హుడీనీ ట్రిక్: కాళ్లు, చేతులు కట్టేసుకుని నదిలోకి దిగిన మెజీషియన్ మళ్లీ ప్రాణాలతో బయటకురాలేదు

  • 18 జూన్ 2019
చంచల్ లహిరి, మ్యాజిక్, హూడినీ Image copyright EI SAMAY

పశ్చిమ బెంగాల్‌లో చంచల్ లహిరి అనే మెజీషియన్ ఓ ట్రిక్‌ కోసం ప్రయత్నిస్తూ ప్రాణాలు కోల్పోయారు.

ట్రిక్‌లో భాగంగా చేతులు, కాళ్లకు గొలుసులు కట్టించుకుని.. తలకిందులుగా హుగ్లీ నదిలోకి తనను తాను వేలాడదీయించుకున్నారు లహిరి.

తరువాత నీటి లోపలే సంకెళ్లను, తాళ్లను విప్పుకొని ఆయన బయటపడాలి.

దీన్ని ‘హుడీనీ ట్రిక్’ అంటారు. ప్రముఖ మెజీషియన్ హ్యారీ హుడీనీ దీనికి ఆద్యుడు.

అయితే, ఈ ట్రిక్‌ను ప్రయత్నించిన లహిరి, నది లోపలి నుంచి ఎంతసేపటికీ బయటకు రాలేదు.

దీంతో, వీక్షించేందుకు వచ్చిన జనాలు పోలీసులను అప్రమత్తం చేశారు.

లహిరి కోసం గాలింపు ఆపరేషన్ మొదలైంది.

ట్రిక్ ప్రదర్శిస్తున్న ప్రాంతానికి ఒక కి.మీ. దూరంలో ఆయన మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionకాళ్లు, చేతులు కట్టేసుకుని నదిలోకి దిగిన మెజీషియన్ మళ్లీ ప్రాణాలతో బయటకురాలేదు

లహిరికి మంద్రేక్ అనే పేరు కూడా ఉంది.

తాజా ట్రిక్‌ను ఆయన ఓ పడవపై నుంచి చేసేందుకు ప్రయత్నించారు. దీన్ని చూసేందుకు పక్కనే మరో రెండు పడవల్లో వీక్షకులు ఉన్నారు. కోల్‌కతాలోని హౌరా వంతెన, నది ఒడ్డు నుంచి ఇంకొందరు దీన్ని చూశారు.

లహిరికి కట్టిన గొలుసులకు మొత్తం ఆరు తాళాలు ఉన్నాయి.

నీట మునిగి పది నిమిషాలైనా ఆయన బయటకు రాకపోవడంతో జనాల్లో ఆందోళన మొదలైనట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

ఘటనను ప్రత్యక్షంగా వీక్షించిన జయంత్ షా అనే ఫొటోగ్రాఫర్ బీబీసీతో మాట్లాడారు.

ట్రిక్‌కు ప్రయత్నించే ముందు లహిరితో తాను మాట్లాడనని ఆయన చెప్పారు.

''మ్యాజిక్ కోసం జీవితాన్ని ఎందుకు పణంగా పెడుతున్నరని ఆయన్ని అడిగా. ఆయన నవ్వతూ.. 'సరిగ్గా చేస్తే మ్యాజిక్.. పొరపాటు జరిగితే ట్రాజిక్ (విషాదం)' అని బదులిచ్చారు. మ్యాజిక్ పట్ల ప్రజల్లో ఆసక్తిని తిరిగి పెంచేందుకు తాను ఈ ట్రిక్ చేస్తున్నానని చెప్పారు'' అని జయంత్ వివరించారు.

Image copyright EI SAMAY

నీటి లోపల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి ట్రిక్కులను చేయడం లహిరికి ఇది కొత్తేమీ కాదు.

20 ఏళ్ల క్రితం ఇదే నదిలోకి ఆయన ఓ గాజు బాక్స్‌లో సంకెళ్లతో దిగి, క్షేమంగా బయటకు వచ్చారు.

ఇంతకుముందు లహిరి నీటి లోపల చేసే ట్రిక్‌ను తాను చూశానని జయంత్ తెలిపారు.

ఆయన బయటపడలేరనే అప్పుడు కూడా తాను అనుకున్నానని చెప్పారు.

హుడీనీ ట్రిక్‌ ప్రదర్శన కోసం లహిరి కోల్‌కతా పోలీసులు, కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ అనుమతి తీసుకున్నట్లు పీటీఐ పేర్కొంది.

అయితే, ఈ ట్రిక్‌లో నీటిలోకి దిగే భాగం ఉంటుందని తమకు లహిరి తెలపలేదని పోలీసులు చెప్పారు.

''ఓ పడవలో ఈ ట్రిక్ జరుగుతుందని లహిరి చెప్పారు. అందుకే అనుమతి ఇచ్చాం. ట్రిక్‌లో ఈ 'అదనపు భాగం' గురించి ఆయనేమీ చెప్పలేదు. ఘటనపై విచారణ జరుపుతున్నాం'' అని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ పోలీసు అధికారి తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు