ముజఫర్‌పుర్ మరణాలు: ‘రెండు రోజులుగా ఈ ఆసుపత్రిలో చేరిన చిన్నారులెవరూ ప్రాణాలతో వెనక్కి వెళ్లట్లేదు’ - గ్రౌండ్ రిపోర్ట్

  • 17 జూన్ 2019
ముజఫర్‌పుర్

గర్భశోకంతో తల్లులు పెడుతున్న ఆక్రందనలు శ్రీకృష్ణ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో మార్మోగుతున్నాయి. బిహార్‌లోని ముజఫర్‌పుర్‌లో ఉన్న ఈ ఆసుపత్రిలో గత పదిహను రోజుల్లో 93 మంది చిన్నారులు మెదడు వాపు వ్యాధితో ప్రాణాలు విడిచారు.

కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్థన్ ఆదివారం ఆసుపత్రిలో పర్యటిస్తున్న సమయంలోనే ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారు.

ఆసుపత్రిలోని చిన్నారుల ఐసీయూ విభాగం గాజు అద్దాలు.. రోదనలను బయటకు వినిపించకుండా ఆపలేకపోతున్నాయి.

ఎనిమిది పడకల ఈ ప్రత్యేక వార్డులో ఓ మూలన కూర్చొని బబియా దేవీ శోకిస్తూ కనిపించారు. ఆమె ఐదేళ్ల కుమార్తె మున్నీ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

మున్నీకి ముందు ఆ వార్డులో చేరిన చాలా మంది చిన్నారులు ఇప్పుడు ప్రాణాలతో లేరు.

మున్నీ పరిస్థితి గురించి వైద్యులు ఇంకా ఏమీ చెప్పలేదు. అయితే, ఆమె తమకు దక్కకపోవచ్చన్న బాధ బబియా ముఖంలో కనిపించింది.

మానిటర్ల నుంచి బీప్‌మంటూ శబ్దాలు వస్తుండగా.. ఇద్దరు వైద్యులు మున్నీకి సీపీఆర్ చేస్తూ ఉన్నారు.

సీపీఆర్ చేస్తున్నకొద్దీ మున్నీ ఇంకా ముఖాన్ని తేలేస్తోంది. ఆమె పచ్చబడ్డ పెదాల నుంచి, కళ్ల నుంచి నీళ్లు కారుతున్నాయి.

బబియా ఏడుస్తూ, వణుకుతున్న గొంతుతోనే ఓ భోజ్‌పురి జానపదాన్ని పాడటం మొదలుపెట్టారు.

అసలు ఆడుతూ పాడుతూ తిరిగిన మున్నీకి ఏమైంది?

మున్నీకి సోకింది మెదడు వాపా, మెదడుకు సంబంధించిన జ్వరమా అన్నది వైద్యులు తేల్చలేకపోతున్నారు.

ఒక రోజు ముందు వరకూ ఆమె చాలా ఆరోగ్యంగా ఉందని బబియా చెప్పారు.

''మాది కొడరియా గోసాయ్‌పుర్ అనే ఊరు. శనివారం ఉదయం మున్నీని ఈ ఆసుపత్రిలో చేర్చాం. శుక్రవారం వరకు ఆమె ఆడుతూ పాడుతూనే ఉంది. ఆ రాత్రి పప్పన్నం తిని పడుకుంది. తెల్లవారేసరికి విపరీతమైన జ్వరం. వెంటనే ఆసుపత్రికి బయల్దేరాం. ఆమెను భుజాన వేసుకునే దారిలో కొంత దూరం పరుగు తీశాం. ఆ తర్వాత ఓ కారు అద్దెకు తీసుకుని, ఇక్కడికి వచ్చాం. అయితే, వచ్చినప్పటి నుంచి ఆమె పరిస్థితి కొంతైనా మెరుగుపడలేదు. కనీసం ఆమె కళ్లు కూడా తెరవలేదు'' అని కన్నీళ్లను చీర కొంగుతో తుడుచుకుంటూ చెప్పారు బబియా.

ముజఫర్‌పుర్‌లో చిన్నారుల మరణాల విషయంలో నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

లిచీ అనే పండ్లలో ఉండే విష పదార్థాలే మెదడు సంబంధిత జ్వరం వ్యాప్తికి కారణమని పరిశోధనలు చెబుతున్నాయి.

పిల్లల శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు తగినంతగా లేకే ఈ వ్యాధికి గురయ్యారని చాలా మంది వైద్య నిపుణులు అంటున్నారు.

చిన్నారుల మరణాలకు అనేక కారణాలు ఉండొచ్చని సీనియర్ డాక్టర్ మాలా కనేరియా అంటున్నారు

''పిల్లల మరణాలకు కారణం మెదడు సంబంధిత జ్వరమా, జపనీస్ ఎన్సెఫలిటీసా అన్నది చెప్పలేం. పచ్చి లిచీ పండ్లలో ఉండే విష పదార్థాలు, పోషకాహార లోపం, శరీరంలో చక్కెర, సోడియం స్థాయిలు తగినంత లేకపోవడం, ఖనిజ లవణాల అసమతౌల్యం లాంటి వన్నీ కారణాలు కావొచ్చు. రాత్రి పూట ఏమీ తినకుండా పడుకొని, తెల్లవారి లిచీ పండ్లు తింటే చిన్నారులు ఈ జ్వరం బారిన పడొచ్చు. అయితే, ఒక్క లిచీలు మాత్రమే దీనికి కారణం కాదు'' అని ఆమె అన్నారు.

ముజఫర్‌పుర్‌లో లిచీలను విస్తారంగా పండిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో అలాంటి తోటలు చాలా కనిపిస్తుంటాయి.

బబియాతో ఐసీయూలో మాట్లాడుతున్న సమయంలోనే ఒక్కసారిగా రెండు బెడ్‌ల అవతల నుంచి ఏడ్పులు వినిపించాయి.

ఓ చిన్నారిని స్పందింపజేసేందుకు వైద్యులు ప్రయత్నిస్తూ కనిపించారు. కానీ, ఆ పాప నుంచి ఉలుకూపలుకూ లేదు. పక్కనే ఉన్న ఇద్దరు మహిళలు బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టారు.

ఆ మహిళల్లో ఒకరి పేరు రూబీ ఖటూన్. ఆమె నాలుగేళ్ల కుమార్తె తమన్నా ఖటూన్‌ కొనప్రాణాలతో ఉంది.

రెండ్రోజులుగా ఆసుపత్రిలో చేరిన చిన్నారులెవరూ వెనక్కి వెళ్లలేదని, అందరూ ప్రాణాలు వదిలారని రూబీ వాపోయారు.

''నా కుమార్తె ఒక్క లిచీ పండు కూడా తినలేదు. రాత్రి రొట్టెలు తిని పడుకుంది. మరుసటి రోజు ఉదయం నిద్ర లేపినా లేవలేదు. ఇంకొంచెం సేపు పడుకుంటుందేమోనని కాసేపు ఆగాం. ఆమె పూర్తిగా ముడుచుకుపోయి ఉంది. కాళ్లు, చేతులూ వణికిపోతూ ఉన్నాయి. వెంటనే ఆసుపత్రికి తీసుకువచ్చాం. ఇక్కడ ఆమె పరిస్థితి మరింత దిగజారింది. వైద్యులు వాళ్లలో వాళ్లే మాట్లాడుకుంటూ వెళ్లిపోతున్నారు. ఇంత కష్టపడి మా బిడ్డను పెంచింది, ఇలా దూరం చేసుకోవడానికా?'' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు రూబీ.

ఆసుపత్రిలో చేరిన రోగుల బంధువులు నీళ్ల సీసాలు పట్టుకురావడం కనిపించింది. మొత్తం మెడికల్ కాలేజ్‌లో సరైన తాగునీటి సదుపాయం ఎక్కడా లేదని వారిని అడిగితే చెప్పారు.

ఆసుపత్రి బయట ఉన్న చేతిపంపు దగ్గరి నుంచి నీటిని తెచ్చుకుంటున్నట్లు వివరించారు.

ఆ చేతిపంపు నీళ్లు కూడా మురికిగా ఉన్నాయని మరికొందరు అన్నారు. పేదవాళ్లమైనా డబ్బులు పెట్టి నీటిని కొనుక్కోవాల్సి వస్తోందని వాపోయారు.

తాగు నీటి కొరత గురించి బీబీసీ ప్రశ్న లేవనెత్తినప్పుడు.. ''ఇప్పుడది అంత ప్రధాన విషయం కాదు'' అని కేంద్ర మంత్రి హర్షవర్థన్ బదులిచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)