కాళేశ్వరం ప్రాజెక్ట్‌: పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నరు సమక్షంలో జాతికి అంకితం చేసిన కేసీఆర్

  • 21 జూన్ 2019
కాళేశ్వరం ప్రాజెక్టు Image copyright KCR/FB

తెలంగాణలో ప్రజల సాగు, తాగు నీటి ఇబ్బందులు తీర్చేలా గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అధికారికంగా ప్రారంభమైంది.

తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఏపీ, మహారాష్ట్ర సీఎంలు, మంత్రులు, అధికారులు సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.

యుద్ధప్రాతిపదికన నిర్మించిన ఈ ప్రాజెక్టు తెలంగాణలోని అత్యధిక జిల్లాలకు సాగు,తాగు నీరు అందించనుంది. పారిశ్రామిక అవసరాలను కూడా తీర్చనుంది.

3 బ్యారేజీలు, 20 రిజర్వాయర్లు, 20 పంపుహౌసుల సమూహారంగా కాళేశ్వరం ప్రాజెక్టును రూపొందించారు. దాదాపు 37.08 లక్షల ఎకరాలకు నీరిందించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని అధికారులు తెలిపారు.

Image copyright Praveen Kasam
చిత్రం శీర్షిక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ విశేషాలను తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ,మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌తో కలిసి కేసీఆర్ వీక్షించారు.

ఒక ప్రాజెక్టు... ముగ్గురు ముఖ్యమంత్రులు

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సహా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

వారికి ప్రాజెక్టు వివరాలను కేసీఆర్ స్వయంగా వివరించారు. కన్నెపల్లి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద వేద పండితులు సమక్షంలో కేసీఆర్ దంపతులు జల సంకల్ప హోమం నిర్వహించారు.

పూర్ణాహుతి అనంతరం ముహుర్తం సమయానికి ముగ్గురు ముఖ్యమంత్రలు కలిసి శిలాఫలకాలను ఆవిష్కరించి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.

Image copyright Harish rao/fb

కనిపించని హరీశ్ రావు

ఈ ప్రాజెక్టు ప్రారంభం నుంచి నిర్మాణ బాధ్యతలను పర్యవేక్షించిన భారీ నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరిశ్ రావు మాత్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో కనిపించలేదు. ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ ప్రాజెక్టు పై ట్విటర్‌లో హరీశ్ స్పందించారు.

‘‘గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్ళాలి అనే ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చే దిశగా ఇది బలమైన అడుగు. ఇది తెలంగాణ ప్రజల పోరాట ఫలితం. అమరుల త్యాగాల ఫలితం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిరంతర కృషి ఫలితం. నాటి సమైక్య పాలకులు కావాలనే అంతరాష్ట్ర వివాదాల్లో చిక్కుకొనే విధంగా నీటి లభ్యత లేని చోట ప్రాజెక్టును డిజైన్ చేస్తే, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అపర భగీరథుడిలా, తానే ఒక ఇంజనీర్ గా మారి అహోరాత్రులు శ్రమించి ప్రాజెక్టును రీడిజైన్ చేశారు. మహారాష్ట్ర తో నెలకొన్న వివాదాన్ని స్నేహ పూర్వకంగా పరిష్కరించి ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమం చేశారు. నిరంతరం పర్యవేక్షిస్తూ రికార్డు సమయంలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయించిన గౌరవ సీఎం కేసీఆర్ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రాజెక్టు నిర్మాణంలో ఎండ, వాన, చలిని లెక్క చేయకుండా రేయింబవళ్లు శ్రమించిన ఇంజనీర్లకు, ఉద్యోగులకు, కార్మికులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు..ఈ సన్నివేశాన్ని ఆనందబాష్పాలతో తిలకిస్తున్న తెలంగాణ రైతుల పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. సస్యశ్యామల తెలంగాణ స్వప్నం సాకారం అయ్యేల ఆశీస్సులు అందించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు