హిందీని తమిళులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

  • 17 జూన్ 2019
హిందీ, బాలుడు Image copyright Getty Images

హిందీయేతర రాష్ట్రాల్లో పాఠశాలల స్థాయిలో విద్యార్థులు ప్రాంతీయ భాష, ఇంగ్లీష్‌లతో పాటుగా హిందీ కూడా నేర్చుకోవాలంటూ కస్తూరిరంగన్ కమిటీ తన నివేదికలో సిఫార్సు చేయడంపై తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

అయితే, ఈ విషయంపై తమిళుల ఆగ్రహాన్ని చూస్తే తమిళనాడు వెలుపలి భారతీయులకు కొంత చికాకుగా అనిపించొచ్చు. కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో హిందీ బోధనను తప్పనిసరి చేయడం పట్ల తమిళులు గతంలో ఎలా ప్రతిఘటించారో సుదీర్ఘ చరిత్రను గుర్తుచేసుకుంటే ఆ చికాకు తగ్గుతుంది.

ఇది ఇప్పుడు మొదలైంది కాదు, దాదాపు రెండు శతాబ్దాలుగా ఉంది. 1833లో భారత్‌లో క్రిస్టియన్ మిషనరీల కార్యకలాపాలను నియంత్రించే విధానాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు చేసింది. దాంతో, క్రైస్తవాన్ని విస్తరించేందుకు మిషనరీలు దేశంలోకి పెద్దఎత్తున ప్రవేశించారు. దక్షిణ భారత దేశాన్ని లక్ష్యంగా ఎంచుకున్నారు.

దక్షిణాన ఆ మిషనరీలు ఎంతగా విస్తరించాయో తెలియాలంటే, రెండు విషయాలను చూడాలి.

మొదటిది క్రిస్టియన్ ప్రచార గ్రంథాల ప్రవాహం: 1832 నాటికి తమిళంలో 40,000 క్రైస్తవ గ్రంథాలు మాత్రమే ముద్రించి ఉండగా, 1852 నాటికి ఆ సంఖ్య 2,10,000కు చేరింది. (ఆధారం: ప్రముఖ రచయిత ఎంఎస్‌ఎస్ పాండియన్ రాసిన 'బ్రాహ్మిణ్ అండ్ నాన్ బ్రాహ్మిణ్' పుస్తకం)

రెండోది మిషనరీ పాఠశాలల వ్యాప్తి: 1852లో ఒక్క మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలోనే 1185 మిషనరీ పాఠశాలలు ఉన్నాయి, వాటిలో 38,000 మంది విద్యార్థులు ఉండేవారు. అదే సమయంలో బాంబే, బెంగాల్ ప్రెసిడెన్సీలలో కలిపి కేవలం 18,000 మంది విద్యార్థులతో 472 మిషన్ స్కూళ్లు మాత్రమే ఉండేవి. (ఆధారం: 'ది ద్రవిడియన్ స్టోరీ' అనే పుస్తకంలో ఎస్.నారాయణ్ రాశారు.)

ఈ క్రైస్తవ మిషనరీలు సువార్తను వ్యాప్తి చేయడానికి మాత్రమే పరిమితం కాలేదు. హిందూ దేవతలు, హిందూ నమ్మకాలను చెడగొట్టడం ద్వారా మత మార్పిడి పట్ల హిందువులు చేస్తున్న ప్రతిఘటనను అధిగమించేందుకు ప్రయత్నించారు.

మిషనరీల ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు బ్రాహ్మణ మేధావి వర్గమంతా వేదాలు, పురాణాలు, శంకర అద్వైత తత్వశాస్త్రంలో బాగా ప్రావీణ్యం సాధించింది. యూరోపియన్, బ్రిటీష్ వారి స్థాయిలో ఆంగ్లంలోనూ బ్రాహ్మణులు పట్టు సాధించారు. హిందూ మతం, సంస్కృతిపై దాడిని తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తూనే, బ్రాహ్మణులు బ్రిటిష్ వలస పాలనా యంత్రాంగంలో ఉన్నత ఉద్యోగాలను చేజిక్కించుకోవడంపై దృష్టిపెట్టారు.

బ్రిటిష్ వలస పాలనా కాలంలో బ్రాహ్మణుల ఆధిపత్యం ఎలా ఉండేదో నారాయణ్ ఇలా వివరించారు: "1892 నుంచి 1904 మధ్యలో నియమితులైన 16 మంది ఐసీఎస్ (ఇంపీరియల్ సివిల్ సర్వీస్) అధికారుల్లో 15 మంది బ్రాహ్మణులే. 27 మంది ఇంజినీర్లలో 21 మంది వారే. అప్పుడు తమిళ జనాభాలో బ్రాహ్మణులు 3 శాతం కంటే తక్కువ మందే ఉండేవారు. అయినా మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీలు అందుకునేవారిలో 67 శాతం మంది వారే ఉండేవారు. ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు, జిల్లా పాలనా యంత్రాంగంలోనూ వారి ప్రాబల్యం బాగా పెరిగింది. మద్రాస్ హైకోర్టును, బార్ అసోసియేషన్‌ను కూడా పరోక్షంగా నియంత్రించే స్థాయిలో ఉండేవారు. ప్రముఖ జర్నలిస్టుల్లో అధిక శాతం ఆ సామాజిక వర్గానికి చెందిన వారే. ప్రైవేటు సంస్థల్లోనూ వారు పట్టు సాధించారు."

అయితే, బ్రాహ్మణుల ప్రతిఘటన ఉద్యమం ఎక్కువ కాలం కొనసాగలేదు. 1916లో, టీఎం నాయర్, పిట్టి తీగరాయ చెట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చి ''బ్రాహ్మణేతర మేనిఫెస్టో'' విడుదల చేశారు. అదే ఏడాది 'తమిళ సంస్కృతం'లో తమిళయేతర పదాలు లేకుండా 'శుద్ధి' చేయాలంటూ ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ మరైమళై అడిగళ్ (అడిగళ్ అంటే మహాత్మా అని అర్థం) ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈ రెండు వర్గాల కలయికతో 1920లో జస్టిస్ పార్టీ ఏర్పడింది. మద్రాస్ ప్రెసిడెన్సీ రాజకీయాల్లో కాంగ్రెస్- బ్రాహ్మణ ఆధిపత్యానికి ఆ పార్టీ గట్టి సవాల్‌ విసిరింది. అది యాంటీ- కాంగ్రెస్, యాంటీ -బ్రాహ్మణ, యాంటీ- ఆర్యన్, యాంటీ- ఉత్తర భారత్, యాంటీ- సంస్కృతం, యాంటీ- హిందీగా, ఆఖరికి తమిళ వేర్పాటువాదానికి, 'ద్రావిడనాడు' డిమాండ్ వరకూ వెళ్లింది.

అయితే, మహాత్మా గాంధీ ప్రోత్సాహంతో 1918లో 'దక్షిణ హిందీ ప్రచార సభ' ఏర్పడటంతో తమిళ ప్రత్యేక వాద అభివృద్ధికి ఎదురుదెబ్బ తగిలింది.

తమిళ ప్రతిఘటన ఉద్యమం పతాక స్థాయికి చేరే సమయంలోనే 1937లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో జస్టిస్ పార్టీ తడబడింది.

గాంధేయవాది అయిన సి.రాజగోపాలాచారి (రాజాజీ) భారీ విజయం సాధించి, ఉమ్మడి మద్రాస్ ప్రావిన్సుకు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రముఖ తమిళ మేగజీన్ సుదేశమిత్రన్‌లో 1937 మే 6న రాజాజీ ఒక వ్యాసం రాశారు. అందులో "హిందీ నేర్చుకోకుండా దక్షిణాది ప్రజలకు ఇతరుల ముందు గౌరవం ఎలా లభిస్తుంది?" అని ఆయన ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా, ఉన్నత పాఠశాలల్లో హిందీ సబ్జెక్టును తప్పనిసరి చేస్తూ జీవోను విడుదల చేశారు. ఆ నిర్ణయం రాజకీయంగా పెను దుమారానికి దారితీసింది. హిందీని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ తీవ్ర ఆందోళనలు జరిగాయి.

జస్టిస్ పార్టీ, ముస్లిం లీగ్ పార్టీలు సంయుక్తంగా తమిళ్ పడై(తమిళ దళం) పేరుతో 1938 సెప్టెంబర్ 11 నుంచి 42 రోజుల పాటు తిరుచ్చి నుంచి 239 గ్రామాలు, 60 పట్టణాల మీదుగా మద్రాస్ వరకు నిరసన యాత్ర చేపట్టాయి. "తమిళులు కన్నీళ్లు కారుస్తుంటే.. ఆర్యులు నవ్వుతున్నారు", "బ్రాహ్మణులు తమ మాతృభాష తమిళాన్ని చంపేస్తున్నారు" అంటూ నినాదాలు చేశారు.

Image copyright DHILEEPAN RAMAKRISHNAN
చిత్రం శీర్షిక పెరియార్

ఆ తర్వాత హిందీ వ్యతిరేక ఉద్యమం మరింత బలపడింది. 1937లో తమిళ ప్రజలపై బలవంతంగా హిందీని రుద్దడాన్ని ఈవీ రామస్వామి తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక మహిళా సదస్సులో ఆయనకు 'పెరియార్' అనే బిరుదును ఇచ్చారు. 1938లో యాంటీ- హిందీ కమాండ్ ఏర్పడింది. దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిపి ప్రత్యేక ద్రవిడనాడు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

"నాది ముస్లిం వంశం. నా మాతృ భాష తమిళ్, ఉర్దూ కాదు. ఈ విషయాన్ని చెప్పుకోవడానికి గర్వపడతాను" అని ముస్లీం లీగ్ నాయకుడు పీ కలీఫుల్లా వ్యాఖ్యానించారు.

రాజాజీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మహాత్మా గాంధీకి సత్యమూర్తి, సర్వేపల్లి రాధాకృష్ణ ఉత్తరాలు రాశారు. రాజాజీ మాత్రం వెనక్కి తగ్గలేదు. హిందీని తప్పనిసరి చేయడం వల్ల మద్రాసు ప్రావిన్సులో తీవ్ర ఇబ్బందులు తలెత్తున్నాయి. ఆ నిర్ణయం ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఉంది" అంటూ మద్రాస్ గవర్నర్ లార్డ్ ఎర్స్‌కైన్ ఆ జీవోను ఉపసంహరించారు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేసేందుకు మరోసారి ప్రయత్నాలు జరిగాయి. దాంతో, 1948లో ద్రవిడ కళగం(డీకే) నేతృత్వంలో తమిళనాడులో మరోమారు ఆందోళనలు జరిగాయి. 6 నుంచి 11వ తరగతి వరకు హిందీని తప్పనిసరి చేస్తూ 1950 మే 2న ఇచ్చిన ఉత్తర్వులను కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే తీవ్రంగా వ్యతిరేకింది. దాంతో కేంద్రం వెనక్కి తగ్గక తప్పలేదు.హిందీని భారత అధికారిక భాషగా చేయడానికి ప్రయత్నాలు జరగాలంటూ 1959లో భారత రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వుపైనా మళ్లీ అల్లర్లు చెలరేగాయి. దీంతో తమిళనాడుపై హిందీని రుద్దబోమంటూ అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ హామీ ఇచ్చారు.

హిందీని ఏకైక అధికారిక భాషగా చేయడానికి 1965లో జరిగిన ప్రయత్నానికి వ్యతిరేకంగా తమిళనాడులో జరిగిన హింసాత్మక ఆందోళనల్లో దాదాపు 63 మంది చనిపోయారు. ఆ తర్వాత ఇందిరా గాంధీ జోక్యం చేసుకుని 1968లో లాంగ్వేజెస్ యాక్ట్ తీసుకొచ్చారు.

ఆ చట్టం ద్వారా తమ సొంత అధికారిక భాషను నిర్ణయించుకునే స్వేచ్ఛ, అధికారం రాష్ట్రాలకు ఉంటుంది.

Image copyright Getty Images

తాజాగా కస్తూరిరంగన్ కమిటీ ఆ తుట్టె మీద మరోసారి రాయి వేసింది. హిందీయేతర రాష్ట్రాల్లో హిందీని కచ్చితంగా బోధించాలని సిఫార్సు చేస్తూ కస్తూరిరంగన్‌ నేతృత్వంలోని విద్యా విధాన కమిటీ కేంద్రానికి సమర్పించిన ముసాయిదా నివేదిక తమిళనాడులో పెను దుమారాన్నే సృష్టించింది.

నిరసనలు మరింత పెరిగేలా సూచనలు కనిపించడంతో కేంద్రం స్పందించింది. ఏ రాష్ట్రంపైనా బలవంతంగా హిందీని రుద్దబోమని ప్రకటించింది. దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు కచ్చితంగా హిందీ అభ్యసించాల్సిన అవసరంలేదని, మూడో భాషగా తమకు ఇష్టం వచ్చిన దాన్ని ఎంచుకోవచ్చని తెలిపింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు