టీకాలు ఎలా పనిచేస్తాయి? టీకాల విజయం ఏమిటి? టీకాలపై కొందరిలో సంశయం ఎందుకు?

  • 20 జూన్ 2019

గత శతాబ్దం ప్రపంచవ్యాప్తంగా టీకాలు కోట్ల మంది ప్రాణాలు కాపాడాయి. అయినప్పటికీ చాలా దేశాల్లో వీటి పట్ల వ్యతిరేకత, సంశయం పెరుగుతున్నట్లు ఆరోగ్య నిపుణులు గుర్తించారు. ఈ ధోరణిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన చెందుతోంది. 2019లో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యానికి ఎదురయ్యే పది అతిపెద్ద సవాళ్లలో ఈ ధోరణి ఒకటని చెబుతోంది.

టీకాలు రాక ముందు ఏటా నివారించదగ్గ వ్యాధులతో లక్షల మంది చనిపోయేవారు.

టీకా ఎలా పుట్టింది?

టీకాల ఆవిష్కరణలో ముందడుగు వేసింది చైనీయులు. టీకామందు తొలిరూపాన్ని పదో శతాబ్దంలో చైనీయులే కనుగొన్నారు. అప్పట్లో చైనీయులు ఒక వ్యాధి వల్ల గాయంపై ఏర్పడ్డ పొర నుంచి కణజాలాన్ని సేకరించి, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులను దాని ప్రభావానికి గురిచేసేవారు. వారిలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఇలా చేసేవారు. దీనిని 'వారియోలేషన్' అంటారు.

ఆ తర్వాత ఎనిమిది శతాబ్దాలకు బ్రిటన్ వైద్యుడు ఎడ్వర్డ్ జెనర్ పరిశోధనలో మరో అడుగు ముందుకేశారు. పాలుపితకడం, సంబంధిత పనుల్లో ఉండే మహిళలకు స్వల్పస్థాయి కౌపాక్స్ ఎక్కువగా వస్తోందిగానీ ప్రాణాంతక మశూచి(స్మాల్‌పాక్స్) మాత్రం అరుదుగానే వస్తోందని గుర్తించిన ఆయన ఈ అంశంపై పరిశోధనలు చేశారు.

మశూచి తీవ్రంగా వ్యాపించే అంటువ్యాధి. గతంలో దీనిబారినపడ్డ వారిలో దాదాపు 30 శాతం మంది చనిపోయారు. వ్యాధి నుంచి బయటపడినవారికి శరీరంపై మచ్చలు ఉండిపోవడం, చూపు పోవడం జరిగేది.

ఎడ్వర్డ్ జెనర్ 1796లో జేమ్స్ ఫిప్స్‌ అనే ఎనిమిదేళ్ల బాలుడిపై ఒక ప్రయోగం చేశారు. కౌపాక్స్ గాయం నుంచి సేకరించిన చీమును బాలుడి శరీరంలో ప్రవేశపెట్టారు. అతడిలో కౌపాక్స్ లక్షణాలు కనిపించాయి.

తర్వాత కౌపాక్స్ నుంచి బాలుడు కోలుకున్నాడు. అప్పుడు ఎడ్వర్డ్ జెనర్ అతడిలో మశూచి కారకాలను చొప్పించారు. అయినప్పటికీ బాలుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. కౌపాక్స్ అతడి రోగ నిరోధక శక్తిని పెంచినట్లు ఎడ్వర్డ్ జెనర్ గుర్తించారు.

1798లో ఈ పరిశోధన ఫలితాలు ప్రచురితమయ్యాయి. అప్పుడే వ్యాక్సిన్(టీకా) అనే మాట వాడుకలోకి వచ్చింది. లాటిన్ భాషలోని 'వాకా' అనే మాట నుంచి వ్యాక్సిన్ వచ్చింది. వాకా అంటే ఆవు.

టీకాలు ఎలా పనిచేస్తాయి?

బలహీనపడ్డ లేదా మృత వ్యాధికారక బ్యాక్టీరియాను వ్యక్తి శరీరంలోకి ప్రవేశపెడతారు. చాలా సందర్భాల్లో ఇంజెక్షన్ ద్వారా ఈ పనిచేస్తారు. శరీరంలోని తెల్లరక్తకణాలు ప్రేరేపితమై, వ్యాధిపై పోరాడేందుకు యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి. సదరు వ్యక్తికి తర్వాత వ్యాధి వస్తే, సంబంధిత కణాలను యాంటీబాడీలు నిర్వీర్యం చేస్తాయి.

టీకా విజయం ఏమిటి?

గత శతాబ్దంలో అనేక వ్యాధులు ప్రాణాలు తీసేవి. వీటిపై పోరాటంలో టీకాల పాత్ర ఎంతో ఉంది.

తట్టు వ్యాధి నివారణకు 1960ల్లో తొలిసారిగా టీకామందును ప్రవేశపెట్టారు. ఈ టీకా వచ్చే వరకు ప్రపంచవ్యాప్తంగా తట్టువల్ల ఏటా సుమారు 26 లక్షల మంది చనిపోయేవారు.

2000, 2017 సంవత్సరాల మధ్య ఈ టీకా మందుతో తట్టు వ్యాధి మరణాలు 80 శాతం తగ్గిపోయాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి.

కొన్ని దశాబ్దాల క్రితం వరకు లక్షల మంది పోలియో వ్యాధి బారినపడేవారు. పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉండేది. బాధితులకు పక్షవాతం రావడం లేదా వారు చనిపోవడం కూడా జరిగేది. ఇప్పుడు పోలియో సమస్య దాదాపు పరిష్కారమైంది. ఈ విజయంలో టీకా మందుది కీలక పాత్ర.

టీకాలను కొందరు ఎందుకు వ్యతిరేకిస్తారు?

ఆధునిక టీకా మందులు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచే కొందరిలో వీటిపై వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది.

గతంలో మతపర కారణాలతో టీకాలు వేయించుకోవడానికి వెనకాడేవారు. టీకా మందు శుభ్రమైనది కాదనుకొనేవారు. ఇది తమ స్వేచ్ఛకు భంగం కలిగించడమేననే వాదనా ఉండేది.

1800ల్లో బ్రిటన్ వ్యాప్తంగా టీకా వ్యతిరేక కార్యక్రమాలు జరిగాయి. వ్యాధులను నివారించేందుకు టీకా మందు వేయొద్దని, రోగులను వేరుగా ఉంచడం లాంటి ఇతర చర్యలు చేపట్టాలని వ్యతిరేకులు డిమాండ్ చేశారు.

1870ల్లో బ్రిటన్‌లో టీకా వ్యతిరేక ఉద్యమకారుడు విలియం టెబ్ అమెరికాను సందర్శించిన తర్వాత అక్కడ టీకా వ్యతిరేక గ్రూపు ఒకటి ఏర్పడింది.

ఇటీవలి చరిత్రలో టీకాలకు వ్యతిరేకంగా పనిచేసిన ముఖ్యుల్లో లండన్‌కు చెందిన వైద్యుడు ఆండ్రూ వేక్‌ఫీల్డ్ ఒకరు.

ఎంఎంఆర్ వ్యాక్సిన్‌ ఆటిజానికి, బోవెల్ వ్యాధికి కారణమవుతుందంటూ ఆయన 1998లో ఒక తప్పుడు పత్రాన్ని సమర్పించారు.

చిన్నారుల్లో తట్టు, గవదబిళ్లలు, రుబెల్లా అనే మూడు వ్యాధులపై పోరాటానికి ఈ టీకా వాడతారు.

వేక్‌ఫీల్డ్ చెబుతోంది తప్పని స్పష్టం చేస్తూ, వైద్యప్రపంచం ఆయన పత్రాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. బ్రిటన్‌లో మెడికల్ రిజిస్టర్ నుంచి ఆయన పేరును తొలగించారు. అయినప్పటికీ ఆయన ఈ తప్పుడు ఆరోపణలు చేసిన తర్వాత ఎంఎంఆర్ టీకా వేయించుకొనే చిన్నారుల సంఖ్య తగ్గింది.

ఒక్క 2004లోనే బ్రిటన్‌లో ఎంఎంఆర్ టీకా వేయించుకున్నవారి సంఖ్య లక్ష తగ్గింది. పర్యవసానంగా తట్టు కేసులు పెరిగాయి.

టీకాల చుట్టూ రాజకీయాలు కూడా పెరుగుతున్నాయి. ఇటలీ అంతర్గత వ్యవహారాల మంత్రి మాటే సాల్విని బాహాటంగానే టీకా వ్యతిరేక గ్రూపులకు మద్దతు పలికారు.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ గతంలో ఎలాంటి ఆధారమూ లేకున్నా టీకాలకు, ఆటిజానికి సంబంధముందని చెప్పేందుకు యత్నించారు. కానీ ఆయన ఇటీవలే పిల్లలకు టీకాలు వేయించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు.

స్థూలంగా చూస్తే టీకాలపై ప్రజల్లో విశ్వాసం ఉందని వెల్‌కమ్‌ ట్రస్ట్ నిర్వహించిన ఒక అంతర్జాతీయ అధ్యయనంలో తేలింది.

ఈ విశ్వాసం ఐరోపా ప్రజల్లో తక్కువని, ఫ్రాన్స్‌ ప్రజల్లో అత్యంత తక్కువని వెల్లడైంది.

టీకాలు వేయించుకోకపోతే ముప్పు ఏమిటి?

జనాభాలో అత్యధికులు టీకాలు వేయించుకుంటే వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చు. తగినంత రోగ నిరోధక శక్తి వృద్ధిచెందని వారికి, లేదా టీకాలు వేయించుకోలేకపోయినవారికి కూడా వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.

ఈ విధంగా రోగాలను నిరోధించే విధానాన్ని 'హెర్డ్ ఇమ్యూనిటీ' అంటారు. ఈ విధానాన్ని పాటించకపోతే సమూహాల్లో ఎక్కువ మందికి ముప్పు ఏర్పడుతుంది.

'హెర్డ్ ఇమ్యూనిటీ' కోసం ఎంత శాతం మందికి టీకాలు వేయాలనేది వ్యాధిని బట్టి మారిపోతుంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం ప్రకారం- తట్టుకు ఇది 95 శాతం కాగా, పోలియోకు 80 శాతం. అంటువ్యాధిగా వ్యాపించడంలో తట్టు పోలియో కన్నా తీవ్రమైనది.

టీకాలకు, ఆటిజానికి సంబంధముందనే తప్పుడు సమాచారంతో గత సంవత్సరం అమెరికాలోని బ్రూక్లిన్‌లో ఒక అతిసంప్రదాయవాద యూదు సమూహం ప్రచారం చేసింది.

అమెరికాలో కొన్ని దశాబ్దాల్లోనే అత్యధికంగా ఈసారి తట్టు కేసులు నమోదయ్యాయి. ఈ సందర్భంలో ఈ సమూహంపైకి అందరి దృష్టీ మళ్లింది.

Image copyright Science Photo Library

టీకాల గురించి సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తిలో ఉందని, దీనిని చూసి చాలా మంది ప్రజలు తప్పుదోవ పడుతున్నారని ఇంగ్లండ్‌లోని అత్యంత సీనియర్ డాక్టర్ ఒకరు నిరుడు విచారం వ్యక్తంచేశారు.

టీకాల గురించి ఆన్‌లైన్‌లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేసేందుకు రష్యన్ బోట్స్‌ను వాడుతున్నారని అమెరికా పరిశోధకులు గుర్తించారు.

కొన్నేళ్లుగా 85 శాతమే

టీకాలు వేయించుకొనే బాలల శాతం కొన్నేళ్లుగా 85గానే ఉందని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. ఇవి ఏటా ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల నుంచి 30 లక్షల మంది ప్రాణాలు కాపాడుతున్నాయని పేర్కొంటోంది.

యుద్ధాలు, హింస, పేలవ ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థలు ఉన్న దేశాల్లో టీకాలు వేసే ప్రక్రియకు అతిపెద్ద సవాళ్లు ఎదురవుతున్నాయి. అఫ్గానిస్థాన్, అంగోలా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇతర దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.

అభివృద్ధి చెందిన దేశాల్లో టీకాల పట్ల నిర్లక్ష్యం ఒక ప్రధాన ప్రతిబంధకమని డబ్ల్యూహెచ్‌వో గుర్తించింది. వ్యాధులు చేసే హానిని అక్కడి ప్రజలు మరచిపోతున్నారని ఆక్షేపించింది.

(ప్రొడ్యూసర్లు: రోలండ్ హ్యూగ్స్, డేవిడ్ బ్రౌన్, టామ్ ఫ్రాన్సిస్-వినింగ్టన్, సియాన్ విల్‌మాట్)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

కార్గిల్ యుద్ధం: "శరీరంలో 15 బుల్లెట్లు దిగాయి, శక్తిని కూడదీసుకుని పాక్‌ సైన్యంపై గ్రెనేడ్ విసిరా"

ఇంట్లో ప్రవేశించి మంచమెక్కి పడుకున్న పులి

అపోలో 11: చంద్రుడి మీదకు మనిషి ప్రయాణం ఓ నాటకమా? దీనికి నాసా సమాధానమేంటి?

పోలవరం పనుల రివర్స్ టెండరింగ్.. ఇంతకీ రివ‌ర్స్ టెండ‌రింగ్ అంటే ఏమిటి

సాయంత్రం 6 లోగా బలపరీక్ష జరపండి.. డెడ్‌లైన్ పొడిగించిన గవర్నర్

‘అమరావతి రుణాన్ని తిరస్కరించాలన్న ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానిదే.. ప్రపంచ బ్యాంకుది కాదు’

జింబాబ్వేను సస్పెండ్ చేసిన ఐసీసీ.. క్రికెట్‌లో రాజకీయ జోక్యంతో జట్టుపై నిషేధం

కుల్‌భూషణ్ జాధవ్ మరణశిక్షను పాకిస్తాన్ ఎలా సమీక్షిస్తుంది