ఏపీ అసెంబ్లీ సమావేశాలు: ప్రతిపక్షం నాకేమీ కొత్త కాదన్న చంద్రబాబు... 'దేవుడి స్క్రిప్ట్' వినిపించిన జగన్

  • 13 జూన్ 2019
చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ రెండో స్పీకర్‌గా ఆముదాలవలస వైసీపీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాంను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నిక తర్వాత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఇతర ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు. రెండో రోజే సభలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటుచేసుకున్నాయి.

గత ప్రభుత్వం సభను నడిపిన విధానం గురించి జగన్ వ్యంగ్యాస్త్రాలు, విమర్శలు చేశారు. అందుకు ప్రతిగా చంద్రబాబు కూడా సమాధానం చెప్పారు.

ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రతిపక్ష నేతను మాట్లాడనివ్వని దిగజారిన వ్యవస్థను ఇదే చట్టసభలో చూశామని, కానీ, తాను అలాంటి సంప్రదాయాలను పాటించనని అన్నారు. రాజ్యాంగ విలువలు తెలిసిన వ్యక్తి కాబట్టి తమ్మినేని సీతారాంను స్పీకర్‌గా బాధ్యతలు తీసుకోవాలని కోరామన్నారు.

''పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టాన్ని, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను తుంగలో తొక్కి, 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకోవడం ఇదే శాసనసభలోనే చూశాం. ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయని ప్రభుత్వం మీద ప్రజలే అనర్హత వేటు వేస్తే ఎలావుంటుందో ఈ ఎన్నికల్లో చూశాం'' అని జగన్ అన్నారు.

‘దేవుడి స్క్రిప్ట్ అలా ఉంది’

ఎన్నికల్లో గెలిచిన మొదటి రోజు చెప్పిన ‘దేవుడి స్క్రిప్ట్‌’నే జగన్ మళ్లీ ప్రస్తావించారు.

''23 మంది ఎమ్మెల్యేలను కొన్నవారికి ఇప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను కొన్నందుకు ఇప్పుడు కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే మిగిలారు. అదీ దేవుడి స్క్రిప్ట్! అది కూడా 23వ తారీఖునే వెలువడింది'' అన్నారు.

టీడీపీ నుంచి ఓ ఐదారుమంది ఎమ్మెల్యేలను లాక్కుంటే చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండదని తనతో ఎవరో అంటే, అప్పుడు తనకు, చంద్రబాబు గారికి తేడా ఉండదని వారికి సమాధానం చెప్పానని జగన్ అన్నారు.

తాము టీడీపీ ఎమ్మెల్యేలను తీసుకోవాలనుకుంటే, వారితో రాజీనామా చేయించాకే తమ పార్టీలోకి తీసుకుంటామని జగన్ అన్నారు. ఒకవేళ అలా చేయకపోతే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేయమని జగన్ స్పీకర్‌ను కోరారు.

Image copyright Getty Images

‘ప్రతిపక్షం నాకు కొత్త కాదు’

జగన్ ప్రసంగం తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రసంగం ప్రారంభమైంది.

చంద్రబాబు ప్రసంగం ప్రారంభంలో మైక్ సరిగా పనిచేయకపోవడంతో, మీ ఆధ్వర్యంలో మైక్ సరిగా పనిచేయడం లేదని ఆయన విమర్శించారు.

''మైకులు సరే... మీ మాటలేమీ బాగో లేవు. నాకు సుదీర్ఘ అనుభవం ఉంది. మీ అందరికంటే ఎక్కువ అనుభవం ఉంది. కాబట్టి మాటలేవీ తగ్గవు. ఏమీ బాధ లేదు. రాజకీయాల్లో అన్నీ చూశాను. మీ ఆధ్వర్యంలో మైకు ఇలా పని చేస్తోంది కాబట్టి మీరే ఆలోచించుకోవాలి. మీకేమీ డౌటు వద్దు.. నా వాయిస్ తగ్గదు, పోరాటమూ తగ్గదు. నాకు ప్రతిపక్షం కొత్త కాదు. ఇది మూడోసారి నాకు ప్రతిపక్షం. మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను కాంట్రవర్సీ జోలికి పోవాలనుకోవడం లేదు’’ అంటూ, స్పీకర్‌కు శుభాకాంక్షలు తెలిపే ప్రసంగాన్ని ఆయన కొనసాగించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం