రాణించాడు. అతనికి బాబర్ అజమ్ (48) అండగా నిలిచాడు. వీరిద్దరూ 100 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేడయంతో పాక్ పోరాడుతున్నట్లే కనిపించింది. కానీ, కుల్దీప్ వరస బంతుల్లో ఫకర్ జమాన్, బాబర్ అజమ్‌లను పెవిలియన్‌కు పంపడంతో ఆ జట్టుపై ఒత్తిడి ఎక్కువైంది. తర్వాత ఓవర్లలో హార్థిక్ పాండ్యా కూడా రెండు కీలక వికెట్లు తీయడంతో పాక్ కోలుకోలేకపోయింది.

డక్‌వర్త్ లూయిస్‌తో మారిన లక్ష్యం

పాక్ స్కోరు 35 ఓవర్ల వద్ద 166 పరుగులు ఉండగా వర్షం పడటంతో కొద్దిసేపు మ్యాచ్‌ను నిలిపివేశారు. తర్వాత డక్‌వర్త్ లూయిస్ పద్ధతిని అనుసరించి మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. పాక్ విజయలక్ష్యాన్ని 302గా నిర్ణయించారు. పాక్ మిగిలిన ఐదు ఓవర్లలో 136 పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

ఈ దశలో బరిలోకి దిగిన ఇమాద్ వసిమ్, షాదాబ్ ఖాన్‌లు ఆట ముగిసేసరికి పాక్ స్కోర్‌ను 212 పరుగులకు చేర్చారు. దాంతో 89 పరుగులతో కోహ్లీ సేన విజయం సాధించింది.

భారత బౌలర్లలో విజయ శంకర్ 2, హార్థిక్ పాండ్య 2, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. భువనేశ్వర్ కుమార్ తన మూడో ఓవర్ వేస్తుండగా కాలి కండరం పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్‌గా పెవీలియన్ చేరాడు.

Image copyright Getty Images

రోహిత్‌కు మ్యాన్ ‌ఆఫ్ ది మ్యాచ్

ఓపెనర్‌గా బరిలోకి దిగి సెంచరీ చేసిన రోహిత్ శర్మ‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. 133 బంతుల్లో 140 ( 3 సిక్సులు, 14 ఫోర్లు) చేసిన ‘హిట్‌మ్యాన్’ భారత గెలుపులో కీలక పాత్ర వహించాడు. ఈ విజయంతో భారత్ 7 పాయింట్లు సాధించి గ్రూప్‌లో మూడో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా 8 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.

Image copyright Getty Images

పాక్ లక్ష్యం 30 బంతుల్లో 136

వర్షం నిలిచిపోవడంతో అంపైర్లు మ్యాచ్ కొనసాగించేందుకు అనుమతించారు. అయితే, మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో పాక్ విజయ లక్ష్యాన్ని 302 పరుగులుగా నిర్ణయించారు. అంటే 35 ఓవర్లలో 166 /6 పరుగుల చేసిన పాక్ గెలవాలంటే 5 ఓవర్లలో 136 పరుగులు చేయాలి.

డక్‌వర్త్‌ లూయిస్‌ అమలు చేస్తే..

ఒక వేళ వర్షం వల్ల ఆట కొనసాగించడం సాధ్యం కాకపోతే డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో ఫలితం తేలుస్తారు. ప్రస్తుతానికి పాక్ 35 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం పాక్ గెలవాలంటే 35 ఓవర్లకు 252 పరుగులు చేయాలి. కానీ, ఆ జట్టు ఇంకా 86 పరుగుల దూరంలో ఉంది.

వర్షం అంతరాయం

35 ఓవర్ల వద్ద వర్షం పడటంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. పాక్ ఆరు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. పాక్ గెలవాలంటే ఇంకా 15 ఓవర్లలో 171 పరుగులు చేయాలి. ఒక వేళ వర్షం వల్ల ఆట కొనసాగించడం సాధ్యం కాకపోతే డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో ఫలితం తేలుస్తారు.

ఆరో వికెట్

34.1 ఓవర్ల వద్ద పాక్ ఆరో వికెట్ కోల్పోయింది. సర్ఫరాజ్ 12 పరుగులు చేసి శంకర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. షాదాబ్ క్రీజులోకి వచ్చాడు.

32 ఓవర్లకు 5

31 ఓవర్లు ముగిసే సరికి పాక్ ఐదు వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. వసీమ్, సర్ఫరాజ్ క్రీజులో ఉన్నారు.

ఐదో వికెట్

హార్థిక్ పాండ్యా వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. స్కోర్ బోర్డు మీద ఒక్క పరుగు చేరకముందే పాక్‌ మరో వికెట్‌ను కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన షోయబ్ మాలిక్.. పాండ్యా వేసిన అద్భుతమైన బాల్‌కు దొరికిపోయాడు. గోల్డెన్ డక్‌గా వెనుతిరిగాడు.

నాల్గో వికెట్

129 పరుగుల వద్ద పాకిస్తాన్ నాల్గో వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ 26.5 ఓవర్ల వద్ద పాండ్యా బౌలింగ్‌లో శంకర్‌కు క్యాచ్ ఇచ్చి మహ్మద్ హఫీజ్(9) వెనుదిరిగాడు.

మూడో వికెట్

25.2 ఓవర్లకు పాక్ మూడు వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. హాఫ్ సెంచరీ చేసి మంచి ఊపు మీదున్న ఫకర్ జమాన్ 62 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. కుల్దీప్ బౌలింగ్‌లో స్వీఫ్ షాట్‌కు ప్రయత్నించిన ఫకర్ ... చహల్‌కు క్యాచ్ ఇచ్చాడు.

వరుస ఓవర్లలో కుల్దీప్ తన స్పిన్ మ్యాజిక్‌తో రెండు వికెట్లు తీశాడు.

బాబర్ ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన పాక్

23 ఓవర్లు ముగిసేసరికి పాక్ రెండో వికెట్ కోల్పోయింది. హాఫ్‌సెంచరీ దిశగా వెళుతున్న బాబర్ అజమ్ 48 పరుగులు వద్ద ఔట్ అయ్యాడు. కులదీప్ ఒక అద్భుతమైన బంతితో బాబర్‌ను బోల్తా కొట్టించాడు. హఫీజ్ క్రీజులోకి వచ్చాడు.

ఫకర్ హాఫ్‌సెంచరీ

20 ఓవర్లు ముగిసేసరికి పాక్ ఒక వికెట్ కోల్పోయి 95 పరుగులు చేసింది. ఫకర్ జమాన్ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.

17 ఓవర్లకు ..

16 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ ఒక వికెట్ కోల్పోయి 79 పరుగులు చేసింది. బాబర్ అజమ్ 30, ఫకర్ జమాన్ 40 పరుగులతో క్రీజులో ఉన్నారు.

8 ఓవర్లకు...

7 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ ఒక వికెట్ కోల్పోయి 29 పరుగులు చేసింది.

ఇమామ్‌ ఉల్‌ హఖ్‌ ఔట్... డ్రెస్సింగ్ రూమ్‌కు భువీ

పాకిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 4.5 ఓవర్ల వద్ద ఇమామ్‌ ఉల్‌ హఖ్‌(7) ఔటయ్యాడు. శంకర్ బౌలంగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. 4వ ఓవర్లో నాలుగు బంతులు వేసిన భువనేశ్వర్ డ్రెస్సింగ్ రూంకు వెళ్లాడు. అతని స్థానంలో బంతి అందుకున్న శంకర్ వెంటనే వికెట్ తీశాడు.

2 ఓవర్లకు

ఇమామ్‌ ఉల్‌ హఖ్‌, ఫకర్‌ జమాన్‌ పాక్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. రెండు ఓవర్లు ముగిసేసరికి పాక్ వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది.

Image copyright PA

50 ఓవర్లకు..

భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది. మొదట ఇన్నింగ్స్ నెమ్మదిగా మొదలుపెట్టిన భారత్ తర్వాత వేగంగా పరుగులు సాధించింది. పాక్ ముగింట భారీ లక్ష్యాన్ని ఉంచింది.

భారత్ ఇన్నింగ్స్

బ్యాట్స్‌మెన్ ఔటైన తీరు పరుగులు
కేఎల్ రాహుల్ (క్యాచ్) బాబర్ అజమ్ (బౌలింగ్) వహబ్ రియాజ్ 57
రోహిత్ శర్మ్ (క్యాచ్) వహబ్ రియాజ్ (బౌలింగ్) హసన్ అలీ 140
విరాట్ కోహ్లీ (కెప్టెన్) (క్యాచ్) సర్ఫరాజ్ అహ్మద్ (బౌలింగ్) మహ్మద్ అమిర్ 77
హార్థిక్ పాండ్యా (క్యాచ్) బాబర్ అజమ్ (బౌలింగ్) మహ్మద్ అమిర్ 26
ఎంఎస్ ధోనీ (క్యాచ్) సర్ఫరాజ్ అహ్మద్ (బౌలింగ్) మహ్మద్ అమిర్ 01
విజయ్ శంకర్ నాటౌట్ 15
కేఎం జాదవ్ నాటౌట్ 09
ఎక్స్‌ట్రాలు
మొత్తం పరుగులు 336/5 (50 ఓవర్లు, రన్‌రేట్: 6.72)

కోహ్లీ ఔట్

47.4 ఓవర్లకు భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసింది. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ 77 పరుగుల వద్ద అమిర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

అంపైర్లు పిచ్‌ను పరిశీలించి ఆటకు అనుమతివ్వడంతో మ్యాచ్ మళ్లీ ప్రారంభమైంది.

46.4 ఓవర్లకు భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (62 బంతుల్లో ఆరు ఫోర్లతో 71 పరుగులు), విజయ్ శంకర్ (6 బంతుల్లో 3 పరుగులు) క్రీజులో ఉన్నారు.

ఈ దశలో చిరు జల్లులు మొదలయ్యాయి. అవి పెరుగుతుండటంతో వర్షం కారణంగా అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు.

ఒకవేళ ఈ దశలో కనుక మ్యాచ్ ఆగిపోతే పాకిస్తాన్ జట్టు డక్ వర్త్ లూయిస్ విధానం ప్రకారం 46 ఓవర్లలో 327 పరుగులు చేయాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.

వన్డేల్లో అత్యంత వేగంగా 11 వేల పరుగులు చేసిన కోహ్లీ

భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డేల్లో అత్యంత వేగంగా 11 వేల పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో 45వ ఓవర్‌లో కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు.

ధోనీ ఔట్

భారత్ 45.1 ఓవర్లకు 298 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. పాండ్యా తర్వత వచ్చిన ధోనీ కేవలం ఒక పరుగు చేసి వెనుదిరిగాడు. మహ్మద్ అమిర్ రెండు వికెట్లు తీసుకోగా, హసన్ అలీ ఒక వికెట్ పడగొట్టాడు.

భారత్ 44 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది.

కెప్టెన్ విరాట్ కోహ్లీ (56 పరుగులు), ఎంఎస్ ధోనీ క్రీజులో ఉన్నారు.

మూడో వికెట్

43.5 ఓవర్లకు హార్థిక్ పాండ్యా (19 బంతుల్లో ఒక సిక్స్, రెండు ఫోర్లతో 26 పరుగులు) ఔటయ్యాడు. సిక్స్ కొట్టబోయి బాబర్‌ ఆజామ్‌‌కు క్యాచ్‌ ఇచ్చాడు.

రెండో వికెట్

38.2 ఓవర్లకు ఓపెనర్ రోహిత్ శర్మ (140, 113 బంతుల్లో 14×4, 3×6) ఔటయ్యాడు. హసన్ అలీ బౌలింగ్‌లో రియాజ్‌కు క్యాచ్ ఇచ్చి రోహిత్ వెనుదిరిగాడు.

భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకెళుతోంది. 6.60 రన్ రేట్‌తో 37 ఓవర్లు ముగిసేసరికి 220 పరుగులు చేసింది.

30 ఓవర్లు ముగిసేసరికి భారత్ ఒక వికెట్ కోల్పోయి 172 పరుగులు చేసింది. రోహిత్ శర్మ సెంచరీ చేశాడు.

23 ఓవర్ల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ చేసి ఊపుమీదున్న రాహుల్ 57 పరుగుల వద్ద వహాబ్ రియాజ్ బౌలింగ్‌లో బాబర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

భారత్ 22 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 123 పరుగులు చేసింది. రాహుల్ హాఫ్‌సెంచరీ చేశాడు.

భారత్ 20 ఓవర్లకు 105 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరూ నెమ్మదిగా బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. భారత్ 17.3 ఓవర్లకు 100 పరుగులు చేసింది.

Image copyright AFP

భారత్ 15 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 87 పరుగులు చేసింది. 12 ఓవర్లు ముగిసేసరికి 79 పరుగులు చేసింది. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేశాడు.

10 ఓవర్లకు

భారత్ వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది.

ఐదు ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. మూడు ఓవర్లు ముగిసేసరికి భారత్ 11 పరుగులు చేసింది.

(ఈ పేజీ అప్డేట్ అవుతోంది. తాజా సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి)

Image copyright AFP
చిత్రం శీర్షిక కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగారు.

రెండో ఓవర్లో హఫీజ్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి రోహిత్ ఖాతా తెరిచాడు. పాక్ బౌలర్ అమిర్ తొలి ఓవర్‌లో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు.

మాంచెస్టర్‌, ఓల్డ్ ట్రాఫర్డ్‌లో భారత్-పాకిస్తాన్ వరల్డ్ కప్ మ్యాచ్ ప్రారంభం అయింది. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు.

టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నారు.

భారత జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), విజయ్ శంకర్, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), కేదార్ జాధవ్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, జస్‌ప్రిత్ బుమ్రా

పాకిస్తాన్ జట్టు: ఇమామ్ ఉల్ హక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, మొహమ్మద్ హఫీజ్, సర్ఫరాజ్ అహ్మద్ (కెప్టెన్, వికెట్ కీపర్), షోయబ్ మాలిక్, ఇమాద్ వసీం, షదాబ్ ఖాన్, వాహబ్ రియాజ్, హసన్ అలీ, మొహమ్మద్ ఆమిర్

Image copyright Getty Images

వర్షం అడ్డంకి అవుతుందా?

ఈ మ్యాచ్ కోసం ఇరుదేశాల క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే, అక్కడి వాతావరణ పరిస్థితులు వారిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. వర్షం వల్ల మ్యాచ్‌కు అంతరాయం కలగవచ్చనే అంచనాలు అందరినీ కలవరపరుస్తున్నాయి.

వరుణుడు కరుణించాలని, రెండు జట్లు అన్ని ఓవర్లూ ఆడాలని క్రికెట్ అభిమానులు పూజలు చేస్తున్నారు. తమ జట్టు గెలుపు కోసం ప్రార్థనలు చేస్తున్నారు.

భారత్-పాక్ వరల్డ్ కప్ మ్యాచ్ సందర్భంగా వర్షం కురిపించవద్దంటూ ప్రయాగరాజ్ లోని క్రికెట్ అభిమానులు వరుణ దేవుడికి పూజలు చేశారని, గోరఖ్‌పూర్, మొరాదాబాద్ వంటి ప్రాంతాల్లో భారత్ విజయం కోసం అభిమానులు పూజలు, ప్రార్థనలు చేశారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

భారత జట్టు ప్రపంచ కప్ పోటీల్లో ఇంతవరకూ పాక్ చేతిలో ఓడిపోలేదు. ఇప్పటివరకూ ఆడిన ఆరు మ్యాచుల్లో భారత జట్టు విజయం సాధించింది.

ఈ మ్యాచ్ జరగడానికి ముందు ఆడిన అయిదు మ్యాచుల్లో భారత జట్టు నాలుగు విజయాలను సొంతం చేసుకుంది. 2017లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మాత్రం పాక్ గెలిచింది.

మాంచెస్టర్ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే ప్రపంచ కప్‌లో పాక్ మీద తన విజయ పరంపర కొనసాగించినట్లవుతుంది.

ఒకవేళ, పాకిస్తాన్ కనుక గెలిస్తే ఈ జట్టుకు కొత్త చరిత్రను సృష్టించిన ఘనత సొంతమవుతుందని పాక్ కోచ్ మిక్కీ ఆర్థర్ అన్నారు.

ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ కెప్టెన్సీ

కాసేపట్లో మ్యాచ్ జరగబోతుండా పాకిస్తాన్ ప్రధానమంత్రి, ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ తమ జట్టును ఉద్దేశించి వరస ట్వీట్లు చేశారు. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఉంటాయి. ఎవరి మానసిక స్థయిర్యం ఎంతన్న దానిపైనే విజయం ఆధారపడి ఉంటుందని ఇమ్రాన్ ట్వీట్ చేశారు.

పిచ్ తడిగా లేకపోతే సర్ఫరాజ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం ఉత్తమమని కూడా ఇమ్రాన్ సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)