అమెరికాపై భారత్ సుంకాలు.. బాదం, యాపిల్ సహా 28 ఉత్పత్తులపై నేటి నుంచి అమల్లోకి

  • 16 జూన్ 2019
మోదీ, ట్రంప్ Image copyright Getty Images

బాదం, యాపిల్ సహా 28 అమెరికా ఉత్పత్తులపై భారత్ ఇటీవల విధించిన దిగుమతి సుంకాలు ఈ రోజే అమల్లోకి వచ్చాయి. కొన్ని ఉత్పత్తులపై సుంకాలు అత్యధికంగా 70 శాతం ఉన్నాయి.

ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అధిక పన్నుల నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలన్న భారత్ అభ్యర్థనను అమెరికా తిరస్కరించడంతో భారత్ ఈ నిర్ణయం తీసుకొంది.

వాణిజ్యపరంగా ప్రాధాన్య దేశాల జాబితా నుంచి భారత్‌ను తొలగిస్తున్నట్లు దాదాపు రెండు వారాల క్రితం అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనికి ప్రతిగా భారత్ ఇటీవల ఈ నిర్ణయం తీసుకొంది.

అమెరికాలోని 'జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్(జీఎస్‌పీ)' కింద భారత్‌ ప్రాధాన్య దేశాల జాబితాలో ఉండేది. ఈ జాబితా నుంచి భారత్‌ను తొలగించడంతో 5.6 బిలియన్ డాలర్ల విలువైన భారతీయ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇంతకుముందు ఈ ఉత్పత్తులపై అమెరికాలో సుంకాలు లేవు.

Image copyright Getty Images

గత ఏడాది జూన్‌లో 120 శాతం వరకు సుంకాలను భారత్ ప్రకటించింది. వాణిజ్య చర్చలతో వీటి అమలు ఆలస్యమైంది.

28 అమెరికా ఉత్పత్తులపై సుంకాల విధింపు ప్రజాప్రయోజనకర నిర్ణయమని భారత ఆర్థికశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో చెప్పింది.

అమెరికా-భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 2018వ సంవత్సరంలో 142 బిలియన్ డాలర్లుగా ఉందని అమెరికా గణాంకాలు చెబుతున్నాయి.

2001 నాటి లెక్కలతో పోలిస్తే ఇది ఏడింతలు పెరిగింది.

చిత్రం శీర్షిక అమెరికా సుంకాలతో వ్యాపారం, లాభాలు తగ్గుతాయని భారత తయారీ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి.

చైనా, భారత్ తదితర దేశాలతో వ్యాపార సంబంధాలు అన్యాయంగా ఉన్నాయని, వీటిని చక్కదిద్దాల్సి ఉందని చెబుతూ ట్రంప్ ప్రభుత్వం వివిధ చర్యలు చేపడుతోంది. ట్రంప్ చర్యలతో అమెరికా, భారత్ మధ్య వాణిజ్య సంబంధాల్లో ఒడిదొడుకులు పెరుగుతున్నాయి.

గత సంవత్సరం ఉక్కు, అల్యూమినియంపై అమెరికా పన్నులను పెంచడాన్ని భారత్ వ్యతిరేకిస్తూ, ప్రతి చర్యగా అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే అనేక ఉత్పత్తులపై సుంకాలు పెంచింది.

త్వరలో జపాన్‌లో జీ-20 సదస్సు సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయోతో భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ సమావేశం కానున్న తరుణంలో, భారత్ 28 అమెరికా ఉత్పత్తులపై సుంకాలను విధించింది.

జీ-20 సదస్సు సందర్భంగా ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ కూడా చర్చలు జరిపే అవకాశం ఉంది.

Image copyright Getty Images

అమెరికా సుంకాలను ఎందుకు పెంచుతోంది?

'జీఎస్‌పీ' ప్రయోజనాలు పొందుతున్న సంస్థలకు దెబ్బ తగిలితే భారత వాణిజ్యరంగం బెంబేలెత్తుతుందని, నరేంద్ర మోదీ ప్రభుత్వం పునరాలోచనలో పడుతుందని అమెరికా ఆశిస్తోంది.

భారత్ తన మార్కెట్లను అమెరికా కంపెనీల కోసం ''న్యాయంగా, సహేతుకంగా'' తెరవటం లేదన్నది ట్రంప్ ప్రధాన ఆరోపణల్లో ఒకటి.

అమెరికా వైద్య పరికరాలు, కొన్ని పాల ఉత్పత్తులను భారత్‌లోని వినియోగదారులకు విక్రయించటానికి అనుమతుల విషయమై నెలకొన్న వివాదం ఉభయ దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలకు దారితీస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు