చంద్రయాన్-2 మిషన్‌‌ సూత్రధారులు ఈ ఇద్దరు మహిళలు

  • 15 జూన్ 2019
చంద్రయాన్-2 Image copyright STAR PLUS/TED TALKS/ GETTY IMAGES
చిత్రం శీర్షిక రీతూ కరిధల్(ఎడమ), ఎం.వనిత

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరోసారి చంద్రుడి మీదకు ఉపగ్రహాన్ని పంపించబోతోంది.

ఈ శాటిలైట్‌ను జులై 15 తెల్లవారుజామున 2 గంటల 51 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తారు.

ఇస్రో ఇంతకు ముందు 2008 అక్టోబర్‌లో చంద్రయాన్-1 ఉపగ్రహం చంద్రుడిపైకి పంపించింది.

ఇప్పుడు చంద్రయాన్-2 మిషన్‌కు ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఇది మహిళల నేతృత్వంలో జరుగుతున్న మొట్టమొదటి గ్రహాంతర మిషన్‌గా నిలిచింది.

రీతూ కరిధల్ దీనికి మిషన్ డైరెక్టర్‌గా, ఎం.వనిత ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఉన్నారు.

చంద్రయాన్-2 గురించి ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె.శివన్ "మాకు మహిళలు, పురుషులు అనే తేడా లేదు. ఇస్రోలో సుమారు 30 శాతం మంది మహిళలు పనిచేస్తున్నారు" అన్నారు.

ఇస్రోలో ఒక పెద్ద మిషన్‌లో మహిళలు కీలకం కావడం ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు మార్స్ మిషన్‌లో కూడా 8 మంది మహిళలు కీలక పాత్ర పోషించారు.

ఈసారీ చంద్రయాన్-2 మిషన్‌కు నేతృత్వం వహిస్తున్న రీతూ కరిధల్, ఎం.వనిత ఎవరు? వారి నేపథ్యం ఏమిటి?

Image copyright ASIF SAUD
చిత్రం శీర్షిక చంద్రయాన్-2 మిషన్ డైరెక్టర్ రీతూ కరిధల్

రీతూ-రాకెట్ వుమెన్ ఆఫ్ ఇండియా

చంద్రయాన్-2 మిషన్ డైరెక్టర్ రీతూ కరిధల్‌ను 'రాకెట్ వుమెన్ ఆఫ్ ఇండియా' అని పిలుస్తారు. మార్స్ ఆర్బిటర్ మిషన్‌లో ఆమె డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.

ఏరోస్పేస్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన కరిధల్, లక్నో విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు.

రీతూ 2007లో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ నుంచి 'ఇస్రో యంగ్ సైంటిస్ట్' అవార్డ్ కూడా అందుకున్నారు.

రీతూ కరిధల్‌కు చిన్నతనం నుంచీ సైన్స్‌ అంటే ఆసక్తి ఉండేది.

మార్స్ ఆర్బిటర్ మిషన్ తర్వాత బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె "నేను చంద్రుడి ఆకారం తగ్గడం, పెరగడం చూసి కంగారు పడేదాన్ని. అంతరిక్షలో చీకట్లు దాటి అవతల ఉన్న విశ్వం గురించి తెలుసుకోవాలని అనుకునేదాన్ని" అని చెప్పారు.

రీతూకు నచ్చిన సబ్జెక్ట్స్ ఫిజిక్స్, మ్యాథ్స్. ఆమె నాసా, ఇస్రో ప్రాజెక్టుల గురించి వార్తాపత్రిక కటింగ్స్ సేకరించేవారు. స్పేస్ సైన్స్‌కు సంబంధించిన ప్రతి చిన్న విషయం గురించీ తెలుసుకోవాలని ప్రయత్నేంచేవారు.

సైన్స్, అంతరిక్షం అంటే ఉన్న ఆసక్తే రీతూను ఇస్రో వరకూ తీసుకొచ్చింది. "పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక నేను ఇస్రోలో ఉద్యోగం కోసం అప్లై చేశాను, స్పేస్ సైంటిస్ట్ అయ్యాను" అని ఆమె చెప్పారు.

ఆమె దాదాపు 20-21 ఏళ్లలో ఇస్రోలో చాలా ప్రాజెక్టులపై పనిచేశారు. వీటిలో 'మార్స్ ఆర్బిటర్ మిషన్' చాలా ముఖ్యమైనది.

Image copyright AFP

'మార్స్ మిషన్' మహిళలు

కుటుంబ సభ్యుల సహకారం లేకుండా ఎవరూ తమ లక్ష్యాన్ని సాధించలేరని రీతూ కరిఘల్ చెబుతారు.

ఆమెకు ఇద్దరు పిల్లలు, ఒక బాబు, ఒక పాప. తల్లి అయిన తర్వాత ఇంట్లో ఉంటూ కూడా ఆఫీస్ పని చేసేదాన్నని, అప్పుడు పిల్లల్ని చూసుకోవడంలో తన భర్త సాయం చేసేవారని రీతూ చెప్పారు. "కుటుంబ సభ్యులు మీ ఆసక్తి, కష్టం చూసినప్పుడు వారికి కూడా మీకు అండగా నిలవాలని అనిపిస్తుంది" అన్నారు.

