ఏపీ పోలీసులకు నేటి నుంచే వారాంతపు సెలవు: ప్రెస్‌రివ్యూ

  • 19 జూన్ 2019
Image copyright Getty Images

ఆంధ్రప్రదేశ్‌లోని పోలీసు సిబ్బందికి తీపి కబురు. కానిస్టేబుల్‌ నుంచి ఇన్‌స్పెక్టర్‌ స్థాయి వరకున్న పోలీసులందరికీ బుధవారం నుంచి వారాంతపు సెలవులు అమలు చేస్తామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ప్రకటించారని ఈనాడు తెలిపింది.

పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో అందుబాటులో ఉన్న సిబ్బంది, వారి పని స్వభావం (వర్క్‌ నేచర్‌) తదితరాలను పరిగణనలోకి తీసుకుని వారాంతపు సెలవు అమలుకు 19 రకాల పద్ధతులను సిద్ధం చేశామని, ఆయా విభాగాధిపతులు వీటిల్లో తమకు అనువైనది ఎంపిక చేసుకోవచ్చని సూచించారు. మంగళగిరిలోని ఏపీ పోలీసు ప్రధాన కార్యాలయంలో మంగళవారం పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులతో డీజీపీ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరికి, ఎప్పుడు వారాంతపు సెలవు వస్తుందో ముందే తెలుస్తుందని అన్నారు. ఈ విధానం అమలు తీరును పర్యవేక్షించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అమలు తీరును నెలకోసారి సమీక్షించి మరింత మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసు సిబ్బంది ఆరోగ్యం, జీవనకాలం పెరగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వారాంతపు సెలవులను ప్రకటించారని వివరించారు.

తాజా నిర్ణయంతో 70 వేల మంది సిబ్బందికి ప్రయోజనం కలగుతుందని తెలిపారు. ఈ విధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అనంతరం పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. భద్రత విషయంలో రాజీ పడకుండా వారాంతపు సెలవులు అమలు చేస్తామని శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ తెలిపారు.

ప్రస్తుతం పోలీసు శాఖలో 12,384 ఖాళీలున్నాయని, వీటిని భర్తీ చేస్తే వారాంతపు సెలవుల విధానం అమలు మరింత సులువవుతుందని పేర్కొన్నారు. తమ కమిటీ సమర్పించనున్న నివేదికలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామన్నారు. సిబ్బంది కొరత ఉన్న చోట్ల వారాంతపు సెలవుల అమలుకు వీఆర్‌లో ఉన్న సిబ్బందిని వినియోగించుకోవాలని డీజీపీ సూచించారని, ఆ మేరకు చర్యలు చేపడతామని చెప్పారు.

ఈ విధానం అమలుపై ప్రతి రోజూ టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించి అభిప్రాయాలు తెలుసుకుంటామన్నారు. ఎవరు ఎప్పుడు వారాంతపు సెలవులు తీసుకుంటారనే అంశంపై సాఫ్ట్‌వేర్‌ సిద్ధం చేస్తున్నామని, ఇది అందుబాటులోకి వచ్చాక పోలీసు వెబ్‌సైట్‌లో సమాచారం తెలుసుకోవచ్చని తెలిపారు. మిగతా ఉద్యోగులతో పోలిస్తే పోలీసు ఉద్యోగులు పదవీ విరమణ పొందాక త్వరగా చనిపోతున్నారని, వారాంతపు సెలవుల వల్ల ఒత్తిడి తగ్గి వారి జీవనకాలం పెరుగుతుందని వ్యాఖ్యానించారని ఈనాడు వెల్లడించింది.

Image copyright APcm/fb

‘ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇవ్వాల్సిందే ’

ఆంధ్రప్రదేశ్‌కు ప్యాకేజీ వద్దని, రాష్ట్రానికి జీవనాడి అయిన ప్రత్యేక హోదానే ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారని సాక్షి తెలిపింది.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఐదు కోట్ల మంది ప్రజల తరఫున కేంద్రాన్ని అభ్యర్థిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ప్రత్యేక హోదా తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. విభజనతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడంతోపాటు ఉపాధి అవకాశాలు లేక నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వల్లే కొంతైనా ఊరట లభిస్తుందని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ఏపీని అభివృద్ధి పథంలో నిలిపేందుకు హోదా అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. పోలవరం ముంపు మండలాలను తెలంగాణ నుంచి ఏపీలో కలపనిదే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోనంటూ నాడు పట్టుబట్టానని చంద్రబాబు గొప్పలు చెబుతున్నారని, మరి అదే పట్టుదల హోదాపై ఎందుకు చూపలేదని నిలదీశారు. నాటి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించిన ప్రత్యేక హోదాను ఇవ్వాలని ప్రణాళికా సంఘాన్ని కలిస్తే సరిపోయేదని, అలాంటి సువర్ణ అవకాశాన్ని జారవిడుచుకుని చంద్రబాబు 7 నెలలపాటు తాపీగా వ్యవహరించారని విమర్శించారు. ఆయన బాధ్యతగా వ్యవహరించి ఉంటే హోదా అప్పుడే వచ్చి ఉండేదని, మన యువతకు లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కూడా దక్కేవని పేర్కొన్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి ధన్యవాదాలు తెలియచేస్తూ చంద్రబాబు గతంలో ఇదే సభలో తీర్మానం చేశారని, ఈ నేపథ్యంలో రికార్డులను సరి చేసేందుకు ప్రత్యేక హోదాయే కావాలంటూ ఇప్పుడు తీర్మానాన్ని ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ప్రత్యేక హోదా రద్దు కోసం తాము ఎలాంటి సిఫార్సులు చేయలేదంటూ 14వ ఆర్ధిక సంఘం సభ్యుడు అభిజిత్‌సేన్‌ రాసిన లేఖను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభ ఎదుట ఉంచారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను మంజూరు చేస్తూ 2014 మార్చి 2వ తేదీన కేంద్ర మంత్రి మండలి చేసిన తీర్మానాన్ని గుర్తు చేస్తూ ఆ నిర్ణయాన్ని అమలు చేయాల్సిందిగా నాటి కేబినెట్‌ ప్రణాళికా సంఘాన్ని ఆదేశించిన నోట్‌ను కూడా ముఖ్యమంత్రి సభ ముందు ఉంచారు. ఈనెల 15వతేదీన ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశంలో కూడా తీర్మానంలోని అంశాలనే ప్రస్తావించానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారని సాక్షి వెల్లడిచింది.

Image copyright Getty Images

మోదీని ప్రతిదానికీ పిలవాలా?: కేసీఆర్‌ వ్యాఖ్య

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించకపోవడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించారని ఈనాడు తెలిపింది.

ప్రధానిని ప్రతీ కార్యక్రమానికి ఆహ్వానించాల్సిన అవసరం లేదని, గతంలో మిషన్‌ భగీరథ ప్రారంభోత్సవానికి పిలిచిన విషయాన్ని కేసీఆర్ గుర్తుచేశారు. కేంద్రం నుంచి ఒక్కపైసా అదనంగా రాలేదని విమర్శించారు. ''ప్రతిదానికీ ప్రధానిని పిలుస్తామా? అన్నింటికీ పిలవాలా? సంతృప్తిగా నేను ప్రారంభోత్సవం చేస్తున్నా మీకు ఇష్టంలేదా. మేం ఎన్డీయేలో భాగస్వాములం కాదు.. ప్రపంచానికి తెలుసు. ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసం నేను పనిచేశాను.

రాజ్యాంగపరమైన సంబంధాలు కేంద్రంతో ఎలా కొనసాగించాలో చేస్తాం. లేనివి ఎందుకు?గతంలో మోదీ ప్రధాని అయ్యాక అతి కఠినంగా నిందించిన వ్యక్తిని నేను. ఏడు మండలాలు, సీలేరు పవర్‌ ప్లాంటు ఏపీకి ఇచ్చినప్పుడు ఫాసిస్టు పీఎం అని అన్నాను.

కేంద్రం నుంచి మాకు ఒక్క రూపాయి కూడా అదనపు సౌకర్యం ఇవ్వలేదు. మిషన్‌ భగీరథ, కాకతీయకు కలిపి రూ.24వేల కోట్లు ఇవ్వాలని మేం కోరితే ఒక్క రూపాయీ ఇవ్వలేదు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అబద్ధాలు మాట్లాడితే ఆయనను క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశాను. కేంద్ర ప్రభుత్వానికి మేం అంశాల వారీగా మద్దతు ఇచ్చాం. నచ్చిన వాటికి మద్దతిచ్చాం..నచ్చని వాటిని వ్యతిరేకించాం'' అన్నారు.

కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీస్టేజ్‌ ఇరిగేషన్‌ పథకం ఇది. 45లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. రాష్ట్రంలో 80శాతం ప్రజలకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరందుతుంది. రాష్ట్రం సొంత నిధులు, బ్యాంకుల సహకారంతో ప్రాజెక్టు నిర్మిస్తున్నాం.

24గంటల నాణ్యమైన విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మాది. రాష్ట్రంలో ఎక్కడా బిందెల ప్రదర్శనలేదు. 2004లో బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటుచేసి 15ఏళ్లు గడిచినా అతీగతీలేదు. ట్రైబ్యునల్‌ తీర్పు ఇవ్వడానికే ఇంతకాలం పడితే ప్రాజెక్టులు ఎప్పుడు కట్టాలి? తెలంగాణలో ప్రాజెక్టుల కోసం అహోరాత్రులు శ్రమించాను. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పరుగులు పెట్టిస్తాం. రేపు అఖిలపక్ష పార్టీల అధ్యక్షుల భేటీకి కేటీఆర్‌ హాజరవుతారు'' అని కేసీఆర్‌ వెల్లడించారని ఈనాడు పేర్కొంది.

కేసీఆర్‌ Image copyright kcr/fb

తెలంగాణ శాసనసభకూ కొత్త భవనం

శాసనసభకు కొత్త భవనాన్ని నిర్మించాలని మంగళవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించిందని నమస్తే తెలంగాణ వెల్లడించింది.

ఎర్రమంజిల్‌లోని ఎత్తయిన ప్రాంతంలో కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. దీంతోపాటు ప్రస్తుతం ఉన్న స్థలంలోనే సచివాలయం కొత్త భవనాన్ని కూడా నిర్మిస్తారు. ఈ రెండు భవనాలకు ఈ నెల 27న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు.

పార్లమెంట్ భవనాన్ని పోలినవిధంగా అసెంబ్లీ నిర్మాణం ఉండాలని మంత్రిమండలి సమావేశం తీర్మానించింది. ఈ భవనంలో సెంట్రల్ హాల్, కౌన్సిల్ హాల్, అసెంబ్లీ హాల్‌ను నిర్మించనున్నారు. ప్రస్తుత శాసనసభ భవనాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించాలని నిర్ణయించారు.

క్యాబినెట్ భేటీలో మహమూద్ అలీ, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. మంత్రిమండలి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మాణాలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

‘ఏపీలో ప్రభుత్వం మారడం మూలాన సెక్రటేరియట్, శాసనసభ భవనాల అప్పగింత పూర్తయింది. రేపు (బుధవారం)అధికారికంగా అప్పగిస్తారు. ఈ రెండు భవనాలు ఖాళీ అయిన దరిమిలా కచ్చితంగా తెలంగాణకు సెక్రటేరియట్ భవనాన్ని, అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలని నిర్ణయానికొచ్చాం.

గతంలో ఏపీ మొండికేయడం వల్ల ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారించాం. అందుకే, బైసన్‌పోలో గ్రౌండ్ కావాలని కేంద్రాన్ని అడిగాం. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ముందుకు రావడంతో ఇక్కడే సెక్రటేరియట్ నిర్మించాలని నిర్ణయించాం.

5 నుంచి 6 లక్షల ఎస్‌ఎఫ్‌టీ కడితే సరిపోతుందనే నిర్ణయానికొచ్చాం. ధరను పరిశీలిస్తే.. మంచి వరల్డ్ క్లాస్ ఫర్నిచర్‌తో కట్టుకున్నా.. అత్యంత మోడ్రన్‌గా కట్టుకుంటే కూడా.. రూ.400 కోట్లు ఖర్చు అవుతుందని అనుకుంటున్నాం. అసెంబ్లీ భవనం కూడా వంద కోట్లలో కట్టొచ్చని నిర్ణయించాం. పార్లమెంట్ తరహాలో సెంట్రల్ హాల్, అసెంబ్లీ హాల్, కౌన్సిల్‌హాల్ వంటివి ఇందులో ఉంటాయి. పార్లమెంట్ తరహాలోనే వసతులుంటాయి. సెపరేట్ హాల్స్ నిర్మిస్తాం’ అని సీఎం కేసీఆర్ తెలిపారని నమస్తే తెలంగాణ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి: