వైఎస్ జగన్‌: ప్రత్యేక హోదాపై మాట తప్పడం సరికాదు - ప్రెస్‌రివ్యూ

  • 20 జూన్ 2019
Image copyright I&pr andhrapradesh

''పార్లమెంటు ప్రజాస్వామ్య దేవాలయంలాంటిది. మరి... పార్లమెంటు వేదికపైనే ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చకపోతే, దీనిపై ప్రజలకు గౌరవం ఎలా ఉంటుంది?'' అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ ప్రశ్నించారని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తామన్న షరతుతో విభజన చేసి... ఆ హామీని అమలు చేయకపోవడాన్ని ఎలా సమర్థించుకుంటారని జగన్ అడిగారు. దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలతోపాటు పలు అంశాలపై ప్రధాని అధ్యక్షతన బుధవారం పార్లమెంటు లైబ్రరీ భవనంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో జగన్‌ ప్రసంగించారు.

పార్లమెంటు పనితీరును మెరుగుపరిచే అంశంపై మాట్లాడుతూ ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారు. ''ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న షరతుతో రాష్ట్ర విభజనకు అప్పటి అధికార, ప్రతిపక్షాలు అంగీకరించాయి.

ఐదేళ్లు దాటినా ఆ మాట నిలబెట్టుకోలేదు. ప్రజల గౌరవాన్ని, విశ్వాసాన్ని నిలుపుకోవాలంటే... పార్లమెంటులో ఇచ్చిన ప్రతీ హామీని నిర్ణీత కాలవ్యవధిలో అమలు చేయాలి. అప్పుడే రాజకీయ పార్టీలు సభలో ఆందోళనలు చేయడం ఆపుతాయి'' అని జగన్‌ పేర్కొన్నారు.

పార్టీ ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోకపోతే బాధిత పార్టీ సభలో ఆందోళనకు దిగడం మినహా ఏం చేయగలుగుతుందని జగన్‌ ప్రశ్నించారు. పార్లమెంటుపై విశ్వసనీయత, ఉత్పాదకత పెంచడానికి ఫిరాయింపులపై రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ మేరకు త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ఫిర్యాదు అందిన 90 రోజుల్లో స్పీకర్‌ తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదించారు. రాజీనామా చేయకుండా ఇతర పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకునే రాజకీయ పార్టీలను ఎన్నికల్లో పోటీ చేయనివ్వకుండా ప్రజాప్రాతినిధ్యం చట్టాన్ని సవరించాలని కోరారు.

గతంలో తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలను, 23 మంది ఎమ్మెల్యేలను అవినీతితో ఆర్జించిన సొమ్ముతో టీడీపీ కొనుగోలు చేసిందని, అందులో కొంత మంది మంత్రులు సైతం అయ్యారని వివరించారు. ప్రజాతీర్పును, ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని, మొత్తంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారంటూ జగన్ ఆవేదన వ్యక్తం చేశారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

Image copyright Getty Images

ఆత్మహత్యలకు ఫలితాలు కారణం కాదు: హైకోర్టు

ఇంటర్‌ ఫలితాలకు విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధం లేదని హైకోర్టు తీర్పు చెప్పిందని సాక్షి వెల్లడించింది. ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు డిస్మిస్‌ చేసింది.

విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం దురదృష్టకరమేనని, అయితే ఇంటర్‌ ఫలితాలకు వారి ఆత్మహత్యలకు సంబంధం లేదని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

3.82 లక్షల మంది ఇంటర్‌ పరీక్షల్లో తప్పితే వారందరి జవాబు పత్రాలను ఎలాంటి రుసుము వసూలు చేయకుండా రీవెరిఫికేషన్‌ చేస్తే 1,183 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారని, ఇది 0.16 శాతమని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.

రీవెరిఫికేషన్‌ తర్వాత 460 మంది మాత్రమే తిరిగి దరఖాస్తు చేసుకున్న విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. లక్షల సంఖ్యలో విద్యార్థులు పరీక్షలు రాసినప్పుడు ఫెయిల్‌ అయిన విద్యార్థుల పత్రాల్ని రీవెరిఫికేషన్‌లో వెలువడిన ఫలితాల శాతాన్ని బేరీజు వేసి చూస్తే తప్పు జరిగినట్లు పరిగణించాల్సిన స్థాయిలో లేదని ధర్మాసనం తన తీర్పులో వెల్లడించింది.

ఇంటర్‌ పరీక్ష పత్రాల మూల్యాంకనం తప్పుల తడకగా జరగడంతో 16 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వీరి కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని, తప్పులు చేసిన ఇంటర్‌ బోర్డు సిబ్బందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ బాలల హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పి.అచ్యుత్‌రావు, న్యాయవాది రాపోలు భాస్కర్‌ వేర్వేరుగా దాఖలు చేసిన పిల్స్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది.

23 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని, అయితే వారి ఆత్మహత్యలకు ఇంటర్‌ ఫలితాలకు సంబంధం లేదని, పిటిషనర్‌ కోరినట్లుగా వారి కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించేలా ఆదేశాలివ్వలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది.

అదేవిధంగా ఇంటర్‌ బోర్డు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకునే విషయంలోనూ ఆదేశాలివ్వలేమని పేర్కొంది. ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవచ్చునని తెలిపింది. ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు రెండు పిల్స్‌ను తోసిపుచ్చిందని సాక్షి తెలిపింది.

కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి Image copyright KCR/FB

‘డీఎంకేలా టీఆర్ఎస్ ఉండాలి’

టీఆర్‌ఎస్ పార్టీ పటిష్ఠంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని, డీఎంకే మాదిరి టీఆర్‌ఎస్ తయారుకావాలని, పార్టీ బాగుంటేనే అందరం బాగుంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారని నమస్తే తెలంగాణ పేర్కొంది.

తెలంగాణభవన్‌లో బుధవారం టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి పార్టీ అధ్యక్షుడి హోదాలో ఆయన అధ్యక్షత వహించారు. ఒకనాడు టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఖాళీచేయించిన నాటి పరిస్థితి నుంచి.. నేడు ప్రతి జిల్లాలో శాశ్వత కార్యాలయాలు నిర్మించుకునే స్థాయికి పార్టీ ఎదిగిందని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని తెలిపారు.

తమిళనాడులో డీఎంకే పార్టీకి ప్రస్తుతం 1400 మంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీమంత్రులు, మాజీ ఎంపీలు, రాష్ట్ర స్థాయి నేతలు ఉన్నారని కేసీఆర్ తెలిపారు. అక్కడ ఒక్కో కుటుంబం నుంచి మూడు నాలుగు తరాలు ఆ పార్టీలో పనిచేస్తారని చెప్పారు. వారు తరుచుగా పార్టీలు మారబోరని, సొంత ప్రయోజనాలు కాకుండా ప్రజల ప్రయోజనాలకోసం, పార్టీ స్థాపించిన లక్ష్యంకోసం పనిచేస్తారన్నారు.

అందుకే అక్కడ వేరేపార్టీలకు అవకాశం లేకుండా ఆ రెండు పార్టీలే అధికారంలో ఉంటున్నాయన్నారు. డీఎంకే స్థాపించిన నాటినుంచి అంత పటిష్ఠంగా పార్టీని తయారుచేశారని తెలిపారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం హిందీని దేశవ్యాప్తంగా అమలుచేసేందుకు నిబంధన పెట్టాలని భావిస్తే ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించిందని, దీంతో ఒక్క రోజులోనే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఆ నిర్ణయాన్ని వెనుకకు తీసుకున్నదని చెప్పారు.

డీఎంకే నిర్ణయానికి కేంద్రం తలవంచాల్సి వచ్చిందన్నారు. అంత పటిష్ఠంగా డీఎంకే అక్కడ పాతుకుపోయిందని, దానికి సిద్ధాంతపరమైన క్యాడర్ ఉన్నదని తెలిపారు. డీఎంకే పార్టీకి అక్కడ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.6 వేల కోట్ల ఆస్తులున్నాయని కేసీఆర్ చెప్పారు.

తెలంగాణ రాష్ట్రానికి టీఆర్‌ఎస్ పార్టీ రక్షణ కవచం లాంటిదని ప్రజలు భావించారని, అందుకే ప్రతి ఎన్నికల్లోనూ అద్భుత విజయాలను అందిస్తున్నారని అన్నారు. ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ప్రేమను పొందామని, దానిని నిలుపుకోవడానికి ఇంకా బాగా పనిచేయాల్సి ఉన్నదని చెప్పారు. ఇందుకోసం పార్టీని మరింత బలోపేతం చేసుకుందామని పేర్కొన్నారని నమస్తే తెలంగాణ వెల్లడించింది.

రవానా భారం తెలుగు రాష్ట్రాలు Image copyright Getty Images

రవాణా భారం నుంచి ఇక విముక్తి

రవాణాకు సంబంధించిన పలు చిక్కుముళ్లు ఇకముందు వీడనున్నాయి. సరకు రవాణా వాహనాలకు పన్ను భారం తగ్గనుందని ఈనాడు ఒక కథనంలో పేర్కొంది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య పరస్పర అవగాహన ఒప్పందం(కౌంటర్‌ సిగ్నేచర్‌ అగ్రిమెంట్‌) చేసుకునేందుకు మార్గం సుగమమవుతోంది. విడివడిన తర్వాత, రెండు రాష్ట్రాల మధ్య నిర్ణీత ఒప్పందం జరగలేదు.

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ కొనసాగినంత కాలం, పరస్పర అవగాహన ఒప్పందం కొనసాగేలా తొలినాళ్లలో ఉత్తర్వు జారీచేసినప్పటికీ అనంతరం అది రద్దయింది. ఆ ఒప్పందం చేసుకునేందుకు పలు దఫాలు కసరత్తు జరిగినా ఓ కొలిక్కి రాలేదు.

రెండు తెలుగు రాష్ట్రాలకూ ఆ ఒప్పందం కుదిరితే, సరకు రవాణాదారులు ఊపిరి పీల్చుకుంటారు. రోజూ వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఒప్పందమంటూ లేకపోవటంతో, రవాణా బండ్లు వారానికి నిర్ణీత మొత్తం చెల్లించి తాత్కాలిక పర్మిట్‌ తీసుకుంటున్నాయి.

వాహనదారులకు అదే భారంగా మారింది. దాన్ని ప్రజలపైనే మోపుతున్నారు. ఒప్పందం కుదిరితే ఏడాదికి నామమాత్రపు రుసుం చెల్లించి ఎన్ని దఫాలైనా రాకపోకలు సాగించవచ్చు. ఆ ఒప్పందం ఫీజు విషయంలో ఉభయ రాష్ట్రాల వాదనా భిన్నంగా ఉంటోంది. ఇక్కడి నుంచి ఏపీకి వచ్చే వాహనాలే అధికంగా ఉంటాయని ఆ రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. ఒప్పందం చేసుకున్న పక్షంలో తమ ఆదాయం తగ్గిపోతుందన్న ఆందోళనను అధికారులు వ్యక్తంచేస్తున్నారు.

ఇదే అంశంపై గతంలో ముఖ్యకార్యదర్శుల స్థాయి చర్చలు జరిగినా పరిష్కారం కాలేదు. సీఎంల స్థాయిలో త్వరలోనే జరిగే చర్చలతో రవాణా అంశం కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ పుణ్యస్థలాల(ఆధ్యాత్మిక ప్రాంతాల)కు వచ్చే వాహనాల పన్నులను ఎత్తివేసే అంశానికీ పరిష్కారం లభిస్తుందంటున్నారు.

ఆయా ప్రదేశాలకు వచ్చే వాహనాలను పన్ను నుంచి మినహాయించే పద్ధతి ఉమ్మడి రాష్ట్రంలో అమలులో ఉంది. రాష్ట్రం విడిపోయిన అనంతరం ఆయా కేంద్రాలకు రాకపోకలు సాగించే వాహనాల నుంచి పన్నులు వసూలు చేస్తున్నారు. పరస్పర అవగాహన ఒప్పందంలో భాగంగా ఈ భారం నుంచి కూడా విముక్తి లభించనుందని ఈనాడు తెలిపింది.

ఇవి కూడా చదవండి: