విజయవాడకు కేసీఆర్: ‘15 శాతం పూర్తయిన కాళేశ్వరం ప్రాజెక్టును ఎలా ప్రారంభిస్తారు..’ - ప్రెస్ రివ్యూ

  • 17 జూన్ 2019

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం విజయవాడ వెళ్తున్నారంటూ ఈనాడు దినపత్రిక ఓ కథనం రాసింది.

రెండు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై సోమవారం జరిగే ఈ భేటీలో జగన్, కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది.

ఇప్పటికే గతంలో కుదిరిన అంగీకారం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య భవనాల అప్పగింత ప్రక్రియ నడుస్తోంది.

కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, తెలుగు రాష్ట్రాల్లో విపక్షాల ధోరణి, ఇతర అంశాలపైనా ఇద్దరు సీఎంలు చర్చిస్తారని సమాచారం.

గుంటూరు తాడేపల్లిలోని శ్రీసచ్చిదానంద ఆశ్రమంలో జరిగే ఓ కార్యక్రమానికి ఈ ఇద్దరు నాయకులతో పాటు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కూడా హాజరుకానున్నారు.

ఈ కార్యక్రమానికి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Image copyright facebook/Bhatti Vikramarka Mallu

‘పూర్తయింది 15 శాతమే.. ప్రారంభం ఎలా చేస్తారు?’

కాళేశ్వరం ప్రాజెక్టు పనులు 15 శాతమే పూర్తయినట్లు తనకు స్పష్టమైన సమాచారం ఉందని, ఆ ప్రాజెక్టును తెలంగాణ సీఎం కేసీఆర్ ఎలా ప్రారంభిస్తున్నారని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక వార్త ప్రచురించింది.

పనులు, వ్యయం వివరాలు పూర్తిగా వెల్లడిస్తూ ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని భట్టి విక్రమార్క తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

''సాగునీటి ప్రాజెక్టును ప్రారంభించడం అంటే కాలువల ద్వారా పొలాలకు నీరివ్వడమే. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కింద చేపట్టిన రిజర్వాయర్లు, కాలువల నిర్మాణ పనులు ఇంకా పూర్తే కాలేదు'' అని అన్నారు.

15 శాతం పనులకే రూ.50వేల కోట్లు ఖర్చు పెడితే, మిగిలిన 85శాతం పనులు పూర్తవడానికి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడతారని కేసీఆర్‌ను ప్రశ్నించారు.

ప్రాజెక్టును ప్రారంభిస్తామనడం ప్రజలను మోసం చేయడమేనని స్పష్టం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్‌ వస్తే ఆయన తండ్రి వైఎస్‌ ఆత్మ క్షోభిస్తుందని, అందుకే రావొద్దని ఆయనకు తాను లేఖ రాశానని చెప్పారు.

సాగునీటి ప్రాజెక్టుల టెండర్‌ పనులను జ్యుడీషియల్‌ కమిషన్‌ ముందుంచుతామని ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తూ.. అదే విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని కేసీఆర్‌ను డిమాండ్‌ చేశారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ ఐదున్నరేళ్లలో ఒక్క కొత్త సాగునీటి ప్రాజెక్టునూ చేపట్టలేదని, కాంగ్రెస్‌ పార్టీ ఏ ప్రాజెక్టును అడ్డుకోలేదని భట్టి వ్యాఖ్యానించారు.

Image copyright FB/VIJAYASAIREDDYOFFICIAL

సహకరిస్తూనే కేంద్రంతో పోరాడతాం..

కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తూనే, ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తామని వైఎస్సార్సీపీ వెల్లడించినట్లు సాక్షి దినపత్రిక ఓ వార్త రాసింది.

ప్రజా ప్రయోజనాలు, దేశ ప్రయోజనాల విషయంలో కేంద్రానికి మద్దతు ఇస్తామని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అన్నారు.

పార్లమెంట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభమవుతున్న నేపథ్యంలో దిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి విజయసాయిరెడ్డితో పాటు వైఎస్సార్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి హాజరయ్యారు.

రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీని కోరామని విజయసాయి రెడ్డి చెప్పారు. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని విజ్ఞప్తి చేశామన్నారు.

''బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని, అవసరమైతే దీన్ని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చి రాజ్యాంగబద్ధత కల్పించాలని కోరాం. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి చర్యలు తీసుకోవాలని విన్నవించాం'' అని విజయసాయి రెడ్డి అన్నారు.

రుతుపవనాలు, వర్షం Image copyright Getty Images

18న ఏపీ, 20న తెలంగాణకు నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్‌ను, 20న తెలంగాణను తాకే అవకాశాలున్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించిందని నమస్తే తెలంగాణ దినపత్రిక కథనం రాసింది.

ఈ నెల 13నే తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తొలుత అంచనా వేశామని, వాయు తుపాను కారణంగా వాటి రాక ఆలస్యమైందని వాతావరణ కేంద్రం తెలిపింది.

రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లోనూ ఎండల తీవ్రత కొనసాగుతుందని హెచ్చరించింది.

కోస్తాంధ్ర తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 4.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఈ ప్రభావంతో సోమవారం ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు