'వాయు' తుపాను: దిశ మారింది... గుజరాత్‌కు ప్రమాదం తప్పింది

  • 13 జూన్ 2019
వాయు తుపాను Image copyright Reuters

గురువారం నాడు భారత పశ్చిమ తీర ప్రాంతం మీద విరుచుకుపడుతుందని భావించిన 'వాయు' తుపాను తన దిశను మార్చుకుని అరేబియా సముద్రంలోకి మళ్ళింది.

‘వాయు’ తుపాను చాలా తీవ్రంగా ఉంటుందనే అంచనాలతో ముందుగానే ఈ ప్రాంతాల నుంచి లక్షలాది మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

తుపాను దిశ మళ్లినప్పటికీ ఇక్కడ భారీ గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

అంతకుముందు, వాయు తుపాను గురువారం ఉదయం తీరం తాకుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 170 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు, భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరించారు.

Image copyright Reuters

గుజరాత్ రాష్ట్రంలో, కేంద్ర పాలిత ప్రాంతమైన దామన్, దయ్యూలోను స్కూళ్లు, కాలేజీలను మూసివేశారు. రైళ్ళు, విమాన సేవలను రద్దు చేశారు. గుజరాత్‌లోని గల్ఫ్ ఆఫ్ కాంబే ఓడరేవులో కార్యకలాపాలన్నిటినీ నిలిపివేశారు.

మత్స్యకారులు జూన్ 15 వరకూ సముద్రం మీదకు వెళ్ళవద్దని కూడా అధికారులు సూచించారు.

సహాయ చర్యల కోసం సౌరాష్ట్ర, కచ్‌లలోని తీర ప్రాంతాల్లో జాతీయ విపత్తు సహాయ దళం (ఎన్‌డీఆర్ఎఫ్) బృందాలను సంసిద్ధంగా మోహరించారు.

తుపాను మార్గంలో ఉన్న వారు సురక్షితంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

ఇప్పటికే గుజరాత్ తీర ప్రాంతాల నుంచి 3 లక్షల మందిని, దామన్, దయ్యూ దీవుల నుంచి 10 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. తీర ప్రాంత భద్రతా సిబ్బంది, భారత వాయుసేన ఇప్పటికే రంగంలోకి దిగి రక్షణ చర్యలు చేపట్టాయని, హెలికాప్టర్లు, విమానాలతో పరిస్థితిని అంచనా వేస్తున్నారని ఆయన తెలిపారు.

1998లో దాదాపు 10,000 మందిని బలితీసుకున్న భీకర తుపాను తర్వాత గుజరాత్‌ను తాకనున్న అత్యంత తీవ్రమైన తుపాను ఇదేనని భావిస్తున్నారు.

అరేబియా సముద్రం మీంచి ఈ వాయుగుండం తీరం తాకే సమయానికి గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణశాఖ నిపుణులు తెలిపారు. దీన్ని వారు 'తీవ్ర' తుపానుగా అభివర్ణిస్తున్నారు.

తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని భావిస్తున్న 10 జిల్లాల్లో జూన్ 13, 14 తేదీలలో పాఠశాలలు, కాలేజీలకు సెలవు ఇస్తున్నట్లు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ ప్రకటించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక తుపాను నేపథ్యంలో గుజరాత్ తీర ప్రాంతాల్లో సహాయ సిబ్బందిని మోహరించారు

ముంబయిపై ప్రభావం

వాయు తుపాను ప్రభావం ముంబయి తీర ప్రాంతం మీద కూడా కొంత మేర ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతానికి మధ్య స్థాయి హెచ్చరికలు జారీ చేశారు. ఇక్కడ గాలులు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, దాని గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత వాతావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కేఎస్ హోసాలికర్ చెప్పారు.

ఈ ఏడాది మే నెలలో తూర్పు తీరంలోని ఒడిశా రాష్ట్రాన్ని కూడా తీవ్ర తుపాను తాకింది.

అది వాయు తుపాను కన్నా తీవ్రమైనది. గంటకు 200 కిలోమీటర్ల వరకూ వేగంతో పెను గాలులు వీచాయి. దానివల్ల దాదాపు 80 మంది చనిపోయారు.

కానీ.. ముందస్తు ఏర్పాట్లు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించటం వల్ల ప్రాణ నష్టం చాలా తగ్గిందని అధికారులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)