"నా కొడుకు 11 ఏళ్లు, పాపకు ఐదేళ్ల వయసులో మేం సమయం ఆదా చేయడానికి మల్టీ టాస్కింగ్ చేసేవాళ్లం. ఆఫీస్‌లో బాగా అలసిపోయినా, ఇంటికి వచ్చి పిల్లలను చూడగానే నా అలసట అంతా పోయేది, చాలా బాగా అనిపించేది" అన్నారు.

"పురుషులు అంగారక గ్రహం నుంచి వస్తారని, మహిళలు శుక్రుడి నుంచి వస్తారని చెబుతారు. కానీ మార్స్ మిషన్‌ విజయవంతం అయ్యాక చాలా మంది మహిళా శాస్త్రవేత్తలను 'మార్స్ మహిళలు' అనడం మొదలుపెట్టారు. నేను భూమిపై అద్భుత అవకాశం అందుకున్న ఒక భారత మహిళను" అన్నారు.

స్టార్ ప్లస్‌లో టెడ్ టాక్ అనే ఒక కార్యక్రమంలో మాట్లాడిన రీతూ కరిధల్ "నాకు మా అమ్మనాన్నలు 20 ఏళ్ల క్రితం ఇచ్చిన ఆత్మవిశ్వాసం ఈరోజు తల్లిదండ్రులు తమ ఆడ పిల్లల్లో చూస్తున్నారు. కానీ అమ్మాయిలు నగరాల్లో ఉన్నా, పట్టణాల వారైనా తల్లిదండ్రులు వారికి సరైన సహకారం అందిస్తేనే వారు చాలా ముందుకు వెళ్లగలరు" అని చెప్పారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక చంద్రయాన్-2 ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.వనిత

ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.వనిత

ఎం.వనిత చంద్రయాన్-2లో ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆమె డిజైన్ ఇంజనీర్ శిక్షణ తీసుకున్నారు. 'ఆస్ట్రనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా' నుంచి 2006లో బెస్ట్ వుమన్ సైంటిస్ట్ అవార్డు అందుకున్నారు. వనిత చాలా ఏళ్ల నుంచీ ఉపగ్రహాల కోసం పనిచేస్తున్నారు.

దీనిపై మాట్లాడిన సైన్స్ నిపుణులు పల్లవ్ బాగ్లా "మిషన్ ఏదైనా దాని పూర్తి బాధ్యతలు ప్రాజెక్ట్ డైరెక్టర్‌పైనే ఉంటాయి. ఒక మిషన్‌కు ఒకే ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉంటారు. అయితే కొన్ని మిషన్‌లలో ఆర్బిట్ డైరెక్టర్, శాటిలైట్ లేదా రాకెట్ డైరెక్టర్‌ అంటూ ఒకరికంటే ఎక్కువ మంది మిషన్ డైరెక్టర్లు ఉండవచ్చు. రీతూ కరిధల్ ఇందులో ఏ మిషన్ డైరెక్టర్ అనేది ఇంకా స్పష్టంగా తెలీడం లేదు" అన్నారు.

చంద్రయాన్-2 మిషన్ విజయవంతం అయ్యేలా వనిత ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అన్ని కోణాలూ చూసుకోవాల్సి ఉంటుంది. ఆమెకు పైన ఒక ప్రోగ్రాం డైరెక్టర్ ఉంటారు.

Image copyright EPA

చంద్రయాన్-2 అంటే..

చంద్రయాన్-2 చాలా ప్రత్యేకమైన ఉపగ్రహం. ఇందులో ఒక ఆర్బిటర్, 'విక్రమ్' అనే లాడర్, 'ప్రజ్ఞాన్' అనే రోవర్ ఉంటాయి. దీని ద్వారా భారత్ చంద్రుడి ఉపరితలంపై మొదటిసారి 'సాఫ్ట్ ల్యాండింగ్' చేయబోతోంది. ఇది చాలా క్లిష్టమైనది.

ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం 600 కోట్ల రూపాయలకు పైనే అని చెబుతున్నారు. 3.8 టన్నుల చంద్రయాన్-2ను జీఎస్ఎల్వీ మార్క్-3 ద్వారా అంతరిక్షంలోకి పంపించబోతున్నారు.

భారత్ తన ఉపగ్రహం ముద్రను చంద్రుడిపై వేయడానికి ఇది చాలా కీలకమైన మిషన్. ఈ మిషన్ కచ్చితంగా విజయవంతం అవుతుందని ఇస్రో చెబుతోంది.

ఇంతకు ముందు జరిగిన చంద్రయాన్-1 మిషన్ రెండేళ్లు జరగాలి. కానీ అందులో లోపాలు తలెత్తడంతో అది ఏడాదిలోనే ముగిసింది. దాని నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నామని, చంద్రయాన్-2లో ఆ లోపాలు సరిదిద్దామని ఇస్రో చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)