చెన్నైలో తాగునీటికి కటకట: వర్షాలు పడకుంటే మురుగునీరే దిక్కా?

  • 18 జూన్ 2019
చెన్నైలో నీటి కష్టాలు Image copyright Getty Images

చెన్నై నగరంలో నీటి ఎద్దడి తీవ్రమైంది. జలాశయాలన్నీ అడుగంటడంతో చెన్నై మెట్రో వాటర్ బోర్డు ప్రత్యామ్నాయ నీటి వనరుల వైపు చూస్తోంది. నీటికి కటకట ఏర్పడడంతో నగరంలో పెద్దఎత్తున్న బోర్లు వేస్తున్నారు. గతంలో వేసిన బోర్లను మరింత లోతు తవ్వుతున్నారు.

చెన్నై నగర నీటి అవసరాలను తీర్చే పూంది, పుజల్, చోళవరం, చెంబరంబక్కం జలాశయాలు ఎండిపోయాయి. చోళవరం, సెంగుండ్రం చెరువుల నుంచి నీటి తరలింపును మే ఆరంభంలో అధికారులు ఆపేశారు.

తర్వాత, చెన్నై శివార్లలోని క్వారీల్లో లభించే నీటిని శుభ్రం చేసి సరఫరా చేశారు. ఇప్పుడు ఆ నీరు కూడా తగినంత లభ్యం కావట్లేదు.

ప్రస్తుతం తమిళనాడులోని పెద్ద జలాశయాల్లో ఒకటైన వీరణం సరస్సు నుంచి 15 కోట్ల లీటర్ల నీటిని తీసుకుంటున్నారు.

Image copyright Getty Images

వానలు పడాలి.. ప్రజల్ని కాపాడాలి

''మేం మరికొన్ని క్వారీలను గుర్తిస్తున్నాం. అయితే, వర్షం మాత్రమే చెన్నై ప్రజల్ని కాపాడాలి'' అని చెన్నై మెట్రో జల విభాగం అధికారులు అంటున్నారు.

నీటి సరఫరాకు చెన్నైని 15 జోన్లుగా విభజించారు. ఈ 15 జోన్లలో రోజూ 88 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేయాలి. కానీ, వాస్తవంగా 65 కోట్ల లీటర్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు.

ఇప్పుడు నీటి కొరత కారణంగా 52 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, లీకేజీల ద్వారా వృథా అయ్యే నీటిని తీసేస్తే కుళాయిలకు చేరుతోంది 42 నుంచి 45 కోట్ల లీటర్ల నీరు మాత్రమే.

ఇందువల్లే నగర వ్యాప్తంగా నీటికి కష్టాలు మొదలయ్యాయి. చాలా ప్రాంతాల్లో నీటి కోసం ప్రజలు చిన్నపాటి కొట్లాటలకు కూడా దిగారు.

Image copyright Getty Images

ఐటీ ఆఫీసులు, రెస్టారెంట్లకు నీటి కష్టాలు

నీటి కొరత కారణంగా నగరంలో చాలా హోటళ్లు, రెస్టారెంట్లను మూసేశారు. చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) అండర్ గ్రౌండ్ రైల్వే స్లేషన్లలో ఏసీని నిలిపివేసింది.

చాలా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల్ని ఇంటి నుంచి పని చేయాలని (వర్క్ ఫ్రమ్ హోమ్) కోరాయి. అయినా పరిస్థితి ఇంకా జఠిలం అవుతోంది.

''మరి ఇంట్లో కూడా నీళ్లుండవు కదా, మేమేం చేయాలి'' అంటున్నారు ఐటీ వర్కర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వినోద్ కలిగై.

నీటి కోసం కొట్లాటలు.. ఒకరి మృతి

నగరంలోని ప్రతి ఒక్కరిపైనా నీటి కొరత ప్రభావం పడింది. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ధనపాల్‌ కారు డ్రైవర్‌గా ఆథిమూలం పనిచేస్తున్నారు. గురువారం ఆథిమూలంను పోలీసులు అరెస్ట్ చేశారు. కారణం.. ఇంటిదగ్గర నీళ్ల పంపకాల సమయంలో గొడవ తలెత్తగా, తన పొరుగింటి మహిళపై ఆథిమూలం పదునైన పరికరంతో దాడి చేశారని.

కేవలం చెన్నైలోనే కాదు కావేరీ నది ప్రవహించే తంజావూరులో కూడా ఇదే పరిస్థితి ఉంది. నీళ్ల పంపకాల సందర్భంగా జరిగిన కొట్లాటలో ఆనంద్ బాబు అనే వ్యక్తి చనిపోయాడు. ఈ వ్యవహారంలో ఆనంద్ బాబుపై దాడి చేసి, అతని మరణానికి కారణమైన కుమార్, ఆయన కుమారులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Image copyright Getty Images

అడుగంటిన భూగర్భ జలాలు

భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటడం వల్లనే ఈ నీటి కొరత ఏర్పడిందని అధికారులు అంటున్నారు.

ఏప్రిల్, మే నెలల్లో చెన్నైతో పాటు తమిళనాడులోని టూటికోరిన్, తిరునెల్వేలి, కడలూరు, కాంచీపురం, తిరువణ్ణామలై జిల్లాల్లో కూడా భూగర్భ జలాలు అడుగంటిపోతుంటాయి.

నీటిని కొనుగోలు చేసే వారికి చెన్నై మెట్రో పైపులు, లారీల ద్వారా సరఫరా చేస్తుంటుంది. కానీ, ఇలా నీటిని కొనుగోలు చేయాలంటే ముందుగానే రిజిస్టర్ చేసుకుని, కనీసం 20 రోజులు వేచి చూడాలి. ఇప్పుడు ఈ సమయం మరింత పెరగొచ్చు.

‘కాంక్రీటు నిర్మాణాలే కారణం’

''ఇబ్బంది మొదలైంది ఇప్పుడే. ఒకవేళ ఈ ఏడాది కూడా వర్షాలు తగినంతగా పడకపోతే వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుంది'' అని ఒక అధికారి చెప్పారు.

''ప్రజల్ని కాపాడేందుకు ఉన్న ఒకే ఒక దారి.. భూగర్భ జలాలను మెరుగుపర్చడం'' అని నీటి సమస్యలపై పోరాడే సామాజిక కార్యకర్త నక్కీరన్ అన్నారు. ''ఇంతకు ముందు కూడా చెన్నై నీటి కొరతను ఎదుర్కొంది. అయితే అప్పుడు భూగర్భ జలాలు ప్రజల్ని కాపాడాయి. ప్రతి ఏటా పడే వర్షంలో 16 శాతం భూగర్భంలోకి వెళ్లాలి. కానీ, చెన్నై వంటి పెద్ద నగరాల్లో 5 శాతం కూడా భూగర్భంలోకి వెళ్లట్లేదు. దీనికి ఏకైక కారణం కాంక్రీటు నిర్మాణాలే'' అని ఆయన చెప్పారు.

Image copyright Getty Images

‘మురుగునీటిని శుద్ధి చేయటమే పరిష్కారం’

చెరువుల్ని ప్రక్షాళన చేయడం, ఉప్పు నీటిని శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయటం నీటి కొరత సమస్యకు శాశ్వత పరిష్కారాలు కాదని నీటి పంపిణీ విభాగం అధికారులు అంటున్నారు. అయితే, ఉపయోగించిన నీటిని రీసైక్లింగ్ చేసి మళ్లీ వాడటం వల్ల ఉపశమనం ఉంటుందని చెబుతున్నారు. చెన్నై నగరంలో ఇలా నీటిని రీసైక్లింగ్ చేసే అంశంపై మే 30వ తేదీన ఐఐటీ మద్రాస్ ఒక నివేదిక ఇచ్చింది. అయితే, ఈ ప్రాజెక్టు ప్రారంభం కావాలంటే 2020 జనవరి వరకూ ఆగాల్సిందే. ఒకవేళ ఈ ప్రాజెక్టు కనుక విజయవంతం అయితే చెన్నై నగరంలో 70 శాతం మురుగు నీటిని శుద్ధి చేయవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

కుల్‌భూషణ్ జాధవ్‌కు పాకిస్తాన్ విధించిన మరణశిక్షను నిలిపివేసిన అంతర్జాతీయ న్యాయస్థానం

కార్గిల్ యుద్ధం: భారత సైన్యాన్ని ఆపడానికి అమెరికా శరణు కోరిన నవాజ్ షరీఫ్

హఫీజ్ సయీద్‌‌: ముందస్తు బెయిల్ కోసం వెళ్తుండగా పాకిస్తాన్‌లో అరెస్ట్

రిచా భారతీ: ఖురాన్ పంపిణీ చేయాలన్న కోర్టు.. ప్రాథమిక హక్కును కాలరాయడమే అంటున్న ఝార్ఖండ్ యువతి

అపోలో-11 మిషన్: చంద్రుడి మీదకు అమెరికా మనిషిని ఎందుకు పంపించింది...

ఇరాకీ కర్డిస్తాన్‌లోని ఇర్బిల్ నగరంలో కాల్పులు... టర్కీ దౌత్యవేత్త మృతి

డోనల్డ్ ట్రంప్ జాత్యహంకారి అన్న కాంగ్రెస్ మహిళా నేతలు ఎవరు...

అనంతపురం హత్యలు: శివాలయంలో గుప్తనిధుల కోసమే ఈ హత్యలు చేశారా