డీజే పూజా సేథ్: "అమ్మానాన్న పెళ్లి చేసుకోవాలన్నారు.. నేనేమో డీజేనయ్యా"

  • 17 జూన్ 2019
పూజా సేథ్

భారత్‌లో మహిళా డీజే(డిస్క్ జాకీ)లు చాలా తక్కువ. బెంగళూరులోని పూజా సేథ్ వీరిలో ఒకరు. ఫొటోగ్రాఫర్ సాయన్ హజ్రా ఆమెను కలిసి అందిస్తున్న కథనం ఇది.

"నేను వినిపించే సంగీతాన్ని ఎవరైనా ఆస్వాదించడం చూస్తే నాకు చాలా సంతోషం కలుగుతుంది. సంగీతం వినిపించడం అంటే ఒక రకంగా స్వేచ్ఛను వ్యక్తీకరించడం. ప్రపంచానికి నన్ను నేను వ్యక్తీకరించుకొనేందుకు సంగీతం వీలు కల్పిస్తుంది" అని పూజ చెప్పారు.

ఆమెకు 31 ఏళ్లు. 2014లో ఆమె బెంగళూరులో డీజేగా పనిచేయడం మొదలుపెట్టారు.

కొన్నేళ్లుగా బెంగళూరులో బార్లు, పబ్‌ల సంఖ్య బాగా పెరుగుతూ వస్తోంది.

తాను మొదట క్లబ్బుల్లో డీజేగా సేవలందించడం మొదలుపెట్టానని పూజ తెలిపారు. ఇతర నగరాల నుంచి ప్రదర్శనలు(గిగ్‌లు)‌ ఇచ్చేందుకు బెంగళూరుకు వచ్చే మహిళా డీజేలను కలిసేదాన్నని చెప్పారు. తనకు తెలిసినంత వరకు అప్పట్లో బెంగళూరులోనే ఉండి సేవలదిందించే మహిళా డీజే ఎవరూ లేరని పేర్కొన్నారు.

బెంగళూరులో కొన్ని ప్రదర్శనలు ఇచ్చిన తర్వాత 'స్థానిక మహిళా డీజే'గా తనకు పేరు వచ్చిందంటూ ఆమె సంతోషం వ్యక్తంచేశారు.

డీజేగా తన ప్రయాణం మాత్రం అంత తేలిగ్గా మొదలు కాలేదు.

పూజ దేశంలోని తూర్పు ప్రాంతంలో ఒక పల్లెటూరిలో సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే కుటుంబంలో పుట్టారు.

తాను ఉద్యోగం చేయాలనుకున్నానని, తల్లిదండ్రులు మాత్రం పెళ్లి చేసుకోవాలని చెప్పేవారని, కానీ పెళ్లి చేసుకోవాలని తానెప్పుడూ అనుకోలేదని పూజ వివరించారు.

ఉన్నత పాఠశాలలో చదువు పూర్తయిన తర్వాత, ఇల్లు వదిలి వచ్చేసి, తన కలలను సాకారం చేసుకోవాలనుకున్నానని ఆమె తెలిపారు.

"మా కులంలో మహిళలు ఉద్యోగం చేయడాన్ని, ఏదైనా వృత్తిని చేపట్టడాన్ని ఒప్పుకోరు. చాలా మంది మహిళలు పెళ్లయ్యే వరకు ఒంటరిగా బయటకు కూడా రారు. అందుకే ఇంట్లోంచి వచ్చేయాలని నేను నిర్ణయించుకొన్నాను" అని పూజ చెప్పారు.

ఆమె ఇల్లు వదిలి వచ్చిన తర్వాత ఉద్యోగ వేటలో పడ్డారు. బెంగళూరులో ఎయిర్ హోస్టెస్‌గా ఉద్యోగంలో చేరారు. అప్పుడే ఆమె తొలిసారిగా ఒక వేడుకలో పాల్గొనేందుకు వెళ్లారు.

వేడుకలో తన దృష్టిని మొదట ఆకర్షించింది డీజేయేనని, తాను ఏం చేయాలనుకుంటున్నానో తర్వాత అర్థమైందని ఆమె తెలిపారు.

"బెంగళూరులో కొందరు డీజేలతో పరిచయం పెంచుకొని స్నేహితులమయ్యాం. వాళ్లు ప్రాథమిక అంశాలు నేర్పించారు. మిగతా విషయాలు యూట్యూబ్ వీడియోలు చూసి నేర్చుకున్నాను" అని పూజ వివరించారు.

ఆమె గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 450కి పైగా గిగ్‌లలో పాల్గొన్నారు.

"ఆడవారు మద్యం తాగడం, సిగరెట్ కాల్చడం నేను మా ఊళ్లో ఎన్నడూ చూడలేదు. ఈ రెండు పనులు చేసే ఎంతో మంది మధ్య నేను ఇప్పుడు స్వేచ్ఛగా సంగీతం వినిపిస్తాను" అని పూజ చెప్పారు.

డీజే ఎంతో ఆకర్షణీయమైన వృత్తే అయినప్పటికీ, ఇందులో ఉండే ఇబ్బందులు ఇందులో ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు. ఇది మహిళల వృత్తి కాదని చాలా మంది అంటుంటారని చెప్పారు.

క్లబ్బుల్లో కొందరు మద్యం తాగిన మత్తులో అనుచితంగా ప్రవర్తిస్తుంటారని ఆమె తెలిపారు.

కొన్నిసార్లు ఫోన్ నంబరు అడుగుతుంటారని, ఇలాంటి వాళ్లను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోవడం కష్టమవుతుంటుందని, అప్పుడు రక్షణగా ఉన్న బౌన్సర్ల సాయం తీసుకుంటుంటానని పూజ చెప్పారు.

Image copyright Sayan Hazra

ఇబ్బందులు ఉన్నప్పటికీ పూజ తాను ఎంచుకొన్న వృత్తిని వదులుకోలేదు.

తాను వినిపించే సంగీతానికి శ్రోతలు నృత్యం చేయడం, ఉర్రూతలూగడం డీజే వృత్తిలో తనకు బాగా నచ్చే అంశాలని ఆమె తెలిపారు.

ఫొటోలు: సాయన్ హజ్రా

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: పాకిస్తాన్‌ను ఉర్రూతలూగిస్తున్న ఎనిమిదేళ్ల బాలిక

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

అపోలో-11 కన్నా పదేళ్ళ ముందే చంద్రుని మీదకు ఉపగ్రహాన్ని పంపిన రష్యా...

ఈ మహిళలు తుపాకీ రిపేర్ చేస్తే తూటా సూటిగా దూసుకుపోవాల్సిందే...

కుల్‌భూషణ్ జాధవ్ కేసులో పాకిస్తాన్ ఐసీజే ఉత్తర్వును గౌరవించకపోతే...

ప్రెస్ రివ్యూ: మోదీది ఓ గెలుపా? ఆయన ఏం పనిచేసి గెలిచారు... -కేసీఆర్

ఫుట్‌బాల్ ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్ వైట్ హౌస్‌లో అడుగు పెట్టనని ఎందుకన్నారు...

అక్కడ గ్రహాంతర జీవులున్నాయా? అందుకే ఎవరూ రావద్దని అమెరికా హెచ్చరించిందా...

బిహార్, అస్సాం వరదలపై రాహుల్ గాంధీ ట్వీట్‌లోని ఫొటోల్లో నిజమెంత

రిచా భారతీ: ఖురాన్ పంపిణీ చేయాలన్న కోర్టు.. ప్రాథమిక హక్కును కాలరాయడమే అంటున్న ఝార్ఖండ్ యువతి