పాకిస్తాన్‌ జైళ్లలో మత్స్యకారులు: 'ఎదురుచూపులతోనే ఏడు నెలలు .. వస్తారో రారో తెలియదు'

  • 20 జూన్ 2019
మత్స్యకార కుటుంబీకురాలు

శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు గత ఏడు నెలలుగా పాకిస్తాన్ చెరలో బందీలుగా ఉన్నారు. బందీలైన మత్స్యకారుల కుటుంబీకులు.. తమ వాళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. అలా ఎదురుచూపులతో ఏడు నెలలు గడిచిపోయాయి. తమవారు వస్తారో రారో, అసలు ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా తెలీదని బాధిత కుటుంబ సభ్యులు బీబీసీతో అన్నారు.

ఆదుకుంటామని హామీ ఇచ్చిన ప్రభుత్వం నుంచి ఇంతవరకూ కనీసం పరిహారం కూడా అందలేదని కొందరు మహిళలు చెబుతున్నారు.

'వేటాడుతూ పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించారు'

అరేబియా మహాసముద్రంలో వేటాడుతూ పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించారంటూ, పాకిస్తాన్ కోస్ట్‌గార్డ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులను 2018 నవంబర్ 28న తేదీన అరెస్టు చెసింది. మొత్తం 22 మందిని అరెస్టు చేయగా, వారిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు 15 మంది ఉన్నారు. వీరిలో 13 మంది ఒకరితో మరొకరికి బంధుత్వం కలిగినవారు!

శ్రీకాకుళం జిల్లాలో చేపల జెట్టీ లేకపోవడంతో మత్స్యకారులు ప్రతి ఏడాది ఆగస్టు నెలలో గుజరాత్‌లోని వీరావల్‌కు వలస వెళ్లి, అక్కడ బోట్లలో కూలీలుగా చేరి వేట సాగిస్తారు. ఇలా వేటాడుతూ పాకిస్తాన్ కోస్ట్‌గార్డ్‌కు చిక్కారు.

శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం కె.మత్స్యలేశం గ్రామానికి చెందిన మగతమ్మ భర్తతోపాటు తన 17 ఏళ్ల పెద్దకొడుకు కిషోర్, 16 ఏళ్ల చిన్న కొడుకు కిరణ్‌, ఆమె సోదరుడు అందరూ గుజరాత్‌లోని హీరావల్‌కు వలస వెళ్లారు. వీరంతా పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్‌కు పట్టుబడినట్లు ఆమె తెలిపారు. కనీసం తమ వారు ఉన్నారో లేరో కూడా తెలియడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: 7 నెలలుగా పాకిస్థాన్ చెరలో శ్రీకాకుళం మత్స్యకారులు

'అభినందన్‌ తరహాలో మావాళ్ల విడుదలకు చర్యలు'

ఇలాంటి మరో కథ డి.మత్స్యలేశం గ్రామానికి చెందిన మైళిపిల్లి ఎర్రమ్మది. ఎర్రమ్మ భర్త సన్యాసి, అతడి కుమారుడు రాంబాబు ఇద్దరు గుజరాత్‌లోని హీరావల్ పోర్ట్‌కు వలస వెళ్లి, పాకిస్తాన్ కోస్ట్‌గార్డ్స్‌కు పట్టుబడ్డారని ఎర్రమ్మ బీబీసీకి చెప్పారు.

తనకు అరోగ్యం అంతంత మాత్రమేనని, రెండో తరగతి చదువుతున్న తన కొడుకు 'అమ్మా.. నాన్న ఎప్పుడొస్తాడు..' అని అడుగుతుంటే, ఆ పిల్లాడికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడంలేదని తన పరిస్థితి వివరించారు.

పూట గడవడం కష్టంగా ఉందని, అప్పులు చేస్తూ కాలం గడుపుతున్నానని ఆమె చెబుతున్నారు.

ఇక కె.మత్స్యలేశం గ్రామానికి చెందిన జి.అప్పన్నది మరో కథ. అతని కొడుకు రామారావు బోటు డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు. ప్రస్తుతం రామారావు పాకిస్తాన్ జైల్లో బంధీగా ఉన్నాడు.

''ఈ వయసులో ఆసరాగా ఉండే కొడుకు పొరుగు దేశం జైల్లో ఉన్నాడు. ఈ వయసులో నాకు పని ఎవ్వరు ఇస్తారు? ముసలివాళ్లైన నా తల్లిదండ్రుల బాగోగులు కూడా నేనే చూడాల్సి వస్తోంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు అప్పన్న.

అభినందన్ తరహాలో తమవారిని కూడా విడుదల చేయాలని, ఆ దిశగా భారత ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.

'పూర్తిస్థాయిలో అందని పరిహారం'

తమకు ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో పరిహారం అందడం లేదని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పాకిస్తాన్‌కు పట్టుబడిన ప్రతి మత్స్యకారుడి కుటుంబానికి 2 లక్షల రూపాయల నగదుతోపాటు, కుటుంబంలోని మహిళకు 4 వేల రూపాయల పెన్షన్ ఇస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు బాధిత మహిళలు చెబుతున్నారు.

అంతేకాకుండా మత్స్యకారులు వేట సాగించేందుకు వీలుగా బోట్లు, కుటుంబ సభ్యుల స్వయం ఉపాధి కోసం మోటారు వాహనాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు నిధులు కూడా విడుదలయ్యాయని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ బీబీసీతో అన్నారు.

అయితే, 2 లక్షల పరిహారం అందిన మత్స్యకార కుటుంబాల నుంచి, పరిహారం అందిన రెండో రోజే, మీకు సొంత బోట్లు ఇస్తాం, అంటూ అధికారులు వీరి నుంచి లక్షా 25 వేల రూపాయలు తీసుకున్నారని, మిగిలిన 75 వేలు మోటారు వాహనాల కోసం తీసుకున్నారని బాధితులు బీబీసీకి తెలిపారు. డబ్బు తీసుకుని వాహనాలను అప్పగించారా అంటే అదీ లేదని వారంటున్నారు.

ఒక కుటుంబంలో వేటకు వెళ్లిన నలుగురు పాకిస్తాన్ కోస్ట్‌గార్డులకు చిక్కినా, ఆ కుటుంబంలో కేవలం ఒక్కరికే పరిహారం ఇచ్చారు. పాక్ చెరలోని మత్స్యకార కుటుంబాల మహిళలకు హామీ ఇచ్చిన 4 వేల రూపాయల పెన్షన్ కూడా ఎన్నికల తరువాత ఆగిపోయింది.

ఇటీవల కొందరు జాలర్లను పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చెసింది. అప్పుడు తమ వాళ్లు కూడా విడుదలవుతారని వీరు ఎదురు చూశారు. కానీ విడుదలైనవారిలో ఈ ప్రాంతానికి చెందినవారు ఎవ్వరూ లేకపోవడంతో కుటుంబ సభ్యులు నిరాశ చెందారు.

'మత్స్యకారుల విడుదలకు ప్రయత్నం చేస్తున్నాం'

''భారత్-పాకిస్తాన్ మధ్య ఖైదీల విడులకు సంబంధించిన ఎలాంటి ఒప్పందం లేదు. దీంతో దశలవారిగా ఇరు దేశాల మధ్య మత్స్యకారులను విడుదల చేస్తున్నారు'' అని వివరించారు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్.

‘‘ఇప్పటికే మత్స్యకారుల విడుదల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపాం. వారి కుటుంబ సభ్యులను ఆదుకోవడానికి పెన్షన్ పథకాన్ని కూడా అమలు చేస్తున్నాం. ఇటీవల పెన్షన్లు ఆగిపోయినా, మళ్లీ పునరుద్ధరిస్తాం'' అని నివాస్ బీబీసీకి తెలిపారు.

వీటితో పాటుగా అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్‌ల వ్యవహారాలకు జాయింట్ సెక్రటరీగా ఉన్న జేఎస్.పాయ్‌కు మత్స్యకారుల గురించి ప్రత్యేకంగా లేఖ కూడా రాశామని ఆయన అన్నారు. అంతేకాకుండా, పాకిస్తాన్ హైకమిషనర్‌కు కూడా లెటర్ రాశామని అన్నారు.

ఎన్నికల హడావుడి అయిపోయింది కనుక, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని తమవారి విడుదలకు చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. మత్స్యకారుల వలసలను శాశ్వతంగా నివారించేలా ఈ ప్రాంతంలో జెట్టి నిర్మాణాన్ని పూర్తి చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

అక్కడ గ్రహాంతర జీవులున్నాయా.. ఎవరూ రావొద్దని అమెరికా ఎయిర్‌ఫోర్స్ ఎందుకు హెచ్చరించింది

బిహార్, అస్సాం వరదలపై రాహుల్ గాంధీ ట్వీట్‌లోని ఫొటోల్లో నిజమెంత

ప్రెస్ రివ్యూ: మోదీది ఓ గెలుపా? ఏంపనిచేసి గెలిచారు? -కేసీఆర్

రిచా భారతీ: ఖురాన్ పంపిణీ చేయాలన్న కోర్టు.. ప్రాథమిక హక్కును కాలరాయడమే అంటున్న ఝార్ఖండ్ యువతి

కుల్‌భూషణ్ జాధవ్‌కు పాకిస్తాన్ విధించిన మరణశిక్షను నిలిపివేసిన ఐసీజే

కార్గిల్ యుద్ధం: భారత సైన్యాన్ని ఆపడానికి అమెరికా శరణు కోరిన నవాజ్ షరీఫ్

హఫీజ్ సయీద్‌‌: ముందస్తు బెయిల్ కోసం వెళ్తుండగా పాకిస్తాన్‌లో అరెస్ట్

అపోలో-11 మిషన్: చంద్రుడి మీదకు అమెరికా మనిషిని ఎందుకు పంపించింది...