ముజఫర్‌పుర్‌: ఎన్సెఫలిటిసా, పాలనావైఫల్యమా... 121 మంది చిన్నారుల మరణాలకు కారణమెవరు...

  • 24 జూన్ 2019
రోహిత్‌
చిత్రం శీర్షిక మూడేళ్ల రోహిత్‌ను ఏఈఎస్‌ బలి తీసుకుంది

ముజఫర్‌పుర్‌లో ఉన్న శ్రీకృష్ణ మెడికల్ కాలేజీలో మురిగిపోయిన వ్యర్థాలు, చెమట, ఫినాయిల్, శవాల నుంచి వచ్చే వాసన గుప్పుమంటోంది. ఆసుపత్రిలో మొదటి అంతస్తులోని ఐసీయూ వార్డ్ ద్వారం వద్ద నేను నిల్చొని ఉన్నా.

బిహార్‌లోని ఈ పట్టణంలో పగటి పూట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. రాత్రుళ్లు కూడా వేడి భగభగలు ఉంటున్నాయి. పైగా ప్రతి పది నిమిషాలకోసారీ కరెంటు పోతోంది.

ఒక్కసారిగా నాకు వార్డులో నుంచి ఓ కేక వినిపించింది.

గాజు అద్దం నుంచి లోపలికి చూశా. ఒక బెడ్ పక్కన మహిళ కనిపించారు. ఆమె పేరు సుధ. వయసు 27 ఏళ్లు.

ఆమె ఒక్కసారిగా నేలకూలిపోయి ఏడుస్తున్నారు. ఆమె మూడేళ్ల కుమారుడు రోహిత్ బెడ్‌పై నిర్జీవంగా పడి ఉన్నాడు. అక్యూట్ ఎన్సెఫలిటిస్ సిండ్రోమ్ (ఏఈఎస్) వ్యాధితో ప్రాణాల కోసం పోరాడి అతడు ఓడిపోయాడు.

తన కుమారుడి చిన్న పాదాలను పట్టుకుని సుధ గట్టిగా ఓ కేక పెట్టారు. ఆసుపత్రి గోడలను దాటుకుని, మొత్తం పట్టణానికి వినిపించేలా ఆ కేక ప్రతిధ్వనించినట్లు నాకు అనిపించింది.

వైద్యులు ఆమెను వార్డు బయటకు తీసుకువెళ్లాలని సూచించారు. నెమ్మదిగా ఆమె కేకలు ఆగని కన్నీటి ధారలుగా మారిపోయాయి.

కన్నపిల్లల మరణం ఓ తల్లికి ఎంత హృదయవిదారకంగా ఉంటుందో గత రెండు వారాలు శ్రీకృష్ణ మెడికల్ కాలేజీ ఐసీయూ వార్డుల్లో నేను ప్రత్యక్షంగా చూశా.

చాలా మంది తల్లుల ఏడ్పులు వింటూ, నేనూ ఆ వార్డులో ఓ మూలన కన్నీరు పెట్టుకున్నా.

ముజఫర్‌పుర్‌లో ఇప్పటివరకూ 121 మంది చిన్నారులను ఏఈఎస్ బలితీసుకుంది. అవి ఇంతటితో ఆగే సూచనలు కూడా కనిపించడం లేదు.

చిత్రం శీర్షిక రోహిత్ తండ్రి అనిల్ సాహ్నీ

వార్డు బయట సుధను ఆమె భర్త అనిల్ సాహ్నీ ఓదార్చేందుకు ప్రయత్నిస్తూ కనిపించారు. వార్డు లోపల రోహిత్ నానమ్మ కూడా రోధిస్తున్నారు.

అనిల్ సాహ్నీ చెమటలో తడిసిపోయారు. ఆయన కుమారుడు ముందు రోజు రాత్రి వరకూ చక్కగా ఉన్నాడు.

''మేము ఓ గంట క్రితమే రోహిత్‌ను ఆసుపత్రికి తీసుకువచ్చాం. బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యలు మొదట చెప్పారు. ఇప్పుడేమో అతడు చనిపోయాడని అంటున్నారు'' అని అనిల్ చెప్పారు.

అనిల్ మాట్లాడుతున్న సమయంలోనే ఆసుపత్రిలో కరెంటు పోయింది. మొబైల్ ఫోన్ టార్చ్ వెలుతురులో ఆయన చెంపలపై కారుతోంది కన్నీరో, చెమటో అర్థం కాలేదు.

కారిడార్‌లో నేను ఇంకొంచెం ముందుకు వెళ్లగానే.. మూత్రం, ఫినాయిల్, చెత్త నుంచి వస్తున్న వాసన ముక్కు పుటాలు అదిరిపోయేలా తగిలింది.

కారిడార్‌కు రెండు వైపులా రోగులు ఉన్నారు. చేతిలో పట్టుకునే చిన్న ఫ్యాన్లతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వారికి వేడి నుంచి ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.

తాగునీరు, బెడ్‌లు, ఫ్యాన్లు, పరిశుభ్రమైన టాయిలెట్లు లేక ఈ ఆసుపత్రి రాత్రి పూట ఓ పాడుపడ్డ భవనంలా కనిపించింది. ప్రభుత్వ ఆసుపత్రిలా లేదు.

చిత్రం శీర్షిక ఐదేళ్ల అర్చన కూడా ఇటీవలే ప్రాణాలు కోల్పోయింది

బిహార్ సీఎం నీతీశ్ కుమార్, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ ఆసుపత్రిని సందర్శించారు. కానీ, ఇక్కడున్నవారికి ఉత్త మాటలు, హామీలే మిగిలాయి.

ఎన్సెఫలిటిస్ లాంటి తీవ్రమైన వ్యాధి బారినపడ్డ రోగులతో ఉన్న ఈ ఆసుపత్రిలో తాగు నీటిని అందించే కుళాయి ఒక్కటి కూడా లేదు.

బీబీసీ ప్రశ్నించినప్పుడు.. 'ఇలాంటి చిన్న విషయాలు ఆసుపత్రి మేనేజ్‌మెంట్ చూసుకోవాల్సి ఉంటుంద'ని హర్షవర్ధన్ బదులిచ్చారు.

వట్టి హామీలే..

ఆసుపత్రి నిర్వహణలో వైఫల్యాల గురించి అడిగినప్పుడు ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీల్ షాహీ సూటిగా సమాధానాలు ఇవ్వలేదు.

''దశలవారీగా 1500 పడకల సామర్థ్యమున్న ఆసుపత్రిని ఈ మెడికల్ కాలేజీలో నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా చిన్నారుల ఐసీయూను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ కల్లా ఇవి పూర్తవుతాయని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ అన్నారు'' అని సునీల్ షాహీ చెప్పారు.

ఈ మాటలు గానీ, ప్రభుత్వం ప్రకటించిన రూ.4లక్షల పరిహారం గానీ రోహిత్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల బాధను కొంచెమైనా తగ్గించలేకపోతున్నాయి.

చిత్రం శీర్షిక రోహిత్ కుటుంబం రెండు గదులున్న గుడిసెలో ఉంటోంది

‘అంతా బాగుంది. కానీ ఒక్కసారిగా..’

రోహిత్ మరణానికి ఒక రోజు ముందు మేం వారి గ్రామం రాజ్‌పునాస్‌కు వెళ్లి, అతడి కుటుంబ సభ్యులను కలిశాం.

ఆ గ్రామంలో 1500 ఇళ్లున్నాయి. రోహిత్ కుటుంబం రెండు గదులున్న గుడిసెలో ఉంటోంది. ఆ కుటుంబంలో మొత్తం నలుగురు చిన్నారులు. రోహిత్ అందరికన్నా చిన్నవాడు.

''రోహిత్ అనారోగ్యానికి గురికావడానికి ముందు రోజు గ్రామంలో ఓ విందు జరిగింది. బాగా రెడీ చేసి అతడిని పంపించాం. ఆ రాత్రి నిద్ర పోయాక మధ్యలో లేచి అతడు వంకర్లు తిరిగిపోయాడు. మాటిమాటికి నీళ్లు తాగాడు. ఉక్కపోతగా ఉందని దుస్తులు తొలగించామన్నాడు. ఆ తర్వాత ప్రశాంతంగా పడుకున్నాడు. తెల్లవారి లేచాక బాగా ఆకలిగా ఉందన్నాడు. అన్నం ఒక రెండు చెంచాలు తిన్నాక కడుపులో మంటగా ఉందని చెప్పాడు'' అని అనిల్ వివరించారు.

దగ్గర్లోని చాలా మంది డాక్టర్ల వద్దకు రోహిత్‌ను తాము తీసుకువెళ్లామని, సమ్మె చేస్తున్న కారణంగా వారెవరూ అతడిని చూసేందుకు అంగీకరించలేదని సుధ చెప్పారు.

''ప్రధాన ఆసుపత్రికి తీసుకువెళ్లిన తర్వాత రోహిత్‌కు సెలైన్ ఎక్కించి, ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత అతడి జ్వరం మరింత పెరిగింది'' అని ఆమె అన్నారు.

''రోహిత్ వణికిపోతూ బెడ్ పైనే అటూఇటూ తిరిగిపోతూ ఉన్నాడు. మేం అతడిని పక్కకు పడిపోకుండా ఉంచేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాం. రోహిత్‌ను డాక్లర్లు మూడు వార్డులు మార్చారు. సెలైన్లు మార్చారు. కానీ, అతడి ఆరోగ్యం మరింత దిగజారింది. ఆరు గంటల తర్వాత మెడికల్ కాలేజీకి తీసుకువెళ్లాలని మాకు సూచించారు. అక్కడికి తీసుకువెళ్లిన గంటకే అతడు మరణించాడు'' అని అనిల్ చెప్పారు.

చిత్రం శీర్షిక ఏహెచ్ఈ బారినపడే చిన్నారుల్లో చాలా మంది కడు పేదరికంలో ఉన్నవారేనని అరుణ్ షా అంటున్నారు

వైద్య పరిశోధనలు ఏం చెబుతున్నాయి..

చిన్నారుల మరణాలకు పేదరికం, పోషకాహార లోపాలే కారణమని ముజఫర్‌పుర్‌లో సీనియర్ పీడియాట్రిషియన్ అరుణ్ షా అన్నారు.

''2014 నుంచి 2015 మధ్య ఈ వ్యాధి గురించి మేం ఇన్వెస్టిగేషన్ చేశాం. బ్యాక్టీరియా, వైరస్, ఇన్ఫెక్షన్లు దీనికి కారణం కాదని గుర్తించాం. ఈ వ్యాధి జీవక్రియలకు సంబంధించింది. అందుకే దాన్ని అక్యూట్ హైపోగ్లిసిమిక్ ఎన్సెఫలోపతి (ఏఎచ్ఈ) అని పిలుస్తాం. శరీరం వంకర్లు తిరిగిపోవడం, విపరీతమైన జ్వరం, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడం దీని లక్షణాలు'' అని ఆయన వివరించారు.

ఏహెచ్ఈ బారినపడే చిన్నారుల్లో చాలా మంది కడు పేదరికంలో ఉన్నవారేనని అరుణ్ షా అన్నారు.

''చాలాకాలం పోషకాహారం లేకపోతే శరీరంలో గ్లైసోజెన్ క్షీణత ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో లిచీ పండ్ల గింజల్లో ఉండే ఓ న్యూరోటాక్సిన్ ఓ ప్రత్యేకమైన చర్య మొదలయ్యేందుకు కారణమవుతుంది. చిన్నారుల మెదడుకు తగినంత గ్లూకోజ్ అందకుండా ఇది చేస్తుంది. బ్రెయిన్ డెత్ ముప్పును ఇదే కలిగిస్తుంది. ఎండాకాలంలో చిన్నారులకు లిచీ పండ్లను ఇవ్వకూడదని ఇంటింటికీ ప్రచారం చేయాలని ప్రభుత్వానికి సూచించాం. చిన్నారులు తినకుండా, ఆకలితోనే నిద్ర పోకూడదని చెప్పాం'' అని అరుణ్ అన్నారు.

చిత్రం శీర్షిక రాజ్‌పునాస్‌లో 15 ఏళ్ల క్రితమే మూతపడ్డ ప్రాథమిక వైద్య కేంద్రం

ప్రాథమిక వైద్య కేంద్రాల్లో గ్లూకోమీటర్లు అందుబాటులో ఉండాలని, గ్లూకోజ్ స్థాయిలు పడిపోయినవారికి వాటిని పెంచే ప్రాథమిక చికిత్సలు అందించాలని సూచించామని.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీన్ని అమలు చేయడంలో విఫలమైందని ఆయన తెలిపారు.

రోహిత్ గ్రామం రాజ్‌పునాస్‌లో ప్రాథమిక వైద్య కేంద్రం 15 ఏళ్ల క్రితమే మూతపడిందని స్థానికులు మాకు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు